KAILASA Library/పరమహంస శ్రీ నిత్యానంద/కోరిక అత్యాశ అనర్ధదాయకంSign in
పరమహంస శ్రీ నిత్యానంద

కోరిక అత్యాశ అనర్ధదాయకం

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ఎవరయినా, నేటికాలంలో మనిషిని నడిపే శక్తి ఏది అని అడిగితే, ఒకటి కాదు రెండు అని సమాధానం చెబుతారు. అవి కోరిక, ఆశ :

ఆశ, ఆశగా ఉన్నంతవరకూ పరవాలేదు. కాని అది అత్యాశగా మారినప్పుడే ఇన్ని సమస్యలు వచ్చేది. అదే విధంగా కోరికలు అనేవి మన కోరికలయితే అసలు బాధపడే అవసరమే లేదు. కాని మనం ఎదుటివారిని చూసి వారి దగ్గర ఉన్న వాటిని మన కోరికలుగా మలచుకొని, ఆ కోరికల వెంట పరుగులు తీస్తున్నాము. ఇది మనకి మరిన్ని బాధలని ముఖ్యంగా తీవ్రమయిన నిరాశ, మానసిక కుంగుబాటులని కలిగిస్తున్నది.

ఈ కోరికలు అత్యాశలు గురించి పరమహంస నిత్యానంద చాలా అద్భుతంగా వివరించుతారు. ఆయన చెప్పే ప్రతి మాట ఒక సత్యం. అది చురుక్కుమనే అగ్నిరవ్వలా మనని తాకి, మనలో పేరుకుపోయిన మనవి కాని వాటిని దహించివేస్తుంది.

మనిషిలో ఉండే కోరికల లక్షణాలని స్వామీజీ ఇలా చెబుతారు. మీలో ఉండే కోరికలకి అంతు ఉండదు. మహావీర ఈ విషయం గురించి ఒక చక్కని మాట చెబుతారు. “మనం జన్మించినప్పుడు మనకి ఏవి అవసరమో వాటిని మనతోపాటు ఈ భూమి మీదకి భగవంతుడు పంపించుతాడు.” కాబట్టి మన అవసరాల గురించి అసలు చింతించనవసరం లేదు. ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికీ వున్న అవసరాలు చాలా సులభంగా తీర్చవచ్చు, కానీ ఈ ప్రపంచమంతా కలసి కూడా ఒక్క వ్యక్తి కోరికలని మాత్రం పూర్తిగా తీర్చలేదు.

ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించుకుంటే, మనం నిరంతరం ఒక కొత్త కోరిక వెంట వెళుతుంటాయి. ఒక కోరిక తీరగానే మరొక కోరిక మన ముందు సిద్ధంగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఆ కోరిక తీరే వరకూ దాని తాలూకా వస్తువు మనకి అత్యవసరం అనిపిస్తుంది. అది లేకపోతే, జీవితం సాఫీగా సాగదు అనిపిస్తుంది. అది కొనగానే దాని విలువ పూర్తిగా తగ్గిపోతుంది.

ఈ సందర్భంలో భగవాన్ రమణ మహర్షి మాటలని పరమహంస నిత్యానంద ఈ విధంగా చెబుతారు. “కోరిక ఉన్నప్పుడు అది ఆవగింజంత అయినా మనకి పర్వతంలా కనిపిస్తుంది. ఆ కోరిక తీరాక పర్వతమంత గొప్పవస్తువయినా మనకి ఆవగింజలా తోస్తుంది” అని.

ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం ప్రతి దానినీ యధాలాపంగా తీసుకుంటాము. పొందిన దానికి కృతజ్ఞత చూపం. అసలు మనం జీవితంలో పొందిన వరాలకి, బహుమతులకి ఏ నాడైనా భగవంతునికి కృతజ్ఞతలు చెప్పామా. మీరు అందమయిన ప్రకృతిని చూడగలిగే కళ్ళు ఇచ్చిన దేవుడికి ఏనాడైనా కృతజ్ఞతలు చెప్పారా? మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి తీసుకువెళ్ళగలిగే కాళ్ళు ఇచ్చినందుకు, మీకు ఇంత అందమయిన లోకాన్ని ఇచ్చినందుకు, మీరు చేసే భోజనం ఇచ్చినందుకు, ఇలా చెబుతూ వెళితే కొన్ని వేల విషయాలు ఉంటాయి, వీటిని పొందినందుకు ఏ రోజూ భగవంతునికి కృతజ్ఞత చెప్పం సరికాడు, ఆ తరువాత ఏమిటి, ఆ తరువాత ఏమిటి? అని అడగటంతో సరిపోతుంది.

మరొక సమస్య అత్యాశ. భవిష్యత్తులో ఏదో సంపాదించాలి అనే ఆత్యత ఆందోళన. దానితో ఈ క్షణాన్ని ఆనందంగా గడపటం మర్చిపోతున్నారు. అందుకే ఎంత సంపాదించినా చివరికి శూన్యమే మిగులుతుంది. గుర్తుంచుకోండి ఏదో సంపాదించాలి, అప్పుడు సంతోషంగా ఉంటాను. అది సంపాదించాలి, అలా సంపాదించాకా సంతోషంగా ఉంటాను. ఇవన్నీ భ్రమలే. అందుకే ఇంత పెద్ద ప్రపంచంలో ఎవరూ నిత్యం ఆనందంలో ఉండటం లేదు. స్పష్టంగా అర్థం చేసుకోండి. ఎవరయితే ఈ క్షణంలో పూర్తి వర్తమానంలో ఉంటారో వాళ్ళు నిజమయిన సంతోషంలో ఉంటారు. ఆ ఆనందం కావాలి అంటే ఈ క్షణాన్ని ఆనందంగా, ఒక ఉత్సవంలా గడపండి.

ఒక యోగి ఒక వ్యక్తి - నారదముని కథ

మనిషికి అత్యాశ నిరాశనే కలిగిస్తుంది. కేవలం భవిష్యత్ కోరిక మీద మక్కువ పెంచుకుంటే వేధనే మిగులుతుంది. ఈ క్షణాన్ని ఆనందంగా గడుపుతూ భవిష్యత్ మీద, భగవంతుని మీద నమ్మకం తప్ప కోరిక లేకుండా ఉండగలిగే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, వారి జీవితాన్ని ఎంత ఉత్సవంలా గడుపుతారో పరమహంస నిత్యానందస్వామి ఒక అందమయిన కథని చెబుతారు.

నారద మహర్షి గొప్ప భక్తుడు. నిత్యం భగవన్నా మ స్మరణలోనే కనిపిస్తాడు. ఆయన పేరు వినగానే మనకి గుర్తు వచ్చేది కూడా భగవన్నా మ స్మరణ మాత్రమే. ఆయన త్రిలోక సంచారి. ఎక్కడికయినా, ఎప్పుడయినా వెళ్ళగల చనువు, శక్తి ఉన్న గొప్ప యోగీశ్వరుడు.

ఒకసారి నారదమహర్షి త్రిలోక సంచారం చేస్తూ భూలోకం నుంచి వైకుంఠానికి విష్ణుమూర్తి దర్శనం కోసం వెళుతుంటాడు. అలా వెళుతూ దారిలో కనపడినవారిని పలకరిస్తూ, వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ ముందుకి వెళుతుంటాడు.

అలా వెళ్లే సమయంలో ఒక అడవిలో చెట్టు క్రింద నారదముని ఒక యోగిని చూస్తాడు. ఆయోగి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతను నారదమహర్షిని చూసి నమస్కరించి “నారద మునీంద్ర తమరి ప్రయాణం ఎంత వరకూ” అని ఎంతో వినయంగా, భక్తిగా అడుగుతాడు.

అప్పుడు నారదుడు తాను వైకుంఠానికి వెళ్లి తిరిగి భూలోకానికి త్వరలోనే వస్తానని చెబుతాడు. అది విన్న యోగి ఎంతో ఆనందపడి నారదునితో ఇలా అంటాడు “ నారద మహర్షి! దయచేసి నా తరపున శ్రీ మన్నారాయణునికి ఒక మాట విన్నవించండి. నేను చాలా కాలంగా తపస్సు చేస్తున్నాను. నేను ఇంకా ఎంత కాలం తపస్సు చేయాలి. నాకు జ్ఞానోదయం ఎప్పుడు అవుతుంది. నాపై కరుణ చూపి ఈ విషయాన్ని కనుక్కొని రండి” అని అంటాడు.

దానికి నారదుడు “స్వామీ! తప్పకుండా మీరు అడగమన్నట్టే అడుగుతాను” అని ఆ యోగికి మాట ఇస్తాడు.

అలా కొంచం దూరం వెళ్ళాక అక్కడ అందమయిన పద్మాలు ఉన్న సరస్సు దగ్గర ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది. అక్కడ ఒక భక్తుడు భగవంతుని కీర్తిస్తూ ఆనందపారవశ్యంతో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ భక్తుని పాటలోని లాలిత్యం, అతని పారవశ్యంలోని భక్తి నారదమునిని అటువైపు వెళ్ళేలా చేస్తాయి.

నారదమునిని చూసి ఆ భక్తుడు తన పాటని ఆపి, నారదునికి నమస్కరించి అతిథి మర్యాదలు చేస్తాడు. మాటల మధ్యలో నారదుడు తాను వైకుంఠానికి వెళ్ళి తిరిగి కొద్దికాలం తరువాత వస్తానని చెబుతాడు.

ఆ మాట విన్న భక్తుడు అమితానంద భరితుడవుతాడు. ఆయన భక్తితో చేతులు జోడించి “మహారుషి! దయచేసి భగవానుని ఒక్కమాట అడగండి. ఆయన దర్శనం నాకు ఎప్పుడువుతుందో, ఆయన నన్ను ఎప్పుడు కరుణిస్తారో అడగండి. ఆయన కరుణ కోసం నేను ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలో అడగండి. నన్ను కరుణించమని చెప్పండి” అని ప్రార్థేయపూర్వకంగా అడుగుతాడు.

అప్పుడు నారదుడు “ తప్పనిసరిగా అడుగుతాను. నీ విషయం మరిచిపోను. నీవు బాధపడవద్దు” అని ఆ భక్తునికి మాట ఇచ్చి వైకుంఠానికి వెళతాడు. మరికొంతకాలానికి నారదుడు జవాబులతో భూలోకానికి వస్తాడు.

ముందుగా యోగి దగ్గరికి వెళతాడు నారదుడు. ఆయనని చూడగానే యోగి ఎంతో ఆత్రుతతో ఎదురు వెళ్ళి, “మహారుషి! భగవంతుని కలసి నా విషయం అడిగారా? ఆయన ఏమని జవాబు ఇచ్చారు” అని అడుగుతాడు.

“యోగీశ్వరా! మీ సంగతి అడిగాను, భగవంతుడు ఈ విధంగా జవాబు చెప్పారు. మీరు మరొక నాలుగు జన్మలు ఎదురు చూడాలంట. అప్పుడు మీకు జ్ఞానోదయమవుతుంది అని చెప్పారు” అని నారదముని జవాబు ఇస్తాడు. ఆ జవాబు వినగానే యోగి కుంగిపోతాడు. అయ్యో! ఇంకా నాలుగు జన్మలు ఎదురు చూడాలా? నేను ఏం చేయాలి. అయ్యో! నాకు ఎంత నిరీక్షణని విధించాడా భగవంతుడు” అని బాధతో కుప్పుకూలిపోతాడు. ఆ యోగి భగవంతుని మాటలు గుర్తుకు తెచ్చుకుని మరీ బాధ పడిపోతుంటాడు. అతనిని అలా వదిలి నారదుడు ముందుకి వెళతాడు. అక్కడ మర్రి చెట్టుకింద భక్తుడు ఎప్పటిలాగానే ఆనందపారవశ్యంలో భగవంతుని కీర్తిస్తూ పాటలు పాడుతుంటాడు. నారదుణ్ణి చూసి, ఆనందంగా ఎదురు వచ్చి “మహర్షి! భగవంతుని దర్శించుకున్నారా? నా విషయం అడిగారా? ఆయన ఏమని జవాబు ఇచ్చారు” అని అడుగుతాడు.

నారదుడు అతనితో భగవంతుణ్ణి నీ విషయం అడిగాను. ఆయన నీ విషయం ఈవిధంగా చెప్పాడు, నీవు ఆయన దర్శనం కోసం చాలా జన్మలు చూడాలట. అవి ఎన్ని జన్మలంటే ఈ చెట్టు మీద ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని జన్మలు ఎదురుచూడాలి. అప్పుడే నీకు జ్ఞానోదయం అవుతుందని, నీ మీద ఆయన కరుణ కురుస్తుందని చెప్పారు' అని అంటాడు.

నారదముని చెప్పిన జవాబు విని, ఆ భక్తుడు ఎంతో ఆనందపడిపోతాడు. నారదునితో ఇలా అంటాడు “ఓ అలా చెప్పారా! చాలా సంతోషం. ఆ దేవదేవుడు హామీ ఇచ్చారు. అది చాలు. నేను ఎన్ని జన్మలయినా ఎదురు చూస్తాను” అని ఆనందపారవశ్యంలో నాట్యం చేయటం ప్రారంభించాడు.

ఆ భక్తుడు చివరి మాటను ముగించగానే పెద్ద వెలుగు వస్తుంది. అక్కడ భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఆ వ్యక్తికి జ్ఞానోదయమవుతుంది. భగవంతుని దర్శనం అవుతుంది.

అక్కడ యోగి మాత్రం తన మనస్సు ఆడే ఆటలలో చిక్కుకుపోయి, తన కోరిక, ఆశల చిక్కులలో ఇరుక్కుపోయి విలవిలలాడుతున్నాడు. అతని కోరిక లౌకికమయినది కాకపోవచ్చు, అది ఆధ్యాత్మిక కోరికే కావచ్చు. జ్ఞానోదయం పొందాలి అనే ఆశే కావచ్చు, కానీ అది కూడా కోరికే కదా!

ఇక్కడ భక్తునిది కోరికే, కానీ అతను దానిని పట్టుకొని వేలాడటం లేదు. హాయిగా ఆ క్షణంలో, వర్తమానంలో ఆనందంగా ఉండగలిగాడు. అతను ఎదురుచూడటానికి అసలు బాధపడలేదు. ఇప్పుడే జ్ఞానోదయం కావాలి, భగవంతుని దర్శనం కావాలి అనే అత్యాశ లేదు. అందుకే అతను ఆనందపారవశ్యంలో ఉండగలిగాడు. భగవంతుడు ఇచ్చిన హామీ చాలు. అన్నింటికీ అతీతంగా ఉన్న అతని విశ్వాసం అతను అనుకున్నది సాధించేలా చేసింది.

స్వార్థం లేని, శ్రద్ధని ఆశించని ప్రేమ :

ప్రేమ అనేది ఒక శక్తివంతమయిన అద్భుతమయిన భావన. మానవ సంబంధాలని పటిష్టం చేయటంలో ప్రేమ చాలా చక్కని పాత్ర పోషిస్తుంది. సంబంధ బాంధవ్యాలు నిలిపే కీలక అంశం ప్రేమ. ప్రేమ అనేది లేకపోతే అసలు ఇంత అందమయిన భూలోకమే ఉండదు. ఎందుకంటే తన బిడ్డలయిన మానవుల కోసం భగవంతుడు ఒక అద్భుతమయిన కళాకారునిగా అవతరించి ఈ భూమిని ఒక గొప్ప కళాఖండంలా తీర్చిదిద్దాడు. దీనిని తన వారికోసం ఎంతో సౌకర్యవంతంగా చేశాడు. ఇదంతా ఆయనకి మన మీద వున్న అపారమయిన, హద్దులు నిబంధనలు లేని ప్రేమ వలన మాత్రమే జరిగింది.

అయితే నేటి మన ప్రపంచంలో ప్రేమ తన అసలు రూపాన్ని, రుచిని, లక్షణాన్ని కోల్పోయి అల్పస్థితిలోనికి జారిపోయింది. ఈ ప్రేమ తల్లిదండ్రులు-పిల్లల మధ్య అయినా కావచ్చు, ప్రేమికులు, భార్యాభర్తలు, స్నేహితులు, అన్నతమ్ములు, అక్క చెల్లెళ్లు ఎవరి మధ్య ఉన్న ప్రేమ అయినా అది ఎక్కడో అల్పస్థాయిలోనే ఉన్నది. పరమహంస శ్రీ నిత్యానంద స్వామి చెప్పే ప్రేమ దివ్య ప్రేమ, దైవ ప్రేమ. అది అత్యున్నత స్థాయిలో ఉండే ప్రేమ.

అద్భుతమైన దైవ ప్రేమ గురించి, అలాగే మన మధ్యన ఉండే మామూలు ప్రేమ గురించి నిత్యానంద స్వామి ఈ విధంగా చెబుతారు. అందరూ అనుకునే ప్రేమ ఒక ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం. ఇవ్వటం ఆగిపోగానే, ప్రేమ ఆగిపోతుంది. అదే విధంగా ఈ ప్రేమలో ఎదుటివారి నుంచి ఏదో ఆశించటం వుంటుంది. ఈ విషయంలో తల్లి ప్రేమ కూడా ఎంతో కొంత ఆశించటంలోనే ఉంటుంది. కాకపోతే అది నిస్వార్థ ప్రేమ అవ్వవచ్చు కాని ఆశలు లేని ప్రేమ మాత్రం కాదు.

మీరు ప్రేమ పంచటానికి కూడా ఎదుటివారికి అర్హత ఉన్నదా లేదా అని ఆలోచించి అప్పుడు ప్రేమిస్తారు. అంతేకాదు ఎవరికి ఎంత ప్రేమ ఇవ్వాలో కొలచి అంతే ప్రేమని ఇస్తారు. ఇన్ని నిబంధనలు, హద్దులు కలిగి ఉన్న ఆ ప్రేమ నిజానికి ప్రేమ కాదు. అది ఎదుటివారి శ్రద్ధని ఆశించటమే. అందుకే ఆ ప్రేమని ప్రేమలో పడటం అంటారు. ఆ ప్రేమలో పడితే ఇక లేచే ప్రసక్తి ఉండదు. అందుకే మీకు తెలిసిన ప్రేమ, వ్యధలు సమస్యలతో ముగుస్తుంది. కష్టాలు, కన్నీళ్ళని ఇస్తుంది.

ఎందుకు అంటే అది నిబంధనలు లేని ప్రేమ కాదు కాబట్టి. దానిలో ఉండేది కేవలం ఏదో ఆశించటమే కాబట్టి. ఇది పూర్తిగా కారణాల మీద ఆధారపడిన ప్రేమ. ఉదా : పిల్లలు తాము అనుకున్నట్టుగా ఉన్నంతవరకే తల్లిదండ్రుల ప్రేమ. పెద్ద వారిని ఎదిరించి పెద్ద నిర్ణయాలు చేయగానే ఆ ప్రేమ మాయం అవుతుంది. పిల్లల ప్రేమ కూడా అంతే.

అదే విధంగా ప్రతి మానవ సంబంధంలోనూ ఎదుటివారి శ్రద్ధ ఆశించటం చాలా ఎక్కువగా ఉంటుంది. భార్య నిరంతరం భర్త తనని పట్టించుకోవాలని అలాగే భార్య కేవలం ఆమె సమయాన్ని తనకే కేటాయించాలని భర్త ఆశిస్తారు. అదే విధంగా ప్రతి వ్యక్తి ఎదుటివారి శ్రద్ధని ఆశిస్తారు. ఎదుటివారి శ్రద్ధ తమ మీద తగ్గగానే మానసికంగా కుంగిపోతారు.

కానీ గురువుల ప్రేమ స్వచ్ఛమైన, ఉన్నతమైన ప్రేమ. జ్ఞానోదయమైన గురువులలో ప్రేమ పొంగి ప్రవహిస్తుంటుంది. వారి ముందు ఎవరు ఉన్నారు వారికి అర్హత ఉన్నదా లేదా అని ఆలోచించదు. ఆ ప్రేమ వెల్లువలో వారిని నింపటమే తెలుసు. అదే దైవ ప్రేమ. అందుకే జ్ఞానోదయమైన గురువుల సమక్షంలో మనం అంత ఆనందంగా ఉండగలం.

మనకి ఉండే చాలా సమస్యలకి, ముఖ్యంగా కుటుంబ సమస్యలు, సామాజిక సమస్యలు, మానవ సంబంధాలకి సంబంధించిన సమస్యలకి అసలు కారణం మనకి నిరంతరం ఎదుటివారు మనపై శ్రద్ధ చూపాలి అని ఆశించటమే. ఇది ఎక్కువ అయినప్పుడు, అనారోగ్యాలని కూడా తెచ్చుకుంటారు. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నప్పుడూ అందరూ మన మీద శ్రద్ధ చూపించుతారు. కాబట్టి మనుషులలో ఉండే మానసిక కుంగుబాటుకి కూడా అదే కారణం.

అందరూ నన్ను, నేను చేసిన పనిని చూసి, ప్రశంసించాలి. అప్పుడే నాకు ఉత్సాహంగా ఉండి మరింత ఎక్కువ పని చేయగలను అని అనుకోవటం చాలా సామాన్యం. అలా ఎవరయినా ఒక్కరు మెచ్చుకోకపోయినా ఆ వ్యక్తి మానసికంగా కుంగిపోతారు.

ఒక్క నిమిషం ఆలోచించండి, ఎదుటివారు మెచ్చుకుంటే మీరు పొందే సంతోషం కోసం ఎందుకు మీరు అంత తాపత్రయపడతారు. మీ అంతరంగంలో ఉండే మీ నిజమైన ఆనందాన్ని పొందినప్పుడు మీరు ఎవరి ప్రేమకోసం, ఎవరి శ్రద్ధ కోసం ఆత్యపడరు. ఎవరి నుంచి దేనినీ ఆశించరు.

ఏమీ ఆశించని, నిస్వార్థమైన ప్రేమ గురించి, ఎదుటివారి శ్రద్ధని ఆశించకుండా ఎంతో తృప్తిగా ఆనందంగా ఉండగలం అని నిరూపించే ఒక అద్భుతమైన కథని పరమహంస నిత్యానంద చెబుతారు. అదే భామతి కథ.

భామతి

భారతీయ వేదాంత సంపదలో అత్యంత విలువైనది, అత్యంత క్లిష్టమైనది బ్రహ్మసూత్రాలు. కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం మహర్షి, మహా జ్ఞాని వేదవ్యాసుడు తన తపః ఫలితంగా అందిన అద్భుతమైన జ్ఞాన సంపదని ఒక చక్కని గ్రంధంగా మలచి మానవజాతి పురోభివృద్ధికి అందించారు. అదే బ్రహ్మసూత్రాలు అనే ఒక గొప్ప వేదాంత గ్రంధం.

బ్రహ్మసూత్రాలు అనే ఈ గ్రంథాన్ని ప్రపంచంలోని వేదాంతాలన్నింటిలోని సారాంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే అత్యంత ప్రాచీనమైన బ్రహ్మసూత్రాల నుంచి ప్రపంచంలోని వేదాంతాలన్నీ ఉద్భవించాయి. అందుకే దీనిని గ్రంథాలకి గ్రంథమని, గ్రంథరాజమని చెబుతారు. బ్రహ్మసూత్రాలు అత్యంత ఉన్నతమైన ప్రమాణాలు కలిగి, అన్ని కాలాలలోను అత్యుత్తమ గ్రంథంగా విరాజిల్లినది. బ్రహ్మసూత్రాలని యథాతథంగా అర్ధం చేసుకోవటం కష్టం. అందుకే జ్ఞానోదయమైన రుషులు దీనికి వ్యాఖ్యానాలు వ్రాసారు.

8వ శతాబ్దంలో భారతదేశంలో జ్ఞానోదయమైన ఒక గురువుగారి దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. వారిలో వాచస్పతి మిశ్రా చాలా తెలివైన చురుకైన విద్యార్థి. ఆ గురువు గారు ఒక రోజు వాచస్పతి మిశ్రాని పిలచి బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం వ్రాయమని చెబుతారు. అది గురువుగారు తనకి ఇచ్చిన ఒక వరంలా భావించి వినయంతో ఆ బాధ్యతని తీసుకుంటాడు, వాచస్పతి మిశ్ర.

ఆ గ్రంధం బాధ్యతతో పాటు ఆయన తన కుమార్తె భామతిని ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత గురుదేవులు స్వర్గస్తులవుతారు. వాచస్పతి మిశ్రా గ్రంధ రచనలో ఉండగా అతని మంచిచెడ్డలు చూస్తూ అతను గ్రంథాన్ని విజయవంతంగా పూర్తి చేసే బాధ్యతని భామతి తీసుకుంటుంది.

వాచస్పతి మిశ్రా బ్రహ్మసూత్రాలు అనే మహా గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాయటం ప్రారంభించాతాడు. గ్రంథ రచనని ఆయన ఒక తీవ్రమైన తపస్సులా, ఒక లోతయిన ధ్యానంలా చేస్తుంటాడు. ఆ గ్రంథ రచనలో నిమగ్నమైపోయి ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఆ విధంగా ఆయన ఆ గ్రంథాన్ని వ్రాస్తూ చాలా సంవత్సరాలు దానిలోనే నిమగ్నమైపోయి ఉంటాడు. ఆ గ్రంధ రచనలో ఉండగా ఆయన మరి దేనినీ గమనించేవాడు కాదు. దేని గురించీ ఆలోచించేవాడు కాదు. ఆ విధంగా ఆయన బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి, గ్రంథ రచనలో నిమగ్నమైపోతాడు.

చివరికి ఆ గ్రంథ రచన పూర్వవుతుంది. ఇక ఆ పుస్తకానికి పేరు పెట్టటం మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు వాచస్పతి మిశ్రా బయట ప్రపంచం వైపు చూస్తాడు. గ్రంథంలోంచి బయటకి వచ్చి చూస్తాడు. అది సాయంత్రసమయం, క్రమంగా చీకటి మొదలవుతుంది. ఆ సమయంలో అక్కడకి ఒక వృద్ధురాలు వచ్చి దీపం వెలిగిస్తూ ఉంటుంది. ఆమెని చూసి వాచస్పతి మిశ్రా “మీరు ఎవరు?” అని అడుగుతాడు. ఆ ప్రశ్నికి ఆమె “ పరవాలేదు మీ పనిని పూర్తి చేయండి” అని అంటుంది. అప్పుడు ఆయన “ ఈ గ్రంథం వ్రాయటం పూర్తి అయినది. మీరు ఎవరో చెప్పండి” అని అడుగుతాడు.

ఆమె వాచస్పతి మిశ్రా వైపు చూసి “ నేను మీ భార్యని” అని జవాబు ఇస్తుంది.

వాచస్పతి మిశ్రా విభ్రాంతిగా ఆమె వైపు చూస్తాడు. అప్పుడు జరిగిన సంఘటనకి ఆశ్చర్యపోతాడు.

అంటే ఆయన ఆ గ్రంథాన్ని రాస్తున్న ఇన్ని సంవత్సరాలు భార్య గురించి ఆలోచించలేదు. ఆ విషయాన్ని ఆయన నమ్మలేకపోయాడు. ఎంతో ఆర్ద్రత నిండిన గొంతుతో ఆయన ఇలా అంటాడు “నీవు ఎందుకు ఈ విషయం నాకు గుర్తుచేయలేదు?”

ఆ ప్రశ్నికి ఆమె “ఎందుకు? మీరు గ్రంథ రచనలో పూర్తిగా నిమగ్నమైపోయారు. మిమ్మలని మీ నిశ్చలతని భంగం చేయవలసిన అవసరం నాకు ఎప్పుడూ అనిపించలేదు” అని నెమ్మదిగా, ప్రశాంతంగా జవాబు చెబుతుంది.

అప్పుడు వాచస్పతి మిశ్రా ఇలా అంటాడు “ మానవులకి ఎంతో ఉపయోగపడే ఈ గ్రంథం కోసం నీ జీవితాన్ని త్యాగం చేసావు. ఆ త్యాగానికి ప్రతిఫలంగా నీకు నేను ఏమి ఇవ్వగలను”.

అప్పుడు భామతి “ మీకు సేవ చేయటంలో నేను చాలా ఆనందపడ్డాను. మీరు ఈ అద్భుతమయిన గ్రంథాన్ని వ్రాసే సమయంలో మీకు సేవ చేయగలగటమే నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకుమించి నాకు ఏ అవసరం లేదు” అని చాలా స్పష్టంగా, దృడంగా జవాబు చెబుతుంది.

భామతి జవాబు విన్న వాచస్పతి మిశ్రాకి ఆనందంతో కళ్ళలో నీరు వచ్చింది. ఆయన తన భార్యకి ఒక మంచి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఆయన జీవితాంతం శ్రమపడి ఒక తపస్సులా వ్రాసిన ఆ అద్భుత గ్రంథానికి తన భార్య ‘భామతి’ పేరు పెడతాడు.

ఈ రోజున మానవత్వం మీద ఉన్న ఒక అపురూపమయిన అద్భుతమయిన గ్రంథం, ఆమె పేరు మీద ఉన్నది. అదే భామతి. వేదాంతంలో ప్రవేశమున్నవారు, వేదాంతం పై పరిశోధనలు చేసేవారు, వేదాంతాన్ని తెలుసుకోగోరిన వారు, వేదాంత ప్రియులు తప్పని సరిగా చదివే గ్రంథం భామతి. రెండు వేల సంవత్సరాలుగా భామతి గ్రంథాన్ని కొన్ని కోట్లమంది చదివి ఉంటారు.

ఈ విధంగా భామతి ఈ ప్రపంచంలో శాశ్వతమయినది. ఆమెలోని నిస్వార్థ ప్రేమ, భక్తి, సేవాతత్పరత, త్యాగం ఆమెని ప్రపంచంలో శాశ్వతం చేసాయి.

అసలు ఈ కథలోని ఒక అద్భుతమయిన విషయం ఉన్నది. అది ఏమిటి అంటే, అన్ని సంవత్సరాలు భామతి తన భర్తకి, ఆయన నిశ్చలతని ఆయన గ్రంథ రచనని ఏమాత్రం భంగ పరచలేదు. ఆమె అలా చేయటం ఇష్టం లేక కాదు, తప్పుడు కాబట్టి కాదు. ఆమె ఏమని చెబుతుంది? ఆ అవసరం తనకి కలగలేదని చెబుతుంది. అది పరిస్థితులకి సర్దుకుపోవటం కాదు. నాకు ఆ అవసరం లేదు అనటం, సర్దుకుపోవటం ఈ రెండింటికీ చాలా తేడా ఉన్నది.

మనకి చాలా సార్లు ఎదుటివారి శ్రద్ధ మా మీద ఉండాలి అని వారు మనని గుర్తించాలి, మన మీద ప్రేమ చూపాలి అని అనుకుంటాము, కానీ ఎందుకులే వారిని విసిగించవద్దులే అని సర్దుకుపోతాము. కానీ ఇక్కడ మన కథలోని భామతికి అసలు ఆ అవసరం లేదు. అదే తేడా ఆమె తన యవ్వనం వృధా అయిపోయింది అని అనుకోలేదు. అలా అని పరిస్థితులకి సర్దుకుపోలేదు. ఆమె తన సహజత్వంతో, తనదైన సహజ వ్యక్తిత్వంతోనే ఉన్నది. అంతే, అది ఆమెకి చాలు. తన భర్త ఏకాగ్రతని పాడు చేయవలసిన అవసరం ఆమెకి రాలేదు. ఆమెకి అంతరంగంలోని శక్తి చాలు. ఆమె తన ఏకాగ్రతని తనపైన కేంద్రీకరించి తనలోని ఆనందాన్ని కనుగొనగలిగింది. ఆ పరమానందం ఆమెకి నిజమైన, శాశ్వతమైన తృప్తిని ఇచ్చింది. ఆ ఆనందం యొక్క అనుభవమైన వ్యక్తి ఆనందం కోసం, బయట ప్రపంచంలో ఎవరిపైన ఆధారపడరు. వారికి ఎవరి శ్రద్ధ అవసరం లేదు. వారికి వారు చాలు. అలా అని వారు బయట ప్రపంచాన్ని వదలనవసరం లేదు. వారి బాధ్యతలని వారు చక్కగా నిర్వహింతారు. అలాగే బయట ప్రపంచంలోని విషయాలు వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు.

అందుకే బామతి మరణించిశా కూడా జీవిస్తూ ఉన్నది. వందల సంవత్సరాల తరువాత కూడా ఆమె మన మనస్సులలో ఉన్నత స్థానాన్ని పొంది మహోన్నత వ్యక్తిగా ఉండిపోయింది.

కానీ మనం, మన ప్రవర్తనని గుర్తు తెచ్చుకుంటే, ఎంతగా ఎదుటివారి శ్రద్ధ, ప్రేమ కోసం తపించిపోతున్నామో అర్థమవుతుంది. ప్రేమని భిక్షగా అడగటం ఎంత తక్కువస్థాయితో అర్థం చేసుకోండి. ఎవరూ కూడా ఆనందం కోసం, నిజమైన సంతృప్తి కోసం ఎవరిపైనా ఆధారపడనవసరం లేదు అని ఈ కథ మనకి చెబుతుంది. ఎదుటి వారి శ్రద్ధ మనకి అసలు అవసరం లేదు. ఎదుటి వారి గుర్తింపు లేకుండానే మనం సంతోషంగా తృప్తిగా ఉండగలం అదే మనని శాశ్వతమైన నిత్యానందం వైపుకి తీసుకెళ్ళగలుగుతుంది.

మరణ భయం అన్ని భయాలకి మూల కారణం :

భయం అంటే ఏమిటి? భయం అంటే మనం దేనినైనా పోగొట్టుకుంటామేమో అని అభద్రతా భావంలో ఉండటమే. ఏమి పోతుంది? అని అంటే అది ఆస్తి, అందం, ఆరోగ్యం, ప్రేమ, దగ్గరివారిని పోగొట్టుకోవటం ఇలా ఏదయినా సరే, అది మననుంచి దూరం అవుతుంది అనే అభద్రతా భావమే భయాన్ని సృష్టిస్తుంది.

పరమహంస శ్రీ నిత్యానంద మనకి తెలియని ఒక విషయాన్ని చెప్పినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. అది మన అన్ని రకాల భయాలకి అసలు కారణం మరణభయమే. మన భయాలన్నీ ఎందుకు అని లోతుగా విశ్లేషించితే అది చివరికి మరణ భయం దగ్గరికే వెళుతుంది. అంతేకాదు స్వామి మరొక విషయం కూడా చెబుతారు. మరణం మన జీవితం యొక్క శ్రేష్టతని, నాణ్యతని మార్చివేస్తుంది. మరణం జీవితంలో ప్రతి క్షణంలో ఉంటుంది. ఇది మన జీవితాన్ని నిర్దేశించుతుంది. ఎందుకంటే మరణం అనే ఒక్క అంశం మొత్తం జీవితాన్ని నియంత్రిస్తుంది.

పరమహంస మరణం గురించి ఈవిధంగా చెబుతారు. మనం మరణం గురించి పూర్తిగా అర్థం చేసుకుంటే, అందులో రహస్యాలని లోతుగా తెలుసుకోగలిగితే, మనం జీవిత రహస్యాలని బాగా అర్థం చేసుకో గలుగుతాము.మరణం అంటే కేవలం మరొక రూపంలోనికి వెళ్ళటమే అని తెలుసుకోగలిగినప్పుడు మనకి మరణ భయం ఉండదు.

భయం అనేది కేవలం ఒక భావన మాత్రమే. ఈ భావన మనలో బలంగా నాటుకుపోవటానికి అసలు కారణం మరణం అంటే మనకి ఉండే భయం. దాని తరువాతది మన అహంకారాన్ని తృప్తిపరచటం. ఉదాహరణకి పరువుపోతుందేమో, నాకు ఉన్న కీర్తి పేరు పోతాయేమో ఇటువంటి భయాలు లేదా పిల్లలు ఎదిరించి తమ అధికారాన్ని లెక్కచేయరేమో అనే భయం అహంకారానికి దెబ్బ తగులుతుందనే భయం, ఇవన్నీ భావాలే కొందరికి చీకటంటే భయం, నీళ్ళు అంటే భయం. అగాధాలు అంటే భయం. జంతువులంటే భయం. ఇవన్నీ కూడా మరణం అంటే మనకి ఉండే భయాలే. అయితే వివరంగా చూస్తే భయాలన్నీ కూడా మనం పోగొట్టుకోవటానికి అక్కడ ఏమీ లేదు అనే విషయం స్పష్టంగా మనకి తెలియక పోవటమే. ఉదాహరణకి ఎవరయితే మరణానికి దగ్గరగా వెళతారో, మరణాన్ని దగ్గరగా ఎదుర్కొంటారో వారికి అక్కడ పోగొట్టుకునేది ఏమి లేదు అని అర్థమవుతుంది. ఎవరయితే మరణ భయాన్ని జయించుతారో వాళ్ళు మరణాన్ని జయించినట్టే.స్వామీజీ ఈ విధంగా చెబుతారు, మరణం అంటే మరొక రూపంలోనికి మారే ఒక ప్రక్రియ. మీరు మరణాన్ని మరణ భయాన్ని అర్థం చేసుకుంటే జీవితాన్ని సంతృప్తిగా ఎంతో నాణ్యతతో జీవించగలుగుతారు.

మరణం చాలా మంచి గురువు, మరణాన్ని వెతుకుతూ వెళితే అక్కడ మరణం ఉండదు. మన జీవితంలో ఏదీ కచ్చితంగా జరగదు ఒక్క మరణం తప్పా. అయినా మనం ఆ మరణాన్ని తప్పించుకోవటానికి మనశక్తి కొద్దీ, మనకి ఉన్న అన్ని అవకాశాలని ఉపయోగించి ప్రయత్నిస్తాము. అంతే కానీ మరణం ఒక గురువు, మనకి బహుమతులనిచ్చే ఒక గొప్ప దేవత అని గ్రహించము. మరణం యొక్క గొప్పదనాన్ని స్పష్టంగా, వివరంగా చెప్పే కథ ఒకటి మన ఉపనిషత్తులలో ఉన్నది. స్వామీజీ ఆ కథని తప్పనిసరిగా తన నిత్యానంద స్ఫురణ కార్యక్రమంలో చెబుతారు. ఆకథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

నచికేతుని కథ :

మనకి ఉండే అనేకమయిన గొప్ప ఉపనిషత్తులలో కఠోపనిషత్తు అనేది ఒక అద్భుతమయిన ఉపనిషత్తు. కఠోపనిషత్ అంతా కూడా ఒక చిన్న బాలుడికి యమధర్మరాజుకి మధ్య జరిగే ఒక చక్కని విజ్ఞానపూరితమయిన సంభాషణ. ఈ కథకి నాయకుడు బాలుడు అయిన నచికేతుడు. ఇందులోని మరొక పాత్ర యమధర్మరాజు.ఆయన మరణానికి దేవత మరణ శాసనకర్త.

ఒకప్పుడు వాజశ్రవసుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి సర్వసంపదలు పొందాలి అని, ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి అనే కోరిక కలిగింది. ఆ కోరిక సాధించటానికి ఆయన వాజపేయ యజ్ఞం చేయాలని సంకల్పించుతాడు. సర్వసంపదలకి అధిపతి కావాలి అని అనుకుంటే, ప్రపంచాన్ని నియంత్రించాలి అని అనుకుంటే ఈ యజ్ఞం చేయాలి.

ఈ యజ్ఞం చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. యజ్ఞం చేసే వ్యక్తి తనకున్న సంపదలు దానమీయాలి. తనకి అత్యంత ప్రియమయినవి, తనకి అధిక సంబంధం గల వస్తువులని, తన దృష్టిలో అత్యంత విలువయిన సంపదలని ఆ యజ్ఞం చేసే వ్యక్తి దానమీయాలి. అప్పుడే ఆ యజ్ఞం పూర్తి అవుతుంది. దాని ఫలితాన్ని యజ్ఞం చేసే వ్యక్తి పొందగలుగుతాడు.

అయితే ఆ రాజు ఋత్విజులకి దక్షిణగా కానుకలు ఇవ్వటానికి, దానం చేయటానికి జీవితపు చివరి దశలో ఉన్నవి, ముసలివి అయిపోయి పాలు ఇవ్వలేని ఆవులని, ఎందుకూ పనికి రాని ఆవులని దానం చేస్తాడు. ఆ విధంగా ఏమాత్రం ఉపయోగం లేని వాటిని దానం ఇవ్వసాగాడు. ఆ రాజుకి ఏడుసంవత్సరాల వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. అతని పేరే నచికేతుడు. అతను తన తండ్రి చేస్తున్న పనిని గమనించసాగాడు. అతను తండ్రిచేసే దానం సరియైనది కాదు అని అర్థం చేసుకున్నాడు. ఆ బాలుడికి తండ్రి చేసే పని తప్పు అని అర్థమయింది. అయితే అతనికి ఎలా చెప్పాలో తెలియలేదు.

ఆ విధంగా మొదటినుంచీ తండ్రిని గమనిస్తూనే ఉన్నాడు నచికేత. చివరికి తండ్రి దగ్గరకి వెళ్ళి “తండ్రి! మీరు యజ్ఞంలో మీకు ఉన్న విలువయిన సంపదని దానం ఇవ్వాలికదా! నేను మీకు ఉన్న విలువయిన, మీకు ప్రియమయిన సంపదని కదా! మరి నన్ను ఎవరికి దానంగా ఇస్తున్నారు? ” అని అడుగుతాడు.

రాజుకి కొడుకు మనస్సు అతను తనకి ఏమి చెప్పదలుచుకున్నాడో ఆ విషయం అర్థమయింది. నచికేత తను చేసే పనిని గురించి మాట్లాడుతున్నాడు అని అర్థమయింది. కాని అతని అహంకారం రాజుని ఆ పనినుంచి తప్పించలేకపోయింది. అతను నచికేత మాటలను లెక్కచేయకుండా తనపనిని తాను చేసుకుపోతుంటాడు.

నచికేత తండ్రిని మరలా అదే ప్రశ్న అడుగుతాడు, నన్ను ఎవరికి దానం ఇస్తారు అని అంటాడు. రాజు జవాబు చెప్పడు. అప్పుడు నచికేత అదే ప్రశ్నని పదే పదే అడుగుతాడు. రాజుకి చాలా కోపం వస్తుంది. “నిన్ను యముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. యముడి దగ్గరికి వెళ్ళు”, అంటాడు చాలా కోపంగా.

తండ్రి తనని మృత్యువుకి అప్పగిస్తున్నాను అని చెప్పినా అతడు బెదరడు. అతను నిజాయితీ కలవాడు, సత్యతత్పరుడు. అతను తండ్రి మాటకి కట్టుబడి తండ్రిమాటని గౌరవించటానికి యమధర్మరాజుని కలవటానికి వెళతాడు. అతను యములోకం వెళ్లిన సమయానికి అక్కడ యమధర్మరాజు ఉండడు. యమధర్మరాజు కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ విధంగా మూడురోజులు గడచిపోతాయి. అయినా నచికేత అక్కడే ఉంటాడు. మూడురోజులు గడిచాక యమధర్మరాజు యములోకానికి తిరిగి వస్తాడు.

అప్పుడు యమధర్మరాజు సేవకులు ఆయనతో ఒక బాలుడు ఆయనకోసం మూడురోజులనుంచి ఎదురు చూస్తున్నాడన్న విషయాన్ని చెబుతారు. వెంటనే యమధర్మరాజు నచికేత దగ్గరికి వెళతాడు. యమధర్మరాజు ఆ బాలుడిని అతను వచ్చేసమయానికి స్వాగతం చెప్పటానికి తాను లేకపోయినందుకు క్షమాపణ కోరుతాడు.

ఆయన నచికేతునితో, “నిన్ను నేను మూడురోజులు ఎదురు చూసేట్టు చేశాను. దానికి పరిహారంగా నీకు మూడు వరాలు ఇస్తాను. నీకు ఇష్టమయిన మూడు కోరికలు కోరుకో. ఆకోరికలు తీరుస్తాను అంటాడు. నచికేతకు మరణం వరాలు ఇచ్చే దేవత అయినది. నచికేత యమధర్మరాజుని మూడు వరాలు కోరుతూ ఈ విధంగా అంటాడు. “యమధర్మరాజా! ధన్యుడని. నీవు నాపై చూపించే అపారమయిన కృపకి ప్రేమకి నా నమస్సులు. హే ధర్మదేవతా! నామొదటికోరిక; నాతండ్రి చేసిన పాపాలు పరిహారం చేయండి ” అని అడుగుతాడు. యమధర్మరాజు తథాస్తు అని వరం ఇచ్చాడు.

“హే మృత్యుదేవతా నా రెండవ కోరిక; మిమ్ములని కలసి వెళ్ళాక నాతండ్రి నన్ను స్వీకరించాలి” అని ప్రార్థించుతాడు. నచికేతుని రెండవ కోరిక కూడా తీరుస్తాడు యమధర్మరాజు.

నచికేతుడు తన మూడవకోరికను ఈ విధంగా అడుగుతాడు.

7యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే
స్తీత్యేకే నాయస్తీతి చైకే !
ఏతద్ విద్యాయమ శిష్టస్త్వయాహం
వరాణామేష వరస్తృతీయః ॥ (కఠోపనిషత్ :20)

హే! యమధర్మరాజా, నా మూడవకోరిక విను. చనిపోయిన వ్యక్తి జన్మిస్తాడు (ఉన్నాడు) అని కొందరు అంటారు. మరికొందరు జన్మించరు, అని అంటారు. ఏది నిజం. ఈ విషయం గురించి తెలుసుకోవాలి అన్నదే నాకోరిక. ఇదే నేను నిన్ను అడిగే మూడవ వరం” అని అంటాడు.

ఏడు సంవత్సరాల పసి బాలుడి ప్రశ్న విని యమధర్మరాజు నిర్ఘాంతపోతాడు. ఆయన నచికేతతో ఈ విధంగా అంటాడు, “నచికేత ! ఇది చాలా సూక్ష్మమయినది, బహు కష్టతరమయిన విషయం. దీనిని నీవు అర్థం చేసుకోలేవు. నీవు మరొక వరం ఏదైనా కోరుకో. ఈ వరం మాత్రం నన్ను అడగవద్దు. నన్ను ఈ మాట అడగకుండా వదిలిపెట్టు”, అని అంటాడు.

యమధర్మరాజు మాటలు విన్న నచికేతుడు వినయంగా ఈ విధంగా జవాబు చెబుతాడు.

“యమధర్మరాజా ! ఇది చాలా సూక్ష్మమయినది, బహుకష్టతరమయిన విషయం అని మీరు చెబుతున్నారు కదా! కాబట్టి ఈ విషయాన్ని నాకు వివరించగల సమర్థులయిన ఆచార్యులు మీరే. ఇంకా ఎవరూ ఈ విషయాన్ని వివరించలేరు. అందుచేత ఈవరాన్ని నాకు ఇవ్వండి. ఈ వరంతో సమానమయిన వరం మరి ఎక్కడాలేదు.”

నచికేతుని జవాబు విన్న యమధర్మరాజు నచికేతుని ఒప్పించాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. నచికేత నీకు సర్వసంపదలు ఇస్తాను, దీనికి సరితూగే మరే వరమయినా కోరుకో. అది ఏ వరమయినా తీరుస్తాను. నీవు గొప్ప సామ్రాజ్యానికి చక్రవర్తి కావాలి అంటే ఆ వరం ఇస్తాను. నీకు కలిగే కోరికలన్నీ తీరుస్తాను కానీ ఈ ప్రశ్న మాత్రం అడగవద్దు అంటాడు.

అప్పుడు నచికేతుడు ఈ విధంగా జవాబు చెబుతాడు.

శ్వోభావామర్త్యస్య యదంతకైతత్
సర్వేంద్రియాణాం జయంతి తేజః
అపి సర్వం జీవితమల్పమేవ
తవైవ వాహొస్తవ నృత్యగీతే ॥

“ఓ యమధర్మరాజా, నువ్వు చెప్పేవన్నీ కూడా క్షణికాలే. ఇవన్నీ మానవుని ఇంద్రియశక్తిని క్షయింప చేసేవే. ఎంత పొడిగించినా మానవ జీవితం అల్పమే. అందుచేత అవన్నీ నీ దగ్గరే ఉంచుకో కానీ నేను అడిగిన వరాన్ని ఇవ్వు. మరణాంతరం ఏమి జరుగుతుందో తెలియచేయి, మరణం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పు. అది తప్పా నాకు మరొక వరం వద్దు” అని కచ్చితంగా చెబుతాడు.

యమధర్మరాజు ఆ బాలుడిలోని పరిణిత, సత్యాన్ని తెలుసుకోవాలనే పట్టుదల గమనించాడు. ఆయన ఆ బాలుడి పరిణితి పొందిన మేధస్సుకి సంతోషించి మరణం యొక్క రహస్యాన్ని, ఆ అనుభవాన్ని తెలియచేయాలి అని నిర్ణయించుకుని అతనికి ఆ విషయాలన్నీ బోధించుతాడు.

యమధర్మరాజు ఇచ్చిన అనుభవపూర్వకమయిన జ్ఞానానికి, ఆ బాలుని ఆత్మపొందిన అనుభవానికి నచికేతుడు ఎంతో వికాసం పొందుతాడు. జ్ఞానోదయం పొందుతాడు.

కఠోపనిషత్తులో ఉండే ఈ కథని పరమహంస నిత్యానంద ఎంతో అద్భుతంగా, చక్కని వివరాలతో చెప్పి, ఈ కథలో మనం తెలుసుకోగల గొప్ప సత్యాలని ఈ విధంగా చెబుతారు. . మరణం ఒక గురువు, అది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. . మనం మరణాన్ని వెతుకుతూవెళితే అక్కడ మనకి మృత్యువు (మరణం) కనిపించదు. . ఒక వేళ మరణం అక్కడ ఉంటే మనందరం అనుకునేటట్టు అది మనని భయపెట్టదు. అది మనని ప్రేమిస్తుంది, మనకి బహుమతులు ఇస్తుంది. . మరణం మనకి అంతిమ బహుమతిని ఇస్తుంది. అదే జ్ఞానం.