KAILASA Library/పరమహంస శ్రీ నిత్యానంద/పెద్దలు చెప్పే విషయాలు మన మంచి కొరకేSign in
పరమహంస శ్రీ నిత్యానంద

పెద్దలు చెప్పే విషయాలు మన మంచి కొరకే

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

జీవితంలో చాలా దూరం ప్రయాణించి, అందులోని సాధక బాధలని, కష్టాలు, ప్రమాదాలని, మంచి చెడులని తెలుసుకొని ఆ అనుభవంతో పెద్దవారు, గురువులు, తల్లిదండ్రులు పిల్లలకి, జీవితపు ప్రయాణంలో మొదటి మలుపులో ఉన్నవారికి హితవు చెబుతారు. వారు తమ అనుభవం ద్వార ముఖ్యదారి,పూల బాటలని గుర్తించి మనని మంచి మార్గంలో వెళ్ళమని బోధిస్తారు. వినకపోతే దండిస్తారు. కానీ చిన్నపిల్లలు, యువత వారిని, వారి మాటలని పట్టించుకోకుండా అలా చెప్పేవారిని శత్రువులుగా చూస్తారు. అలా ఎందుకు చేస్తారు?

ఇదంతా కూడా మనలోని మోసపూరితమైన మనస్సు, జిత్తులమారి అహంకారం ఆడే నాటకం. ఎప్పుడైతే మనం మన మనస్సు (ఆలోచనలు), అహం మాట వింటామో అప్పుడు హృదయానికి, ఆ తరువాత మనలోని మన నిజమైన ఉనికి అయిన ఆత్మకి దూరం అయిపోతాము. ఎప్పుడైతే మనం మన అంతరాత్మకి దూరం అవుతామో అప్పుడు సర్వాంతర్యామి, విశ్వశక్తి అయిన భగవంతునికి కూడా దూరం అయిపోతాము.

అహం అంటే నేను, నాది అనే హద్దులు మాత్రమే. మనస్సు అంటే అర్థం లేని ఒకదానికొకటి ఎటువంటి సంబంధంలేని ఆలోచనలు. ఈ రెండు కలిసి మనని మన అంతరాత్మకి, సర్వాంతర్యామికి మధ్య దూరాన్ని పెంచుతాయి. అవి మన మధ్యకి అద్భుతమైన హేతువాదాన్ని, శాస్త్రీయతని తీసుకువచ్చి అవి చెప్పేదే నిజం అని నమ్మేలా చేస్తాయి.

మనస్సు, అహం అనేవి మనసొంతం కాదు. అవి నిజమైన మన ఆత్మకి సంబంధించినవి కాదు, అవి సమాజంచేత, మనలోని భావావేశాలు, కోరికలు వలన తయారూకాబడి, మనకి తెలియకుండా మనలోనే పటిష్టంగా తయారయినవి. వాటినే పరమహంస “నీవు కాని నీవు ” అంటారు. ఇవి పూర్తిగా మన అచేతనస్థితిలోనే పని చేస్తాయి. గురువులు,యోగిঈশ্বরులు మనకి పదే పదే ఈ విషయాన్ని చెబుతారు, “నీనుంచి నీవు దూరం అయిపోతున్నావు. సమాజం నీపైన వేసిన ముద్రలని నీవు అని భ్రమపడి పొంగిపోతున్నావు లేదా కుంగిపోతున్నావు. అది సరియైన పద్ధతి కాదు.నేను, నాది అనే అహంకారాన్ని వదిలిపెట్టు అది మహా ప్రమాదకరమైనది. నీవు అహంకారాన్ని వదలకపోతే అది నిన్ను ఆధ్యాత్మిక దారిలోకిగాని, బయట ప్రపంచంలో కాని అభివృద్ధిని సాధించనీయదు.” కానీ మనం వారి మాటలు వినం; విన్నా వారిని నమ్మం.

ఇదంతా ఎలా ఉంటుందంటే , చిన్న పిల్లలు, యువకులు తప్పదారిలో వెళుతున్నప్పుడు పెద్దలు, తల్లితండ్రులు గురువులు వారిని అలా వెళ్ళవద్దు, అది మీ లక్ష్యాన్ని సాధించిపెట్టే దారికాదు. మీ అసలయిన దారి ఇది అని చెబితే వినరు. పెద్దలు, తల్లిదండ్రులు జీవితప్రయాణంలో చాలా ముందుకు సాగిపోయారు. ఆ దారిలో ఏది మంచిది, ఏది చెడ్డది అనేది వారికి అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి వాళ్ళు ఏ విషయం అయినా సరిగ్గా చెప్పగలరు. కానీ అహంకారంతో అమాయకత్వంతో వారు ఆ విషయాలని వినిపించుకోరు. పాముని పట్టుకుని అదే తాడు అని సంబరపడతారు.

నీవు పట్టుకున్నది ఒక ప్రమాదాన్ని అని పెద్దవారు బలవంతంగా చిన్నవారి చేతిలోని ప్రమాదాన్ని లాగి పారవేస్తానికి ప్రయత్నిస్తే, వారిని స్వార్ధ పరులుగా అనుమానించి వారిని శత్రువులుగా చూస్తారు.

జ్ఞానోదయం పొందిన యోగీశ్వరులు, గురువులు ఎంతో శ్రమలకోర్చి, తపస్సు చేసి కనుగొన్న సత్యాలని మనకి చెబుతారు. వారిలో పొంగి ప్రవహించే కరుణ, ప్రేమ వారిని మన దగ్గరకి పంపించుతాయి. మనకి సహాయపడాలి అని, మనం తెలివితక్కువగా, అమాయకంగా మన చుట్టూ అల్లుకునే సమస్యలు, వ్యధల నుంచి రక్షించాలని, వారు పొందిన పరమానందం మనం కూడా పొందాలనే ఉద్దేశంతో వారు ఇవన్నీ చేస్తున్నారని వారికి దూరంగా వారి నుంచి పారిపోతాము. ఈ విషయాలని వివరించే సమయంలో పరమహంస నిత్యానంద ఒక చక్కని కథ చెబుతారు.

ఒక అంధుడెయిన వ్యక్తి : సాధువు

అది హిమాలయాల ప్రాంతాలలో దట్టంగా మంచు కురిసే ఒక గ్రామం. ఒకరోజు అంధుడయిన ఒక యువకుడు గ్రామం ఉన్న అడవి గుండా నడుస్తూ వస్తున్నాడు. అక్కడ చల్లదనానికి నీరు, అన్నీ గడ్డకట్టుకుపోయి ఉన్నాయి. ఆకులు, కాయలు, కొమ్మలు, రాళ్ళు కూడా మంచుతో గడ్డకట్టుకుపోయి ఉన్నాయి. అలా మంచులో నడచి వస్తున్న గుడ్డివాడయిన యువకుడు ఒక దగ్గర కాలుజారి నేలపై పడతాడు. అప్పుడు అతని చేతి కర్ర జారి లోయలో పడిపోతుంది.

దారి బాగా అలవాటు కాబట్టి లేచి మెల్లగా చేతులతో తడుముకుంటూ గ్రామంవైపు నడుస్తుంటాడు ఆ యువకుడు. అలా కొంచెం దూరం వెళ్ళాక, అకస్మాత్తుగా అతని చేతులమీద ఒక కర్ర పడుతుంది. దానిని ఒడిసి పట్టుకుంటాడు అది పొడవైన కర్ర.

దానిని పట్టుకుని, " అమ్మయ్య !నాకు కర్ర దొరికింది. అదృష్టవంతుణ్ణి ! దేవుడే ఈ కర్ర నాకు ఇచ్చాడు,” అని దాని సహాయంతో గబగబా నడుస్తుంటాడు.

కానీ అతని మీద పడినది కర్రకాదు. భయంకరమైన నాగుపాము. అది మంచులో గడ్డకట్టుకుపోయి కర్రలా ఉన్నది. కానీ ఆ యువకుడు చూడలేదు కాబట్టి దానిని కర్ర అనుకుని దానిని పట్టుకుని నడుస్తుంటాడు

అంతలో ఒక సాధువు గ్రామం నుంచి అడవి లోపలికి వెళుతుంటాడు. ఆయన ఆ అంధుడి చేతిలో పాముని చూస్తాడు. వెంటనే ఆ యువకుడితో “అయ్యా !నీవు ఎవరివో కానీ, ముందు నీచేతిలో దానిని పారవేయి. నీవు దానిని కర్ర అనుకుంటున్నావు. కానీ అది పాము. త్వరగా దానిని పారవేయి” అని అరుస్తూ చెబుతాడు.

అప్పుడు ఆ యువకుడు సాధువుతో “నాకు అన్నీ తెలుసు. నా చేతిలోనిది కర్రే. నీవు మాట్లాడకుండా నీదారిని వెళ్ళు” అంటాడు కోపంగా.

అప్పుడు సాధువు, “ అయ్యో ! ఓ యువకుడా ! అది పాము. మరి కాసేపటిలో సూర్యకిరణాలు బయటికి వస్తాయి. ఆ మంచు కరిగిపోయి, పాము బయటికి వస్తుంది. అది కరిస్తే నీ ప్రాణాలు దక్కవు. అది భయంకరమైన నాగుపాము దానిని దూరంగా పారవేయి అని కొంచెం గట్టిగా చెబుతాడు.

ఈసారి ఆ యువకుడికి చాలా కోపం వస్తుంది. అతనుకూడా చాలా గట్టిగా ఇలా అంటాడు,” బహుశః నీకు ఈ కర్ర అవసరం అయి ఉంటుంది.నేను దీనిని పారవేస్తే , నీవు తీసుకోవాలని అనుకుంటున్నావు. నాకు ఆ మాత్రం తెలియదు అని అనుకోకు. నీలాంటి వారిని చాలా మందిని చూసాను. నీదారిని నీవు నోరుమూసుకొని వెళ్ళు. అనవసరంగా నాజోలికి రావద్దు. నీవు ఎంత అరచినా నేను ఈ కర్రని వదలను” అంటాడు. అప్పుడు ఆ సాధువు “ ఓ మూర్ఖుడా ! అతిగా ప్రవర్తించి నీప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. నీ మంచి కోరి చెబుతున్నాను. అనవసరంగా చస్తావు ” అంటాడు. ఆ యువకుడు లెక్క చేయకుండా ముందుకి వెళ్ళిపోతుంటాడు.

అప్పుడు సాధువు ఆ యువకుడి మీద జాలితో అతను తనని తిడుతున్నా లెక్కచేయకుండా అతని చేతిలోని పాముని లాగేయటానికి ప్రయత్నిస్తాడు. ఆ యువకుడు కోపంగా ఆ పాముతోనే సాధువుని కొడతాడు. కరుణా, ప్రేమ మాత్రమే తెలిసిన ఆ సాధువు ఆ దెబ్బలను భరిస్తూ పాముని అతని చేతినుంచి లాగి దూరంగా పారవేసి ఆ యువకుడి ప్రాణాలు కాపాడతాడు.

మనందరం కూడా జీవితంలో చాలాసార్లు ఆ యువకుడిలా మూర్ఖంగా ప్రవర్తించుతాము. కానీ మనమీద ఉండే అపారమైన ప్రేమతో,కరుణతో గురువులు తిరిగి తిరిగి మనకి సహాయం చేయాలనే చూస్తారు. మనకి వారి హస్తాన్ని అందించుతారు. మనం మాత్రం అహంకారంతో అంధులమైపోయి ఆ చేతిని బలంగా తోసిపారేస్తాము.

పూజ, ప్రార్థన అంటే కృతజ్ఞత చూపటం

మనం ఈ భూమిమీద పుట్టినప్పటినుంచి చనిపోయేవరకూ నిరంతరం ఆ భగవంతుని రక్షణలో ఉంటాము. కానీ ఆ విషయాన్ని మనం ఎప్పుడూ గమనించము. అసలు ఆ ఆలోచన రానీయము. ఎంతవరకూ కూడా కేవలం మన కళ్ళకి కనపడుతూ, మనం కష్టాలలో ఉన్నప్పుడు సహాయం చేసిన వారిని మాత్రం గుర్తించుతాము. మనం అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేసిన వారిని మాత్రం స్మరించుతాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యనేర్పినవారు, సహాయం చేసిన స్నేహితులు, బంధువులు ఇలా అనుకుంటాము కానీ నిరంతరం, కొన్ని వేలసార్లు మనని రక్షిస్తున్న ఆ సర్వాంతర్యామిని, మనం అడగకుండానే అన్ని వరాలని మనమీద వర్షింపచేసే విశ్వశక్తి అయిన భగవంతుణ్ణి మాత్రం గుర్తించం. దేవుడికి అసలు కృతజ్ఞత ఎప్పుదయినా చెబుతామా?

మీరు ఒకసారి గమనించండి - ప్రార్థన చేయి లేదా పూజ చేయి అనగానే, ‘భగవంతుడా నాకు ఇది కావాలి, అది కావాలి,’ అని మొదలు పెడతాం. గుడికి వెళ్ళగానే లేదా దేవుని పటం ముందు నిలబడగానే భగవంతుడా మమ్ములని చల్లగా చూడు, మంచి ఆరోగ్యం ఇవ్వు, మంచి జీవితాన్ని ఇవ్వు, చదువు ఇవ్వు ఇలా ఉంటుంది మన ప్రార్థన.

అంతేకాదు భగవంతుడు మనకు ఎంత ఇచ్చినా ఇంకా కావాలి.. ఇంకా కావాలి అని మాత్రమే అంటాం. మనకి భగవంతుడు ఇచ్చిన ఎన్నో అపురూపమైన బహుమతులని ఏరోజూ తృప్తిగా చూసుకోము, అవి ఇచ్చినందుకు భగవంతుడికి మనస్పూర్తిగా కృతజ్ఞత చెప్పం.

పిల్లలు గుడికి వెళతాం అనగానే ఇది అడుగు, అది అడుగు అని చెబుతామే కానీ,నీకు భగవంతుడు ఎన్నో ఇచ్చాడు మనస్పూర్తిగా, ప్రేమతో కృతజ్ఞత చెప్పు అని చెప్పం. అందుకే చిన్నతనం నుంచి మనకి పూజ, ప్రార్థన అనగానే అడగటం అనేది అలవాటైపోయింది. మనకి చక్కని శరీరాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు. అందమయిన కాళ్ళు, ఇలా మహోద్భుతమయినవి ఎన్నో ఇచ్చాడు. సంతోషంగా బ్రతకడానికి అందాల ప్రపంచాన్ని ఇచ్చాడు. మనం నిద్రలేచినది మొదలు, నిద్రపోయేవరకు మన అవసరాలు తీరుస్తూ రక్షణని ఇస్తున్నాడు. కానీ మనం ఏరోజు అయినా భగవంతునికి కృతజ్ఞతలు చెప్పామా?

ఎందుకు మనం నిరంతరం కృతజ్ఞతతో ఉండము? ఎందుకు భగవంతుడు ఎన్ని వరాలు ఇచ్చినా ఇంకా కావాలి. ఆ తరువాత ఏమిటి? ఇంతేనా! అని అనుకుంటాము? అసలు తృప్తి అనేది మనకి లేదా?

ఎందుకు అలా ప్రవర్తిస్తాము అంటే , మనకి ఏది ఇచ్చినా దానిని యధాలాపంగా, చాలా మాములుగా తీసుకుంటాము. అద్భుతమయిన ఈ జీవితాన్నే యధాలాపంగా తీసుకుంటాము. అంతే కాకుండా, నాకు అర్హత ఉన్నది కాబట్టి ఇవన్నీ పొందగలుగుతున్నాను అనే భావం కూడా మనలో కృతజ్ఞతని లేకుండా చేస్తుంది. కానీ ఒక్క విషయం అర్ధం చేసుకోము. భగవంతుడు ఇతను/ఆమె నాకు అవసరం లేదు అనుకున్నా మరుక్షణం మనం ఈ ప్రపంచంలో ఉండము. మనం జీవించి ఉన్నాము అంటే, భగవంతుని రక్షణలో ఆయన కోరికపై ఈ భూమిమీద ఉన్నాము అని అర్ధం. అందుకే మనం నిరంతరం కృతజ్ఞతతో ఉండాలి. మనపూజలు, మనప్రార్ధనలు, మన జీవితమే కృతజ్ఞతగా మారాలి. కృతజ్ఞత అనేది ఒక సమాజపు మర్యాదలా ఉండకూడదు. అది మన అంతరాత్మనుంచి, మనహృదయపు లోతుల నుంచి పొంగి ప్రవహించాలి. అలాంటి స్థితిలో మనం మాటల రూపంలో కృతజ్ఞతని వ్యక్తం చేయకపోయినా పరవాలేదు.

మనం ఏ మత ఆచారాలు పాటించినా పరవాలేదు. కానీ ఆ ఆచారాలు మనని నిష్కల్మషమైన ప్రేమతో కృతజ్ఞతతో నింపాలి. మనం చేసే ప్రార్ధన, ప్రేమ కృతజ్ఞతలతో ఉండాలికాని కోరిక, భయంతో కాదు. నాకు ఇది వచ్చింది కాబట్టి దేవుడికి పూజ చేస్తాను. నాకు ఇది రాలేదు కాబట్టి ఇవాళ ప్రార్ధన చేయను అని అంటే అది భక్తి కాదు, కృతజ్ఞత అంతకంటే కాదు. మనకి మంచిరిగినా చెడు జరిగినా (చెడు అనేది కేవలం మన భాష, మన భావం మాత్రమే) నిరంతరం భగవంతుడికి కృతజ్ఞతని ప్రేమతో తెలియచేయాలి.

ఒక సుఫీ గురువు కథ :

జున్నాద్ అనే ఒక సుఫీ గురువు తన శిష్యులతో కాలినడకన దేశాటన చేస్తూ ఉంటాడు. సుఫీ మతం కృతజ్ఞతతో ఉండే మతం. వారు రోజుకి ఐదుసార్లు భగవంతునికి ప్రార్ధనలు చేస్తారు.

సుఫీ గురువు తన శిష్యులతో ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి, అక్కడ వారు ఇచ్చిన భోజనం తిని ఊరు చివరలో రాత్రికి బస చేసి తిరిగి మర్నాడు మరొక గ్రామానికి వెళుతుంటారు. ఆ విధంగా వారు దేశాటన చేస్తుంటారు.

ఒకసారి ఈ సుఫీ గురువు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళతాడు. ఆ గ్రామ ప్రజలకి సుఫీ మతం గురించి కానీ, సుఫీ గురువుల గురించి కానీ ఏమీ తెలియదు. వీరు మాములుగా బిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఎవరూ వారికి బిక్ష వేయరు. సాయంత్రం వరకూ బిక్షాటన చేసినా తినటానికి ఏమీ దొరకదు. సుఫీ గురువు శిష్యులతో ఆ రాత్రి గ్రామం సరిహద్దులో విశ్రమిస్తాడు. అందరూ ఆకలితోనే పడుకుంటారు. రెండవరోజు వీరంతా ఆ తరువాత ఉన్న గ్రామానికి వెళతారు. ఆ గ్రామంలో వారికి సుఫీమతం అంటే ఇష్టం ఉండదు. దాంతో వారు భిక్షవేయరు సరికదా వీరిని తిట్టి పంపించి వేస్తారు. ఆ రాత్రి కూడా గురువుగారు తన శిష్యులతో గ్రామం బయట ఆకలితోనే నిద్రపోతారు.

మూడవరోజు వారంతా ఆ తరువాత గ్రామంలోనికి వెళతారు. ఆ గ్రామంలో వారు సుఫీ మతం అంటే అసలు ఇష్టం ఉండదు. దాంతో వారు గురువుగారిని, ఆయన శిష్యులని కర్రలతో బెదరించి ఊరు బయటికి తరిమివేస్తారు. అందరూ ఆ గ్రామం దాటి బయటికి వచ్చేస్తారు.

ఆ రోజు రాత్రి ఎప్పటిలాగానే సుఫీ గురువు గుడ్డపరచి, దాని మీద కూర్చొని, ప్రార్థన చేసి భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేస్తాడు.

ఇదంతా గమనించిన శిష్యులకి చాలా కోపం వస్తుంది. అసలు గురువుగారు దేవుడికి ఎందుకు కృతజ్ఞతలు చెబుతున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు కోపంగా గురువు గారితో, “గురుదేవా! మనకి గత మూడు రోజుల నుండి భోజనం లేదు. ఈ రోజు అయితే కర్రలతో కొట్టబోయారు. మనని భయపెట్టి ఊరునుంచి తరిమివేసారు. మనకి ఏమి మంచి జరిగింది అని మీరు దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నారు? మనం ఆకలితో ఉన్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నారా? అని కోపంగా అడుగుతారు.”

గురువుగారికి వాళ్ళ కోపం అర్థమయింది. ఆయన వాళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఇలా అంటాడు. “ మీరు మూడురోజుల ఆకలి గురించి మాట్లాడుతున్నారు. మరి గత ముప్పై సంవత్సరాలుగా మీరు చేస్తున్న భోజనానికి భగవంతునికి కృతజ్ఞత చెప్పాలి కదా! ఆ విషయం మర్చిపోయారా?”

ఆయన ఇంకా ఇలా అంటాడు “ మీకు ప్రార్థన అంటే తెలిసింది ఇదే. మీరు ఒక్క విషయం గురించి మాత్రమే ఆలోచించుతారు. అది, ఏమైనా పొందినప్పుడు మాత్రమే కృతజ్ఞత చెప్పాలి అని కానీ నేను భగవంతునికి చెప్పే కృతజ్ఞత అది కాదు. నేను ఎంతో పొందాను అని చెప్పేది కృతజ్ఞత కాదు. నా ప్రార్థన, నా కృతజ్ఞత అనేవి నా అంతరంగపు లోతుల నుంచి పొంగి ప్రవహించే ఆనందం, ప్రేమ. నేను కేవలం వాటిని మాత్రమే వ్యక్తం చేస్తున్నాను. దీనికి ఎంపికలు ఉండవు. కేవలం నా నుంచి పొంగి ప్రవహించే భక్తి, ప్రేమ భావాలే నా ఈ ప్రార్థన”

మీలో కృతజ్ఞతా భావం పొంగి ప్రవహించుతున్నప్పుడు, కృతజ్ఞత తెలియచేయటం అనేది బాధ్యతగా ఉండదు. ఏదో జరిగింది కాబట్టి మర్యాద కోసం చెప్పే మాటలుగా అనిపించదు. అటువంటివారి జీవితమే కృతజ్ఞతతో నిండి ఉంటుంది. అలా కృతజ్ఞత ఉన్నప్పుడు వారు ధ్యానస్థితిలో ఉన్నట్టే. ఎందుకంటే మనం, మన అంతరంగం కృతజ్ఞతతో నిండి ఉన్నట్లయితే మనలో అహంకారం, అదే విధంగా మనస్సు అనే వాటికి స్థానం ఉండదు. ఎప్పుడయితే ఆ రెండూ మనలో ఉండవో మనం ధ్యానస్థితిలో ఉన్నట్టే. అదే మనం చేరగల అత్యున్నతమైన స్థితి.

పూజ, ప్రార్థన అనేవి ఒక పని కాదు:

మనం భగవంతుడిని ప్రేమతో, భక్తితో ప్రార్థించాలి. కానీ చాలా మంది దానిని యాంత్రికంగా, అదేదో ఒక డ్యూటీ లేదా బాధ్యత అన్నట్టు చేస్తారు. పూజ అయిపోగానే, హమ్మయ్య అయిపోయిందిలే అని అనుకుంటాము. కొంతమంది గుడిలో విగ్రహాలకి బిందెడు పాలతో అభిషేకం చేస్తాం అని అంటారు. కొందరు గుడి చుట్టూ 108 సార్లు 21 రోజులు ప్రదక్షిణ చేస్తాం అంటారు. కొందరు, కొన్ని స్తోత్రాలని 10 రోజులు 21 రోజులు లేదా 10,000 సార్లు చదివాము అని అంటారు. ఇవన్నీ దేనికి చేస్తారు. అలా చేయటం వలన వారికి భగవంతుని మీద భక్తి లేదా భయం అనే భావాలు తప్ప వారికి భగవంతునితో సాన్నిహిత్యం ఏర్పడదు. నిజంగా ఆలోచిస్తే ఇదంతా వ్యాపార వ్యవహారంలా ఉంటుంది.

కొంతమంది పూజకి అన్నీ ఇచ్చి తమ పేరు గోత్రం అడ్రస్ అన్నీ చెప్పి వారికి ఏమికావాలో కూడా స్పష్టంగా చెబుతారు. అప్పుడు భగవంతుడు వారికి ఇచ్చే వరాలు కచ్చితంగా ఉండి, వారి కరెక్ట్ అడ్రస్కి వస్తాయి అని నమ్మకం. అంటే వీరి ఉద్దేశం భగవంతుడికి మనకి ఏమి ఇవ్వాలో, ఏది అవసరమో తెలియదు అని నమ్మకం. భగవంతుడు అంటేనే మేధస్సు. భగవంతునికి తెలియనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. మన గురించి ఈ జన్మ మాత్రమే కాదు, మన పూర్వ జన్మలు, మన రాబోయే జన్మలు దేవుడికి స్పష్టంగా తెలుసు. మన గురించి మనకంటే దేవుడికే బాగా తెలుసు.

కానీ తెలివిగలవాళ్ళం మనమే అనుకునే వారి వ్యవహారాలు, వారి పూజలు, ప్రార్ధనలు ఎలా వ్యాపారంలా ఉంటాయో పరమహంస నిత్యానంద ఒక చిన్న కథలో వివరిస్తారు.

ఒక చిన్న కథ :

దేవుడే వ్యాపారంలో భాగస్వామి అయితే?

ఒక చిన్న పట్టణంలో ముగ్గురు స్నేహితులు ఉంటారు. వారికి చదువు పూర్తయింది. ఏం ఉద్యోగం చేయాలా అని చాలా ఆలోచించుతారు. వారి ఉద్దేశం ఏమిటి అంటే, త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలి. అలా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే వ్యాపారమే సరియైన పద్ధతి అని నిర్ణయించుకుంటారు.

కొంత ఆలోచించి, వాధించి మాట్లాడి చివరిగా ముగ్గురూ వాటాదారులుగా ఉండి వ్యాపారం చేయాలి అని నిర్ణయించుతారు.

అప్పుడు వారిలో ఒక వ్యక్తి “ మనo ముగ్గురం వాటాదారులమంటే బాగుండదు. మనకి మరొక వాటాదారుడు ఉంటే బాగుంటుంది” అని అంటాడు. వారు మరలా చాలా తర్జన భర్జన పడతారు. వారికి ఏకాభిప్రాయం కుదరదు. చివరికి వారిలో రెండో వ్యక్తి ఇలా అంటాడు “ మనకి బయట వ్యక్తులు ఎవరూ వద్దు. మనం ముగ్గురం, నాలుగవ భాగస్వామిగా దేవుడిని పెట్టుకుందాము. అప్పుడు మనకి ఎవరితో గొడవలు ఉండవు, దేవుడే మన భాగస్వామి కాబట్టి మన వ్యాపారం చాలా బాగుంటుంది” అని అంటాడు.

మిగిలిన ఇద్దరూ చాలా సంతోషపడతారు. అప్పుడు వారిలో మూడవ వ్యక్తి “ఇది చాలా మంచి సలహా మనం దేవుడికి కూడా మన లాభాలలో కొంత భాగం ఇద్దాము” అంటాడు

అందరూ ఒప్పుకుంటారు. ఆ ముగ్గురు స్నేహితులు, దేవుడిని కూడా భాగస్వామిగా చేసి, చాలా ధైర్యంగా వ్యాపారం మొదలు పెడతారు. సంవత్సరం అయ్యేటప్పటికి వారికి చాలా లాభాలు వస్తాయి. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. సంవత్సరం చివరిలో అందరూ లాభాలు పంచుకొనే సమయం వస్తుంది. ఇప్పుడు అసలు సమస్య ప్రారంభమవుతుంది. సమస్య ఏమిటి అంటే దేవుడికి లాభాలలో వాటా ఎంత ఇవ్వాలి, అది ఎలా నిర్ణయించాలి. వారికి లాభాలు చూస్తే చాలా ఎక్కువగా వచ్చాయి.

స్నేహితులు చాలా సేపు ఆలోచించి చాలా మార్గాలని పద్ధతులని చర్చించుతారు. చివరగా మొదటి వ్యక్తి ఇలా అంటాడు. “సరే, నేను ఒక పద్ధతి చెబుతాను. ఇక్కడ ఒక సర్కిల్ గీద్దాము. మనకి వచ్చిన డబ్బు అంతా దాని మీది పోద్దాము. ఆ సున్నాలో పడిన డబ్బు దేవుడికి ఇద్దాము. బయటపడిన డబ్బు మనం పంచుకుందాము” ఈ సలహా మిగతా ఇద్దరికీ అంతగా నచ్చదు. వాళ్ళు ఏం మాట్లాడరు.

అప్పుడు రెండవ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా అంటాడు “ ఒక పెద్ద వృత్తాన్ని గీద్దాము. మనకి వచ్చిన డబ్బుని అందులో వేద్దాము. వృత్తం లోపల పడిన డబ్బు మనం తీసుకుందాము. బయటపడిన డబ్బు దేవుడికి ఇద్దాము”, అంటాడు. ఆ సలహా కూడా అంతగా నచ్చదు వాళ్ళకి.

అప్పుడు మూడవ వ్యక్తి, “ నేనొక సలహా ఇస్తాను. ముందు నామాట వినండి. భగవంతుడు ఎక్కడ ఉంటాడు. పైన ఉంటాడు కదా. మనం డబ్బు మొత్తం పైకి విసురుదాము. దేవుడు తనకు ఎంత డబ్బు కావాలో అంత తీసుకొని మిగతాది మనకి ఇస్తాడు. అలా క్రింద పడిన డబ్బు మనం పంచుకుందాం అంటాడు.

ఈ సలహా అందరికీ నచ్చుతుంది.

మనం ఇలానే ప్రవర్తిస్తాము. భగవంతుడిని వరాలు అడిగే సమయంలో నేను కోరుకున్నది జరిగితే నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెబుతాము. కోరిక తీరగానే దేవుడిని మర్చిపోతాం. తిరిగి ఇంకొక కోరిక రాగానే మళ్ళీ దేవుడితో బేరాలు మొదలు పెడతాము. ఇదీ మనం చూపించే భక్తి. అందుకే అంటాను, భక్తి అంటే కృతజ్ఞతా, ప్రేమ అంతే కాని వ్యవహారాలు కాదు. దానిని భక్తి అనరు.

పోలిక విత్తనం : అసూయ ఆ చెట్టుకు కాసే ఫలం :

మనం మన జీవితంలో చాలా భాగం. ఎదుటివారితో లేదా ఇతరులతో పోల్చుకోవటంలో గడుపుతుంటాము. మనకి తెలిసే విధంగా కొంత, మన అచేతన స్థితిలో కొంత మనం నిరంతరం పోల్చుంటూ ఉంటాము. మన మైండ్ ఈ పోల్చుకునే కార్యక్రమంలో ఎంతగా మునిగిపోయిందంటే, మనం అసలు సత్యాన్ని ఆ విధంగా చూడకుండా కేవలం పోలికతో మాత్రమే చూడగలుగుతున్నాము. దీనివలన మనం మన జీవితంలో నాణ్యతని కోల్పోతున్నాము. అసలు జీవితాన్ని యథాతథంగా చూడలేకపోతున్నాము.

పరమహంస నిత్యానంద ఒక చక్కని విషయాన్ని చెబుతారు. మీరు ఎదుటివారిని చూసి కొంత విషయాన్ని, కొత్త సంగతులని, తెలియని జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. అంతవరకు మాత్రమే మీరు ఎదుటివారిలో చూడలగాలి. అది మంచి పద్ధతి. ఇటువంటి దృక్పథం వలన మీరు అభివృద్ధి చెందుతారు. అలా కాకుండా ఎదుటివారు ఇలా చేసారు కాబట్టి నేను కూడా.... ఇలా ఆలోచించి తే మనం జీవితంలో ఏదీ సాధించలేము.

అసలు అందరూ ఎందుకు నిరంతరం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీకు మీరు అంటే ఏమిటో తెలియదు. మీ లోపల ఉన్న అద్భుతమైన శక్తి కూడా తెలియదు. మీలోని గొప్పశక్తిని మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీలోని శక్తియుక్తులని ఎప్పుడయితే తెలుసుకుంటారో అప్పుడు మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. ఎప్పుడయితే మిమ్మలని మీరు నమ్ముతారో ఇక ఎదుటివారితో పోల్చుకోవలసిన అవసరం ఉండదు.

మీ ఏకాగ్రత, మీ దృష్టి మీ మీద లేకపోవటం కూడా ఒక కారణం. మీరు మీతో ఉండగలిగే స్థితిని పొందితే మీరు ఎవరితోనూ పోల్చుకోరు. మీకు మీరు చాలు అని అనుకోగలిగితే, మీతో మీరు ఉండగలిగితే ఎదుటి వారితో పోల్చుకునే అవసరం మీకురాదు.

ఈ ప్రపంచంలో ప్రతీ వ్యక్తి భగవంతుని సృష్టి. భగవంతుడు తనలోని దివ్యశక్తిని అద్భుత మేధస్సుని కలిపి ఈ ప్రపంచంలోనికి మనం ఏ లక్ష్యంతో పంపబడ్డామో ఆ లక్ష్యం సాధించేందుకు అనువుగా మనని తయారుచేస్తాడు. అందుకే ప్రతి మనిషి ఒక ప్రత్యేకతని కలిగి ఉంటాడు. ఎవరి ప్రత్యేకత వారిది. నేను ప్రత్యేక వ్యక్తిని అని అనుకోలేని మనిషి తనని ఎదుటివారితో పోల్చుకుంటాడు. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనప్పుడు ఇక పోల్చటానికి ఏముంటుంది. గులాబీ పూవు, మల్లెపూవుతో ఏవిధంగా పోల్చుకుంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనం ఎదుటి వారితో పోల్చుకోవటం మానేస్తాము. నేను ప్రత్యేక వ్యక్తిని, నా ప్రత్యేకత నాది అనుకున్నవారు అసలు ఎవరితోనూ పోల్చుకోరు.

ఎదుటి వారితో పోల్చుకుంటే నష్టం ఏమిటి?

మీరు జాగ్రత్తగా గమనించితే, మన జీవితంలో సగభాగం ఇతరులతో పోల్చుకోవటంతోనే గడిచిపోతుంది. మనం మన కోసం ఉపయోగించే శక్తిలో 60% ఎదుటివారి అభివృద్ధిని లెక్కలు కట్టటానికి, మనం వారితో పోలిస్తే ఎక్కడ ఉన్నామో లెక్క కట్టడానికి ఉపయోగిస్తాము. ఒక్క క్షణం ఆలోచించండి. ఆ అరవైశాతం శక్తిని కూడా మన అభివృద్ధి కే ఉపయోగించగలిగితే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో, మనలో ఎంత శాంతి ఆనందం ఉంటాయో ఊహించండి.

ఒక చిన్న కథ :

ఒక వ్యక్తి 1000 మీటర్ల పరుగుపందెంలో పరిగెడుతుంటాడు. 250 మీటర్లు పరిగెత్తాక ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అతను అందరికంటే ముందు ఉంటాడు. మరలా 500 మీటర్లు పరిగెత్తాక ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అతనే ముందు ఉంటాడు. అలాగే 750 మీటర్లు తరువాత వెనక్కి చూస్తే అతనే ముందు ఉంటాడు. చివరికి అతను గెలుస్తాడు.

ఆ వ్యక్తి అసలు వెనక్కి తిరగకుండా, తన పూర్తి శక్తిని ఏకాగ్రతని కేవలం తన లక్ష్యం వైపు మాత్రమే ఉంచి ఉంటే బహుశః అతను ప్రపంచ రికార్డు సాధించి ఉండేవాడు.

ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి జీవిత లక్ష్యం వారిది. అటువంటప్పుడు ఎదుటివారితో పోల్చుకుని మనం ఏమి అర్థం చేసుకోగలం. వారి ఆధారంగా మనం ఏమి సాధించగలం.

ఎదుటివారితో పోల్చుకుంటే నష్టం ఏమిటి?

ఎదుటివారితో పోల్చుకుంటే మనకి మిగిలేది వ్యధ, మానసిక కుంగుబాటు అంతే. మనం అంతకంటే ఇంకా గొప్పవారము కాగలిగి ఉండి కూడా పోల్చుకుంటూ మన చిన్న పరిధిలో ఉండిపోతున్నాము.

ఎదటివారితో పోల్చుకుంటూ, వారిలా మనం పనులు చేస్తే, మహా సాధించగలిగే వారి స్థితిని చేరగలం. కానీ మన ప్రత్యేక శక్తియుక్తులని, మన లక్ష్యం వైపు ఉపయోగించి ఉంటే మనం ఇంకా గొప్పవారం అయివుండే వారం కదా!

ఉదాహరణకి : బిల్‌గేట్స్ ఎవరితోనైనా పోల్చుకొని ఉంటే బహుశ ఒక కంపెనీకి మేనేజర్ అయి ఉండేవాడు అంతే. ఐన్‌స్టీన్ లేదా న్యూటన్ ఒకరితో పోల్చుకొని ఉంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ అయి ఉండేవారు.

అర్థం చేసుకోండి! పోల్చుకోవటం అనే విషయాన్ని వదిలివేస్తే మనం స్వేచ్ఛగా, ఆనందంగా మన పని మనం పూర్తి ఏకాగ్రతతో చేసి మంచి ఫలితాలు సాధించగలం. అప్పుడు మన జీవితం అద్భుతంగా, తప్తిగా ఉంటుంది.

మరొక చిన్న కథ :

ఒక అందమయిన చిన్న రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆయన ఎప్పుడూ దిగులుగా, అశాంతిగా, అసంతృప్తితో ఉండేవాడు. ఆయన మంత్రులకి కారణం తెలియదు. ఆయన దిగులుగా ఉండవలసిన పరిస్థితులు ఆ రాజ్యంలో లేవు. ఆ దేశ ప్రజలు మంచివారు. దేశంలో అందరూ ధనవంతులు. దేశానికి పెద్దగా శతృభయం లేదు. రాజుగారి కొలువులో అందరూ సమర్థులే. మరి రాజుగారి అసంతృప్తి, దిగులుకి కారణం ఎవరికీ తెలియదు. ఆయనని ఎప్పుడూ ఆనందంగా ఉండటం ఎవరూ చూడలేదు.

రాజు దిగులుకి కారణం ఏమిటంటే, ఆయన ప్రతి క్షణం తన ప్రక్కదేశపు రాజు గురించే ఆలోచిస్తాడు. ఎప్పుడూ ఆ రాజుతో ఆ రాజ్యంతో పోల్చుకుంటూ ఉంటాడు. ఆ రాజ్యాన్ని చూసి అసూయతో మండిపోతుంటాడు. అతనికి ఆ రాజు తనకంటే గొప్పవాడు అనే భావం చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో ఆ రాజ్యం మీద ఆ రాజుమీద ద్వేషం పెరుగుతుంది. కానీ ఆ రాజ్యాన్ని ఏమీ చేయలేడు. కారణం, ఆ రాజ్యం తన రాజ్యానికంటే చాలా రెట్లు పెద్దది. ఆ రాజు ఈయన కంటే చాలా ధనవంతుడు. చాలా మంచి వాడని, తెలివైనవాడని పేరు ఉన్నది. కాబట్టి ఆ రాజుని, రాజ్యాన్ని ఏమీ చేయలేననే దిగులు, అతనిని చూస్తే కలిగే అసూయతో ఆ రాజు కుంగిపోతుంటాడు.

ఒక రోజు ఆయన వాళ్ళ కులుగురువు యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. గురువుగారు రాజుని కుశల ప్రశ్నలు అడిగిన తరువాత ఆశ్రమానికి వచ్చిన కారణం అడుగుతాడు. అప్పుడు రాజు తన మనస్సులోని బాధని చెప్పి గురువుగారితో ఇలా అంటాడు, “గురుదేవా! మీ దగ్గర అద్భుతమైన మహిమలు, గొప్ప మంత్రాలు ఉంటాయి కదా! నాకు ఏదైనా ఒక మంత్రాన్ని నేర్పించండి. దాని మహిమతో నేను నా ప్రక్కనే ఉన్న రాజుని ఓడించి ఆ రాజ్యాన్ని సాధించుతాను. దయచేసి నాకు ఈ సహాయం చేసి నాలోని దుఃఖాన్ని, వేదనని తొలగించండి” అని ప్రార్థించుతాడు.

రాజుగారు చెప్పినదంతా చాలా ఓపికగా విని, రాజుతో, “రాజా! ఈప్రక్కన పూలతోటలో చక్కని గులాబి మొక్క ఉన్నది, దాని ప్రక్కనే ఒక కానగ చెట్టు ఉన్నది. వాటిని జాగ్రత్తగా గమనించు. అవి నీకు కావలసిన విషయాలని నేర్పించుతాయి” అని అంటారు గురువు గారు గురువు గారు చెప్పిన విధంగా రాజు తోటలో ఉన్న గులాబి చెట్టు దగ్గరకి వెళతాడు. గులాబి చెట్టు ప్రక్కనే ఉన్నకానగ చెట్టుని చాలాసేపు గమనించుతాడు. కానీ అతనికి ఏమీ అర్థం కాదు. కొంచెంసేపు అలా వాటిని చూసి గురువుగారి కుటీరానికి తిరిగి వస్తాడు.

గురువుగారితో రాజు ఇలా అంటాడు “గురుదేవా! ఆ చెట్లని చూసాను కానీ నాకు ఏమి అర్థం కాలేదు. అవి నాకు ఏమి నేర్పించుతాయి” అని అంటాడు.

అప్పుడు గురువుగారు రాజుని తీసుకొని ఆ చెట్ల దగ్గరకి వస్తాడు. ఈ గులాబి మొక్క కానగ చెట్టు చాలా కాలం నుంచి ఇలా ప్రక్కప్రక్కనే ఉన్నాయి. కానగ చెట్టు ఏనాడు తాను గులాబి మొక్కలా ఉండాలి అని కోరుకోలేదు. అదే విధంగా గులాబి మొక్క ఎప్పుడు తాను కానగ మొక్కలా ఉండాలి అని ఆశించలేదు. అవి వాటి బాధ్యతలని నెరవేర్చుతూ ఆనందంగా, హాయిగా పెరిగి పెద్దవుతున్నాయి.

అదే గనక ఒక మనిషి కానగ చెట్టు స్థానంలో ఉండి ఉంటే అతను నిరంతరం ఆ గులాబి చెట్టు వైపు చూస్తూ, దాని అందంతో తనని తాను పోల్చుకుంటూ అసూయతో రగిలిపోయేవాడు. తోటలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి గులాబి మొక్క దగ్గరకే వచ్చి, దాని అందానికి ఆనందిస్తూ ఆ పూలని మాత్రమే కోసుకుంటూ ఉంటే అది చూసి మరింత కుంగిపోయేవాడు. తనకి ఉన్న శక్తిని మొత్తం ఇలా పోల్చుకుని బాధపడడానికే ఉపయోగించేవాడు.

అదే విధంగా గులాబి మొక్క స్థానంలో మనిషి ఉండి ఉంటే, అతను తన ప్రక్కనే బలంగా ఎత్తుగా, పెద్దగా ఉన్న కానగ చెట్టుని చూసి దానితో తనని తాను పోల్చుకుని బాధపడేవాడు. తోటలోనికి ఎవరు వచ్చినా అందరూ నన్నే విసిగిస్తారు. నా పూలు కోసి నన్ను హింసపెడతారు. నన్ను ఒక్కక్షణం ప్రశాంతంగా ఉండనీయరు. నా బ్రతుకే ఇటువంటిది. అదే కానగ చెట్టు దగ్గరకి ఎవరురారు. దానిని ఎవరూ బాధించరు. దాని ప్రశాంతతని పాడుచేయరు. అది చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. కానగ ఎంత అదృష్టవంతురాలు అని ఇంకాస్త బాధపడేవాడు.

కానీ రాజా! ఈ మొక్కలు ఏ మాత్రం తన ప్రక్కవాటి మీద దృష్టిపెట్టి ఉండి ఉంటే అవి ఇంత అందంగా, బలంగా పెరగవు కదా. నీకు ఉన్న శక్తియుక్తులని నీతెలివి తేటలని, నీ సమయాన్ని కేవలం నీ రాజ్యం మీద మాత్రమే పెడితే నీ దేశం మరింత అభివృద్ధి అవుతుంది. నీవు ఆనందంగా తృప్తిగా జీవించగలవు కదా! ఇదే నేను నీకు ఇచ్చే మహిమగల మంత్రం. ఈ మంత్రాన్ని పాటిస్తే త్వరలోనే నీవు చాలా గొప్ప ధనవంతుడిగా అవుతావు, నీ దేశాన్ని స్వర్గంలా తీర్చిదిద్దగలుగుతావు అని అంటాడు.

ఈ ప్రపంచంలో ఏదీ నీది కాదు : ఏదీ శాశ్వతం కాదు

ఈ భూమి మీద ఉన్న ప్రాణులు అన్నింటిలోనూ మనిషి అత్యంత తెలివితేటలు కలిగిన ప్రాణి అని అంటారు. కానీ అంత మేధస్సు కలిగిన మనిషి అత్యంత సామాన్యమైనది, ప్రతి నిత్యం తన కళ్ళముందు నిలబడి ఉన్న సత్యాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడు. ఆ సత్యం “ఈ ప్రపంచంలో ఏదీ తనది కాదు. ఏదీ శాశ్వతం కాదు. మనిషి ఎంత మహాసామ్రాజ్యాలు పొందినా, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా, కొంతకాలం వాటికి సంరక్షకుడిగా ఉండి, వాటిని తిరిగి సర్వాంతర్యామికి అప్పచెప్పి వెళ్ళిపోవలసినదే.

ఒక్క నిముషం జాగ్రత్తగా ఆలోచించండి. మన చుట్టుప్రక్కల ఉన్న ఈ స్థలాలు, ఇళ్ళు, పొలాలు వీటికోసం ఎంతమంది రాజులు ఎందరిని చంపి వుంటారో, ఎందరు జమిందారులు, భూస్వాములు ఎంతమందికి అన్యాయం చేసి ఉంటారో. కేవలం కొద్దికాలం వాటికి సంరక్షకులుగా ఉండటం కోసం వాళ్ళు ఎన్ని దారుణాలు చేశారో, నిరంతరం ఆ అపరాధ భావంతో ఎంత అశాంతిగా బ్రతికి ఉంటారో మనం ఊహించగలం.

సంపాదించిన ఆస్తులు కాపాడుకోవటంలో మరొకరకమైన క్షోభకి గురిఅవుతారు. శత్రురాజు ఏ క్షణాన తన రాజ్యం మీదకి వస్తాడో అని, తన భూమిని ఆక్రమిస్తాడో అనే భయంతో ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపివుంటాడో. కష్టపడి సంపాదించిన ఆస్తులని కాపాడుకోవటంలో భోజనం చేయకుండా ఎన్నిరోజులు గడిపి ఉంటారో. పరిగెత్తి, పరిగెత్తి సంపాదించిన ఆస్తికి కాపాలా కాస్తూ అమూల్యమైన జీవితాన్ని జీవించటం మర్చిపోయారు. జీవిత కాలంలో కనీసం ఒక్క రోజయినా విరామంగా నిలబడి, తను సంపాదించిన ఆస్తిని కానీ, భగవంతుడు తనకి ఇచ్చిన వరాలని కానీ తృప్తిగా చూసుకొని, వాటిని ఆనందంగా అనుభవించి ఉండడు. ఎందుకంటే అలా నిలబడితే తన సంపాదన ఆగిపోతుందని భయం. మరణించే వరకూ పరుగుపెట్టటమే కానీ నిలబడి తృప్తిగా ఆనందించటానికి భయం. అలా చేస్తే ఆ తరువాత మరొకటి సంపాదించలేము అని భయం. ఒక చిన్న కథ :

ఒక రైతు ఏదో కొన్ని కారణాల వలన తనకున్న కొద్దిపాటి పొలాన్ని పోగొట్టుకుంటాడు. అతను చాలా పేదస్థితికి వెళ్ళిపోతాడు. ఏమీ చేయలేని స్థితిలో “భగవంతుడా నీవే నాకు దిక్కు” అని మనస్పూర్తిగా భగవంతుడిన శరణు వేడుతాడు. అతని ప్రార్ధనని ఆలకించిన భగవంతుడు ప్రత్యక్షమై, ఏమికావాలో కోరుకోమని అడుగుతాడు.

రైతు పరమానందభరితుడయ్యి, భగవంతుడికి నమస్కరిస్తూ, “దేవాదిదేవా! కరుణామూర్తి! ఈ పేదవాడి మీద దయ చూపించావా! నీకు వేల వేల కృతజ్ఞతలు. స్వామీ! నాకు కొంచం భూమి ఇప్పించితే అందులో వ్యవసాయం చేసుకొని నేను నాకుటుంబం హాయిగా ఉంటాము ” అని పదే పదే ప్రార్ధించుతాడు.

భగవంతుడు చాలా అందమైన చిరునవ్వు నవ్వి, “తథాస్తు! నీకు ఎంత భూమి కావాలో అంత తీసుకో” అంటాడు.

రైతు కొంచం అయోమయంగా చూస్తాడు. అప్పుడు భగవంతుడు, “రేపు సూర్యోదయం కాగానే నీవు కాలినడకన సూర్యాస్తమయం వరకూ ఎంత దూరం నడిస్తే ఆ భూమి అంతా నీ సొంతమవుతుంది” అని దేవుడు మాయం అవుతాడు. రైతు ఆనందానికి అవధులు ఉండవు. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూ ఉంటాడు.

మర్నాడు సూర్యోదయం కాగానే రైతు నడవటం మొదలు పెడతాడు. అలా కొన్ని గంటలు నడిచాక అతను పోగొట్టుకున్న భూమిని సంపాదిస్తాడు. ఇప్పుడు అతనిలో ఆశ మొదలవుతుంది. అప్పుడు అతను, “అదేమిటి, నేను ఎందుకు నడుస్తూ టైం అంతా వృధా చేస్తున్నాను. పరిగెడితే ఇంకా చాలా భూమిని సంపాదించవచ్చు కదా!” అని అనుకొని పరిగెడటం మొదలు పెడతాడు.

అలా మధ్యాహ్నం వరకూ పరిగెడతాడు. విపరీతమైన దాహం వేస్తుంది. కానీ మంచినీళ్ళు తాగటానికి ఆగితే కొంత భూమి పోతుందేమో అని భయపడి అలాగే పరిగెడతాడు. మరికొంత సేపటికి ఆకలి, నీరసం ఎక్కువ అయిపోతాయి. అయినా లేని ఓపికని తెచ్చుకొని పరిగెడుతుంటాడు. ఇంకా నీరసం వచ్చి పరిగెత్తలేకపోతాడు. అయినా తనకి తాను ఇలా చెప్పుకుంటాడు, “ఈ రోజు ఏమయినా సరే నేను ఒక్కక్షణం కూడా వృథా చేయను. ఒక్కరోజు మరే పనీ చేయను. మంచినీళ్లు, ఆహారం ఏమీ తీసుకోను. ఒక నిముషం కూడా విశ్రాంతి తీసుకోను. నేను ఇంకా చాలా భూమిని చుట్టబెట్టాలి. దానికి అధికారిని కావాలి” అని పరిగెడుతుంటాడు. అలా సూర్యాస్తమయం అయ్యే సమయానికి పరిగెత్తి పరిగెత్తి, కిందపడి చనిపోతాడు.

పరిగెత్తి పరిగెత్తి సంపాదించిన భూమిని ఒక్కక్షణం కూడా తృప్తిగా చూసుకోలేదు. అత్యాశకి పోయి అమూల్యమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. మనందరం కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉన్నాము. ఎప్పుడూ పరిగెత్తటమే. ఎందుకు పరిగెడుతున్నాము?ఎక్కడికి? ఏమి సాధించటానికి ఈ అత్యుత? ఒక్క క్షణం నిలబడి భగవంతుడు మనకి ఇచ్చిన ఎన్నో అద్భుతవరాలని అనుభవించి తృప్తిపడటం లేదు. ఎంతసేపూ ఆ తరువాత ఏమిటి? ఇంకా ఏమిటి అనుకోవటమే. ఇలా పరిగెత్తటం ఎంత అమాయకత్వమో కదా! ప్రకృతిలో మరే ప్రాణి ఇలా జీవితాన్ని జీవించటం మాని పరిగెత్తటం లేదు. ఏవీ అమాయకంగా జీవితాన్ని బలిపెట్టి ఆస్తులు కూడబెట్టటం లేదు. అవి అందమైన ఈ ప్రపంచంలో, ప్రకృతిలో ఒక భాగంగా జీవిస్తాయి. ప్రతి నిమిషం అత్యంత ఆనందంగా సంబరాలు చేసుకుంటాయి. ప్రతి క్షణం ఒక ఉత్సవంలా జీవిస్తాయి. కేవలం ఆనందం తప్పా మరే భావం లేకుండా చనిపోతాయి. కేవలం మనిషి మాత్రమే నిత్యం వ్యధలు, బాధ, కోపం, నిరాశ, అసంతృప్తి, కుంగుబాటుతనం, అపరాధభావం వీటితో జీవిస్తూ జీవితం అంటే ఉత్సాహం అని, జీవితంలో ప్రతిక్షణం ఒక పండుగలా జీవించాలనే విషయాన్ని మర్చిపోయి, జీవితాన్ని నిరాశతో లాగుతున్నాడు. అది ఎలా ఉంటుందంటే మరణాన్ని వాయిదా వేస్తున్నట్టే ఉంటుంది, కాని మనిషి జీవిస్తున్నట్టుగా ఉండదు.

ఎప్పుడయితే మనం ఇది నాది, నేను దీనిని పొందాలి, నేను దీనికి అధికారిని అవ్వాలి అనే భావనని వదిలిపెడతామో అప్పుడు మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాము. జీవితం అనేది ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ స్వేచ్ఛలోని ఆనందం ఎంత మధురంగా ఉంటుందో అనుభవించగలుగుతాము. అప్పుడు మనం పొందే ఆనందం ఎన్ని కోట్ల ఆస్తి అయినా మనకి ఇవ్వలేదు. ఎప్పుడయితే నాది అనే దానిని వదిలివేస్తామో, జీవితం తేలికగా, స్వేచ్ఛగా అందంగా ఉంటుంది. ప్రతీ క్షణం ఒక ఉత్సవంలా జీవితాన్ని గడపవచ్చు.

మీ అంతరంగంలో ఎన్నో గాయాలు ఉన్నాయి. అవి మీలోని కోపం, అసూయ, అసంతృప్తి, అత్యాశ, అశాంతి, మానసిక ఒత్తిడి అనే వాటి ద్వారా ఏర్పడ్డాయి. అదే విధంగా మీరు ఇతరులతో పోల్చుకుంటూ, వాళ్ళు పరిగెడుతున్నారు కాబట్టి మీరూ పరిగెడుతున్నారు. ఆ విధంగా ఇతరుల ద్వారా, సమాజం ద్వారా ఏర్పడిన గాయాలు మరికొన్ని. ఇన్ని గాయాలు అంతరంగం నిండా ఉన్నప్పుడు మీకు ఆనందం ఎక్కడ నుంచి వస్తుంది. ఈ గాయాలని మాన్పగల దివ్య మంత్రం ఒకటి ఉన్నది, అది ఈ ప్రపంచంలో ఏదీ నా సొంతం కాదు ప్రతిదీ భగవంతునికి వదిలివేయవలసినదే. ఏదీ శాశ్వతం కాదు. నేను, నాది అనేది కేవలం నా అమాయకత్వం ” అని తెలుసుకోవటమే దివ్యమంత్రం. అది గొప్ప మందులా పనిచేసి గాయాలన్నింటినీ ఒక్క క్షణంలో మాన్పగలుగుతుంది. అప్పుడు మీ అంతరంగం అద్భుతమైన ఆనందం, తృప్తి, శాంతితో నిండిపోతుంది. ఆ అనుభూతిని ఆ పరమానందాన్ని ఒక్కసారి అనుభవించినా చాలు, దాని గొప్పదనం మీకు అర్ధమవుతుంది.

మీరు మీతో ఉండగలగటం నేర్చుకోవాలి. మీరు మీ మీద ఏకాగ్రతని నిలిపి, మీతో ఉండగలిగితే విశ్రాంతిగా, విరామంగా ఉండగలుగుతారు. అప్పుడు మీకు నిజంగా ఏమి కావాలో తెలుస్తుంది. అప్పుడు మీరు సరియైన నిర్ణయాలు చేయగలుగుతారు. అనవసరంగా పరుగులు పెట్టరు.

ఒక చిన్న కథ : ఒక యోగీశ్వరుడు - అలెగ్జాండరు :

అలెగ్జాండరు గ్రీకుదేశానికి రాజు. అతడు యువకుడు. గొప్ప యోధుడు. అతనికి ప్రపంచాన్ని గెలవాలి, ప్రపంచానికి చక్రవర్తిని కావాలి అనే కోరిక కలిగింది. వెంటనే పెద్ద సైన్యాన్ని తీసుకొని తూర్పుదిశగా ఒక్కొక్క రాజ్యాన్ని జయించుతూ వస్తాడు. చివరిగా అతను భారతదేశం చేరుతాడు. భారతదేశపు సరిహద్దులలోని రాజులని జయించి తన ప్రతినిధులని ఉంచుతాడు.

అతను భారతదేశపు సంస్కృతి, సంప్రదాయాలు, విజ్ఞానము చూసి ఆశ్చర్యపోతాడు. వారి వైభవానికి కారణం వారికి ఉన్న వేదాలు, జ్ఞానోదయమైన యోగీశ్వరులు అని తెలుసుకుంటాడు. అతనికి ఆ విజ్ఞానాన్ని తన దేశానికి తీసుకువెళ్ళాలి అనే కోరిక కలుగుతుంది.

అలెగ్జాండర్ తనతో భారతదేశం నుంచి జ్ఞానోదయం అయిన యోగిని అలాగే వేదాలని తీసుకు వెళ్ళాలి అని అనుకుంటాడు. వాటి సహాయంతో తన దేశాన్ని బాగా అభివృద్ధి చేయగలను అని నిర్ణయించుకుంటాడు. అతను అనుకోకుండా ఒక జ్ఞానోదయమైన యోగిని కలుస్తాడు.

అలెగ్జాండర్, యోగీశ్వరుని చూసి చాలా సంతోషపడతాడు. ఆయన దగ్గరకి వెళ్ళి, "దయచేసి మీరు నాతో మా దేశానికి రండి" అని ఆహ్వానించుతాడు. అలెగ్జాండర్ ఆహ్వానానికి యోగీశ్వరుడు నవ్వి, " నేను రాను. నాకు ఎక్కడికి రావాలని లేదు. నేను ఇక్కడే ఉంటాను" అని అంటాడు. అప్పుడు అలెగ్జాండరు, " మీరు అలా అనవద్దు. మీరు మా దేశానికి రండి. మీరు అక్కడికి వస్తే మీకు గొప్ప రాజభవనాన్ని ఇస్తాను. మీరు ఇక్కడ కేవలం ఒక బిక్షగానిలా ఉన్నారు. మీకు కట్టుకోవటానికి సరియైన బట్టలు కూడా లేవు. మీరు మా దేశానికి వస్తే మీకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. దయచేసి నాతో మా దేశానికి రండి" అని అంటాడు.

అప్పుడు యోగి నవ్వి, " నేను రాను. నేను ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఎక్కడికీ వెళ్ళాలని లేదు" అంటాడు.

అప్పుడు ఏమయి ఉంటుందో మీకుతెలుసు : అలెగ్జాండరు ఒక చక్రవర్తి, యోధుడు, బాగా తెలివైనవాడు. అతను ముందుగా యోగికి ఆశలు చూపించి ఆధీనం చేసుకోవాలి అని అనుకుంటాడు. అది పని చేయలేదు ఇప్పుడు భయపెట్టి తనతో తీసుకువెళ్ళాలి అని అనుకుంటాడు. అప్పుడు తన కత్తిని బయటికి తీసి " నీవు నాతో రాకపోతే నిన్ను చంపేస్తాను" అంటాడు అలెగ్జాండరు.

అలెగ్జాండరుని, అతని కత్తిని చూసి మరింత నవ్వుతాడు అయోగి. ఒక మామూలు వ్యక్తి, ఒక సన్యాసి గొప్ప చక్రవర్తిని, అతని కత్తిని చూసి నవ్వటం అంటే సామాన్య విషయం కాదు. రాజు ఏమి చేసినా అడిగేవారు ఉండరు. అయినా సరే ఆ యోగి అతనిని చూసి నవ్వి, అలెగ్జాండరు కళ్ళలోనికి సూటిగా చూస్తూ, " ఓ! తెలివి తక్కువ వాడా! నీవు అబ్దాలకోరివి అంటాడు."

గొప్ప యోధుడయిన అలెగ్జాండరు, జీవితంలో మొదటిసారి భయపడతాడు. అతను యోగిని చూస్తూ, “నీకు భయం వేయటం లేదా?” అని అడుగుతాడు.

అప్పుడు యోగి, “నీవు నన్ను ఎప్పటికీ చంపలేవు. నీవు నా ఈ శరీరాన్ని నాశనం చేయగలవేమో కానీ నన్ను మాత్రం ఏమీ చేయలేవు” అంటాడు.

ఆ యోగికి ఆ ధైర్యం, తనపై తనకి ఆ నమ్మకం అతని అనుభవం ద్వారా వచ్చాయి. ఆధ్యాత్మిక అనుభవం అతనిని ఆ విధంగా నిలబెట్టాయి.

అలెగ్జాండరు ఆశ్చర్యపోతాడు. ఆ యోగీశ్వరుడి వైపు చూస్తూ “నీవు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలిగావు?” అని అడుగుతాడు.

అప్పుడు యోగి అలెగ్జాండర్ని, “నీవు భారతదేశానికి ఎందుకు వచ్చావు” అని అడుగుతాడు. భారతదేశాన్ని జయించటానికి వచ్చాను అని అలెగ్జాండరు జవాబు ఇస్తాడు.

‘ఆ తరువాత ఏమి చేస్తావు’, అని యోగి ప్రశ్నిస్తాడు. మరొక దేశాన్ని జయించుతాను అని జవాబు ఇస్తాడు అలెగ్జాండరు.

“ ఆ తరువాత?” అని అడుగుతాడు యోగి.

“హాయిగా విశ్రాంతిగా ఉంటూ ఆనందంగా ఉంటాను”, అంటాడు అలెగ్జాండరు. అప్పుడు యోగి, “ ఓ తెలివితక్కువ వాడా! నేను ప్రస్తుతం అదే స్థితిలో ఆనందంగా ఉన్నాను” అంటాడు.

అలెగ్జాండరుకి తాను ఎంత మూర్ఖుడినో, ఎంత తెలివిహీనుడో అర్ధమయింది. తాను ప్రపంచాన్ని జయించాడు కానీ అపూర్వపమయిన ఆనందాన్ని, అద్భుతమయిన జీవితాన్ని పోగొట్టుకున్నాను అని తెలుసుకున్నాడు. ఈ రాజ్యాలు, గెలుపు తనతో రావు అని తెలుసుకున్నాడు. అందుకే అతను తన మంత్రులతో ఈ విధంగా చెబుతాడు.

“నేను మరణించాక, నా పార్ధవ శరీరాన్ని తీసుకు వెళ్ళేటప్పుడు నాచేతులు బయటికి పెట్టండి. ప్రజలందరికీ, అలెగ్జాండర్ అంతటివాడు కూడా మరణించాక తనతో ఏమీ తీసుకువెళ్ళటం లేదు అని తెలుసుకోవాలి. ఇది నా కోరిక”.

ఈ కథలో మనకి మూడు విషయాలు అర్ధమవుతాయి. జ్ఞానోదయమయిన యోగీశ్వరులలో ధైర్యం, నమ్మకం స్పష్టంగా కనిపిస్తాయి. ప్రపంచంలోని విషయాల వెనుక పరిగెత్తటం వలన ఉపయోగం లేదు. విశ్రాంతిగా ఉంటూ జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా గడపగలగాలి. ఆ యోగీశ్వరుడికి ఏమీ లేవు కానీ గొప్ప పరమానందంలో ఉంటూ జీవితాన్ని ఉత్సవంలా గడుపుతున్నాడు.

మన ఈ ప్రపంచంలో ఎంత సంపాదించినా, మనతో ఏమీ తీసుకువెళ్ళము. మీ కీర్తి ప్రతిష్ఠలు, ఆస్తి అంతస్తులు ఏవీ మీరు తీసుకువెళ్ళలేరు. ఈ ప్రపంచమంతా మిమ్మలని గొప్ప చక్రవర్తి అని అభిమానించి ఆరాధించినా దానిని మీతో తీసుకువెళ్ళలేరు. మీరు ఖాళీ చేతులతోనే వెళతారు. సంపాదించినది మొత్తం తిరిగి ఆ సర్వాంతర్యామికి వదిలి మరీ వెళతారు.

భగవంతుడికి కృతజ్ఞతతో పూజించాలి, ప్రేమతో దరి చేరాలి.

భగవంతుడు, దేవుడు మరే పేరుతో పిలిచినా సరే, ఆయన సర్వాంతర్యామి. ఆయన విశ్వశక్తి, అత్యుత్తమ అత్యున్నత చేతనస్థితి. ఆ విశ్వశక్తే ప్రతి మనిషిలోనూ ప్రతి ప్రాణిలోనూ జీవశక్తిగా ఉంటుంది. అందుకే ప్రతి ప్రాణి దేవుని రూపమే. భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన మహామ్యేధావి, కరుణామూర్తి ప్రేమమూర్తి.

అటువంటి భగవంతుని మనం భయం, భక్తిపేరుతో దూరం చేసుకోకూడదు. గౌరవం అనే భావంతోఎక్కడో పైన పెట్టి మనం దూరం వెళ్ళి పోకూడదు. ఆయనని కృతజ్ఞతతో, ప్రేమతో పూజించాలి. భగవంతునితో ఉండే బంధుత్వం, సంబంధమే అన్ని సంబంధ బాంధవ్యాలలోనికి ఉత్తమోత్తమయినది. ఆయనే అన్ని రకాల బంధుత్వాలు.

కష్టకాలంలో రక్షణ ఇచ్చే తండ్రి ఆ దేవుడే. మానసికంగా బలహీనులమయినప్పుడు తన ఒడిలో లాలించే తల్లి ప్రేమ ఆ భగవంతుడే. ఒక ప్రేమికునిగా, ఒక ప్రేయసిగా ఆటలాడి ఆనందపరచే ప్రేమశక్తి ఆ దేవదేవుడే. ఒక స్నేహితునిగా ఆదరించినా, గురువుగా మంచిమార్గంలో పెట్టినా, ఆ శక్తి ఆ భగవంతుడే. మనం ఏ బంధుత్వంతో దగ్గరయితే మనని అలా ఆదరిస్తాడు. ఏమీ లేదు! దేవా నావల్లకాదు. నీవే దిక్కు అని ఆయన పాదాల శరణు వేడితే, తన హృదయానికి హత్తుకునే గొప్ప బంధువు, యాజమాని అన్నీ ఆయనే.

కానీ ఆయనని మన నుంచి వేరే చేసే ఒక శక్తివంతమయిన అంశం మనలో ఉన్నది. అదే మనలోని అహంకారం. కొందరిలో అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. కొందరిలో వారికే తెలియకుండా అహంకారం ఉంటుంది. ఎవరైతే అహంకారాన్ని పూర్తిగా త్యజించుతారో, ఎవరిలో అయితే అహంకారం అనేది అసలు ఉండదో, ఎవరైతే అహంకారంలేని పూర్తి అమాయకత్వంతో ఉంటారో వారికి భగవంతుడు చాలా దగ్గర చుట్టము. తెలిసి గాని తెలియక గాని అహంకారంతో ఉండి, ఆ భగవంతునికి ఎన్ని పూజలు, ఎన్ని యాగాలు ఎన్ని అభిషేకాలు చేసినా వ్యర్థం. ఆయన కోసం అహం తప్పా అన్ని సన్యసించి కఠోర తపస్సు చేసినా ఆయనదొరకడు. అందుకే ఆయనని భక్త సులభుడు అంటారు కాని జ్ఞాన సులభుడు అనరు. ఈ విషయాన్ని వివరిస్తూ పరమహంస ఒక చిన్నది చక్కని కథని చెబుతారు.

చిన్నకథ : గోపికలు - రుషులు :

శ్రీ కృష్ణుడు జన్మించి, పెరిగి పెద్దవాడయిన గోకులం అనబడే బృందావనం చాలా అందమయిన పల్లె. అక్కడ గోపాలూరు, గోపికలు అమాయకమయిన పల్లె ప్రజలు. గోవులని మేపుతూ ఆ పాలు పెరుగులే వారి ఆస్తిపాస్తులుగా జీవించే సామాన్యులు.

బృందావనానికి కొంచం దూరంలో ఉండే అరణ్యంలో చాలా మంది రుషుల తపస్సు చేసుకుంటూ నిరంతరం ధ్యానస్థితిలో ఉండేవారు. వారికి అవసరమయిన పళ్ళూ, పాలు గోకులంలోని గోపాలూరు, గోపికలు భక్తితో ఇస్తుండేవారు.

శ్రీకృష్ణుడు జన్మించాక గోకులంలోని స్త్రీ పురుషులకి, పిల్లలకి పెద్దలకి నిరంతరం శ్రీకృష్ణుడు ధ్యాసే ఉండేది. వారు ఏమాత్రం సమయం దొరికినా శ్రీకృష్ణుని సన్నిధికి చేరేవారు. ఆ పరంధాముని సన్నిధిలో, ఆయన సమక్షంలో అంతులేని పరమానందాన్ని పొందేవారు. ఆయన ఉన్న పరిసరాలలో ఉండి, అద్భుతమయిన ఆధ్యాత్మిక అనుభవాలు పొందేవారు. శ్రీకృష్ణుడు చెలిమిలో నిరంతరం ఆనంద పారవశ్యంలో మునిగి ఉండేవారు. వారు కృష్ణుని తప్ప మిగతా విషయాలన్ని మరిచిపోయారు. వారి జీవితం, ధ్యేయం, సుఖం, దుఃఖం, సంతోషం, ఉత్సాహం, సర్వం శ్రీకృష్ణుడే, శ్రీ కృష్ణుని ప్రేమలో, ఆయన ఆటపాటల లీలలలో వారు ప్రపంచాన్నే మరచిపోయారు.

ఈ క్రమంలో రోజులు గడిచే కొద్దీ వారు రుషులకి చేసే మర్యాదలలో లోటు వస్తుండేది. వారు క్రమంగా రుషుల దగ్గరకి వెళ్ళటం తగ్గించారు. గోకుల వాసుల నిర్లక్ష్యం మహా జ్ఞానులు, తపో సంపన్నులు ఆయన రుషులకి కోపం తెప్పించింది.

విషయం ఏమిటో తెలుసుకొని గోపాలురికి, గోపికలకి బుద్ధి చెప్పాలని రుషులు గోకులానికి వస్తారు. వారికి ఎక్కడా జన సమూహాలు కనిపించవు. వారు ఇంకా ముందుకి వెళితే అక్కడ కొంతమంది గోపికలు కనిపిస్తారు.

వారు రుషులని చూడగానే భక్తి మర్యాదలతో వారికి నమస్కరించుతారు. వారి భక్తిని పట్టించుకోకుండా, రుషులు గోకులవాసుల నిర్లక్ష్యానికి వారి ఆగ్రహాన్ని వెల్లడిస్తారు. వారు కోపంతో “మీ గోకులవాసులు మమ్మలని నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు తగిన గౌరవ మర్యాదలని ఇవ్వటం లేదు. మాకు కోపం వస్తే మీరు తగిన ఫలితాలు అనుభవిస్తారు” అని గట్టిగా చెబుతారు.

కాని గోపికలు వారి కోపానికి, వారి మాటలకి అసలు భయపడరు. గోపికల ధైర్యానికి రుషుల ఆశ్చర్యపోతారు. “మేము ఎవరో మా గొప్పదనం ఏమిటో మీకు తెలుసా” అని వారిని హుంకరిస్తూ అడుగుతారు. గోపికలు తెలియదు అంటారు.

“మేము రుషులము. అడవులలో నిరంతరం తపోదీక్షలో ఉంటాము. మేము వేదవేదాంగాలు చదివిన జ్ఞానులం” అంటారు. అప్పుడు గోపికలు వారివైపు ఆశ్చర్యంగా చూస్తూ “మహాత్ములారా! తపస్సు అంటే ఏమి చేస్తారు” అని అమాయకంగా అడుగుతారు.

వారి అమాయకత్వానికి, అజ్ఞానానికి రుషుల జాలిపడి, వారితో ఇలా అంటారు, “మేము నిరంతరం ఆ భగవంతుని ధ్యాసలో ఉంటాము. ఆ దేవదేవుని పాదాలపై ధ్యానం చేస్తుంటాము”.

“అలా ఎందుకు చేస్తారు?” ఇంకా అమాయకంగా ప్రశ్నిస్తారు గోపికలు. గోపికలని చూస్తూ, “అలా తపస్సు చేస్తే భగవంతుడు మాకు దర్శనాన్ని ఇస్తాడు. మాకు ఆత్మసాక్షాత్కారం కలిగించి జ్ఞానోదయమయ్యేలా చేస్తాడు. ఆ భగవదనుగ్రహం కోసం, భగవత్ సాక్షాత్కారం కోసం ఎన్నో జన్మలుగా ఎందరో మునులు తపస్సు చేస్తున్నారు. అయినా లోకజ్ఞానం లేని అమాయకులయిన మీకు ఈవిషయాలు అర్థం కావు. మీ వారందూరా ఎక్కడ. వారికి మేము వచ్చిన విషయం తెలియచేయండి” అంటారు.

“మహాత్ములయిన తపోధనులారా! మీరు భగవంతుని కోసం అరణ్యాలలో తపస్సు చేస్తున్నారు. భగవదనుగ్రహం కోసం ఎన్నో గ్రంథాలు చదివి గొప్ప జ్ఞానాన్ని పొందారు. చాలా గొప్పవిషయం ఇది. కానీ అక్షరజ్ఞానం లేని మా గోకులవాసులం భగవంతునితో ఆడుకుంటున్నాము. మీరు అలా యమునానది ఒడ్డుకి వెళితే అక్కడ భగవంతునితో ఆడుతూ,పాడుతూ, నాట్యాలు చేస్తూ పరమానందపు పారవశ్యంలో మునిగి ఉన్న మా గోకుల వాసులు కనిపిస్తారు. ఆ ఆనంద పారవశ్యంలో మైమరచి మావారు మిమ్మలని గమనించకపోతే దయచేసి క్షమించండి” అంటూ వినయంగా, అమాయకంగా చెబుతారు గోపికలు

ఎవరైతే పరిపూర్ణంగా ఆ భగవంతుని ఆధీనులవుతారో భగవంతుడు వారికి సొంతమవుతాడు. అక్షర జ్ఞానం, లోక జ్ఞానం అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లేని గోకులవాసులకి భగవంతునికి మధ్య నిలబడే జ్ఞానం, హేతువాదం, శాస్త్రీయత, అహంకారం, మేధస్సు ఇలాంటి అడ్డుగోడలు ఉండవు. వారికి సంపూర్ణంగా నమ్మటం సంపూర్ణంగా ఆధీనులై ప్రేమించటమే తెలుసు. అందుకే భగవంతుడు వారితో నాట్యం చేశాడు. పాటలు పాడాడు. చక్కని ఆటలు ఆడుకున్నాడు. గోకులం వారికి కృష్ణుడితో వాదించటం రాదు, ప్రశ్నలు అడగటం తెలియదు. కేవలం ప్రేమించటమే తెలుసు అందుకే వారు ధన్యులు.