KAILASA Library/పూలమామయ్యసీ శ్రీనిత్యానంద చెప్పిన చిన్న కథలో పెద్ద సత్యము/పెద్దలు చెప్పే విషయాలు మన మంచి కొరకే :Sign in
పూలమామయ్యసీ శ్రీనిత్యానంద చెప్పిన చిన్న కథలో పెద్ద సత్యము

పెద్దలు చెప్పే విషయాలు మన మంచి కొరకే :

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

జీవితంలో చాలా దూరం ప్రయాణించి, అందులోని సాధక బాధలని, కష్టాలు, ప్రమాదాలని, మంచి చెడులని తెలుసుకొని ఆ అనుభవంతో పెద్దవారు, గురువులు, తల్లిదండ్రులు పిల్లలకి, జీవితపు ప్రయాణంలో మొదటి మలుపులో ఉన్నవారికి హితవు చెబుతారు. వారు తమ అనుభవం ద్వారా ముళ్ళదారి,పూల బాటలని గుర్తించి మనని మంచి మార్గంలో వెళ్ళమని బోధిస్తారు. వినకపోతే దండిస్తారు. కానీ చిన్నపిల్లలు, యువత వారిని, వారి మాటలని పట్టించుకోకుండా అలా చెప్పేవారిని శత్రువులుగా చూస్తారు. అలా ఎందుకు చేస్తారు?

ఇదంతా కూడా మనలోని మోసపూరితమైన మనస్సు, జిత్తులమారి అహంకారం ఆడే నాటకం. ఎప్పుడయితే మనం మన మనస్సు (ఆలోచనలు), అహం మాట వింటామో అప్పుడు హృదయానికి, ఆ తరువాత మనలోని మన నిజమయిన ఉనికి అయిన ఆత్మకి దూరం అయిపోతాము. ఎప్పుడయితే మనం మన అంతరాత్మకి దూరం అవుతామో అప్పుడు సర్వాంతర్యామి, విశ్వశక్తి అయిన భగవంతునికి కూడా దూరం అయిపోతాము.

అహం అంటే నేను, నాది అనే హద్దులు మాత్రమే. మనస్సు అంటే అర్థం లేని ఒకదానికొకటి ఎటువంటి సంబంధంలేని ఆలోచనలు. ఈ రెండు కలిసి మనని మన అంతరాత్మకి, సర్వాంతర్యామికి మధ్య దూరాన్ని పెంచుతాయి. అవి మన మధ్యకి అద్భుతమయిన హేతువాదాన్ని, శాస్త్రీయతని తీసుకువచ్చి అవి చెప్పేదే నిజం అని నమ్మేలా చేస్తాయి.

మనస్సు, అహం అనేవి మనసొంతం కాదు. అవి నిజమయిన మన ఆత్మకి సంబంధించినవి కాదు, అవి సమాజంచేత, మనలోని భావావేశాలు, కోరికలు వలన తయారుకాబడి, మనకి తెలియకుండా మనలోనే పటిష్టంగా తయారయినవి. వాటినే పరమహంస “నీవు కాని నీవు ” అంటారు. ఇవి పూర్తిగా మన అచేతనస్థితిలోనే పని చేస్తాయి. గురువులు, యోగీశ్వరులు మనకి పదే పదే ఈ విషయాన్ని చెబుతారు, “నీనుంచి నీవు దూరం అయిపోతున్నావు. సమాజం నీపైన వేసిన ముద్రలని నీవు అని భ్రమపడి పొంగిపోతున్నావు లేదా కుంగిపోతున్నావు. అది సరియైన పద్ధతి కాదు.నేను, నాది అనే అహంకారాన్ని వదిలిపెట్టు అది మహా ప్రమాదకరముయినది. నీవు అహంకారాన్ని వదలకపోతే అది నిన్ను ఆధ్యాత్మిక దారిలోకాని, బయట ప్రపంచంలో కాని అభివృద్ధిని సాధించనీయదు.” కానీ మనం వారి మాటలు వినం; విన్నా వారిని నమ్మం.

ఇదంతా ఎలా ఉంటుందంటే, చిన్న పిల్లలు, యువకులు తప్పుదారిలో వెళుతున్నప్పుడు పెద్దలు, తల్లితండ్రులు గురువులు వారిని అలా వెళ్ళవద్దు, అది మీ లక్ష్యాన్ని సాధించిపెట్టే దారికాదు. మీ అసలయిన దారి ఇది అని చెబితే వినరు. పెద్దలు, తల్లిదండ్రులు జీవితప్రయాణంలో చాలా ముందుకు సాగిపోయారు. ఆ దారిలో ఏది మంచిది, ఏది చెడ్డది అనేది వారికి అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి వాళ్ళు ఏ విషయం అయినా సరిగ్గా చెప్పగలరు. కానీ అహంకారంతో అమాయకత్వంతో వారు ఆ విషయాలని వినిపించుకోరు. పాముని పట్టుకుని అదే తాడు అని సంబరపడతారు.

నీవు పట్టుకున్నది ఒక ప్రమాదాన్ని అని పెద్దవారు బలవంతంగా చిన్నవారి చేతిలోని ప్రమాదాన్ని లాగి పారవేస్తానికి ప్రయత్నిస్తే, వారిని స్వార్ధ పరులుగా అనుమానించి వారిని శత్రువులుగా చూస్తారు.

జ్ఞానోదయం పొందిన యోగీశ్వరులు, గురువులు ఎంతో శ్రమలకోర్చి, తపస్సు చేసి కనుగొన్న సత్యాలని మనకి చెబుతారు. వారిలో పొంగి ప్రవహించే కరుణ, ప్రేమ వారిని మన దగ్గరకి పంపించుతాయి. మనకి సహాయపడాలి అని, మనం తెలివితక్కువగా, అమాయకంగా మన చుట్టూ అల్లుకునే సమస్యలు, వ్యధల నుంచి రక్షించాలని, వారు పొందిన పరమానందం మనం కూడా పొందాలనే ఉద్దేశంతో వారు ఇవన్నీ చేస్తున్నారని వారికి పారిపోతాము. ఈ విషయాలని వివరించే సమయంలో పరమహంస నిత్యానంద ఒక చక్కని కథ చెబుతారు.

ఒక అంధుడయిన వ్యక్తి : సాధువు

అది హిమాలయాల ప్రాంతాలలో దట్టంగా మంచు కురిసే ఒక గ్రామం. ఒకరోజు అంధుదయిన ఒక యువకుడు గ్రామం ఉన్న అడవి గుండా నడుస్తూ వస్తున్నాడు. అక్కడ చల్లదనానికి నీరు, అన్నీ గడ్డకట్టుకుపోయి ఉన్నాయి. ఆకులు, కాయలు, కొమ్మలు, రాళ్ళు కూడా మంచుతో గడ్డకట్టుకుపోయి ఉన్నాయి. అలా మంచులో నడచి వస్తున్న గుడ్డివాదయిన యువకుడు ఒక దగ్గర కాలుజారి నేలపై పడతాడు. అప్పుడు అతని చేతి కర్ర జారి లోయలో పడిపోతుంది.

దారి బాగా అలవాటు కాబట్టి లేచి మెల్లగా చేతులతో తడుముకుంటూ గ్రామంవైపు నడుస్తుంటాడు ఆ యువకుడు. అలా కొంచెం దూరం వెళ్ళాక, అకస్మాత్గా అతని చేతులమీద ఒక కర్ర పడుతుంది. దానిని ఒడిసి పట్టుకుంటాడు అది పొడవైన కర్ర.

దానిని పట్టుకుని, “ అమ్మయ్య !నాకు కర్ర దొరికింది. అదృష్టవంతుణ్ణి ! దేవుడే ఈ కర్ర నాకు ఇచ్చాడు,” అని దాని సహాయంతో గబగబా నడుస్తుంటాడు.

కానీ అతని మీద పడినది కర్రకాదు. భయంకరమయిన నాగుపాము. అది మంచులో గడ్డకట్టుకుపోయి కర్రలా ఉన్నది. కానీ ఆ యువకుడు చూడలేదు కాబట్టి దానిని కర్ర అనుకుని దానిని పట్టుకుని నడుస్తుంటాడు అంతలో ఒక సాధువు గ్రామం నుంచి అడవి లోపలికి వెళుతుంటాడు. ఆయన ఆ అంధుడి చేతిలో పాముని చూస్తాడు. వెంటనే ఆ యువకుడితో “అయ్యా !నీవు ఎవరివో కానీ, ముందు నీచేతిలో దానిని పారవేయి. నీవు దానిని కర్ర అనుకుంటున్నావు. కానీ అది పాము. త్వరగా దానిని పారవేయి” అని అరుస్తూ చెబుతాడు.

అప్పుడు ఆ యువకుడు సాధువుతో “నాకు అన్నీ తెలుసు నా చేతిలోనిది కర్రే. నీవు మాట్లాడకుండా నీదారిని వెళ్ళు” అంటాడు కోపంగా.

అప్పుడు సాధువు, “ అయ్యా ! ఓ యువకుడా ! అది పాము మరి కాసేపటిలో సూర్యకిరణాలు బయటకి వస్తాయి. ఆ మంచు కరిగిపోయి, పాము బయటకి వస్తుంది. అది కరిస్తే నీ ప్రాణాలు దక్కవు. అది భయంకరమైన నాగుపాము దానిని దూరంగా పారవేయి అని కొంచెం గట్టిగా చెబుతాడు.

ఈసారి ఆ యువకుడికి చాలా కోపం వస్తుంది. అతనుకూడా చాలా గట్టిగా ఇలా అంటాడు,” బహుశః నీకు ఈ కర్ర అవసరం అయి ఉంటుంది.నేను దీనిని పారవేస్తే , నీవు తీసుకోవాలని అనుకుంటున్నావు. నాకు ఆ మాత్రం తెలియదు అని అనుకోకు. నీలాంటి వారిని చాలా మందిని చూసాను. నీదారిని నీవు నోరుమూసుకొని వెళ్ళు. అనవసరంగా నాజోలికి రావద్దు. నీవు ఎంత అరచినా నేను ఈ కర్రని వదలను” అంటాడు.

అప్పుడు ఆ సాధువు “ ఓ మూర్ఖుడా ! అతిగా ప్రవర్తించి నీప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. నీ మంచి కోరి చెబుతున్నాను. అనవసరంగా చస్తావు ” అంటాడు. ఆ యువకుడు లెక్క చేయకుండా ముందుకి వెళ్ళిపోతుంటాడు.

అప్పుడు సాధువు ఆ యువకుడి మీద జాలితో అతను తనని తిడుతున్నా లెక్కచేయకుండా అతని చేతిలోని పాముని లాగేయటానికి ప్రయత్నిస్తాడు. ఆ యువకుడు కోపంగా ఆ పాముతోనే సాధువుని కొడతాడు. కరుణా, ప్రేమ మాత్రమే తెలిసిన ఆ సాధువు ఆ దెబ్బలను భరిస్తూ పాముని అతని చేతినుంచి లాగి దూరంగా పారవేసి ఆ యువకుడి ప్రాణాలు కాపాడతాడు.

మనందరం కూడా జీవితంలో చాలాసార్లు ఆ యువకుడిలా మూర్ఖంగా ప్రవర్తించుతాము. కానీ మనమీద ఉండే అపారమయిన ప్రేమతో,కరుణతో గురువులు తిరిగి తిరిగి మనకి సహాయం చేయాలనే చూస్తారు. మనకి వారి హస్తాన్ని అందించుతారు. మనం మాత్రం అహంకారంతో అంధులమయిపోయి ఆ చేతిని బలంగా తోసిపారేస్తాము.

పూజ, ప్రార్థన అంటే కృతజ్ఞత చూపటం

మనం ఈ భూమిమీద పుట్టినప్పటినుంచి చనిపోయేవరకూ నిరంతరం ఆ భగవంతుని రక్షణలో ఉంటాము. కానీ ఆ విషయాన్ని మనం ఎప్పుడూ గమనించము. అసలు ఆ ఆలోచన రానీయము. ఎంతవరకూ కూడా కేవలం మన కళ్ళకి కనపడుతూ, మనం కష్టాలలో ఉన్నప్పుడు సహాయం చేసిన వారిని మాత్రం గుర్తించుతాము. మనం అవసరంలొ ఉన్నప్పుడు సహాయం చేసిన వారిని మాత్రం స్మరించుతాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యనేర్పినవారు, సహాయం చేసిన స్నేహితులు, బంధువులు ఇలా అనుకుంటాము కానీ నిరంతరం, కొన్ని వేలసార్లు మనని రక్షిస్తున్న ఆ సర్వాంతర్యామిని, మనం అడగకుండానే అన్ని వరాలని మనమీద వర్షింపచేసే విశ్వశక్తి అయిన భగవంతుణ్ణి మాత్రం గుర్తించం. దేవుడికి అసలు కృతజ్ఞత ఎప్పుడుయినా చెబుతామా?

మీరు ఒకసారి గమనించండి - ప్రార్ధన చేయి లేదా పూజ చేయి అనగానే, 'భగవంతుడా నాకు ఇది కావాలి, అది కావాలి,' అని మొదలు పెడతాం. గుడికి వెళ్ళగానే లేదా దేవుని పటం ముందు నిలబడగానే భగవంతుడా మమ్ములని చల్లగా చూడు, మంచి ఆరోగ్యం ఇవ్వు, మంచి జీవితాన్ని ఇవ్వు, చదువు ఇవ్వు ఇలా ఉంటుంది మన ప్రార్ధన.

అంతేకాదు భగవంతుడు మనకు ఎంత ఇచ్చినా ఇంకా కావాలి.. ఇంకా కావాలి అని మాత్రమే అంటాం. మనకి భగవంతుడు ఇచ్చిన ఎన్నో అపురూపమైన బహుమతులని ఏరోజూ తృప్తిగా చూసుకోము, అవి ఇచ్చినందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పం.

పిల్లలు గుడికి వెళతాం అనగానే ఇది అడుగు, అది అడుగు అని చెబుతామే కానీ,నీకు భగవంతుడు ఎన్నో ఇచ్చాడు మనస్ఫూర్తిగా, ప్రేమతో కృతజ్ఞత చెప్పు అని చెప్పం. అందుకే చిన్నతనం నుంచి మనకి పూజ, ప్రార్ధన అనగానే అడగటం అనేది అలవాటైపోయింది.

మనకి చక్కని శరీరాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు. అందమైన కళ్ళు, ఇలా మహాద్భుతమైనవి ఎన్నో ఇచ్చాడు. సంతోషంగా బ్రతకటానికి అందాల ప్రపంచాన్ని ఇచ్చాడు. మనం నిద్రలేచినది మొదలు, నిద్రపోయేవరకు మన అవసరాలు తీరుస్తూ రక్షణని ఇస్తున్నాడు. కానీ మనం ఏరోజు అయినా భగవంతునికి కృతజ్ఞతలు చెప్పామా?

ఎందుకు మనం నిరంతరం కృతజ్ఞతతో ఉండము? ఎందుకు భగవంతుడు ఎన్ని వరాలు ఇచ్చినా ఇంకా కావాలి. ఆ తరువాత ఏమిటి? ఇంతేనా! అని అనుకుంటాము? అసలు తృప్తి అనేది మనకి లేదా?

ఎందుకు అలా ప్రవర్తిస్తాము అంటే , మనకి ఏది ఇచ్చినా దానిని యధాలాపంగా, చాలా మాములుగా తీసుకుంటాము. అద్భుతమైన ఈ జీవితాన్నే యధాలాపంగా తీసుకుంటాము. అంతే కాకుండా, నాకు అర్హత ఉన్నది కాబట్టి ఇ్వవన్నీ పొందగలుగుతున్నాను అనే భావం కూడా మనలో కృతజ్ఞతని లేకుండా చేస్తుంది. కానీ ఒక్క విషయం అర్ధం చేసుకోము. భగవంతుడు ఇతను/ఆమె నాకు అవసరం లేదు అనుకున్నా మరుక్షణం మనం ఈ ప్రపంచంలో ఉండము. మనం జీవించి ఉన్నాము అంటే, భగవంతుని రక్షణలో ఆయన కోరికపై ఈ భూమిమీద ఉన్నాము అని అర్ధం. అందుకే మనం నిరంతరం కృతజ్ఞతతో ఉండాలి. మనపూజలు, మనప్రార్ధనలు, మన జీవితమే కృతజ్ఞతగా మారాలి. కృతజ్ఞత అనేది ఒక సమాజపు మర్యాదలా ఉండకూడదు. అది మన అంతరాత్మనుంచి, మనహృదయపు లోతుల నుంచి పొంగి ప్రవహించాలి. అలాంటి స్థితిలో మనం మాటల రూపంలో కృతజ్ఞతని వ్యక్తం చేయకపోయినా పర్వాలేదు.

మనం ఏ మత ఆచారాలు పాటించినా పర్వాలేదు. కానీ ఆ ఆచారాలు మనని నిష్కల్మషమయిన ప్రేమతో కృతజ్ఞతతో నింపాలి. మనం చేసే ప్రార్ధన, ప్రేమ కృతజ్ఞతలతో ఉండాలికాని కోరిక, భయంతో కాదు. నాకు ఇది వచ్చింది కాబట్టి దేవుడికి పూజ చేస్తాను. నాకు ఇది రాలేదు కాబట్టి ఇవాళ ప్రార్ధన చేయను అని అంటే అది భక్తి కాదు, కృతజ్ఞత అంతకంటే కాదు. మనకి మంచి జరిగినా చెడు జరిగినా (చెడు అనేది కేవలం మన భాష, మన భావం మాత్రమే) నిరంతరం భగవంతుడికి కృతజ్ఞతని ప్రేమతో తెలియచేయాలి.

ఒక సుఫీ గురువు కథ :

జున్నాద్ అనే ఒక సుఫీ గురువు తన శిష్యులతో కాలినడకన దేశాటన చేస్తూ ఉంటాడు. సుఫీ మతం కృతజ్ఞతతో ఉండే మతం. వారు రోజుకి ఐదుసార్లు భగవంతునికి ప్రార్ధనలు చేస్తారు.

సుఫీ గురువు తన శిష్యులతో ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి, అక్కడ వారు ఇచ్చిన భోజనం తిని ఊరు చివరలో రాత్రికి తిరిగి మర్నాడు మరొక గ్రామానికి వెళుతుంటారు. ఆ విధంగా వారు దేశాటన చేస్తుంటారు.

ఒకసారి ఈ సుఫీ గురువు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళతాడు. ఆ గ్రామ ప్రజలకి సుఫీ మతం గురించి కానీ, సుఫీ గురువుల గురించి కానీ ఏమీ తెలియదు. వీరు మాములుగా బిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఎవరూ వారికి బిక్ష వేయరు. సాయంత్రం వరకూ బిక్షాటన చేసినా తినటానికి ఏమీ దొరకదు. సుఫీ గురువు శిష్యులతో ఆ రాత్రి గ్రామం సరిహద్దులో విశ్రమిస్తాడు. అందరూ ఆకలితోనే పడుకుంటారు. రెండవరోజు వీరంతా ఆ తరువాత ఉన్న గ్రామానికి వెళతారు. ఆ గ్రామంలో వారికి సుఫీమతం అంటే ఇష్టం ఉండదు. దాంతో వారు బిక్షవేయరు సరికదా వీరిని తిట్టి పంపించి వేస్తారు. ఆ రాత్రి కూడా గురువుగారు తన శిష్యులతో గ్రామం బయట ఆకలితోనే నిద్రపోతారు.

మూడవరోజు వారంతా ఆ తరువాత గ్రామంలోనికి వెళతారు. ఆ గ్రామంలో వారు సుఫీ మతం అంటే అసలు ఇష్టం ఉండదు. దాంతో వారు గురువుగారిని, ఆయన శిష్యులని కర్రలతో బెదరించి ఊరు బయటికి తరిమివేస్తారు. అందరూ ఆ గ్రామం దాటి బయటికి వచ్చేస్తారు.

ఆ రోజు రాత్రి ఎప్పటిలాగానే సుఫీ గురువు గుడ్డపరచి, దాని మీద కూర్చొని, ప్రార్ధన చేసి భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేస్తాడు.

ఇదంతా గమనించిన శిష్యులకి చాలా కోపం వస్తుంది. అసలు గురువుగారు దేవుడికి ఎందుకు కృతజ్ఞతలు చెబుతున్నారో వాళ్ళకి అర్ధం కాలేదు. వాళ్ళు కోపంగా గురువు గారితో, “గురుదేవా! మనకి గత మూడు రోజుల నుండి భోజనం లేదు. ఈ రోజు అయితే కర్రలతో కొట్టబోయారు. మనని భయపెట్టి ఊరునుంచి తరిమివేసారు. మనకి ఏమి మంచి జరిగింది అని మీరు దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నారు? మనం ఆకలితో ఉన్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నారా? అని కోపంగా అడుగుతారు.

గురువుగారికి వాళ్ళ కోపం అర్ధమయింది. ఆయన వాళ్ళ వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఇలా అంటాడు. “ మీరు మూడురోజుల ఆకలి గురించి మాట్లాడుతున్నారు. మరి గత ముఫ్ఫై సంవత్సరాలుగా మీరు చేస్తున్న భోజనానికి భగవంతునికి కృతజ్ఞత చెప్పాలి కదా! ఆ విషయం మర్చిపోయారా?”

ఆయన ఇంకా ఇలా అంటాడు “ మీకు ప్రార్ధన అంటే తెలిసింది ఇదే. మీరు ఒక్క విషయం గురించి మాత్రమే ఆలోచించుతారు. అది, ఏమైనా పొందినప్పుడు మాత్రమే కృతజ్ఞత చెప్పాలి అని కానీ నేను భగవంతునికి చెప్పే కృతజ్ఞత అది కాదు. నేను ఎంతో పొందాను అని చెప్పే కృతజ్ఞత కాదు. నా ప్రార్ధన, నా కృతజ్ఞత అనేవి నా అంతరంగపు లోతుల నుంచి పొంగి ప్రవహించే ఆనందం, ప్రేమ. నేను కేవలం వాటిని మాత్రమే వ్యక్తం చేస్తున్నాను. దీనికి ఎంపికలు ఉండవు. కేవలం నా నుంచి పొంగి ప్రవహించే భక్తి, ప్రేమ భావాలే నా ఈ ప్రార్ధన” మీలో కృతజ్ఞతా భావం పొంగి ప్రవహించుతున్నప్పుడు, కృతజ్ఞత తెలియచేయటం అనేది బాధ్యతగా ఉండదు. ఏదో జరిగింది కాబట్టి మర్యాద కోసం చెప్పే మాటలుగా అనిపించదు. అటువంటివారి జీవితమే కృతజ్ఞతతో నిండి ఉంటుంది. అలా కృతజ్ఞత ఉన్నప్పుడు వారు ధ్యానస్థితిలో ఉన్నట్లే. ఎందుకంటే మనం, మన అంతరంగం కృతజ్ఞతతో నిండి ఉన్నట్లయితే మనలో అహంకారం, అదే విధంగా మనస్సు అనే వాటికి స్థానం ఉండదు. ఎప్పుడైతే ఆ రెండూ మనలో ఉండవో మనం ధ్యానస్థితిలో ఉన్నట్లే. అదే మనం చేరగల అత్యున్నతమైన స్థితి.

పూజ, ప్రార్ధన అనేవి ఒక పని కాదు:

మనం భగవంతుడిని ప్రేమతో, భక్తితో ప్రార్ధించాలి. కానీ చాలా మంది దానిని యాంత్రికంగా, అదేదో ఒక డ్యూటీ లేదా బాధ్యత అన్నట్లు చేస్తారు. పూజ అయిపోగానే, హమ్మయ్య అయిపోయిందిలే అని అనుకుంటాము. కొంతమంది గుడిలో విగ్రహానికి బిందెడు పాలతో అభిషేకం చేస్తాం అని అంటారు. కొందరు గుడి చుట్టూ 108 సార్లు 21 రోజులు ప్రదక్షణ చేస్తాం అంటారు. కొందరు, కొన్ని స్తోత్రాలని 10 రోజులు 21 రోజులు లేదా 10,000 సార్లు చదివాము అని అంటారు. ఇవన్నీ దేనికి చేస్తారు. అలా చేయటం వలన వారికి భగవంతుని మీద భక్తి లేదా భయం అనే భావాలు తప్ప వారికి భగవంతునితో సాన్నిహిత్యం ఏర్పడదు. నిజంగా ఆలోచింతే ఇదంతా వ్యాపార వ్యవహారంలా ఉంటుంది.

కొంతమంది పూజకి అన్నీ ఇచ్చి తమ పేరు గోత్రం అడ్రస్ అన్ని చెప్పి వారికి ఏమికావాలో కూడా స్పష్టంగా చెబుతారు. అప్పుడు భగవంతుడు వారికి ఇచ్చే వరాలు కచ్చితంగా ఉండి, వారి కరెక్ట అడ్రస్కి వస్తాయి అని నమ్మకం. అంటే వీరి ఉద్దేశం భగవంతుడికి మనకి ఏమి ఇవ్వాలో, ఏది అవసరమో తెలియదు అని నమ్మకం. భగవంతుడు అంటేనే మేధస్సు. భగవంతునికి తెలియనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. మన గురించి ఈ జన్మ మాత్రమే కాదు, మన పూర్వ జన్మలు, మన రాబోయే జన్మలు దేవుడికి స్పష్టంగా తెలుసు. మన గురించి మనకంటే దేవుడికే బాగా తెలుసు.

కానీ తెలివిగలవాళ్ళం మనమే అనుకునే వారి వ్యవహారాలు, వారి పూజలు, ప్రార్ధనలు ఎంత వ్యాపారంలా ఉంటాయో పరమహంస నిత్యానంద ఒక చిన్న కథలో వివరిస్తారు.

ఒక చిన్న కథ :

దేవుడే వ్యాపారంలో భాగస్వామి అయితే?

ఒక చిన్న పట్టణంలో ముగ్గురు స్నేహితులు ఉంటారు. వారికి చదువు పూర్తయింది. ఏం ఉద్యోగం చేయాలా అని చాలా ఆలోచించుతారు. వారి ఉద్దేశం ఏమిటి అంటే, త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలి. అలా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే వ్యాపారమే సరియైన పద్ధతి అని నిర్ణయించుకుంటారు.

కొంత ఆలోచించి, వాధించి మాట్లాడి చివరిగా ముగ్గురూ వాటాదారులుగా ఉండి వ్యాపారం చేయాలి అని నిర్ణయించుతారు.

అప్పుడు వారిలో ఒక వ్యక్తి “ మనం ముగ్గురం వాటాదారులముంటే బాగుండదు. మనకి మరొక వాటాదారుడు ఉంటే బాగుంటుంది” అని అంటాడు. వారు మరలా చాలా తర్జన భర్జన పడతారు. వారికి ఏకాభిప్రాయం కుదరదు. చివరికి వారిలో రెండో వ్యక్తి ఇలా అంటాడు “మనకి బయట వ్యక్తులు ఎవరూ వద్దు. మనం ముగ్గురం, నాలుగవ భాగస్వామిగా దేవుడిని పెట్టుకుందాము. అప్పుడు మనకి ఎవరితో గొడవలు ఉండవు, దేవుడే మన భాగస్వామి కాబట్టి మన వ్యాపారం చాలా బాగుంటుంది” అని అంటాడు.

మిగిలిన ఇద్దరూ చాలా సంతోషపడతారు. అప్పుడు వారిలో మూడవ వ్యక్తి “ఇది చాలా మంచి సలహా మనం దేవుడికి కూడా మన లాభాలలో కొంత భాగం ఇద్దాము” అంటాడు

అందరూ ఒప్పుకుంటారు. ఆ ముగ్గురు స్నేహితులు, దేవుడిని కూడా భాగస్వామిగా చేసి, చాలా ధైర్యంగా వ్యాపారం మొదలు పెడతారు. సంవత్సరం అయ్యేటప్పటికి వారికి చాలా లాభాలు వస్తాయి. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. సంవత్సరం చివరిలో అందరూ లాభాలు పంచుకొనే సమయం వస్తుంది. ఇప్పుడు అసలు సమస్య ప్రారంభమవుతుంది. సమస్య ఏమిటి అంటే దేవుడికి లాభాలలో వాటా ఎంత ఇవ్వాలి, అది ఎలా నిర్ణయించాలి. వారికి లాభాలు చూస్తే చాలా ఎక్కువగా వచ్చాయి.

స్నేహితులు చాలా సేపు ఆలోచించి చాలా మార్గాలని పద్ధతులని చర్చించుతారు. చివరిగా మొదటి వ్యక్తి ఇలా అంటాడు. “సరే, నేను ఒక పద్ధతి చెబుతాను. ఇక్కడ ఒక సర్కిల్ గీద్దాము. మనకి వచ్చిన డబ్బు అంతా దాని మీద పోద్దాము. ఆ సున్నాలో పడిన డబ్బు దేవుడికి ఇద్దాము. బయటపడిన డబ్బు మనం పంచుకుందాము” ఈ సలహా మిగతా ఇద్దరికీ అంతగా నచ్చదు. వాళ్ళు ఏం మాట్లాడరు.

అప్పుడు రెండవ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా అంటాడు “ ఒక పెద్ద వృత్తాన్ని గీద్దాము. మనకి వచ్చిన డబ్బుని అందులో వేద్దాము. వృత్తం లోపల పడిన డబ్బు మనం తీసుకుందాము. బయటపడిన డబ్బు దేవుడికి ఇద్దాము”, అంటాడు. ఆ సలహా కూడా అంతగా నచ్చదు వాళ్ళకి.

అప్పుడు మూడవ వ్యక్తి, “నేనొక సలహా ఇస్తాను. ముందు నామాట వినండి. భగవంతుడు ఎక్కడ ఉంటాడు. పైన ఉంటాడు కదా. మనం డబ్బు మొత్తం పైకి విసురుదాము. దేవుడు తనకు ఎంత డబ్బు కావాలో అంత తీసుకొని మిగతాది మనకి ఇస్తాడు. అలా క్రింద పడిన డబ్బు మనం పంచుకుందాం అంటాడు.

ఈ సలహా అందరికీ నచ్చుతుంది.

మనం ఇలానే ప్రవర్తిస్తాము. భగవంతుడిని వరాలు అడిగే సమయంలో నేను కోరుకున్నది జరిగితే నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెబుతాము. కోరిక తీరగానే దేవుడిని మర్చిపోతాం. తిరిగి ఇంకొక కోరిక రాగానే మళ్ళీ దేవుడితో బేరాలు మొదలు పెడతాము. ఇది మనం చూపించే భక్తి. అందుకే అంటాను, భక్తి అంటే కృతజ్ఞతా, ప్రేమా అంటే కాని వ్యవహారాలు కాదు. దానిని భక్తి అనరు.