KAILASA Library/పరమహంస శ్రీ నిత్యానంద/మనిషి దివ్యశక్తి సంపన్నుడుSign in
పరమహంస శ్రీ నిత్యానంద

మనిషి దివ్యశక్తి సంపన్నుడు

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

మనిషి భగవంతుని యొక్క అద్భుతమయిన సృష్టి. భగవంతుడు గొప్ప కళాకారుడు. ప్రతీ వ్యక్తిని ప్రత్యేక శ్రద్ధతో రూపొందించి వారిలో తన దివ్యశక్తిని నింపాడు. ఈ ప్రపంచంలోనికి ప్రతి వ్యక్తిని ఒక ఉద్దేశంతో పంపించుతాడు. వారు ఆ లక్ష్యాన్ని సాధించగల నేర్పుని వారిలో నింపుతాడు. వారు ఈ ప్రపంచంలో సాధించవలసిన లక్ష్యాలకి అనుగుణంగా వారి శరీరాన్ని, మేధస్సును తీర్చిదిద్దుతాడు. చివరిగా ప్రతి వ్యక్తిలోనూ తన శక్తిని నింపుతాడు. అందుకే మనం భగవంతుని పిల్లలము, మనం ఆయన యొక్క ప్రతిరూపాలం.

భగవంతుడు అంటేనే సర్వశక్తి స్వరూపం. రూపంలేని రూపంలో ఆ శక్తి ప్రపంచమంతా, ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటుంది.ఈ విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఆ శక్తి ఆధారంగానే పనిచేస్తున్నాయి. అంత అద్భుతమయిన శక్తి మనలోపల ఉన్నది. భగవంతుడు శక్తి మాత్రమే కాదు. ఒక అపూర్వమయిన మేధస్సు. ఆశక్తి, మేధస్సులని మేళవించి మనని తయారుచేసాడు. అందుకే భగవంతుని సృష్టి అద్భుతం, అపూర్వం.మనలోని భగవంతుని శక్తికి నాశనం అనేది లేదు. అది శాశ్వతమయినది. ఎప్పుడూ శక్తి, మేధస్సులతో ప్రకాశించుతూ ఉంటుంది. దానినే మనం 'ఆత్మ' అంటాము. అదే మన యొక్క నిజమయిన ఉనికి. అంతేకాని ఈ శరీరం, ఈ మనస్సు అనేవి నిజమయిన మనం కాదు. శరీరం మనకి ఒక వాహనం లాంటిది. అలాగే మనస్సు అనేది అనేక సాంఘిక, సాంస్కృతిక, జీవన విధానాల ఆధారంగా మనం చేసే ఆలోచనల సమూహం, అంతేకాని అది నిజమయిన మన ఉనికి కాదు.

మనం మన ఉనికి, మనలోపల నిక్షిప్తమయిపోయిన అసలయిన మన శక్తిని తెలుసుకోలేక పోతున్నాము. భగవంతుడు మనలని సృష్టించిన విధంగా మన సహజమయిన తత్వంతో స్వచ్ఛతతో ఉండగలిగితే మనం మన అంతరంగంలోని అసలయిన దివ్యశక్తిని తెలుసుకోగలం. అయితే ఆ శక్తి మీద; ఆ ఉనికి మీద సమాజపు నిబంధనలు, మన అహంకారం, మనలోని వ్యతిరేక భావావేశాలయిన అసూయ, ద్వేషం, అత్యాశ, కోపం ఇలాంటివన్నీ పొరలు పొరలుగా కప్పివేసాయి. కాలక్రమంలో ఆ పొరలు గట్టి పడిపోయాయి. చివరికి మనం అంటే ఆ పొరలు, లేదా అశాశ్వతమైన ఈ శరీరం మాత్రమే అని అనుకునే స్థితికి చేరిపోయాము.

ఈ సందర్భంలో పరమహంస నిత్యానంద ఈ విధంగా చెబుతారు, "అసలు సమస్య ఏమిటి అంటే మనం మనలోని దివ్యశక్తిని మర్చిపోయాము. మనం కేవలం మాములు మనుషులం మాత్రమే అని అనుకుంటున్నాము. మనలోని శక్తి చాలా చిన్నది అని దాని పరిధిని చూస్తుంటాము. దానివలన మనం అన్నీ సాధించలేము అని అనుకుంటాము. మీరు తెలుసుకోగలిగితే మీలో అంతులేని అద్భుతమైన శక్తి నిక్షిప్తమై ఉన్నది. మీలోని శక్తికి ఎలాంటి హద్దులు లేవు. మీలో అనంతమైన విశ్వశక్తి ఉన్నది. దానిని గుర్తించి చేరగానే అది గొప్ప విస్ఫోటకంగా బయటకి వచ్చిఎన్నో పెద్దపెద్ద లక్ష్యాలని సాధించే విధంగా మీకు సహాయం చేస్తుంది.

ఒక చిన్న కథ :

మన పరిస్థితి ఎలా ఉన్నదో మీకు వివరంగా, అర్ధమయ్యే విధంగా పరమహంస శ్రీ నిత్యానంద ఒక చిన్న కథ చెబుతారు.

మొదటి ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత, సైనికులు ఒక చిన్న విమానాన్ని అడవుల ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు.

ఆ స్థలానికి కొంచెం లోపల ఒక చిన్న గిరిజనులు ఉండే పల్లె ఉంటుంది. ఆ గ్రామంలోని ప్రజలకి నాగరికత అసలు తెలియదు. ముఖ్యంగా అప్పటికి బయట ప్రపంచంలో జరిగిన అభివృద్ధి గురించి తెలయదు. వారికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అసలు లేదు. వారు వారి జీవితకాలంలో ఎప్పుడూ విమానం అనేదానిని చూడలేదు, దాని గురించి వినలేదు. అసలు అటువంటిది ఈ ప్రపంచంలో ఉన్నది అని వారికి తెలియదు.

అటువంటి అమాయకమైన గ్రామస్తులు ఆ విమానాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఆ వింత వస్తువు గురించి తెలుసుకున్న గ్రామస్తులు అందరూ దాని చూస్తూ గుమిగూడి, అది ఏమిటి? అనే విషయం మీద చాలాసేపు వాధించి, వివరించి చివరికి దానికి రెండు చక్రాలు ఉన్నాయి కాబట్టి అది ఎడ్లబండి అని నిర్ణయించుతారు. వారిలో పెద్దలు ఇలా అంటారు, "బహుశ: కొత్త ప్రదేశంలోని వారెవరో ఇటువంటి ఎడ్లబళ్ళని వాడతారు కాబోలు" అని నిర్ణయించుతారు.

dానికి రెండు ఎడ్లు కట్టి దానిని గ్రామంలోనికి తెస్తారు. వారి గ్రామంలోనికి ఒక వింత బండి వచ్చిన సందర్భంగా గ్రామస్తులందరూ ఆనందంలో ఉత్సవాలు జరుపుతారు. అవిధంగా చిన్న విమానాన్ని గ్రామస్తులు ఎడ్లబండిలా ఉపయోగిస్తుంటారు.

ఇలా కొన్ని వారాలు గడుస్తాయి. అప్పుడు ఆ ఊరికి ఒక యువకుడు వస్తాడు. ఆ అబ్బాయి ఆ ఊరికి దూరంగా ఉండే ఒక చిన్న పట్టణంలో చదువుకుంటున్నాడు. సెలవలు గడపటానికి ఊరికి వచ్చి ఎడ్లు కట్టిన విమానాన్ని చూస్తాడు. ఆ అబ్బాయి విమానం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న మెషిన్లు, గేర్లు, స్విచ్ఛులు గమనించి వాటిని అటూ ఇటూ తిప్పుతాడు. అప్పుడు అకస్మాత్గా ఒక ఇంజను పనిచేయటం మొదలు పెట్టింది.

ఆ అబ్బాయి పట్టణంలో ట్రాక్టర్స్ చూసాడు. అతనికి ఆ ట్రాక్టరు, ట్రక్కులు గుర్తువచ్చి బహుశ: ఇది కూడా ఒక ట్రాక్టరు లాంటిదే అని అనుకొని గ్రామస్తులకి ఆ విషయం చెబుతాడు.

“ఇది ఎడ్లబండికాదు. దీనికి ఎడ్లు కట్టనవసరంలేదు. దానంతట అదే మెషిన్ సహాయంతో తిరగగలుగుతుంది” అని ఆ యువకుడు చెబుతాడు. అయితే గ్రామస్తులు అతని మాట నమ్మరు. అప్పుడు ఆ అబ్బాయి విమానాన్ని గ్రామవీధులలో నడిపి చూపిస్తాడు. గ్రామస్తులు ఎంతో ఆశ్చర్యపోయి, అంత వింతగల బండి వారి ఊరిలో ఉన్నది అని గర్వంగా, ఆనందంగా మరోసారి ఉత్సవాలు చేసుకుంటారు.

ఈ విధంగా కొన్ని నెలలు గడిచిపోతాయి. అప్పుడు ఆ ఊరికి రిటైర్ అయిన మిలటరీ ఆఫీసరు వస్తాడు. అతనికి విమానాన్ని ట్రాక్టరులా ఉపయోగిస్తున్న గ్రామస్తులు కనిపిస్తారు.

ఆ ఆఫీసరు గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళి “ ఇది ట్రాక్టరు కాదు, ఇది విమానం. ఇదిగాలిలో ఎగురుతుంది. ఇది ఏమిటో తెలియక మీరు దీనిని ట్రాక్టర్లా రోడ్డుమీద తిప్పుతున్నారు.” అని చెబుతాడు.

గ్రామస్తులు ఆఫీసరు మాటని కొట్టిపారేస్తారు. వారి దృష్టిలో కేవలం పక్షులు మాత్రమే ఎగరగలవు. కాని మనుషులు, మెషిన్లు అలా ఎగరలేవు.

అప్పుడు ఆ ఆఫీసరు విమానంలో కూర్చోని దానిని కాసేపు గాలిలో తిప్పి కిందకి దింపుతాడు. అది చూసిన గ్రామస్తుల ఆశ్చర్యానికి అంతు ఉండదు. వారు తమ కళ్ళని నమ్మలేకపోతారు. అసలు ఇది ఎలా సాధ్యం ? అని అడుగుతారు.

దానికి ఆ ఆఫీసరు దీనిలో ఉన్న అసలయిన శక్తి మీకు తెలియదు. అందుకే మీరు దానిని విమానంలా ఉపయోగించలేకపోయారు అని అంటాడు.

మనలోని శక్తి విషయంలో మనం కూడా ఆ గ్రామస్తుల విధంగానే ప్రవర్తిస్తున్నాము. మనం ఎగర గలం. ఆశక్తి ఉన్నది కానీ ఆ శక్తి విషయం తెలియక పాకుతున్నాము. ఎవరయినా గురువులు, యోగీశ్వరులు వచ్చి, మీరు గొప్ప శక్తి సంపన్నులు మీలోపలి శక్తి అద్భుతమయినది, మీరు ఎన్నోరెట్లు శక్తివంతులు అని చెప్పినా మనం వారి మాటలు నమ్మం. అందుకే క్రింది స్థాయిలోనే ఉండిపోతాము.

పరమహంస నిత్యానంద ఈ విధంగా మనస్థితిని పోల్చిచెబుతూ మరొక విషయం కూడా వివరించతారు. మనలో ఎవరయితే కేవలం అత్యల్ప స్థాయిలో నాఇల్లు, నా ఉద్యోగం, నావారు అనే చిన్న చిన్న విషయాలకి మాత్రమే పరిమితమైపోతారో వాళ్ళు ఎడ్లబండి స్థాయిలో ఉంటారు. వారు వారిలోని అద్భుతమయిన శక్తిని కేవలం చాలా క్రింది స్థాయిలో మాత్రమే ఉపయోగించుకుంటూ నేను మాములు మనిషిని, నాజీవితం ఇంతే అని తృప్తి పడతారు. వారు ఎడ్లబండి స్థాయినుంచి ఎదగరు. కొంతమంది ఉద్యోగం, ఇల్లు, ఆస్తి వీటితోపాటు కళలలో ప్రవీణ్యం సంపాదించుకుంటారు, కళలలో రాణిస్తారు. నాట్యం, సంగీతం, కవిత్వం, శిల్పకళ మొదలయిన విద్యలు ఉన్నవారు ట్రాక్టర్ స్థాయిలో జీవిస్తారు. వారిలో శక్తిని ఆ స్థాయిలో ఉపయోగించుకోగలుగుతున్నారు. అలాంటివారు, జీవితంలో ఏదో సాధించాము అన్న తృప్తితో జీవించుతారు. దీని తరువాతది అత్యున్నత స్థాయి అయిన ఆధ్యాత్మిక స్థితిని చేరటం. ఈస్థాయిలోని వారు తాము విశ్వశక్తిలో ఒక భాగం అనే అంతిమ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. వారు జ్ఞానోదయం పొంది అత్యుత్తమ చేతనస్థితిలో ఉంటారు. అటువంటివారు తమలోని శక్తిని విమానం స్థాయిలో ఉపయోగింటారు. వారు నిరంతరం పరమానందపు పారవశ్యంలో ఉంటారు. వారినే పరమహంసలు అంటారు. వారు ఆకాశంలోనికి అంతే అత్యున్నత స్థితికి ఎగరగలరు (చేరగలరు)

నీటిలో తామరల ప్రపంచపు ఛాయ అంట కూడదు

ఈ ప్రపంచంలో ప్రతివ్యక్తీ ప్రయత్నించేది; వెతికేది ఒకే ఒక్క దాని కోసం అదే పరమానందం. పరమానందం అంటే శాశ్వతమయిన సంతోషపు స్థితి. ఇది అత్యున్నతమయిన స్థితి. మరి అందరూ ఎంతో కష్టాలు ఇబ్బందులు పడుతూవెతుకుతున్న ఆనందం వారికి దొరుకుతున్నదా? మరి అలా దొరికితే అందరూ నిరంతరం ఆనందస్థితిలోకి ఎందుకు ఉండటంలేదు ? గొప్ప చదువులు చదివి, ఉద్యోగాలు చేసి; ఆస్తి, పేరు ప్రతిష్టలు సంపాదించి, అధికారాలు చెలాయించి అన్ని ముఖ్య దేవాలయాలు చూసి అన్నీ చేశాక ఎందుకు అందరిలో చివరికి శూన్య భావన మాత్రమే మిగులుతుంది ? ఎందుకు అంతులేని ఆవేదన, మానసిక కుంగుబాటు మిగులుతుంది? కారణం ఏమిటి?

వీటి అన్నింటికీ కారణం ఒక్కటే. మనం వెతుకుతున్న ఆనందం మనలోనే ఉన్నది. అది బయట ప్రపంచంలో లేదు. ఆ విషయం మనకి తెలియక బయట ప్రపంచంలో వెతుకుతూ ఉంటాము. డబ్బు ద్వారా, పేరు ప్రఖ్యాతుల ద్వారా, అధికారం ఆస్తుల ద్వారా ఆనందం పొందవచ్చు అని అనుకుంటాము. అందులో వచ్చే చిన్న చిన్న సంతోషాలనే ఆనందం అని మురిసిపోతాము. చివరికి వ్యధలలో కూరుకుపోతాము.

ఇక్కడ మీరు చేసే తప్పుపని ఒకటి ఉన్నది. మీరు మిమ్ములని నమ్మటం మానేసి సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని నమ్మటం మొదలు పెట్టారు. మీకు మీరు అప్పాయింట్మెంట్ ఇచ్చుకోవటానికి టైం ఉండదు అంటారు కాని ప్రపంచంలో అందరికీ అప్పాయింట్మెంట్ ఇస్తారు, అని పరమహంస పదే పదే హెచ్చరించతారు.

మీరు అంటే ఏమిటో మీకు తెలియదు. ప్రపంచం మీ గురించి ఏమి చెబితే అదే మీరు అనుకుంటారు. మీకోరికలు, మీ లక్ష్యాలు మీకు తెలియదు. ప్రపంచంలోని ఇతరుల కోరికలని మీ కోరికలుగా చేసుకొని బాధలు కొని తెచ్చుకుంటారు. ఉదాహరణకి మీ ఆఫీసు పనికి, ఇంటిపనికి మోటార్ సైకిల్ చాలు. కాని పక్కింటి వ్యక్తి కారుకొనగానే ‘అయ్యో! నాకు కారులేదు. కారులేని బ్రతుకు కష్టాలమయం’ అని కారులేకపోతే కలిగే కష్టాలు లిస్టులు తయారుచేసుకుని, చాలా కష్టాలుపడి డబ్బు సంపాదించి కారు కొనుక్కుంటారు. కారుతో పాటు మనకి ఏమివస్తాయో తెలుసు, కష్టాలు. అందుకే అంటారు, కష్టాలు కొని తెచ్చుకున్నాము అని.

ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు. కారు అనేది అదనపు సౌకర్యమే కదా! కష్టాలు ఎలా అవుతాయి? అది మనకి నిజమయిన అవసరం అయినప్పుడు సౌకర్యం అవుతుంది. అవసరం లేనప్పుడు అది భారమే కదా! భారం అంటే సమస్యలు. ఈ విధంగా మీరు ప్రతివిషయానికి, ప్రతిక్షణం ప్రపంచం మీద ఆధారపడి ఉంటారు. ప్రపంచంలో మునిగిపోయి మీరు అనే విషయాన్ని మర్చిపోతారు. సమాజపు కోరికలు మీ అవసరాలుగా చేసుకుంటారు. సమాజం యొక్క అభిప్రాయంతో మీరు ఏమిటో తెలుసుకుంటారు. అందుకే ఇన్ని వ్యధలు. మీరు నిరంతరం పరమానందంలో ఉండాలి అంటే మీరు ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచంపు ఛాయలు మీ నిశ్చలనితని భంగపరచకుండా ఉండాలి. అది ఎలా అంటే పద్మం నీటిలో పుట్టి, అక్కడే పెరిగి అందులోనే అందంగా వికసించుతుంది. కానీ ఒక్క నీటి బొట్టుకూడా పద్మాన్ని కాని, పద్మ పత్రాలనికాని అంటలేవు. మనంగూడా ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచంలోని వస్తువులు కాని, సంఘటనలు కాని, వ్యక్తులు కాని మనని ప్రభావితం చేయలేని విధంగా ఉండాలి. అంటే ఈ ప్రపంచం మెచ్చుకోవటంతో సంతోషపడి, విమర్శించగానే కుంగిపోకూడదు. ఏదైనా ఒక వస్తువు మనని ఆకర్షింటితే మీరు నిజాయితీగా మీతోనే కూర్చోని ఈ వస్తువు నిజంగా నాకు అవసరమా అని తెలుసుకోవాలి. అలా చేసినప్పుడు ఈ ప్రపంచం వలన మన నిశ్చలత పాదవదు. మన ప్రశాంతత, ఆనందం అనేవి ప్రభావితం కావు.

మనం ఆ విధంగా ఉండగలగాలి అంటే ఏమి చేయాలి? మన ఏకాగ్రత నిరంతరం, కేవలం మనలోని మన ఉనికి, మన ఆత్మ పైన మాత్రమే ఉండాలి. మన ఆత్మ మాత్రమే మనకి సరియైన మార్గాన్ని చూపించగలుగుతుంది. ఎందుకంటే అది దివ్యశక్తి మయమయినది కాబట్టి. నిరంతరం మన ఎరుక, మన తెలుసుకునే తత్వం, మన ఏకాగ్రత మనతోనే ఉండాలి. బయట ప్రపంచపు విషయాలు, వస్తువులు ఎంత ఆకర్షణతో ఉన్నాకూడా అవి మన నిశ్చలతని భంగపరచలేని విధంగా మనం ఉండాలి. అలా ఉన్న వ్యక్తులు బయట ప్రపంచంలోను, అంతరంగ ప్రపంచంలో కూడా అద్భుతాలు సాధించగలుగుతారు.

బయట ప్రపంచపు అనవసర విషయాలు మనని ప్రభావ పరచకపోతే ఎంత గొప్పవారమైనా కావచ్చు .ఇందుకు ఉదాహరణగా పరమహంస నిత్యానంద ఒక చక్కని కథ చెబుతారు.

శుక మహాఋషి జీవితం నుంచి ఒక చిన్న సంఘటన :

శుక మహాఋషి గొప్ప యోగీశ్వరుడు అత్యంత ప్రతిభ గల మహాఋషి. ఆయన మహా మేధావి, ఈ ప్రపంచంలోనే పేరెన్నిక కలిగి ఎన్నదగిన మహా జ్ఞాని వ్యాస మహాఋషి కుమారుడు శుకుడు తండ్రి దగ్గర విద్యాభ్యాసం చేసి శాస్త్రాలు కావ్యాలు అన్నీ నేర్చుకుంటాడు.

ఒకరోజు వ్యాసమహాఋషి శుకుని పిలిచి, “నేను నీకు నేర్పించవలసిన విద్యలు, బోధించవలసిన సత్యాలు చెప్పాను. ఇప్పుడు నీవు జనకమహారాజు దగ్గరికి వెళ్ళు” అంటాడు

జనక మహారాజు మిధిలా దేశానికి రాజు. ఆయన గొప్ప మహారాజు, కానీ అంతకంటే గొప్ప యోగీశ్వరుడు, రాజరుషి. ఆయనకి విదేహ అనే పేరు ఉన్నది. విదేహ అంటే శరీరం లేనివాడు. అంటే ఆయన తన శరీరం తనుకాదు అని తెలుసుకున్న జ్ఞానమూర్తి. ఆయన అష్టఐశ్వర్యాలలో తులతూగే దేశానికి రాజు అయికూడా, ఈ ప్రాపంచిక విషయాలు అంటకుండా, వాటితో ఏమాత్రం చలించకుండా ఉండగలిగే ఆధ్యాత్మిక యోగీశ్వరుడు. ఆయన తనలోని తన నిజమయిన ఉనికిలో స్థిరపడిన వ్యక్తి. ఎవరయితే వారిలోని నిజమయిన ఉనికిలో, ఆత్మలో స్థిరపడగలరో, వారిలోనే వారి ఏకాగ్రతని నిలపగలరో అటువంటివారిని బయట ప్రపంచం యొక్క వస్తువులు, వ్యక్తులు ప్రభావితం చేయలేవు. వారు నిరంతరం మహదానందంలో ఉంటారు. అందుకే వ్యాసుడు తన కుమారుడు శుకుని జనకమహారాజు దగ్గరికి పంపించుతాడు.

జనక మహారాజుకి శుకుడు వస్తున్న విషయం తెలుస్తుంది. అతనికి స్వాగతం చెప్పటానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు. మంత్రులకి ఆ బాధ్యతలు అప్పగించుతాడు. ఒకరోజు శుకుడు జనకమహారాజు భవనం దగ్గరకి చేరుకుంటాడు. ఆయన రాజభవన ద్వారం దగ్గరకి వస్తాడు, కాని ద్వారపాలకులు ఆయనని గుర్తించరు. శుకుడు విశిష్టమయిన పేరు ప్రఖ్యాతులుగల మహాజ్ఞాని వ్యాసుడి కుమారుడు అయినా ఏమీ మాట్లాడకుండా ఆ ద్వారం దగ్గర మూడు రోజులు కూర్చుంటాడు. కానీ ఎవరూ కూడా అతనిని పట్టించుకోరు. అలా మూడురోజులు గడిచాక, జనకుని మంత్రులకి శుకుడు వచ్చిన విషయం తెలుస్తుంది. శుకుడు భవనం బయట ఎదురు చూస్తున్నట్టు తెలుసుకొని పరుగు పరుగున ద్వారం దగ్గరికి వస్తారు.

వారు ద్వారం దగ్గర ఎదురు చూస్తున్న శుకుని అత్యంత గౌరవ మర్యాదలతో సకల రాజ లాంఛనాలతో రాజ భవనంలోనికి తీసుకు వెళతారు. ఆయనకి వైభవపేతమైన భవనాన్ని ఇస్తారు. అద్భుతమైన రాజరికపు భోజనాన్ని ఇస్తారు. అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు. భయభక్తులతో మర్యాదలు చేస్తారు.

శుకుని గమనించితే ఆయనలో ఎటువంటి మార్పు కనిపించదు. ఆయన మూడురోజులు రాజభవనం బయట ఎదురు చూసే విధంగా ఏమాత్రం గౌరవం భక్తి లేకుండా రాజభవనం వారు ప్రవర్తించినప్పుడు ఆయనలో అదే ప్రశాంతత, నిశ్చలత ఉన్నాయి. ఆయనని అత్యంత గౌరవమర్యాదలతో, రాజలాంఛనాలతో సత్కరించినప్పుడూ అదే ప్రశాంతత, అదే నిశ్చలత ఉన్నాయి. ముఖంలో ఎప్పుడూ చెదరని చిరునవ్వు అన్ని సమయాలలో ఒకే విధంగా ఉన్నది. దీనినే ప్రపంచంలో ఉంటూ ప్రపంచ విషయాలు అంటకుండా జీవించగలగటం అంటారు. తరువాత శుకుని జనకుడు ఉన్న రాజసభకి తీసుకువెళతారు. జనకుడు సింహాసనం మీద కూర్చోని ఉంటాడు. సభలో సంగీత,నాట్య కార్యక్రమాలు చాలా అట్టహాసంగా జరుగుతూ ఉంటాయి. సభలోని వారు అందరూ ఆ అట్టహాసంలో, హోరున వినిపించే సంగీత నాట్యాలలో మునిగిపోయి ఉంటారు.

అక్కడకి వచ్చిన శుకుడికి జనకుడు నిండుగా పాలను నింపిన పాత్రని ఇచ్చి, ఆపాత్రని పట్టుకొని సభచుట్టూ ఏడుసార్లు తిరగాలి, తిరిగే సమయంలో పాత్రలోని పాలు తొణకి వలక కూడదు అని చెబుతాడు.

శుకుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ పాత్రని తీసుకొని సభచుట్టూ తిరగటం ప్రారంభిస్తాడు. అదే సభలో ఎంతో అందమైన నాట్యాలు, ఆహ్లాదమయిన సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి చాలా ఆకర్షణగా ఉన్నాయి. అటువంటి అట్టహాసల మధ్య, ఆకర్షణల మధ్య శుకుడు పాలు ఉన్న పాత్రతో సభచుట్టూ ఏడుసార్లు తిరిగాడు. ఈ అట్టహాసాలు ఆ యువ రుషి నిశ్చలతని ఏమాత్రం భంగపరచలేక పోయాయి.

పాలు ఉన్న పాత్రని తిరిగి జనకుని అప్పచెబుతాడు శుకుడు. అప్పుడు శుకుని చూస్తూ జనకుడు, “మీ తండ్రిగారు నీకు నేర్పించిన సత్యాలనే నేను తిరిగి చెప్పాను. నీవు ఏ సత్యాలనైతే సంపూర్ణంగా తెలుసుకోగలిగావో వాటినే నేను నీకు చూపించాను.నీకు తెలియవలసినదంతా తెలుసుకున్నావు. కుమారా! ఇక నీవు ఇంటికి వెళ్ళవచ్చు ” అని చెప్పి శుకుని ఆశీర్వదించి పంపిస్తాడు రాజరుషి జనకుడు.

శుకుడు ఈ ప్రపంచంలో ఏ విషయాల వలన ప్రభావితుడు కాలేదు. ఆ విధంగా ఉండాలి అనేదే అతని నిర్ణయం. మనం చేసే ప్రతి పనిని మనమే ఎంచుకుంటాము. అది కేవలం మన నిర్ణయమే. ఉదాహరణకి మిమ్ములని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళమీద కోపం చూపించాలా వద్దా అనేది మీ నిర్ణయం. అసలు మీకు కోపం కూడా రాదు. అటువంటి స్థితిలో ఎంతమంది మిమ్ములని రెచ్చగొట్టినా మీరు నిశ్చలంగా ఉండిపోగలుగుతారు. ఒకవేళ వారిపైన కోపం చూపించినా దాని ప్రభావం మీ మీద అసలు ఉండదు. ఆ స్థితిని సాధించాలి అంటే సాధనతో సాధ్యమవుతుంది. ధ్యానం చేస్తే అది మిమ్ములని ఆ స్థితికి చేరే విధంగా సహాయం చేస్తుంది.

తగిన మోతాదులో ఉంటే కోపం గొప్ప శక్తి

కోపం మరొక మోసపూరితమయిన భావావేశము. కోపం అనేది చాలా చిన్న విషయం కానీ అత్యంత ప్రమాదకరమయినది కూడా, ఎందుకంటే మనకి కోపం వచ్చినప్పుడు, ఆ ఆవేశం మనని తన ఆధీనంలోనికి తీసేసుకుంటుంది. మన ఆధీనంలో ఉండి మనం చెప్పినట్టు వినవలసిన ఆవేశం, మనని తన వశం చేసుకుని మనం ఏంచేస్తున్నామో స్పృహ లేకుండా చేస్తుంది. అందుకే అంటారు కోపం వచ్చినప్పుడు ఎం చేస్తూనో నాకు తెలియదు అని. కోపం అంటే ఒక సంఘటనకి కాని, వ్యక్తుల వలన కలిగిన సంఘటనకి కానీ మననుంచి వచ్చే స్పందన మాత్రమే. ఎందుకు కోపం వస్తుంది? కోపంలో ఎందుకు అంత అతిగా ప్రవర్తించుతాము? చిన్న విషయానికే ఎందుకు అంత కోపం తెచ్చుకుంటాము?

పై ప్రశ్నలన్నింటికి పరమహంస నిత్యానంద ఒక చక్కని వివరణని ఇస్తారు. మనకి కోపం కలిగినప్పుడు రెండు విషయాలు జరగాలి. మొదటిది కోపాన్ని ప్రదర్శించటం. సమాజపు మర్యాద పాటించటానికి గాని లేదా మన ఉద్యోగ ధర్మం వలన కాని లేదా కుటుంబసమస్యలు వస్తాయి అనే భయంతో కానీ మనం చాలాసార్లు కోపాన్ని చూపించం. కోపం చూపిస్తే ఉద్యోగం పోవచ్చు లేదా ఇంకా గొడవలు ఎక్కువ అయిపోవచ్చు కాబట్టి కోపాన్ని ఎదుటివారిమీద చూపించలేము. రెండవ విషయం కోపాన్ని అణచడం. కోపాన్ని అణచకూడదు. అలా అణచివేస్తే, అది మనలోపల శారీరక, మానసిక వ్యాధిలా మారిపోతుంది.

అసలు మనకి అంత త్వరగా కోపం ఎందుకు వస్తుంది?

మనం చిన్నతనం నుంచి మనలోని కోపం, ద్వేషం, అవమానం ఇటువంటి భావాలని అణచివేస్తాము. అవన్నీ కూడా మనలోపల పేరుకుని పోతాయి. అవి ఒక అగ్నిపర్వతంలా తయారవుతాయి. మనం సమాజమర్యాద కోసం లేదా మరొక కారణంతో ఆ అగ్నిపర్వతానికి మూత పెట్టి దానిమీద కూర్చుంటాము. అది లోపల రగులుతూ ఉంటుంది. అది ఎప్పుదయినా ఏచిన్న రాపిడి జరిగినా బక్కున బ్రద్దలయ్యి అందరికీ అశాంతిని తెస్తుంది. అందుకే మనం నడిచేటప్పుడు ఎవరయినా మనకి తగిలారనుకోండి లేదా సైకిల్ తగిలిందనుకోండి, మనకి పెద్దగా దెబ్బలు తగలవు కానీ మనం దానిని కారణంగా చూపించి చాలా గొడవ చేస్తాము. చిన్న విషయానికే అంత పెద్దగొడవ ఎందుకు చేస్తామంటే దానికి కారణం మనలో అణచివేయబడిన కోపం మొదలయిన భావాల వలన.

ఈ రోజు ప్రపంచంలో ఇంత హింస జరగటానికి కూడా అదే కారణం. దీనివలన కోపం చూపే వ్యక్తి, దానికి బలి అయిన వ్యక్తి ఇద్దరూ బాధపడతారు. ఇద్దరూ అశాంతితో ఉంటారు. తిరిగి ఆ అశాంతి మరింత అశాంతిని సృష్టిస్తుంది.

కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలి : మీరు కోపాన్ని అణచుకోవద్దు, అలా అని అతిగా వ్యక్తం చేయవద్దు. మీకు కోపం వచ్చినప్పుడు దానిని జాగ్రత్తగా గమనించండి. ఆ కోపాన్ని చేతన స్థితిలో పరిశీలించండి. అప్పుడు మీకు కోపం అసలు రూపం తెలుస్తుంది. ఎంతకోపాన్ని ప్రదర్శించాలో అర్థమవుతుంది. అప్పుడు మనం అంతే కోపాన్ని చూపించుతాము. అప్పుడు ఎదుటి వ్యక్తిపైన మన కోపాన్ని చూపించక మనకి అపరాధ భావం ఉండదు. ఎదుటి వ్యక్తిలో మార్పు వస్తుందే కానీ అతను బాధపడడు.

అదే విధంగా కోపం, ద్వేషం మొదలయినవి మనిని ప్రభావితం చేయకుండా ఉండే విధంగా మన జీవితాన్ని మలచుకోవాలి. ఆ స్థితిని ధ్యానం ద్వారా సాధించవచ్చు. కోపం అనే భావన మనలోనికి వచ్చినప్పుడు ఒక్కసారి చేతన స్థితిలో అది ఎందుకు వచ్చినది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు అసలు అది నిజమైన కోపమా లేక మరొక భావన ఆ రూపంలో వచ్చినదా అనే విషయం మనకి అర్థమవుతుంది.

మీరు ఎప్పుదయినా కోపం వలన ప్రభావితమయ్యి, 'అయ్యో ఎందుకు అలా చేశాను', అని అనుకుంటే మీరు కోపాన్ని అచేతనస్థితిలో చూపించారు అని అర్థం.

అదే విధంగా, కోపం మీ నిశ్చలతని, మీ ప్రశాంతతని పాడు చేస్తే మీరు కోపాన్ని తెలుసుకునే తత్వంతో పరిశీలించలేదు అని అర్థం. అటువంటిప్పుడు మీరు కోపానికి బానిస అవుతారు. కోపం అనే భావన మిమ్ములని తన అధీనంలోనికి తీసుకుంటుంది.

సాధువు - పాము కథ

ఒక గ్రామంలోనికి కొత్తగా ఒక నాగుపాము వస్తుంది. అది ప్రజలని భయభ్రాంతులని చేస్తూ, వారి జీవితాలలో ప్రశాంతత లేకుండా చేస్తుంది. గ్రామ ప్రజలు స్వేచ్ఛగా తమ పనులు చేసుకోలేకపోతుంటారు. నిరంతరం భయంతో జీవిస్తు ఉంటారు. వారు ఎంత ప్రయత్నించినా ఆ పాముని ఏమి చేయలేక పోతారు.

ఇలా కొంతకాలం గడిచాక ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. ఆయన హిమాలయాలలో తపస్సు చేసుకొని దేశ పర్యటన చేస్తూ ఆ గ్రామానికి వస్తాడు. తపస్సు చేసే యోగులకి జంతువుల భాష తెలుస్తుంది అని ఎవరో ఆగ్రామస్తులకి చెబుతారు. అవిషయం తెలుసుకున్న గ్రామస్తులు ఊరు చివర ఉన్న యోగి దగ్గరకి వెళతారు.

భయంతో అక్కడ నిలబడిన గ్రామస్తులని చూసి ఆ యోగి, "అయ్యా మీరు ఎవరు? ఎందుకు అలా భయపడుతున్నారు?" అని ఎంతో ప్రేమగా లాలనగా అడుగుతాడు.

అప్పుడు వాళ్ళు ఆయన కాళ్ళమీద పడి "స్వామీ! మేము ఈ గ్రామ పెద్దలము. మా ఊరిలోనికి ఒక నాగుపాము వచ్చి మమ్ములని భయభ్రాంతులని చేస్తుంది. మా జీవితాలని అల్లకల్లోలం చేస్తుంది. మీకు జంతువుల భాష తెలుసు అని విన్నాము. మామీద దయ చూపించి, ఆ పాము వలన మాకు బాధలు లేకుండా చూడండి. మమ్ములని కాపాడండి" అని దీనంగా అడుగుతారు.

"తప్పకుండా! నేను ఆ పాముతో మాట్లాడి, అది మీ జోలికి రాకుండా చూస్తాను. మీరు ధైర్యంగా మీ పనులు చేసుకోండి, ఇక నిశ్చింతగా ఉండండి" అని వారికి చెప్పి వెనక్కి పంపించి వేస్తాడు.

ఆ తరువాత ఆ సాధువు పామును కలిసి దానితో మాట్లాడి చివరగా “ ఓ స్నేహితుడా! అమాయకులయిన గ్రామస్తులని హింసించవద్దు. నామాట విని, వారిని వదిలి వేయి” అని అంటాడు.

సాధువు మీద ఉండే అపారమయిన గౌరవంతో నాగుపాము ఆ సాధువుకి సరే అని మాట ఇస్తుంది. గ్రామస్తుల జోలికి వెళ్ళను అని ప్రమాణం చేస్తుంది.

కొంతకాలమయ్యాక ఆ సాధువు తిరిగి హిమాలయాలకి వెళ్ళిపోతూ అదే గ్రామానికి వస్తాడు. ఆ గ్రామం సరిహద్దుల దగ్గరకి రాగానే సాధువుకి అతని స్నేహితుదయిన నాగుపాము కనిపిస్తుంది. నాగుపాము పరిస్థితి అతి దయనీయంగా ఉంటుంది. అది గాయాలతో రక్తం కారుతూ బాధపడుతూ చనిపోయే స్థితిలో ఉంటుంది. పాముని ఆస్థితిలో చూసిన సాధువు ఆశ్చర్యపోతాడు, చాలా బాధపడతాడు. ఆయన పాము దగ్గరకి వచ్చి, “ స్నేహితుడా! నీకు ఏమయింది? ఎందుకు ఇంత దీన స్థితిలో ఉన్నావు. ఎందుకు నీకు ఇన్ని దెబ్బలు తగిలాయి” అని అడుగుతాడు.

dానికి ఆపాము, “ ఓ!సాధువా! ఇదంతా నీవలనే జరిగింది” అంటుంది నిష్ఠూరంగా.

“అసలు ఏమిజరిగిందో చెప్పు” అంటాడు సాధువు

“నేను గ్రామస్తుల జోలికి వెళ్ళను అని నీకు ప్రమాణం చేసాను కదా! నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వరకూ నేను వారిని ఏమీ అనకుండా, నీమాట ప్రకారం నడుచుకుంటున్నాను. కానీ ఈ గ్రామస్తులు నేను ఇచ్చిన మాటని అలుసుగా తీసుకుని నన్ను హింసిస్తున్నారు. ఇదివరకు గ్రామస్తులు నన్ను చూసి భయపడి పారిపోయేవారు. ఇప్పుడు నా మంచితనాన్ని నా బలహీనతగా అనుకుని నన్ను చిత్రహింసలు పెడుతున్నారు. నేను వారిని కాటు వేయను అని తెలుసుకొని నన్ను కొట్టి బాధ పెడుతున్నారు. చూడు నాపరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో! చూస్తే నీకే అర్ధమవుతుంది.” అని బాధపడుతూ చెబుతుంది నాగుపాము.

పాము చెప్పినదంతా విన్న సాధువుకి ఆ పాము అమాయకత్వం చూస్తే జాలి అనిపిస్తుంది. “అయ్యో ! అమాయకపు స్నేహితుడా !నేను నిన్ను ప్రజలని కాటువేయొద్దు అని చెప్పాను కానీ బుసకొట్టవద్దు అనలేదుగా. నీవు వారిని భయపెట్టు కానీ కాటువేసి ప్రాణం తీయవద్దు” అని హితవు చెబుతాడు సాధువు.

మీరు కోపాన్ని చూపించవచ్చు కానీ దానిని సరియైన పద్ధతిలో, తగిన మోతాదులో మాత్రమే చూపించాలి. అలా చేయగలిగినప్పుడు మీ కోపం మీకు మంచి చేస్తుంది, ఎదుటి వారికి మంచి చేస్తుంది.

కోపం గురించి తెలుసుకుంటే కోపం తగ్గుతుంది. దానిని సరియైన పద్ధతిలో ఉపయోగించేతే అది గొప్ప శక్తిగా మారి అందరికీ మంచి చేస్తుంది.