KAILASA Library/పూలమామయ్యసీ శ్రీనిత్యానంద చెప్పిన చిన్న కథలో పెద్ద సత్యము/శుక మహర్షి జీవితం నుంచి ఒక చిన్న సంఘటన :Sign in
పూలమామయ్యసీ శ్రీనిత్యానంద చెప్పిన చిన్న కథలో పెద్ద సత్యము

శుక మహర్షి జీవితం నుంచి ఒక చిన్న సంఘటన :

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

శుక మహర్షి గొప్ప యోగీశ్వరుడు అత్యంత ప్రతిభ గల మహర్షి. ఆయన మహా మేధావి, ఈ ప్రపంచంలోనే పేరెన్నిక కలిగి ఎన్నదగిన మహా జ్ఞాని కుమారుడయిన శుకుడు తండ్రి దగ్గర విద్యాభ్యాసం చేసి శాస్త్రాలు కావ్యాలు అన్నీ నేర్చుకుంటాడు.

ఒకరోజు వ్యాసమహర్షి శుకుని పిలిచి, “నేను నీకు నేర్పించవలసిన విద్యలు, బోధించవలసిన సత్యాలు చెప్పాను. ఇప్పుడు నీవు జనకమహారాజు దగ్గరికి వెళ్ళు” అంటాడు

జనక మహారాజు మిధిలా దేశానికి రాజు. ఆయన గొప్ప మహారాజు, కానీ అంతకంటే గొప్ప యోగీశ్వరుడు, రాజరుషి. ఆయనకి విదేహ అనే పేరు ఉన్నది. విదేహ అంటే శరీరం లేనివాడు. అంటే ఆయన తన శరీరం తనుకాదు అని తెలుసుకున్న జ్ఞానమూర్తి. ఆయన అష్టైశ్వర్యాలలో తులతూగే దేశానికి రాజు అయికూడా, ఈ ప్రాపంచిక విషయాలు అంటకుండా, వాటితో ఏమాత్రం చలించకుండా ఉండగలిగే ఆధ్యాత్మిక యోగీశ్వరుడు. ఆయన తనలోని తన నిజమయిన ఉనికిలో స్థిరపడిన వ్యక్తి. ఎవరయితే వారిలోని నిజమయిన ఉనికిలో, ఆత్మలో స్థిరపడగలరో, వారిలోనే వారి ఏకాగ్రతని నిలపగలరో అటువంటివారిని బయట ప్రపంచం యొక్క వస్తువులు, వ్యక్తులు ప్రభావితం చేయలేవు. వారు నిరంతరం మహాదానందంలో ఉంటారు. అందుకే వ్యాసుడు తన కుమారుడు శుకుని జనకమహారాజు దగ్గరికి పంపించుతాడు.

జనక మహారాజుకి శుకుడు వస్తున్న విషయం తెలుస్తుంది. అతనికి స్వాగతం చెప్పటానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు. మంత్రులకి ఆ బాధ్యతలు అప్పగించుతాడు. ఒకరోజు శుకుడు జనకమహారాజు భవనం దగ్గరకి చేరుకుంటాడు. ఆయన రాజభవన ద్వారం దగ్గరకి వస్తాడు కాని ద్వారపాలకులు ఆయనని గుర్తించరు. శుకుడు విశిష్టమయిన పేరు ప్రఖ్యాతులుగల మహాజ్ఞాని వ్యాసుడి కుమారుడు అయినా ఏమీ మాట్లాడకుండా ఆ ద్వారం దగ్గర మూడు రోజులు కూర్చుంటాడు. కానీ ఎవరూ కూడా అతనిని పట్టించుకోరు. అలా మూడురోజులు గడిచాక, జనకుని మంత్రులకి శుకుడు వచ్చిన విషయం తెలుస్తుంది. శుకుడు భవనం బయట ఎదురు చూస్తున్నట్లు తెలుసుకుని పరుగు పరుగున ద్వారం దగ్గరికి వస్తారు.

వారు ద్వారం దగ్గర ఎదురు చూస్తున్న శుకుని అత్యంత గౌరవ మర్యాదలతో సకల రాజ లాంచనాలతో రాజ భవనంలోనికి తీసుకు వెళతారు. ఆయనకి వైభవపేతమయిన భవనాన్ని ఇస్తారు. అద్భుతమయిన రాజరికపు భోజనాన్ని ఇస్తారు. అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు. భయభక్తులతో మర్యాదలు చేస్తారు.

శుకుని గమనించిచే ఆయనలో ఎటువంటి మార్పు కనిపించడు. ఆయనకి మూడురోజులు రాజభవనం బయట ఎదురు చూసే విధంగా ఏమాత్రం గౌరవం భక్తి లేకుండా రాజభవనం వారు ప్రవర్తించినప్పుడు ఆయనలో అదే ప్రశాంతత, నిశ్చలత ఉన్నాయి. ఆయనని అత్యంత గౌరవమర్యాదలతో, రాజలాంఛనాలతో సత్కరించినప్పుడూ అదే ప్రశాంతత, అదే నిశ్చలత ఉన్నాయి. ముఖంలో ఎప్పుడూ చెదరని చిరునవ్వు అన్ని సమయాలలో ఒకే విధంగా ఉన్నది. దీనినే ప్రపంచంలో ఉంటూ ప్రపంచ విషయాలు అంటకుండా జీవించగలగటం అంటారు. తరువాత శుకుని జనకుడు ఉన్న రాజసభకి తీసుకువెళతారు. జనకుడు సింహాసనం మీద కూర్చోని ఉంటాడు. సభలో సంగీత,నాట్య కార్యక్రమాలు చాలా అట్టహాసంగా జరుగుతూ ఉంటాయి. సభలోని వారు అందరూ ఆ అట్టహాసంలో, హోరున వినిపించే సంగీత నాట్యాలలో మునిగిపోయి ఉంటారు.

అక్కడకి వచ్చిన శుకుడికి జనకుడు నిండుగా పాలను నింపిన పాత్రని ఇచ్చి, ఆపాత్రని పట్టుకొని సభచుట్టూ ఏడుసార్లు తిరగాలి, తిరిగే సమయంలో పాత్రలోని పాలు తొణకి వలక కూడదు అని చెబుతాడు.

శుకుడు ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఆ పాత్రని తీసుకొని సభచుట్టూ తిరగటం ప్రారంభిస్తాడు. అదే సభలో ఎంతో అందమైన నాట్యాలు, ఆహ్లాదమైన సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి చాలా ఆకర్షణగా ఉన్నాయి. అటువంటి అట్టహాసల మధ్య, ఆకర్షణల మధ్య శుకుడు పాలు ఉన్న పాత్రతో సభచుట్టూ ఏడుసార్లు తిరిగాడు. ఈ అట్టహాసాలు ఆ యువ రుషి నిశ్చలతని ఏమాత్రం భంగపరచలేక పోయాయి.

పాలు ఉన్న పాత్రని తిరిగి జనకుని అప్పచెబుతాడు శుకుడు. అప్పుడు శుకుని చూస్తూ జనకుడు, “మీ తండ్రిగారు మీకు నేర్పించిన సత్యాలనే నేను తిరిగి చెప్పాను. నీవు ఏ సత్యాలనైతే సంపూర్ణంగా తెలుసుకోగలిగావో వాటినే నేను మీకు చూపించాను.మీకు తెలియవలసినదంతా తెలుసుకున్నావు. కుమారా! ఇక నీవు ఇంటికి వెళ్ళవచ్చు ” అని చెప్పి శుకుని ఆశీర్వదించి పంపిస్తాడు రాజరుషి జనకుడు.

శుకుడు ఈ ప్రపంచంలో ఏ విషయాల వలన ప్రభావితుడు కాలేదు. ఆ విధంగా ఉండాలి అనేది అతని నిర్ణయం. మనం చేసే ప్రతి పనిని మనమే ఎంచుకుంటాము. అది కేవలం మన నిర్ణయమే. ఉదాహరణకి మిమ్ములని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళమీద కోపం చూపించాలా వద్దా అనేది మీ నిర్ణయం. అసలు మీకు కోపం కూడా రాదు. అటువంటి స్థితిలో ఎంతమంది మిమ్ములని రెచ్చకోట్టినా మీరు నిశ్చలంగా ఉండిపోగలుగుతారు. ఒకవేళ వారిపైన కోపం చూపించినా దాని ప్రభావం మీ మీద అసలు ఉండదు. ఆ స్థితిని సాధించాలి అంటే సాధనతో సాధ్యమవుతుంది. ధ్యానం చేస్తే అది మిమ్ములని ఆ స్థితికి చేరే విధంగా సహాయం చేస్తుంది.

తగిన మోతాదులో ఉంటే కోపం గొప్ప శక్తి

కోపం మరొక మోసపూరితమైన భావావేశము. కోపం అనేది చాలా చిన్న విషయం కానీ అత్యంత ప్రమాదకరమైనది కూడా, ఎందుకంటే మనకి కోపం వచ్చినప్పుడు, ఆ ఆవేశం మనని తన ఆధీనంలోనికి తీసేసుకుంటుంది. మన ఆధీనంలో ఉండి మనం చెప్పినట్టు వినవలసిన ఆవేశం, మనని తన వశం చేసుకుని మనం ఏంచేస్తున్నామో స్పృహ లేకుండా చేస్తుంది. అందుకే అంటారు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నో నాకు తెలియదు అని. కోపం అంటే ఒక సంఘటనకి కాని, వ్యక్తుల వలన కలిగిన సంఘటనకి కానీ మననుంచి వచ్చే స్పందన మాత్రమే. ఎందుకు కోపం వస్తుంది? కోపంలో ఎందుకు అంత అతిగా ప్రవర్తించుతాము? చిన్న విషయానికే ఎందుకు అంత కోపం తెచ్చుకుంటాము?

ఫై ప్రశ్నలన్నింటికి పరమహంస నిత్యానంద ఒక చక్కని వివరణని ఇస్తారు. మనకి కోపం కలిగినప్పుడు రెండు విషయాలు జరగాలి. మొదటిది కోపాన్ని ప్రదర్శించటం. సమాజపు మర్యాద పాటించటానికి గాని లేదా మన ఉద్యోగ ధర్మం వలన కాని లేదా కుటుంబసమస్యలు వస్తాయి అనే భయంతో కానీ మనం చాలాసార్లు కోపాన్ని చూపించం. కోపం చూపిస్తే ఉద్యోగం పోవచ్చు లేదా ఇంకా గొడవలు ఎక్కువ అయిపోవచ్చు కాబట్టి కోపాన్ని ఎదుటివారిమీద చూపించలేము. అదే విధంగా కోపాన్ని అణచకూడదు. అలా అణచివేస్తే, అది మనలోపల శారీరక, మానసిక వ్యాధిలా మారిపోతుంది.

అసలు మనకి అంత త్వరగా కోపం ఎందుకు వస్తుంది?

మనం చిన్నతనం నుంచి మనలోని కోపం, ద్వేషం, అవమానం ఇటువంటి భావాలని అణచివేస్తాము. అవన్నీ కూడా మనలోపల పేరుకుని పోతాయి. అవి ఒక అగ్నిపర్వతంలా తయారవుతాయి. మనం సమాజమర్యాద కోసం లేదా మరొక కారణంతో ఆ అగ్నిపర్వతానికి మూత పెట్టి దానిమీద కూర్చుంటాము. అది లోపల రగులుతూ ఉంటుంది. అది ఎప్పుడయినా ఏచిన్న రాపిడి జరిగినా బళ్ళున బ్రద్దలయ్యి అందరికీ అశాంతిని తెస్తుంది. అందుకే మనం నడిచేటప్పుడు ఎవరయినా మనకి తగిలారనుకోండి లేదా సైకిల్ తగిలిందనుకోండి, మనకి పెద్దగా దెబ్బలు తగలవు కానీ మనం దానిని కారణంగా చూపించి చాలా గొడవ చేస్తాము. చిన్న విషయానికే అంత పెద్దగొడవ ఎందుకు చేస్తామంటే దానికి కారణం మనలో అణచివేయబడిన కోపం మొదలయిన భావాల వలన.

ఈ రోజు ప్రపంచంలో ఇంత హింస జరగటానికి కూడా అదే కారణం. దీనివలన కోపం చూపే వ్యక్తి, దానికి బలి అయిన వ్యక్తి ఇద్దరూ బాధపడతారు. ఇద్దరూ అశాంతితో ఉంటారు. తిరిగి ఆ అశాంతి మరింత అశాంతిని సృష్టిస్తుంది.

కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలి :

మీరు కోపాన్ని అణచుకోవద్దు, అలా అని అతిగా వ్యక్తం చేయవద్దు. మీకు కోపం వచ్చినప్పుడు దానిని జాగ్రత్తగా గమనించండి. ఆకోపాన్ని చేతన స్థితిలో పరిశీలించండి. అప్పుడు మీకు కోపం అసలు రూపం తెలుస్తుంది. ఎంతకోపాన్ని ప్రదర్శించాలో అర్ధమవుతుంది. అప్పుడు మనం అంతే కోపాన్ని చూపించుతాము. అప్పుడు ఎదుటి వ్యక్తిపైన మన కోపాన్ని చూపించాక మనకి అపరాధ భావం ఉండదు. ఎదుటి వ్యక్తిలో మార్పు వస్తుందే కానీ అతను బాధపడడు.

అదే విధంగా కోపం, ద్వేషం మొదలయినవి మనిని ప్రభావితం చేయకుండా ఉండే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. ఆ స్థితిని ధ్యానం ద్వారా సాధించవచ్చు. కోపం అనే భావన మనలోనికి వచ్చినప్పుడు ఒక్కసారి చేతన స్థితిలో అది ఎందుకు వచ్చినది అనే విషయాన్ని అర్ధం చేసుకోవాలి. అప్పుడు అసలు అది నిజమయిన కోపమా లేక మరొక భావన ఆ రూపంలో వచ్చినదా అనే విషయం మనకి అర్ధమవుతుంది.

మీరు ఎప్పుడయినా కోపం వలన ప్రభావితమయ్యి, 'అయ్యో ఎందుకు అలా చేసాను', అని అనుకుంటే మీరు కోపాన్ని అచేతనస్థితిలో చూపించారు అని అర్ధం. అదే విధంగా, కోపం మీ నిశ్చలతని, మీ ప్రశాంతతని పాడు చేస్తే మీరు కోపాన్ని తెలుసుకునే తత్వంతో పరిశీలించలేదు అని అర్థం. అటుంటప్పుడు మీరు కోపానికి బానిస అవుతారు. కోపం అనే భావన మిమ్ములని తన ఆధీనంలోనికి తీసుకుంటుంది.

సాధువు - పాము కథ

ఒక గ్రామంలోనికి కొత్తగా ఒక నాగుపాము వస్తుంది. అది ప్రజలని భయభ్రాంతులని చేస్తూ, వారి జీవితాలలో ప్రశాంతత లేకుండా చేస్తుంది. గ్రామ ప్రజలు స్వేచ్ఛగా తమ పనులు చేసుకోలేకపోతుంటారు. నిరంతరం భయంతో జీవిస్తు ఉంటారు. వారు ఎంత ప్రయత్నించినా ఆ పాముని ఏమి చేయలేక పోతారు.

ఇలా కొంతకాలం గడిచాక ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. ఆయన హిమాలయాలలో తపస్సు చేసుకొని దేశ పర్యటన చేస్తూ ఆ గ్రామానికి వస్తాడు. తపస్సు చేసే యోగులకి జంతువుల భాష తెలుస్తుంది. అని ఎవరో ఆగ్రామస్తులకి చెబుతారు. అవిషయం తెలుసుకున్న గ్రామస్తులు ఊరు చివర ఉన్న యోగి దగ్గరకి వెళతారు.

భయంతో అక్కడ నిలబడిన గ్రామస్తులని చూసి ఆ యోగి, "అయ్యా మీరు ఎవరు? ఎందుకు అలా భయపడుతున్నారు?" అని ఎంతో ప్రేమగా లాలనగా అడుగుతాడు.

అప్పుడు వాళ్ళు ఆయన కాళ్ళమీద పడి "స్వామీ! మేము ఈ గ్రామ పెద్దలము. మా ఊరిలోనికి ఒక నాగుపాము వచ్చి మమ్ములని భయభ్రాంతులని చేస్తుంది. మా జీవితాలని అల్లకల్లోలం చేస్తుంది. మీకు జంతువుల భాష తెలుసు అని విన్నాము మామీద దయ చూపించి, ఆ పాము వలన మాకు బాధలు లేకుండా చూడండి. మమ్ములని కాపాడండి" అని దీనంగా అడుగుతారు.

"తప్పకుండా! నేను ఆ పాముతో మాట్లాడి, అది మీ జోలికి రాకుండా చూస్తాను. మీరు ధైర్యంగా మీ పనులు చేసుకోండి, ఇక నిశ్చింతగా ఉండండి" అని వారికి చెప్పి వెనక్కి పంపించి వేస్తాడు.

ఆ తరువాత ఆ సాధువు పామును కలిసి దానితో మాట్లాడి చివరగా " ఓ స్నేహితుడా! అమాయకులయిన గ్రామస్తులని హింసించవద్దు నామాట విని, వారిని వదిలి వేయి" అని అంటాడు.

సాధువు మీద ఉండే అపారమయిన గౌరవంతో నాగుపాము ఆ సాధువుకి సరే అని మాట ఇస్తుంది. గ్రామస్తుల జోలికి వెళ్ళను అని ప్రమాణం చేస్తుంది.

కొంతకాలమయ్యాక ఆ సాధువు తిరిగి హిమాలయాలకి వెళ్ళిపోతూ అదే గ్రామానికి వస్తాడు. ఆ గ్రామం సరిహద్దుల దగ్గరకి రాగానే సాధువుకి అతని స్నేహితుడయిన నాగుపాము కనిపిస్తుంది. నాగుపాము పరిస్థితి అతి దయనీయంగా ఉంటుంది. అది గాయాలతో రక్తం కారుతూ బాధపడుతూ చనిపోయే స్థితిలో ఉంటుంది. పాముని ఆస్థితిలో చూసిన సాధువు ఆశ్చర్యపోతాడు, చాలా బాధపడతాడు. ఆయన పాము దగ్గరకి వచ్చి, " స్నేహితుడా! నీకు ఏమయింది? ఎందుకు ఇంత దీన స్థితిలో ఉన్నావు. ఎందుకు నీకు ఇన్ని దెబ్బలు తగిలాయి” అని అడుగుతాడు.

దానికి ఆపాము, “ ఓ!సాధువా! ఇదంతా నీవలనే జరిగింది” అంటుంది నిష్ఠూరంగా.

“అసలు ఏమిజరిగిందో చెప్పు” అంటాడు సాధువు “నేను గ్రామస్థుల జోలికి వెళ్ళను అని నీకు ప్రమాణం చేశాను కదా! నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వరకూ నేను వారిని ఏమీ అనకుండా, నీమాట ప్రకారం నడుచుకుంటున్నాను. కానీ ఈ గ్రామస్థులు నేను ఇచ్చిన మాటని అలుసుగా తీసుకుని నన్ను హింసిస్తున్నారు. ఇదివరకు గ్రామస్థులు నన్ను చూసి భయపడి పారిపోయేవారు. ఇప్పుడు నా మంచితనాన్ని నా బలహీనతగా అనుకుని నన్ను చిత్రహింసలు పెడుతున్నారు. నేను వారిని కాటు వేయను అని తెలుసుకొని నన్ను కొట్టి బాధ పెడుతున్నారు. చూడు నాపరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో! చూస్తే నీకే అర్థమవుతుంది.” అని బాధపడుతూ చెబుతుంది నాగుపాము.

పాము చెప్పినదంతా విన్న సాధువుకి ఆ పాము అమాయకత్వం చూస్తే జాలి అనిపిస్తుంది. “అయ్యో ! అమాయకపు స్నేహితుడా !నేను నిన్ను ప్రజలని కాటువేయోద్దు అని చెప్పాను కానీ బుసకొట్టవద్దు అనలేదుగా. నీవు వారిని భయపెట్టు కానీ కాటువేసి ప్రాణం తీయవద్దు” అని హితవు చెబుతాడు సాధువు.

మీరు కోపాన్ని చూపించవచ్చు కానీ దానిని సరియైన పద్ధతిలో, తగిన మోతాదులో మాత్రమే చూపించాలి. అలా చేయగలిగినప్పుడు మీ కోపం మీకు మంచి చేస్తుంది, ఎదుటి వారికి మంచి చేస్తుంది.

కోపం గురించి తెలుసుకుంటే కోపం తగ్గుతుంది. దానిని సరియైన పద్ధతిలో ఉపయోగించితే అది గొప్ప శక్తిగా మారి అందరికీ మంచి చేస్తుంది.