బాల్యలీలలు :
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
జన్మతః జ్ఞానోదయమయిన మహాజ్ఞాని, విశ్వాత్మ మన కోసం, మనలో తాను ఒకడిగా కలిసిపోవటానికి ఆయన తన జ్ఞానోదయపు జ్ఞానాన్ని తన లోపల నిక్షిప్తం చేసారు. సామాన్య బాలుడిగానే ఉండేవారు. అయినా ఆయన తన లీలలను, మహత్మ్యాలను చూపుతూ ఉండేవారు.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడూ ఏ అవతరమయినా, భగవంతుని అవతారలే. ఆ అవతారంలో వారు వారిలోని దివ్యజ్ఞానాన్ని తమలోనే నిక్షిప్తం చేసి, సాధారణ మానవులుగా జీవిస్తూ అసాధారణ విజయాలను సాధించారు. అద్భుతాలను చూపించారు. అదే దైవత్వంలోని దివ్యలక్షణం.
శ్రీనిత్యానందకి తాను భగవదవతారం అని తెలుసు. కాని ఏనాడూ ఆయన ఆ విషయాన్ని ఎవరికీ తెలియచేయలేదు. ఆయనలోని దివ్యత్వాన్ని, ఆయన భగవంతుని అవతారమని మహాయోగులు, తపస్వినులు ముందుగా ఆయన బాల్యంలోనే గుర్తించగలిగారు.
ఈ సందర్భంలో, భాగవతంలో ఒక అందమయిన సంఘటన గుర్తు వస్తుంది. శ్రీకృష్ణునికి బాల్యంలో చాలా ఆపదలు కలిగాయి. తల్లి యశోద అమాయకురాలయి ఒక గ్రామీణ స్త్రీ. తన ముద్దుల బిడ్డకి, గారాల పట్టికి కలుగుతున్న ప్రమాదాలు చూసి తల్లడిల్లిపోయింది. ఆమె ఆ బాలుడిని తమ కులగురువు దగ్గరకి తీసుకువెళ్ళి తన బిడ్డకి ఏదయినా మంత్రం గాని, రక్ష రేకు కాని ఇవ్వమని ప్రార్థేయపడుతుంది. అది నిష్కపటమయిన మాతృప్రేమ.
దివ్యతపస్సంపన్నుడయిన ఆ గురుదేవులు “భగవంతునికి లోక రక్షకునికి నేను రక్షణ కవచం ఇవ్వటమా?” అని తనలోనే ఆశ్చర్యపోయాడు. అమ్మ యశోద ఒడిలో బోసినవ్వులు చిందించే జగన్నాధునికి మనస్సులోనే, మనస్పూర్తిగా నమస్కరించి ఆయనకి ప్రీతికరమైన స్తోత్రాన్ని, సూక్తాన్ని జపించి అంజలి గటిస్తారు.అప్పుడు యశోద గురుదేవులు తని బిడ్డకి రక్షణ కవచం ఇచ్చారులే, ఇక ప్రమాదం ఉండదు అని తృప్తిగా బిడ్డకి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది.
దైవాంశ సంభూతులని సామాన్యులు గుర్తించలేక పోయినా, దైవాన్ని తెలుసుకొని నిరంతరం తపస్సులో ఉండే యోగులు తపస్సంపన్నులు గుర్తించగలుగుతారు. చిన్నారి పరమహంస భగదవతారంగా యోగులు, తపః సంపన్నులు ముందుగానే గుర్తించి ఆయనను ప్రేమతో, గౌరవంగా చూసేవారు.
ఆయనలోని దైవాన్ని గుర్తించి ఆయనని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన వారంతా మహాయోగులే.
చిన్నారి నిత్యానంద తన రెండవ ఏట నుంచే ఆధ్యాత్మిక భావాలను వెల్లడి చేసేవారని ఆయన తల్లితండ్రులు, బంధువులు చెబుతారు. ఆయన బాల్యక్రీడలన్ని అసాధారణంగా ఉండేవి. చిన్నపిల్లల ఆటలు ఉండేవి కాదు. నిరంతరం దేవుడి విగ్రహాలతో గడిపేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయనని ఇంట్లో అందరూ ముద్దుగా 'స్వామీ' అని పిలిచేవారు. అదే ఆయన ముద్దుపేరు.
ఆయన బాల్యమంతా అరుణాచల పర్వతంతో పెనువేసుకుని ఉన్నది. ఆయన అరుణాచలేసుని (ఈశ్వరుని గుడి)తో ఆ అరుణాచలంతో ఒకటిగా ఐక్యమయిపోయారు. తానే అరుణాచలం అని,అరుణాచలమే తానని గట్టిగా నమ్మేవారు. స్వామి మీద అరుణాచలేసుని ఆశీర్వాద ప్రభావం దృఢంగా ఉండేది అని చెబుతారు. అరుణాచలేశ్వరుడు స్వామికి రక్షణ నిచ్చేవారు. చిన్నారి నిత్యానంద తన తాతగారి చేయి పట్టుకొని అరుణాచలం కొండచుట్టూ ప్రదక్షణలు చేస్తూ, ఆయన చెప్పే ప్రహ్లాద, ధృవుడు, మార్కాండేయుని కథలు వింటూ ఉండేవారు.
కొంచెం పెద్ద వయస్సు వచ్చాకా తనంతట తాను అరుణాచలంపై గడిపే వారు. అరుణాచలేశ్వరుడు ఆయన బాల్య స్నేహితుడు. స్వామి తన సమయాన్ని ఆయన సన్నిధిలో గడపటానికి ఎంతో ఇష్టపడేవారు. ఆ శిఖరం మీద ఉండే యోగులూ సన్యాసులు ఆయన నేస్తాలు. చాలా చిన్న వయస్సు నుంచే ఆయన వారి సాన్నిహిత్యాన్ని ఇష్టపడేవారు. ఇంటిలో ఆయన ఆటలు ఆడే బొమ్మలు, కార్లు, రైళ్ళు, మరే విధమైన బొమ్మలుకాదు. ఆయన నిరంతం దేవుడి విగ్రహాలతోనే ఆడుకునేవారని ఆయన తల్లిదండ్రులు, బంధువులు చెబుతారు.
చిన్నారి నిత్యానంద, తన మూడవ పుట్టినరోజు కానుకగా తన తల్లిదండ్రులని గణేశుని విగ్రహం కావాలి అని కోరుకున్నారట. ఎంత అద్భుతమో ఈ కోరిక. అనాటి నుంచీ ఆ గణేశుడే ఆయన స్నేహితుడు. ఆ విగ్రహంతో కబుర్లు చెప్పేవారు. ఆటలు ఆడేవారు, ఆవిగ్రహం మీద కోపంతో అలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఒకసారి ఆయన పెట్టిన భోజనం విగ్రహం తినలేదు. దాంతో చిన్నారి నిత్యానందకి చాలా కోపం వచ్చి విగ్రహంతో పోట్లాట పెట్టుకుని తాను భోజనం చేయకపోతే అమ్మ ఎలా అంటుందో అదే విధంగా ఆయన ఆవిగ్రహాన్ని కూడా బెదరించేవారు అని ఆయన తల్లిదండ్రులు బంధువులు చెబుతుంటారు.
ఒకసారి ఆయన అమ్మమ్మ, చిన్న నిత్యానందని నీకు ఇందులో ఏదికావాలో తీసుకో అని తన బంగారు నగలు ఉన్న పెట్టెని ఆయన ముందు ఉంచారు. అందులో విలువయినవి, మెరిసిపోతున్న బంగారు నగలు చాలా ఉన్నాయి. కానీ ఐదు సంవత్సరాల పసిబాలుడిని అవి ఆకర్షించలేకపోయాయి. ఎక్కడో ఒక ప్రక్కన ఉన్న రుద్రాక్షమాలని ఆయన వెతికి మరీ తీసుకున్నారు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా చాలా చిన్నవయస్సులోనే ఆయన తన భవిష్యత్ ప్రణాళికలని చూపే వారు. అదే విధంగా బంధువులు నీవు పెద్ద అయ్యాక ఏమి చదువుతావు చదివి ఏమి చేస్తావు అని అడిగితే, తన చిన్ని చిన్ని చేతులలో సన్యాసి (యోగి) బొమ్మవేసి ఇచ్చారట. ఆ బొమ్మ ఇప్పటికీ బిదది ఆశ్రమంలో ఉన్నది.
చిన్నారి నిత్యానంద చాలా చిన్నవయస్సు నుంచే బంకమట్టితో దేవుడి విగ్రహాలు చేసేవారు. వినాయక చవతి సందర్భంగా బంకమట్టి తెచ్చి, పండగ అయిపోయాక, ఆ మట్టిని అలాగే ఊరిలో వదిలి బొమ్మలు అమ్మేవారు వెళ్ళిపోయేవారు. నిత్యానంద ఆ మట్టిని తెచ్చి రకరకాల దేవుడి విగ్రహాలు చేసి, వాటికి అలంకరణలు చేసి, పూజలు చేసేవారు. ఇల్లంతా మట్టితో, దేవుడి బొమ్మలతో నిండిపోయేది. ఆ ఇంటిజ్యోతి, వారి కంటి వెలుగు అయిన చిన్నారి నిత్యానంద పనులు పెద్దవారికి ఏనాడు కోపం తెప్పించేవు కాదు. ఎవరూ ఆయనని అలా చేయవద్దు అని అడ్డగించే వారు కాదు. లోకనాధునికి అడ్డంకులు ఎవరు సృష్టించగలరు?
స్వామి జీవితాన్ని ఒక నిర్దిష్టమయిన ఆధ్యాత్మిక పదంలో నిలిపిన వారిలో రఘుపతి యోగి ప్రథములుగా స్వామి చెబుతారు. పరమహంస నిత్యానంద చిన్నతనంలో ఎందరో యోగులు చేరదీసి, తమకు చేతనయిన విద్యలతో ఆయనని ప్రవీణునిగా తీర్చిదిద్దారు. అలాంటి మహాయోగులలో రఘుపతి యోగి మొదటి వ్యక్తి.
స్వామికి ఐదు సంవత్సరాల వయస్సులో ఆయనని భగవంతుని అంశంగా అవతార పురుషునిగా గుర్తించారు ఆ యోగి. ఆయన ఇండియా, నేపాల్ బర్మా ప్రాంతాలలో మహాపురుషుల దగ్గర యోగా నేర్చుకొని అందులో అద్భుతమయిన ప్రావీణ్యాన్ని సంపాదించుతారు. స్వామీజీ ఆయనని పతంజలి యొక్క అంశగా చెబుతారు. ఆయన పాములకి స్నేహితుడు కూడా అని స్వామీజీ మాటల సందర్భంలో తన శిష్యులకి చెప్పారు. రఘుపతి యోగి శబ్దశాస్త్రంలో చాలా లోతైన ప్రావీణ్యం ఉండేదని చెప్పారు.
వీరి ఇద్దరి స్నేహము, గురుశిష్య సంబంధమూ చూడటానికి చాలా ముచ్చటగా ఉండేది. ఆయన స్వామీజీకి యోగాసనాలలో కఠోరమైన సాధన చేయించేవారు. స్వామీజీ సత్యాన్వేషణలో హిమాలయాలలోనూ, భారతదేశం మొత్తం కాలినడకన తిరిగేవారు. స్వామీజీ ఆ విషయాలు చెప్పే సందర్భంలో, “ఐదు సంవత్సరాల వయస్సులో రఘుపతి యోగి నాతో సాధన చేయించిన యోగాసనాలు నాశరీరాన్ని నా సత్యాన్వేషణకి కఠోర తపస్సు చేయటానికి అనువుగా సిద్ధం చేసాయి. ఆనాటి నా సాధన నా సత్యాన్వేషణకి, నా కఠోర తపస్సుకి నా శరీరం చక్కగా సహకరించించనది” అని చెబుతుంటారు.
చిన్నారి నిత్యానంద భవిష్యత్‌ని అర్థంచేసుకున్న రఘుపతి యోగి, ఆ బాలుడికి సన్యాస దీక్షని ఇవ్వదలచుకున్నారు. ఆయన ఆ బాలుడిని అరుణాచలం దేవాలయంలో క్రిత్రిక మండపంలో కూర్చోబెట్టి ఆయనకి దీక్షని ఇచ్చారు. సామాన్యంగా అంత చిన్న వయస్సులో ఆ దీక్షని సాధారణ బాలలకి ఇవ్వరు.
దీక్ష ఇచ్చే సమయంలో యోగి స్వామికి మంత్రోపదేశం చేయటానికి ‘హ్రీం’ అనే బీజాక్షరాన్ని చెప్పారు. చిన్నారి స్వామి ‘హ్రీం’ అనగానే ఆయనకి జగన్మాత, పరాశక్తి పార్వతీదేవి దర్శనమిచ్చినది. ఆమె చిన్నారి నిత్యానంద ఎదురుగా నిలబడి దర్శనం ఇచ్చింది. ఆమె దర్శన ఆనందపారవశ్యంలో స్వామి “అమ్మ ఇక్కడ ఉన్నది” అని అన్నారు. ఆయనను దీవించిన పరాశక్తి ఆ బాలుడిలో కలసిపోయింది.
చిన్న నిత్యానందకి “హ్రీం” అనేది దేవి బీజాక్షరం అని తెలియదు. జగన్మాత ప్రత్యక్షమవుతుందని తెలియదు. ఆయన ఆశ్చర్యంతో ఆనందంలో యో గీతో “నేను ఆమెని చూసాను” అని అన్నారు. చిన్న నిత్యానంద జగన్నాథ దర్శనం యొక్క ఆనంద పారవశ్యంలో ఇంటికి వెళ్ళి చిన్న రాతి, ఉలిని తీసుకొని తాను చూసిన దేవి విగ్రహాన్ని చెక్కారు. తరువాత దానిని తనకి బాగా తెలిసిన శిల్పి దగ్గరకి తీసుకువెళ్ళి అందంగా చేయమన్నారు. ఆనాడు చిన్నారి నిత్యానంద చెక్కిన జగన్నాథ శిల్పం ఇప్పటికీ ఆయన దగ్గర ఆయన పూజలని అందుకుంటుంది.
స్వామీజీ తన ఐదవ ఏట నుంచి అనేకమంది గొప్పయోగులని రుషులని కలిసారు. వారిలో ఆయన అమ్మమ్మ స్నేహితురాలు, కుప్పుమ్మాళ్ యోగిని, చిన్న నిత్యానందలోని సిద్ధ పురుషుని గుర్తించి ఆయనని చేరదీసి ఆయనకి మంచి ఆధ్యాత్మిక మార్గాన్ని ఏర్పరచారు. స్వామీజీ అరుణాచలం అమ్మవారి దేవాలయంలో దర్శనం చేసుకునే సమయంలో ఆయనకి బంగారు వర్ణంలో ఏదో గీతల జామంట్రీ బొమ్మలాంటిది మెరుపుతో దర్శనమిచ్చినది. ఆయన ఇంటికి వచ్చి ఒక రేకుమీద మేకుతో ఆ బొమ్మని చిత్రించటం చూసిన కుప్పుమాళ్ యోగిని ఆ బాలుడు ఒకఅద్భుత అవతారపురుషుడు అని ఆబాలుడిని తన చేతులలోనికి తీసుకొని ఎన్నో యోగా విద్యలు నేర్పించారు. కుండలిని తంత్రం ఆమె చాలా నేర్చుకొని దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. ఆమె స్వామికి శ్రీ చక్ర విశిష్టతని, పూజా విధానాన్ని నేర్పించారు. ఆమె స్వామి కోసం తిరువణ్ణామలైలో ఒక ఆశ్రమాన్ని కట్టి ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఆశ్రమం తిరువణ్ణామలైలో ఉన్నది. బాల్యంలో నిత్యానందపై ఆమె ప్రభావం చాలా ఉన్నది.
నిత్యానంద స్వామీజీ బాల్యంలో ఆయనపైన లోతయిన ప్రభావాన్ని చూపిన వారిలో శ్రీ సత్యనారాయణ స్వామి ప్రముఖులు. ఆయన తెలిపతిలో ప్రావీణ్యుడు. ఆయన తంత్ర, యంత్ర, మంత్ర అనే మూడు పద్ధతులని సాధనచేసి వాటిలో అద్భుతాలు సాధించిన వ్యక్తి. సత్యనారాయణస్వామి నిత్యానంద చిన్నతనంలోనే ఆయనలోని అద్భుత ఆధ్యాత్మిక శక్తిని చూసి ఆయనకి ఎన్నో విద్యలని నేర్పించారు. స్వామి ఆయనని 'సత్యనారాయణ తాత' అని పిలిచేవారు. తాత ప్రభావం ఆయన నేర్పిన మంత్ర, యంత్ర, తంత్రాలు చిన్నారి నిత్యానందుని అందులో గొప్ప ప్రవీణుని చేసాయి. ఆయన ఇచ్చిన చిన్న వెండి భరిణ (అంజన భరిణ) ఇప్పటికీ స్వామీజీ దగ్గర ఉన్నది.
నిత్యానందస్వామీజీని చిన్న వయస్సులో దగ్గరకు తీసుకున్నయోగులు, ఋషులు ఎందరో ఉన్నారు. విసిరి స్వామి, ఆయననే సక్కుపోయి (జనపనార) స్వామి అనేవారు. ఆయన గోనే సంచులనే వస్త్రాలుగా కట్టుకునే వారు. స్వామికి ఆధ్యాత్మిక విషయాలు, యోగా చాలా నేర్పించారు. అలాగే చిన్నారి నిత్యానందకి ఒక మౌన స్వామికి మంచి స్నేహం ఉండేది.
నిత్యానంద స్వామి తన మూడవ సంవత్సరం నుంచి సత్యాన్వేషణకి వెళ్ళే వరకు, బాల్యమంతా సాధువులతో యోగులతో కలిసి ఉండేది. ఆయన వారికి భోజనం పెట్టేవారు. వారితో కలిసి భోంచేసే వారు. వారు కూడా నిత్యానందలోని సిద్ధ పురుషుని, అవతార మూర్తిని గుర్తించి ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారు. వీరంతా కూడా స్వామి నిత్యానంద ఆధ్యాత్మిక ప్రగతికి అందరూ తోడ్పడిన వారే. ఈనాడు స్వామి అనేక విద్యలలో ఎంతో ప్రావీణ్యం పొందారు అంటే దానికి కారణం వీరందరి సాంగత్యమే. ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక జిజ్ఞాస అనే నిప్పురవ్వని రగిలించి దానిని మహా జ్వాలగా ప్రజ్వలింప చేసిన వీరందరు స్వామి జరపబోయో ప్రపంచ ధ్యాన మహా యజ్ఞానికి కావలసిన సమిధలని కూర్చి అంకురార్పణ చేయటంలో ఎంతో సహాయం చేసి ధన్య జీవులయ్యారు,
ఆధ్యాత్మిక అనుభవము :
స్వామి చిన్నతనంలో ఎక్కువ సమయాన్ని అన్నామలై దేవాలయంలో గడిపే వారు. ఆయనకి అక్కడి దేవతా విగ్రహాలని అలకరించటం చాలా ఇష్టంగా ఉండేది. ఆ వయస్సులోనే ఆయనకి కొంతమంది అనుచరులు ఉండేవారు. వారంతా దేవిదేవతల విగ్రహాలు అలకరించటం, పండుగలు చేయటంలో నిమగ్నమయి ఉండేవారు.
ఆయన తన పదవ ఏట నుంచి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళటం మొదలుపెట్టారు. అక్కడ లైబ్రరీలో పుస్తకాలు చదివేవారు. చాలా సమయం ధ్యానంలో గడిపేవారు. ఆ సమయంలోనే స్వామికి అన్నామలై స్వామి (ఈయన రమణ మహర్షి శిష్యుడు. జ్ఞానోదయమయిన యోగీశ్వరుడి)తో మంచి సాన్నిత్యం పెరిగింది. ఆయన ప్రవచనాలు శ్రద్ధగా వినేవారు. ఆయన చెప్పిన “ఈ శరీరం మనం కాదు, మనం ఈ శరీర బాధకి వ్యధలకి అతీతులం” అన్న విషయం ఆయన మనస్సులో చాలా లోతుగా నాటుకున్నది
నిత్యానందలోని సత్యాన్వేషి ఆయనని నిలువనీయలేదు. తాను విన్న విషయం ఎంతవరకూ సత్యం, శరీరం బాధకు ఎలా అతీతం, నాకు ఎదుటివారికి ఎన్నో రకాల శారీరక బాధలు ఉన్నప్పుడు, అవి అనుభవిస్తున్నాము. మరి అన్నామలై స్వామి చెప్పినది ఎలా సాధ్యం. నిత్యానంద స్వామికి చిన్నతనం నుంచీ ఒక చక్కని అలవాటు ఉన్నది. అది చేసి చూసి అనుభవంతో తెలుసుకోవాలనే జిజ్ఞాస. ఆయన మర్నాడు ఉదయం చాకుతో తొడపై గాటు పెట్టుకున్నారు. చాలా రక్తం పోయింది. ఆయనకి చాలా బాధ కలిగింది. వెంటనే ఆయన తల్లి ఆయనని హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు. గాయం లోతుగా ఉండటంతో కుట్లు పడ్డాయి. స్వామీజీ తన శిష్యుతో ఆ గాయం మచ్చ ఇంకా ఉన్నది అని చెప్పారు.
మర్నాడు స్వామి నిత్యానంద, రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి, స్వామిని కలసి తన శరీరానికి బాధ కలిగిన విషయాన్ని వివరించారు. చిన్న బాలుడిలో సత్యాన్వేషణకై రగులుతున్న ఆకాంక్షని, అతని ధైర్యసాహసాలని చూసి అన్నామలై స్వామి ఆశ్చర్యపోయారు. ఆ బాలుడితో మాట్లాడి, అతను సామాన్య బాలుడు కాడు అని తెలుసుకొని ఆయన నిత్యానందకి ధ్యానపద్ధతులు నేర్పించారు. ఆయన నిత్యానందుని లో పట్టుదల ధైర్యంగా ఆయన చేసే సత్యాన్వేషణని ఎంతో ప్రశంసించి ఆయనని ప్రోత్సహించారు. “నీ ధైర్యమే నీకు స్వేచ్ఛనిస్తుంది” అన్న ఆయన మాటలు నిత్యానంద స్వామికి అమిత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ అనుభవమే ఆయనను ధ్యానపద్ధతుల మీద ఎన్నో ప్రయోగాలు చేసే దిశగా ఆయనలో బీజాలు నాటబడ్డాయి.
ఆయన అన్నామలై స్వామి దగ్గర నేర్చుకున్న ధ్యానాన్ని ఎంతో సీరియస్‌గా సాధన చేసేవారు. ఆయనకి పన్నెండు సంవత్సరాల వయస్సు వచ్చే సరికి ధ్యానంలో చక్కని ప్రావీణ్యాన్ని సాధించారు. అరుణాచలం కొండ రాళ్ళపైన ధ్యానం చేసేవారు. ఒకసారి బుద్ధ పూర్ణిమ రోజున ఆయనకి మొదట ఆధ్యాత్మిక అనుభవం జరిగింది. ఆయన ధ్యానం చేస్తుండగా తన లోపల ఏదో వికసించటం చూడగలిగారు. అలా జరిగే సమయంలో ఏదో కొంత తాను కోల్పోవటం మరేదో ఆయనలో సృష్టించబడటం ఆయన గమనించారు. ఏవో ద్వారాలు తెరవబడిన అనుభూతిని ఆయన పొందారు.
ఆసమయంలో కళ్ళు మూసుకొని ఉండి ఆయన అన్నీ స్పష్టంగా చూడగలిగారు. కొండని, తన వెనుకవైపు ఉన్న గుడిని, తన క్రింద ఉన్న రాళ్ళని, తన చుట్టూ ఉన్న చెట్లని స్పష్టంగా చూడగలిగారు.
ఆ తరువాత ఈ సంఘనని వివరిస్తూ స్వామి తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు. ఆ క్షణంలో నాకు ఒక విషయం విశదమయింది. నేను ఈ సర్వసృష్టిలో ఒక భాగం, ఈ సృష్టి అంతా నేను” అని.
ఈ విషయాన్ని ఆయన యోగిని కుప్పమ్మాళ్తో చెబితే ఆమె అది చాలా శక్తివంతమయిన ఆధ్యాత్మిక అనుభవం అని వివరించారు. దీనినే స్వామి సతోరి అంటారు. సతోరి అనేది సత్యాన్వేషణలో సాధకులు గురువుల అధ్వర్యంలో పొందే తొలి జ్ఞానోదయపు అనుభవం. కానీ స్వామీ నిత్యానంద విషయంలో అది ఆయన చేసిన తపస్సు ఫలితంగా, ఆయనంతట ఆయనే పొందిన గొప్ప అనుభవం. ఇటువంటి అనుభవం అంత చిన్నవయస్సులో పొందగలగటమే ఆయన అవతార పురుషుడు అనటానికి గొప్ప నిదర్శనం.

నిత్యానంద అరుణాచల పర్వతం మీద ధ్యానంలో
స్వామి నిత్యానంద చిన్నతనం నుంచీ ఒంటరితనాన్ని కోరుకునేవారు. ఆయన ఎప్పుడూ తన వయస్సువారితో కలిసి ఆటలు ఆడలేదు. ఆయన స్నేహితులు సాధువులు, లేకపోతే దేవుడి విగ్రహాలు. తిరువణ్ణామలైకి వచ్చిపోయే సాధువులు, యోగులు, అక్కడే ఆ పర్వతం పై తపస్సు చేసుకునేవారు, వీరే ఆయనకు ప్రియనేస్తాలు. వారి దగ్గర కూర్చొని గంటల కొద్దీ వారి అనుభవాలని వింటూ గడిపేవారు. వారికి ఇంటి నుంచి భోజనం తీసుకువెళ్లేవారు. వారికి అన్నీ పెట్టేవారు. వారితో కలసి భోజనం చేసేవారు. కొన్ని సార్లు వారితోనే రాత్రి పగలు గడిపేవారు. వాళ్ళు చెప్పే కథలు, వాళ్ళు ఆధ్యాత్మిక అనుభవాలని వింటూ గడిపేవారు. ఇక్కడ ఒక ముఖ్య విశేషమేమిటంటే అంత చిన్న వయస్సు ఉన్న అబ్బాయికి పెద్దపెద్దవారితో స్నేహం, వారంతా ఈ బాలుడిని ఎంతో గౌరవ మర్యాదలతో చూడటం. చిన్న నిత్యానందకి ఇంట్లో పెద్దవారు ఎటువంటి అభ్యంతరాలు కాని అడ్డంకులు కానీ సృష్టించేవారు కాదు. అర్ధరాత్రి ఇంటికి వచ్చినా, సాధువులతో గడిపినా ఆయనని ఏమీ అనేవారు కాదు. వారి కుటుంబంలో మొదటి నుంచీ సాధువులను యోగులను గౌరవించే ఆచారమున్నది. అప్పుడుప్పుడు సాధువులని ఇంటికి ఆహ్వానించి వారిని గౌరవించే సాంప్రదాయం ఆ కుటుంబంలో ఉండేది.