మీ ఆలోచనల మీద పనిచేయండి :
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమయిన పాత్ర పోషించే భాగం ఆలోచనలు. అవి మనలో నిరంతరం ఒక ప్రవాహంలా వస్తూనే ఉంటాయి. బహుశః మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి నేటి వరకు కనీసం ఒక క్షణమయినా ఆ ఆలోచనలు లేకుండా జీవితం ఉండి ఉండదు. నిద్రలో కూడా ఆలోచనలు కలల రూపంలో వస్తుంటాయి. ఈ ఆలోచనలన్నీ ఒక వ్యవస్థగా ఏర్పడితే దానినే మనస్సు లేదా మైండ్ అంటాము. అదే మన మానసిక స్థితిని తెలియచేస్తుంది.
ఆలోచనలు అంటే ఏమిటి?
ఈ ప్రశ్నకు పరమహంస ఒక చక్కని పరిశోధనా నివేదిక లాంటి శాస్త్రీయ వివరణ ఇస్తారు. ఆయన ఆలోచనల గురించి చాలా ప్రవచనాలలో ఎంతో అద్భుతంగా వివరించారు. ఆయన ఇచ్చిన వివరణ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని విషయాలు మనని నిర్ఘాంతపోయేలా చేస్తాయి. పరమహంస ఆలోచనలని గురించి చెప్పిన విషయాలు బహుశః మనం ఎక్కడా విని ఉండం లేదా ఎక్కడా చదివి ఉండము. స్వామీజీ ఆలోచనలని గురించి ఈ విధంగా చెబుతారు. ఆలోచనల మనలో మనం మాట్లాడుకునే మాటలే :
ప్రతి వ్యక్తి నిరంతరం తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. పైకి నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తి నిజానికి నిశ్శబ్దంగా ఉండరు. వారి అంతరంగంలో మాటల ప్రవాహం వెళుతూ ఉంటుంది. అది అర్ధం లేని, కారణం లేని, ఎటువంటి సంబంధంలేని మాటల రాసులు మాత్రమే. ఒక్క ఐదు నిమిషాలు మీ అంతరంగంలో అనుకునే మాటలు పైకి అనండి. మీ మాటలు మీరు విని ఎంత సిగ్గుపడతారో చూడండి. ఆ మాటలే ఆలోచనలు. ఒక్కొక్కసారి ఆ మాటల హింస నుంచి తప్పించుకోవడానికే మీరు బయట ప్రపంచంలో ఎవరో ఒకరిలో మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఈ ప్రపంచంలో ఇంత ఎక్కువగా మాటల సంభాషణలు జరుగుతుంటాయి.
ప్రతి ఆలోచనా స్వతంత్రమైనది :
మనలో జనించే ప్రతి ఆలోచనా స్వతంత్రమైనవి. వాటికి ఒకదానితో మరొకదానిని ఎటువంటి సంబంధం ఉండవు. అవి అలా వస్తూవుంటాయి పోతుంటాయి. వాటికి ఇప్పటి పరిస్థితికీ ఏమీ సంబంధం ఉండదు. వాటికి అర్థం ఉండదు, ఒక లక్ష్యం ఉండదు. అవి చెరువులోని గాలి బుడగలు లాగా పుడతాయి, మరొక ఆలోచన రాగానే మాయం అయిపోతాయి. అయితే ఇంత వరకూ పరవాలేదు కానీ మనం ఏమి చేస్తాం. అర్థం లేని, స్వతంత్రమైన ప్రతి ఆలోచన ఒకదానితో ఒకదానికి ఏదో విధమైన సంబంధాన్ని ఏర్పరచి, ఒకదానితో మరొకదానికి లింకులు ఏర్పాటు చేసి వాటినన్నింటినీ కలిపి ఒక చైనులా లేదా ఒక ఇరుసులా తయారు చేస్తాం. ఇప్పుడు దీని ఆధారంగా మనం ఎలా ఉండాలి అని నిర్ణయాలు చేస్తాం. ఇది ఎంత విచిత్రమో చూడండి. అసల అర్థం లేని పిచ్చిమాటలని ఒక వ్యవస్థలా ఏర్పరచి, దానిని మనం నమ్ముతాము. దాని మీద మన విశ్వాసాన్ని వుంచి, మన జీవితాన్ని ఆ వ్యవస్థకి అప్పచెబుతాము. ఎందుకంటే మనం కల్పించిన అర్థం లేని ఈ వ్యవస్థ మన నియంత్రణలో ఉండదు. మనం, మన జీవితం దాని నియంత్రణలో ఉంటాయి. మనం ఈ ఆలోచనా వ్యవస్థ ఎలా చెబితే అలా జీవిస్తాము. దాని మనం అంత శక్తిని ఇస్తాము.