పరమహంస శ్రీ నిత్యానంద
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

పరమహంస శ్రీ నిత్యానంద
చెప్పిన చిన్న కథలలో పెద్ద సత్యాలు
కథలు మానవ సంస్కృతిలో ఒక ముఖ్య భాగము. మనిషి మాటలు నేర్చి, కల్పనలు అల్లటం నేర్చుకున్న నాడే కథలకి అంకురార్పణ జరిగింది. కథలు లేని సాహిత్యం బహుశః ప్రపంచంలో ఎక్కడా లేదేమో. కథలు చెప్పటం ప్రాచీనమయిన ఒక కళ. కథలలో పురాణ కథలు, జానపద కథలు, సమకాలీన జీవిత కథలు ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. కథలు చిన్నవయితే కథానికలు అంటాము. మరీ పెద్ద కథలయితే నవలలు అంటాము.
భారతీయ సాహిత్యం, సంస్కృతిలో పెనవేసుకుపోయిన అంశం కథ. ప్రపంచదేశాలతో పోల్చిచూస్తే భారతీయ కథలు బహుప్రాచీనమయినవి. అవి నేటికి సజీవంగా అలరారుతున్నాయి. బహుశః ప్రపంచంలో వినే కళలో భారతీయులు వేల సంవత్సరాలుగా నిష్ణాతులు అయినందుకు కథలు అంత ప్రాచుర్యాన్ని పొందాయేమో. వారి శ్రవణ శక్తి అమోఘం .అందుకు ఉదాహరణ, కొన్ని వేల సంవత్సరాలుగా మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వినటం ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి జాగ్రత్తగా బదిలీ అయ్యాయి. వాటిని ఈ మధ్య కాలంలోనే బహుశః మూడు నుంచి నాలుగువేల సంవత్సరాల క్రితం మాత్రమే అక్షర రూపంలో తాళ పత్రాల మీద రచించారు. ఈ శ్రవణ శక్తి వలన కూడా నేటికి కథలు అజరామంగా ఈ భూమి మీద ఉన్నాయి. కథలు లేని పురాణాలు, కథలు లేని ఏ కార్యక్రమాలు మనకి ఉండవు.
కథ అంటే మనలోని భావాలకి ఊహలని కల్పనలని మేళవించి, వినటానికి ఇంపుగా, చదవటానికి చక్కగా తయారు చేసి చెప్పటమే. కథని సృష్టించటం, దానిని అందంగా మలచటం, ఇంకాస్త అద్భుతంగా చెప్పటం అనేది గొప్ప కళ. కథలు సృజనాత్మకతకి, మేధస్సుకి, అసంకల్పితంగా స్పందించ గల నేర్పుకి చక్కని ఉదాహరణ.
కథలని సృష్టించే సృజనాత్మకత గురించి పరమహంస శ్రీ నిత్యానంద ఒక చక్కని మాట చెబుతారు. ‘ఎప్పుడయితే మేధస్సుతో పాటు హృదయం కూడా కలుస్తుందో అక్కడ సృజనాత్మకత ఉంటుంది. అందులోంచి కళ ఉద్భవిస్తుంది’. కథలు సృజనాత్మకతకి ఉదాహరణలు. మనలోని భావాలని స్పష్టంగా చిన్న చిన్న మాటలలో ఎదుటివారికి సూటిగా అర్థమయ్యే రీతిలో చెప్పగల నేర్పుని కథలు అంటాము. చెబుతున్న సందర్భాన్ని మనకి స్పష్టం చేయటానికి కథలని ఉపయోగిస్తాము. మనం సూటిగా చెప్పలేని విషయాలని కథల రూపంలో అద్భుతంగా చెప్పవచ్చు. అందుకే కథలు సృష్టించే కళాకారునికి దొరికే తృప్తి అనంతమయినది. ఈ సందర్భంగా పరమహంస శ్రీ నిత్యానంద ఈ విధంగా చెబుతారు. ‘ఒక పద్యాన్ని వ్రాసిన (కథని వ్రాసిన) కవి, ఒక బిడ్డకి జన్మనిచ్చిన తల్లి కంటే ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే బిడ్డకి జన్మనిచ్చే తల్లి గర్భం కడుపులో ఉంటుంది. అదే కవికి హృదయంతో ఉంటుంది. అదే ఫలసిద్ధి పొందిన ఆనందం. పరమహంస శ్రీ నిత్యానంద మరొక అందమయిన విషయాన్ని కూడా తన ప్రవచనాలలో చెబుతుంటారు.
సృజనాత్మకత భగవంతునికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే సృజనాత్మకత హృదయానికి సంబంధించినది. హృదయం ఎప్పుడూ భగవంతునికి చేరువకావాలని ఆతృత పడుతుంది. కాని మేధస్సు లౌకిక ప్రపంచానికి దగ్గరవటానికి ఆతృత పడుతుంది. అందుకే కళాకారులు సర్వాంతర్యామికి దగ్గరగా ఉంటారు.
బహుశః ఈ కారణం వలననేమో ఎక్కడ ఆధ్యాత్మికత ఉంటుందో అక్కడ కథలు, పాటలు, పద్యాలు, నాట్యాలు, భజనలు, కీర్తనలు, సంగీతం ఉంటాయి. కానీ అక్కడ గణిత శాస్త్ర సూత్రాలు, లేదా మరొక శాస్త్ర ధియరీలు, గణాంకాలు, లెక్కలు ఇలాంటివి ఉండవు. అసలు మేధస్సుకి సంబంధించిన ఏ విషయం అక్కడ కనిపించదు. అక్కడ మీకు కేవలం హృదయం మాత్రమే కనిపిస్తుంది. అదే ఆధ్యాత్మికత. అదే భగవంతుని సమక్షం. అక్కడ కూడా లెక్కలు కడుతున్నాము అంటే అది ఆధ్యాత్మికత కాదు అది కేవలం వ్యాపారం.
కథ అనే మాట చాలా చిన్నది. అలాగే కథలు కూడా చిన్నవే. అలా అని వాటిని మనం చిన్న చూపు చూడకూడదు. ఈ సందర్భంలో శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు (1891) కథల గురించి వాటి గొప్పదనం గురించి చాలా చక్కగా చెబుతారు. ఆయన ఈ విధంగా అంటారు " కథలు కల్పించటానికి గొప్ప ప్రతిభ ఉండాలి. అవి చెప్పటానికి నేర్పు ఉండాలి. అవి అర్థం చేసుకోవటానికి బుద్ధి సూక్ష్మత ఉండాలి" అని. కథల ద్వారా చెప్పే విషయం సూటిగా, సున్నితంగా హృదయాలని తాకుతుంది. అందుకే ఆ విషయం మనకి ఎంత కాలమైనా గుర్తుంటుంది. మన చిన్నప్పుడు తాతయ్య చెప్పిన అనగనగా ఒక రాజు కథ మర్చిపోయిన వారు అసలు మనకి కనిపించరు. ఆ కథ మొత్తం మనకి గుర్తుంటుంది. కాని నిన్న మొన్న నేర్చుకున్న సూత్రాలు, థియరీలు, నిర్వచనాలు, పాఠాలు అసలు గుర్తు ఉండవు. ఎందుకంటే అవి మేధస్సుకి చేరతాయి.
కథలు స్ఫూర్తిని ఇస్తాయి. స్తబ్దతగా ఉన్న మనస్సుని ఉత్సాహపరుస్తాయి. నిరుత్సాహంగా ఉన్న వారిలో చైతన్యాన్ని నింపుతాయి. కథలు కల్పించిన కళాకారుడికి ఆ కథ ఇచ్చే తృప్తి అనంతమయినది, ఎంతో విలువయినది. అదే విధంగా ఆ కథకి శ్రోత అయిన కళాపోషకుడు పొందే ఆనందం వెలకట్టలేనిది. అందుకే కథలకి మనకి అంత చక్కని అనుబంధం ఏర్పడినది.
కథ మనిషిని మనస్విగా మారుస్తుంది, వ్యక్తిని తపస్విని చేస్తుంది. భోగిని త్యాగిగా తయారు చేయగలుగుతుంది. అదే విధంగా నిరాశావాధిని అన్వేషిగా చేయగల శక్తి కథకి ఉన్నది. రాముడి కథ ఎంతమంది సామాన్యులని రుషులుగా చేసిందో మనందరికీ తెలుసు. ఛత్రపతి శివాజీని అంత గొప్పవీరునిగా మలచటంలో అమ్మ చెప్పిన కథలు ప్రభావం ఎక్కువ అని మనం చదివాము.
ఇక్కడ కథల గురించి మంచి ప్రాచుర్యంలో ఉన్న కథ ఒకటి మన భారతీయ సాహిత్యంలో ఉన్నది. అదే పంచతంత్ర. ఒక రాజుగారు తన కుమారులని గొప్ప మేధావులుగా, మంచి పరిపాలనా దక్షులుగా చేయాలి అని నిర్ణయించి వారిని మంచి గురుకులానికి పంపిస్తారు. ఆ రాజకుమారులు చాలా దుడుకువారు. చదువు సంధ్యలు వారి దగ్గరికి వచ్చేవి కాదు. క్రమశిక్షణ లేదు, భయం భక్తి వారికి అసలు లేదు. గురువులు మహారాజుకి నమస్కరించి రాజకుమారులకి విద్యాబుద్ధులు నేర్పించటం తమ శక్తిని మించిన పని అని సెలవు తీసుకునేవారు. రాజకుమారులని చాలా గురువుల దగ్గరకి పంపించాడు, కానీ ఫలితం శూన్యం.
రాజకుమారుల విషయం రాజుగారికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఆ సమయంలో మహామంత్రి రాజుగారి కులగురువుని రాజ్యానికి ఆహ్వానించి సమస్యని వివరించి, ఈ సమస్యవలన మహారాజుగారు ఏవిధంగా మానసికంగా కుంగిపోయారో చెబుతాడు. అప్పుడు రాజగురువు రాజుని ఓదార్చి ఒక రోజు మొత్తం రాజకుమారులతో గడిపి, రాజు దగ్గరకి వస్తాడు. ఆయన రాజుతో, “మహారాజా! రాజకుమారులని నా వెంట నా ఆశ్రమానికి తీసుకువెళతాను. వీరిని విద్యావంతులని చేసి తిరిగి నీ రాజభవనానికి వస్తాను” అని వాళ్ళని వెంట పెట్టుకుని ఆశ్రమానికి వెళతాడు.
ఇంతమంది గురువులు చేయలేని పని ఈయన మాత్రం ఏం చేస్తాడులే అని అందరూ అనుకుంటారు. రాజగురువు రాజకుమారులకి చిన్న చిన్న అందమయిన కథలని చెబుతూ అన్ని శాస్త్రాలు భోధించుతాడు. వారికి యుద్ధ నైపుణ్యాలు, యుద్ధతంత్రాలు, సామాజిక జీవితంలో ఉండే విశేషాలు, మోసాలు, కుతంత్రాలు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం ఈవిధంగా రాజకుమారులకి కావలసిన శాస్త్రాలన్నీ నేర్పించుతారు. అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న కథల రూపంలోనే నేర్పించుతాడు. వారు శాస్త్రాలు నేర్చుకుంటున్నారు అన్న విషయం తెలియకుండా నేర్చుకుంటారు. చివరికి మహామేధావులుగా మారి రాజభవనానికి తిరిగి వస్తారు.
కాబట్టి కథలకి అంతశక్తి ఉన్నది అని భారతదేశంలో ఎప్పుడో ప్రాచీన కాలంలోనే నిరూపించబడినది.
సరే మనందరం కథలని ఎందుకు ఇష్టపడతాం? దీనికి జవాబు మరొక ప్రశ్న ఉన్నది. మనం అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసి ఎందుకు అంత ఆనందంపడతాం? ఎందుకు అంత ఇష్టపడతాం? ఇది కూడా అంతే. కథలలో ఉండే భావాలు, విషయాలు సమస్యలు, పరిష్కారాలు అన్నీ మనకి సంబంధించినవే. మన ప్రతిబింబాన్ని అందంగా చూపిస్తున్నాయి కాబట్టి మనం కథలని ఇష్టపడతాము.
పరమహంస శ్రీ నిత్యానంద స్వామి కూడా పంచతంత్రలో గురుదేవుల మాదిరిగానే మన అందరినీ కథల ద్వారా సత్యాన్ని అర్థం చేసుకునేలా చేస్తారు. ఆయన తన ప్రతి ప్రవచనంలో ఎన్నో చిన్న చిన్న కథలు చెబుతూ తాను చెప్పదలిచిన అంశాన్ని సూటిగా మన హృదయంలోనికి పంపించుతారు.
పరమహంస శ్రీ నిత్యానంద స్వామి చెప్పే ప్రతి మాట ఒక సత్యం. అది విశ్వ జనీయత కలిగిన ఒక నిర్దిష్ట ప్రమాణం. సత్యం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. అది మనకి ఒక ఘాతంలా తగులుతుంది. అందుకే సత్యం చేదుగా ఉండి మనకి గుచ్చుకుంటుంది. ఆ పదునైన సత్యాలు అగ్నిశిఖలా దూసుకు వస్తే మనం తట్టుకోలేము, అందుకే ఆ సత్యాల నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తాము అని పరమహంసకి తెలుసు. పంచతంత్ర కథలోని రాజకుమారులలా ఆ చేదు గుళికలు రుచించక, మనం గురువుల నుంచి, సత్యాల నుంచి తప్పించుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని కూడా పరమహంసకి తెలుసు. విశ్వమేధస్సుతో నింపబడిన ఆ జ్ఞానోదయమయిన యోగీశ్వరుడు, మనని తప్పించుకోనీయరు.
స్వామి ఆ బాణాలని సుకుమార సుమాల మాలగా, అగ్ని శిఖలని చల్లని శ్రీ గంధంలా తయారు చేసి, ఆ సత్యాలని మన దగ్గరకి మృదువుగా, మధురంగా ఆహ్లాదకర రీతిలో పంపించుతారు. దానికి ఆయన వాడే అతి శక్తి వంతమయిన పద్ధతి చక్కని చిన్న కథలు. అప్పుడు ఎటువంటి బాధ, శ్రమ లేకుండా, చేదు తెలియకుండా ఆ సత్యాలు సూటిగా మన హృదయంలోనికి వెళతాయి. అవి మనని బాధించవు సరికదా ఆహ్లాదపరుస్తాయి. అదే, పరమహంస శ్రీ నిత్యానంద స్వామి యొక్క కరుణాపూరితమయిన మేధస్సు, ప్రేమ పూరితమయిన అపార ఆదరణ. ఇంత యుక్తిగా, అంత శక్తివంతమయిన విషయాలని సామాన్యులమయిన మన లోపలికి అత్యంత ఆహ్లాదకరమయిన రీతిలో పంపించ గల నేర్పు, మేధస్సు ఆ పరమహంసకి తప్ప ఎవరికి ఉంటుంది?
పరమహంస నిత్యానంద స్వామీజీ ఎవరు?
భారతదేశాన్ని వేద భూమి, దేవ భూమి అంటారు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద అవతారపురుషులు, భగవత్ స్వరూపులు అవతరించి సామాన్య మానవులని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. ఆ పరంపరలో, ఈ నాటి ఆధునిక కాలంలో పరమహంస శ్రీ నిత్యానంద స్వామి మనకోసం వచ్చిన మహాత్ముడు. ఆయన జ్ఞానోదయమయి మన మధ్య ఉన్న యోగీశ్వరుడు.
పరమహంస నిత్యానంద 1978లో తమిళనాడులో జన్మించి, పదహారవ ఏట, హిమాలయాలకి వెళ్ళి అక్కడ కఠోర తపస్సు చేశారు. ఆయన పరివ్రాజకునిగా భారతదేశమంతా కాలినడకన తిరిగారు. ఇండియా, నేపాలులోని హిమాలయ ప్రాంతాలన్నీ తిరిగారు. అక్కడ ఆయన ఎందరో రుషులని,యోగులని కలిసి వారి దగ్గర యోగా, తంత్ర, ధ్యానం మొదలయిన ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రాలని క్షుణ్ణంగా నేర్చుకున్నారు.
స్వామీజీ హిమాలయాలలో తపస్సు చేసుకునే రోజులలో ఆయనకి మహావతార్ బాబాజీ దర్శనమిచ్చి ఆయనని పరమహంస నిత్యానంద అని పిలిచి, దీవించి మాయం అయిపోయారు. అయితే ఆ సమయంలో ఆయనకి అది బాబాజీ తనకి ఇచ్చిన పేరు అని అర్ధం కాలేదు. కొంత కాలం గడిచాకా ఒక యోగీశ్వరుడు స్వామీజీకి సన్యాస దీక్షని ఇచ్చి ఆయనకి ‘పరమహంస శ్రీ నిత్యానంద’ అని పేరు పెట్టారు. అప్పుడు స్వామీజీకి మహావతార్ బాబాజీనే తనకి ఆ పేరుని ఇచ్చారు అని అర్ధమయినది.
పరమహంస శ్రీ నిత్యానందస్వామి కఠోర తపస్సు ఫలితంగా జనవరి ఒకటి 2000 సంవత్సరంలో ఆయనకి జ్ఞానోదయమయ్యి ఆయన శాశ్వతానంద స్థితిని చేరారు.
జ్ఞానోదయం పొందిన తరువాత స్వామీజీ దక్షిణ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయన ఏకైక లక్ష్యం, తాను పొందిన ఆనందాన్ని అందరికీ పంచి పెట్టాలి. తప్పుదారిలో ఉండే ఆధ్యాత్మికతని సరియైన మార్గంలో నిలపాలి, ముఖ్యంగా భారతీయ ఆధ్యాత్మికత, యోగా, ధ్యానం పైన పాశ్చాత్యదేశాలలో చాలా తప్పు ప్రచారాలు జరుగుతున్నాయి. అది సరికాదు అని చెప్పడానికి నిత్యానందస్వామి నిర్ణయించుకున్నారు.
ఆయన నేటి సమాజంలో ఉన్న సమస్యలు, వ్యధలు అన్నీ కూడా చాలా వరకూ సామాన్యమైనవే అని, వాటిని చిన్న చిన్న సాధనలతో తొలగించవచ్చునని నిరూపించారు. స్వామి ముఖ్యలక్ష్యం, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలో మార్పుని తీసుకురాగలిగితే ప్రపంచంలోని సమస్యలన్నీ మాయం అయిపోతాయి, ముఖ్యంగా హింసాప్రవృత్తి, డిప్రెషన్, అత్యాశ ఇటువంటి సమస్యలని చాలా సులభంగా తొలగించవచ్చు అని అంటారు.
ప్రపంచంలోని ఇన్ని సమస్యలకి అసలయిన కారణం మనకి ఏమి కావాలో మనకి తెలియకపోవటం. మనకు తెలియని దాని కోసం, అక్కడ లేని దాని కోసం మన శక్తినంతా ఉపయోగించి పరుగులు పెడుతున్నాము. లేని దాని కోసం పరుగెడితే మనం ఏమీ సాధించలేము. దాంతో మానసికంగా కుంగిపోవటం, శారీరకంగా చాలా అనారోగ్యాలని తెచ్చుకొని అనేక సమస్యల ఊబిలో కూరుకుపోతున్నాము. దీనితో అశాంతి, అసహనం, అసంతృప్తి, అహింసా ఇలాంటివన్నీ కుటుంబాలలో, సమాజంలో చివరికి ప్రపంచమంతా వ్యాపించిపోయాయి. అది ఎంతలోతుగా వ్యాపించినది అంటే ఈ లక్షణాలు లేని వ్యక్తులు కానీ, ప్రదేశాలు కాని మనకి కనపడటం లేదు.”
ఈ సమస్యలన్నింటికి పరమహంస నిత్యానంద చాలా సులభమయిన, ఆచరణ యోగ్యమయిన, అందరికీ అందుబాటులో ఉండే ఒక సూత్రాన్ని చెప్పారు. అది “వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిలో మార్పు తీసుకురావటం ద్వారా ప్రపంచంలోని సమస్యలని అధిగమించవచ్చు. అదే విధంగా ప్రపంచాన్ని మార్చవచ్చు. వ్యక్తిగత మార్పుని ధ్యానం ద్వారా సాధించవచ్చు. దీని ద్వారా ప్రపంచంలో నిత్యానందాన్ని పరమానంద స్థితిని స్థాపించవచ్చు.
ధ్యానంతో పాటు, స్వామీజీ మనలోని సమస్యలకి, ప్రపంచంలోని సమస్యలకి కారణాలని మనకి స్పష్టంగా చూపిస్తూ, అవి ఏవిధంగా సమస్యలని సృష్టిస్తున్నాయో, ఆ సమస్యలని మనం ఏవిధంగా ధ్యానం ద్వారా పరిష్కరించవచ్చో నేర్పించుతారు. ఈ సందర్భంలో స్వామీజీ చెప్పే సత్యాలు మనని నిర్ఘాంతపోయేలా చేస్తాయి. కొన్ని నమ్మలేని విధంగా ఉంటాయి. అటువంటి సత్యాలని స్వామీజీ మనకి మనోహరమైన, ఆహ్లాదకరంగా ఉండే చిన్న చిన్న కథల ద్వారా ఆ నొప్పి తెలియకుండా నేర్పించుతారు. అటువంటి కొన్ని కథలని ఒక పుస్తక రూపంలో తీసుకువచ్చాము. ఇవి పిల్లలకి, పెద్దలకి, బాగా చదువుకున్న వారికి, అందరికీ అర్థమయ్యేవిధంగా మలిచాము.