KAILASA Library/పరమహంస శ్రీ నిత్యానంద/మీ శరీరాన్ని, మిమ్మలని మీరు ప్రేమించటం నేర్చుకోండి?Sign in
పరమహంస శ్రీ నిత్యానంద

మీ శరీరాన్ని, మిమ్మలని మీరు ప్రేమించటం నేర్చుకోండి?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

పరమహంస శ్రీ నిత్యానంద మనం నమ్మలేని నిజాన్ని, మనం ఆశ్చర్యపోయే సత్యాన్ని ఒకదానిని చాలా చమత్కారంగా చెబుతారు. అది ‘మీ శరీరాన్ని, మిమ్మలని మీరు ద్వేషించుతారు’. ఈ మాట వినగానే మనం నమ్మం, కానీ స్వామీజీ వివరంగా ఉదాహరణలతో చెప్పినప్పుడు, నమ్ముతాము, ఆశ్చర్యపోతాము.

స్వామీజీ ఈ విధంగా చెబుతారు. ‘నా శరీరంతో సౌకర్యంగా ఉన్నాను. నా శరీరం నాకు చాలా బాగున్నది’ అని చెప్పేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. వాళ్ళు కూడా నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను అని అనరు, సౌకర్యంగా ఉన్నాను అంటారు.

శరీరం అంటే ఏమిటి?

శరీరం అంటే మీరు కాదు. ఈ శరీరం మిమ్మలని మోస్తూ తిరిగే ఒక వాహనం. ఈ జీవితం అనే సముద్రాన్ని దాటించే నౌక. మీకు నివాసాన్ని కల్పించిన గృహం. అంతే. అయితే మీరు ఏ పని చేయాలి అని అనుకున్నా శరీరం కావాలి. శరీరం సహాయసహకారాలు లేకపోతే ఏమీ సాధించలేరు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా, సౌకర్యంగా ఉంచుకోవాలి. అంతేకాదు శరీర సహాయం మీకు కావాలి కాబట్టి శరీరంతో మీరు మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి, దానిని ప్రేమించాలి. అయితే దాని మీద ప్రేమ మిమ్మలని దాటి వెళ్ళిపోకూడదు. మీ శరీరం మీ కంటే గొప్పది కాదు. అది మీ యొక్క తాత్కాలిక నివాసం. ఈ జన్మలో మీరు చేయవలసిన పని అయిపోగానే ఇక ఆ ఇంట్లో వుండరు. దానిని వదిలి వేస్తారు.

అదే విధంగా శరీరాన్ని ద్వేషించకూడదు. నేను అందగాలేను, నేను పొడవుగా లేను, పొట్టిగా లేను ఇలాంటివన్నీ అర్థం లేని విషయాలు. ఇవన్నీ ఇతరులతో పోల్చుకోవటం వలన కలిగిన భ్రమలే. ఈ విధంగా చాలా మంది మానసికంగా కుంగిపోతారు.

స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరందరూ ఆ భగవంతుని చేత ప్రత్యేకంగా సృష్టించబడినవారు. భగవంతునికి మీరు కావాలి. అందుకే భగవంతుడు మిమ్మలని సృష్టించాడు. మీ ద్వారా ఈ ప్రపంచానికి ఏదో చేయాలి అని సంకల్పించాడు. అయితే మీరు ఒక విషయం అడగవచ్చు. భగవంతుడు అందరినీ అందంగా సృష్టించవచ్చు కదా! అని.

అవును. భగవంతుడు అందరినీ అందంగా అద్భుతంగా సృష్టించాడు. కాదని ఎవరయినా చెప్పగలరా? ఆయన మేధస్సు కంటే గొప్పదా వీరి మేధస్సు? ఆయన సృష్టిని ప్రశ్నించేంత మేధస్సు ఉన్నదా మనకి? అర్థం చేసుకోండి, భగవంతుడు ఇంజినీరు కాదు. ఏదో ఒక మూస తీసుకొని మనుషులని ముద్రించటానికి. ఆయన అందమైన హృదయం ఉన్న కళాకారుడు. ప్రతి మనిషినీ అతని జీవితానికి సరిపడే విధంగా తీర్చిదిద్దుతాడు. అతను ఈ ప్రపంచంలో ఏ కర్మలు చేయటానికి వచ్చాడో దానికి అనుగుణంగా అతనిని తీర్చిదిద్దాడు. మహామేధో సంపన్నుడయిన భగవంతుని పనికి మనం లోపం చూపాలా? మనం ఆయనకి సలహాలు చెప్పనవసరం లేదు కదా! ఆయన ఎవరిని అయినా ఒక లక్ష్యం కోసం సృష్టించుతారు. దానికి తగినట్టు వారిని తయారు చేస్తాడు. మనలో లోపం అనేది కేవలం సమాజం సృష్టి లేదా మన భ్రమ.

ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మనని మనం ద్వేషించుతాము. మనని నియంత్రించాలని (కంట్రోలు చేయాలని) చూసే సమాజం మీ శరీరం గురించి ఇటువంటి అర్థం లేని వ్యతిరేక అభిప్రాయాలని పంపించి, మనం తక్కువ అని అనుకునేలా చేసి అప్పుడు మనని తన గుప్పిట్లోకి తీసుకుంటుంది. మీరు ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మీ శరీరం మీద మీకు ఉన్న అభిప్రాయాలన్నీ కూడా మీ చిన్నతనం నుంచి ఈ సమాజం కల్పించినవే అని స్పష్టంగా అర్థమవుతుంది. అవి నమ్మి మీరు అపరాధభావంతో ఆత్మన్యూన్యతా భావంతో కుంగిపోతే, అప్పుడు సమాజం మీ మీద విజయం సాధించినట్టే అనుకొని, మిమ్మలని తన గుప్పిట్లోకి తీసుకుంటుంది. పరమహంస ఈ విషయాలన్నీ చెబుతూ మనకి ఒక చక్కని కథ చెబుతారు.

చిన్నకథ : కావడి మోసే వ్యక్తి - కావడి కుండలు

ఒక వ్యక్తి ఒక ఆసామి ఇంట్లో పనిచేస్తుంటాడు. ఆ వ్యక్తి చేయవలసిన పని ప్రతి రోజూ ఆ ఇంటికి దూరంగా ఉన్న నదికి వెళ్లి రెండు కుండలు నిండుగా నీరు నింపి, ఇంటికి తీసుకురావాలి. ఆ నీటిని ఒక తొట్టిలో నింపాలి. ఆ తరువాత యజమాని గదిని అందంగా తీర్చిదిద్దాలి.

ఆ వ్యక్తి తన పనులని చాలా బాధ్యతగా చేస్తుంటాడు. అతని పనులకి యజమాని సంతోషపడుతుంటాడు. ప్రతి రోజు ఆ వ్యక్తి కావడి భుజాన వేసుకొని నడచి నది దగ్గరికి వెళ్లి, రెండు కుండల నిండా నీరు నింపి వాటిని కావడిలో పెట్టి భుజాన మోసుకొని యజమాని ఇంటికి తెస్తుంటాడు. ఈ విధంగా ప్రతి రోజు చేస్తుంటాడు.

అతను ఇంటికి నీరు తెచ్చే రెండు కుండలలో ఒకటి బాగానే ఉంటుంది కాని మరొక కుండకి చిన్న పగులు ఉంటుంది. దాంతో కుండనిండుగా నీరు పట్టి తెచ్చినా ఆ పగులు ద్వారా నీరు బయటకి కారిపోయి ఇంటి వచ్చేటప్పటికి సగం నీరు మాత్రమే మిగిలేది.ఆ విధంగా కుండలోని నీరు సగం బయటకి పోయినా, ఆ కావడి మోసే వ్యక్తి ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఏమీ అనుకునే వాడు కాదు. అవిధంగానే సగం కుండ నీరు మాత్రమే యజమాని ఇంటి తెచ్చేవాడు.

అయితే రెండు కుండలలోనూ బాగున్న కుండ తాను చాలా కచ్చితమయిన దానిని అని, తనని తయారు చేసిన ఉద్దేశం ప్రకారం తన బాధ్యతని చక్కగా నిర్వహిస్తున్నాను అని చాలా గర్వపడేది. తనలో లోపం లేదు అనే అహంకారాన్ని ప్రదర్శించుతూ ఉండేది. తన పనిలోని నాణ్యతని చూసి గర్వపడేది.

రెండవదయిన పగులు ఉన్న కుండ తనలోని లోపం చూసి సిగ్గుపడేది. తాను కచ్చితంగా లేనని, తన బాధ్యతని పూర్తిగా నెరవేర్చలేకపోతున్నాను అని చాలా బాధపడేది. మానసికంగా కుంగిపోయేది. రోజులు గడచేకొద్దీ పగిలిన కుండ వ్యధ అధికమయిపోతుండేది.

ప్రతి రోజూ మాదిరిగానే ఆ రోజు కూడా కావడి మోసే వ్యక్తి నదికి వెళ్ళి కుండల నిండుగా నీరు నింపుతాడు. పగిలిన కుండని నీటితో నింపే సమయంలో ఆ కుండ, నీరు మోసే వ్యక్తితో ఈ విధంగా అంటుంది. “ ఓ వ్యక్తీ! నాకు చాలా సిగ్గుగా ఉన్నది. నాకు చాలా బాధగా ఉన్నది. నేను నీకు చాలా శ్రమ ఇస్తున్నాను. నా వలన నీకు చాలా కష్టం కలుగుతుంది,” అని చాలా బాధగా అంటుంది.

నీరు మోసే వ్యక్తి ఆశ్చర్యంగా ఆ కుండ వైపు చూస్తాడు. అతనికి ఏమీ అర్థం కాదు. “ ఓ కుండా! నీవు ఏ విషయం గురించి బాధపడుతున్నావు?” అని అడుగుతాడు.

పగిలిన కుండ ఆ వ్యక్తికి ఈ విధంగా జవాబు ఇస్తుంది, “ అయ్యా! నీవు ప్రతి రోజు నన్ను నీటితో నిండుగా నింపుతావు. కష్టపడి భుజం మీద కావడి వేసుకొని మోసి ఇంటికి వస్తున్నావు. నీవు తీరా ఇంటికి చేరే సరికి నా లోని లోపం వలన సగం నీటిని పోగొట్టుకుంటున్నావు. నా మూలాన నీకు నీ శ్రమకి తగిన ఫలితం దొరకటం లేదు. ఈ విధంగా నా వలన నీ శ్రమ వృధా అవుతుంది. అందుకే నేను బాధపడుతున్నాను” అని చాలా బాధపడుతూ తన మనస్సులోని వ్యధని ఆ కావడి మోసే వ్యక్తికి చెబుతుంది పగిలిన కుండ.

కావడి మోసే వ్యక్తికి ఆ కుండని చూస్తే చాలా జాలి అనిపిస్తుంది. ఆ కుండని ఎంతో ప్రేమగా తన చేతులలోనికి తీసుకొని దానితో “నీవు అసలు ఈ విషయం గురించి ఆలోచించకు. ఇవాళ మనం యజమాని ఇంటికి వెళ్ళే దారిలో చుట్టూ ఉన్న ప్రకృతిని చూడు. అక్కడ ఉన్న అందమయిన పూలని గమనించు” అని అప్యాయంగా చెబుతాడు.

కుండ కన్నీళ్ళని తుడుచుకుని సరే అంటుంది, కానీ దానికి దిగులు తగ్గదు. ఆ వ్యక్తి కావడిని భుజం మీద వేసుకొని యజమాని ఇంటికి బయలుదేరుతాడు. అవ్యక్తి చెప్పినట్టు పగిలిన కుండ దారికి రెండువైపులా ఉన్న పరిసరాలని గమనించుతూ ఉంటుంది. అప్పుడే ఉదయించిన సూర్యుని కిరణాలు నులివెచ్చగా అక్కడి చెట్లపై పడి ఆ చెట్లు ఎంతో అందంగా, బంగారు రంగులో కనపడుతున్నాయి. దారి అంతా ఉన్న మొక్కలు అందమయిన పూలతో చాలా అందంగా ఉన్నాయి. ఆ పూల మొక్కలు వాటి పూలతో దారి అందంగా కనపడుతుంది. ఆ ప్రకృతి అందాలు, పూలతో నిండుగా ఉన్న మొక్కలని చూసి కుండ చాలా ఆనందపడుతుంది.

వారు ఇంటికి చేరాకా, తిరిగి కుండ తన పాత భావాలలోనికి వెళ్ళిపోతుంది. తాను ఎందుకూ పనికిరాని దానినని మరింతగా వ్యధ చెందుతుంది. తనలోని లోపాన్ని మరొకసారి గుర్తుచేసుకొని సిగ్గుతో కుంచించుకుపోతుంది. నీరుమోసే వ్యక్తి కుండలోని నీటిని తీసుకెళ్ళి తొట్టిలో పోసి, వాటిని యథాస్థానంలో పెడతాడు.

అప్పుడు పగిలిన కుండ సగం నీరుని మాత్రమే తేగలిగాను అని కన్నీరు కారుస్తూ ఆ వ్యక్తిని క్షమించమని అడిగి తాను అసమర్థురాలనని అంటుంది.

ఆ వ్యక్తి కుండతో ఇలా అంటాడు, “ నీవు నది నుంచి ఇంటికి వచ్చే దారిని గమనించావా?” అని అడుగుతాడు.

“ అవును, గమనించాను. ఎంతో అందమయిన పూల మొక్కలు ఉన్నాయి. అవి అదృష్టం కలిగినవి, నాలాంటి దురదృష్టవంతమయినవి కావు. వాటి అందాలు వర్ణించలేను” అని అంటుంది, పగిలిని కుండ. ఆ వ్యక్తి తిరిగి కుండతో ఇలా అంటాడు, “ ఆ పూల మొక్కలు అన్నీ నీవు ఉన్నవైపు మాత్రమే ఉన్నాయి. అవతలవైపు లేవు. ఆ విషయం గమనించావా”. అవును, గమనించాను అని కుండ జవాబు చెబుతుంది. అప్పుడు ఆ వ్యక్తి కుండతో, “ ఆ మొక్కలు, అందమైన పూలు నీవు పెంచినవే. అదంతా నీప్రతిభే అంటాడు”.

ఆశ్చర్యపోయిన కుండ నేను నమ్మను. నేను అసమర్థురాలని. ఇది ఎలా సాధ్యం అని అంటుంది.

అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, “ ప్రతి రోజు ఉదయం నది నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నీ పగులు నుంచి కారిన నీటితో ఆ మొక్కలు పెరిగాయి. అవి అందమైన పూలని ఇస్తున్నాయి. నేను ఆ పూలతో యజమాని గదిని అలంకరిస్తాను. యజమాని నా పనికి ఎంతో సంతోషపడతాడు. నన్ను ఎంతో మెచ్చుకుంటాడు. ఇదంతా కేవలం నీ వలన మాత్రమే సాధ్యపడినది. నేను నీకు కృతజ్ఞత చెప్పాలి” అని ముగింపుతాడు ఆ వ్యక్తి.

పగిలిన కుండ ఆశ్చర్యానికి, ఆనందానికి హద్దులు లేనతంగా ఆనందిస్తుంది. తనని అంత ప్రత్యేకంగా చేసిన భగవంతునికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.

ఈ కథని ముగించి స్వామీజీ ఈ విధంగా చెబుతారు. మన అందరిలో ఒక లోపం ఉంటుంది. అందరం పగులు ఉన్న కుండలాంటి వారమే. కాని మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మనందరిని భగవంతుడు ఎంతో శ్రద్ధతో ప్రత్యేకంగా సృష్టించాడు. నేను బాగా లేను, నాలో లోపం ఉన్నది అని మీరు అనుకుంటే, మీరు భగవంతుని శక్తిని విమర్శంచుతున్నారు అని అర్థం. భగవంతుని మేధస్సు కచ్చితం కాదు అని మీరు అనుకుంటున్నారు అని అర్థం.

మీలో లోపాలు ఉన్నాయి అని అనుకోవద్దు. మీకు ఏదయినా అలా కనిపింశితే అవి మన జీవిత విధానాలు అని గుర్తుంచండి. అప్పుడు మీరు మీ జీవితంలోనికి అందాలు తేగలుగుతారు. ఆనందం మీ సొంతమవుతుంది. మీ చుట్టు ప్రక్కల, మీ ఇంటిలో, సమాజంలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం వ్యాపించుతుంది.