KAILASA Library/ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?/ధ్యానం ఈ స్థితిలో ఏవిధంగా సహాయం చేస్తుంది?Sign in
ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?

ధ్యానం ఈ స్థితిలో ఏవిధంగా సహాయం చేస్తుంది?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

ఈ బలమైన రాతి గోడలని కూల్చగల అత్యంత శక్తిగల ఆయుధమే ధ్యానం. పదునైన ఈ ఆయుధాన్ని మీరు నమ్ముకుంటే, ఆ మార్గంలో వెళ్ళగలిగితే మీకు మీ నిజమైన ఉనికిని మధ్య నిర్మించబడిన గోడలన్నీ, సూర్యరశ్మి తగిలిన మంచుపొరలు కరిగినట్టుగా కరిగిపోతాయి. ధ్యానం ఆ గోడలని ఎటువంటి ఆనవాలు లేకుండా కరిగించి మిమ్మలని నేరుగా మీ ఉనికి దగ్గరికి తీసుకువెళుతుంది. ఎప్పుడయితే మిమ్మలని మీరు తెలుసుకుంటారో శాశ్వతమైన పరమానందం మీ స్వంతమవుతుంది. ఒక్కసారి ఆ పరమానంద స్థితిలో స్థిరపడితే ఈ ప్రపంచంలోని ఏ విషయం మిమ్మలని కదిలించలేదు. ప్రపంచవిషయాలు, సమాజం, దాని నిబంధనలు అనే సంకెళ్ళు వాటంతట అవే తెగిపోయి మీరు స్వేచ్ఛా జీవిగా బయటికి వస్తారు. అప్పుడు మీలో ప్రవహించే పరమానందపు వెల్లువు మీ చుట్టు ప్రక్కలకి వ్యాపించి మీరు ఉన్న పరిసరాలలో ఆ ఆనందపు సుమధుర పరిమళాల తరంగాలు వెదజల్లుతాయి. అప్పుడు ఆ పరిసరాలలోని వారు ఆ పరిమాళాలు ఆనందపు అనుభూతులని పొందటం తప్ప వారికి మరొకదారి ఉండదు. ఈ కారణం వలననే జ్ఞానోదయమయిన గురువులు యోగులు సమక్షంలో మనం అంత ఆనందంగా, ఆహ్లాదంగా ఉండగలం.

కాబట్టి పరమహంస నిత్యానంద స్వామి చెప్పినట్టుగా ధ్యానం మనని మన అంతరంగంలోనికి తీసుకువెళ్ళి మన అసలయిన ఉనికిని, మన ఆత్మని చూపిం చుతుంది. మనం మన ఆత్మతో పొందే ఆ సంయోగాన్నే ఆత్మసాక్షాత్కారం అంటాము. దానినే మనని మనం తెలుసుకోవటం అని అంటాము. ఆత్మసాక్షాత్కారం పొందినవారికి జ్ఞానోదయం అవుతుంది. అంతేకాకుండా ఆ జ్ఞానోదయపు స్థితిలో వారు స్థిరపడగల శక్తి కూడా వారికి వస్తుంది.

ధ్యానం మనలోని శక్తి కేంద్రాలని చైతన్యపరచి శక్తివంతం చేస్తుంది. ప్రాచీన కాలంనాటి ఆధ్యాత్మిక అంతరంగ శాస్త్రాలకి సంబంధించిన శాస్త్రవేత్తలు (రుషులు) ఆధునిక జీవశాస్త్రానికి సంబంధించినశాస్త్రవేత్తలు పరిశోధించి నిరూపించినవే ఈ శక్తి కేంద్రాలు. వారి పరిశోధనల ప్రకారం మానవ శరీరంలో అనేక శక్తి కేంద్రాలు ఉన్నాయి. వీటినే మనం చక్రాలు అని అంటాము. వీటిలో ప్రధానమయిన చక్రాలు ఏడు. అవి మనిషి శరీరంలో చాలా కీలకమయిన స్థానాలలో ఉంటాయి. ఇవి అతి సూక్ష్మంగా ఉండి భౌతిక నేత్రాలకి కనపడవు. కెర్లిన్ ఫోటోగ్రఫీ ద్వారా వీటిని ఫోటో తీయగలిగారు. ఈ చక్రాల గురించి పరమహంస నిత్యానంద చాలా వివరాలు చెబుతారు.

మనిషిలోని ప్రధానమయిన ఏడు చక్రాలు : మూలాధారా, మణిపూరక, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రార చక్రాలు. ఈ ఏడు చక్రాలు చైతన్యవంతంగా ఉండి, వికసించితే మనిషి శారీరకంగా, మానసికంగా, భావావేశాత్మకంగా చాలా ఆరోగ్యంగా ఉంటాడు. చక్రాలు వికసించినప్పుడు మనిషి జీవితం ఎంతో నైపుణ్యంగా, సమస్యలు లేకుండా ఉంటుంది. మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడు. మనిషి యొక్క ఆధ్యాత్మిక స్థితి పూర్తిగా వికసించి ఉంటుంది.

చక్రాలు కల్మషమయి, ముడుచుకుపోయి బంధింపబడి ఉన్నప్పుడు అవి కోటు బటన్ సైజుకి కుంచించుకుపోతాయి. అప్పుడు మనిషి భౌతికంగా మానసికంగా అనేక సమస్యలతో ఉంటాడు. మానసికంగా కుంగిపోయి ఉంటాడు. జీవితంలో జీవకళ లేకుండా పోతుంది. నిరుత్సాహంగా ఉంటాడు. ఇదే అనేక రకాలు అనారోగ్యాలకి కారణం అవుతుంది. పరమహంస నిత్యానందస్వామి ఈ చక్రాలని శుభ్రపరచి, శక్తి నింపి చైతన్యం చేయగల శక్తి ధ్యానానికి ఉన్నది అని నిరూపించారు. స్వామీజీ ఈ చక్రాలని చైతన్యవంతం చేయగల ధ్యానాలని రూపొందించారు. వీటితో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని తయారుచేశారు. దీనినే భారతదేశంలో ఆనందస్ఫురణ అని ఇతర దేశాలలో లైఫ్‌బ్లిస్ ప్రోగ్రాం అని అంటారు. దీనినే చక్రా ధ్యాన కార్యక్రమం అని కూడా అంటారు. స్వామీజీ ధ్యానంతో ఈ చక్రాలను శక్తివంతం చేసి దాని ద్వారా మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయగలగటాన్ని ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఇందులో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ధ్యానపద్ధతిని నేర్పించుతారు. ఆ ధ్యానపద్ధతి ఏవిధంగా ఆయా చక్రాలని చైతన్యపరుస్తుందో, దాని ద్వారా మనకి సమస్యలని సృష్టించే భావావేశాలని ఏవిధంగా వదిలివేయగలమో వివరంగా చెబుతారు.

ధ్యానం ద్వారా శక్తికేంద్రాలు అద్భుతశక్తిని ప్రవహించేలా చేయవచ్చును అని స్వామీజీ చెపుతారు. మనలో శక్తి సాఫీగా ప్రవహించకుండా అడ్డుకునే అడ్డంకులని ధ్యానం ద్వారా తొలగించవచ్చు అని స్వామి నిరూపించారు. ధ్యానం మీలోని అత్యున్నత స్థాయిలో ఉండే శక్తిని పొందే విధంగా సహాయం చేస్తుంది :

ఈ విషయాన్ని పరమహంస నిత్యానంద చాలా వివరంగా చెబుతారు. ప్రతి మనిషి విశ్వంలో ఒక భాగం. ఈ సర్వసృష్టి ఏవిధంగా అయితే ఐదు ప్రధాన మూలకాలు (పంచభూతాల) తో నిర్మించబడిందో, మనిషి కూడా అవే పంచభూతాలతో నిర్మించబడ్డాడు. అంటే విశ్వం ఒక పెద్ద పదార్థమయితే దానిలో ఒక చిన్న భాగం మనిషి. కాబట్టి మనిషిని సూక్ష్మవిశ్వం అనవచ్చు.

ప్రతి మనిషిలో శక్తి ఉంటుంది. ఆ శక్తి మూడు దశలలో మూడు పొరలుగా ఏర్పడి ఉంటుంది. (Three Energy layers in Man) అందులో మొదటిది మన మైండ్ నుంచి వస్తుంది. దీనినే మనం మన దిన చర్యలకి ఉపయోగించుతాము. మనం ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి, నిద్రపోయే వరకు మనo చేసే ప్రతి పనికీ మనం శక్తిని ఇక్కడ నుంచి తెచ్చుకుంటాము. ఈ శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తే మీరు అలసిపోతారు. మీరు ఎక్కువ పనిచేసినప్పుడు మీకు అలసట, విసుగు కలగటానికి ఇదే కారణం. ఆ సమయంలో ఎవరయినా ఇంకాస్త పని చెబితే ఎటువంటి ఉత్సాహం చూపించరు. ఈ శక్తి పొరకి కావలసిన శక్తి మనం తీసుకునే భోజనం నుంచి వస్తుంది. మీరు తీసుకునే ఆహారం, ఎక్సర్‌సైజుల నుంచి వచ్చే శక్తి ఈ మొదటి దశలో ఉండే శక్తికి సహాయం చేస్తుంది. ఇది చాలా తక్కువ స్థాయిలో శక్తిని కలిగి ఉంటుంది.

మీలో రెండవ దశలో ఉండే శక్తి అత్యవసర శక్తి. ఈ శక్తి మన భావావేశాల నుంచి వస్తుంది. మనకి ఏదైనా అత్యవసరం అయినప్పుడు ఈ శక్తి బయటకి విడుదల అవుతుంది. ఉదాహరణకి మీరు రోడ్డు మీద నడుస్తున్నారనుకోండి, ఆకస్మాత్తుగా ఒక కుక్క మీ వెంటపడితే, అప్పుడు మీ నుంచి భయం అనే భావం బయటపడుతుంది. ఆ భావం మీలోని అత్యవసర శక్తిని విడుదల చేస్తుంది. అప్పుడు మీరు చాలా వేగంగా పరిగెడతారు. మామూలు స్థితిలో మీరు అంత వేగంగా పరిగెత్తలేరు. అసలు అలా పరిగెత్తగలను అని కూడా మీరు ఊహించలేరు. ఆ సమయంలో మీరు బాగా నీరసంగా ఉన్నా కాళ్ళు నొప్పి పెడుతున్నా, అమ్మో ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేను అనుకున్నా కూడా, భయం కలిగితే మీరు అలా పరిగెత్తగలుగుతారు. దీని అర్ధం ఏమిటంటే, ఇక్కడ పరిగెత్తటానికి మీరు ఉపయోగించేది వేరొక శక్తి. దానినే నేను అత్యవసర శక్తి అంటాను. ఇది భావావేశాలు కలిగినప్పుడు మాత్రమే విడుదల అవుతుంది. అవి కోపం, ప్రేమ, ఆశ, భయం ఇటువంటి భావాలకి సంబంధించిన శక్తి. అత్యవసర పరిస్థితిలో మాత్రమే మనకి ఉపయోగపడుతుంది.

మూడవ దశలో ఉండే శక్తి, మన ఉనికి (ఆత్మ) దశలోని శక్తి. అది మనిషి లోపల ఉండే అంతులేని శక్తి. ఈ శక్తిని సామాన్య మానవుల ఎవరూ ఉపయోగించరు. అసలు ఆ శక్తి మీ లోపల ఉన్నది అని కూడా మీకు తెలియదు. ఈ శక్తితో అద్భుతాలు చేయవచ్చు. ఈ శక్తికి అసాధ్యం అనే మాట ఉండదు.

మూడవ దశలో ఉండే ఈ అత్యున్నత శక్తిని వికసింపచేయాలన్నా, దానిని విడుదల చేసి ఉపయోగించాలన్నా దానికి ఉన్న ఒక మార్గం ధ్యానం. ధ్యానం చేయటం ద్వారా ఆ శక్తిని పొందవచ్చును. లోతుగా, తీవ్రంగా ధ్యానం చేసే యోగులు చేసే అద్భుతాలన్నీ ఈ శక్తి నుంచి చేసినవే. ధ్యానం మీకు మీలో ఉండే ఉన్నత శక్తిని చూపిస్తుంది. ఆ శక్తి యొక్క అనుభూతిని మీకు ఇస్తుంది. అప్పుడే ఆ శక్తిని మీరు తెలుసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీరు మీ ఆత్మ శక్తిని తెలుసుకుంటారో, అప్పుడే మీ ప్రాణాధారాన్ని, జీవాధారాన్ని అత్యున్నతస్థాయిలో అందుకోగలుగుతారు. మీరు ఒక్కసారి ఈ శక్తిని ఉపయోగించటం తెలుసుకోగలిగితే మీదైనందిన జీవితంలో అద్భుతాలు చేయగలుగుతారు. మీ జీవితం యొక్క నాణ్యత మీరు ఊహించనంతగా అభివృద్ధి చెందుతుంది.

కాబట్టి స్పష్టంగా అర్థం చేసుకోండి. ధ్యానం మిమ్ములని అత్యున్నతమయిన శక్తికి దగ్గరగా చేస్తుంది. దానిని అందుకోగల నేర్పుని ఇస్తుంది. యోగులు, రుషులు, జ్ఞానోదయమయిన గురువులు ఉపయోగించేది ఈ శక్తినే. అందుకే మీరు వారిలో ఎటువంటి అలసటని కాని విసుగుని కాని చూడరు.

నన్ను చాలామంది అడుగుతుంటారు, 'స్వామీజీ! ఉదయం నుంచి అంత బిజీగా అన్ని పనులు, కార్యక్రమాలు, మీటింగ్‌లు ఇవన్నీ ఎటువంటి విశ్రాంతి లేకుండా సాయంత్రం వరకూ చేస్తూనే ఉంటారు. సాయంత్రం అంత మందికి హీలింగ్ చేసి వారు అడిగే వాటికి నవ్వుతూ జవాబు ఇస్తారు. కాని ఒక్క నిముషం అయినా మీ ముఖంలో అలసట ఉండదు. మీరు నీరసంగా కనపడరు. అసలు రహస్యం ఏమిటి? అని.

ఇదే అసలు రహస్యం. మూడవ దశలోని శక్తిని ఉపయోగించుకోగలిగితే ఎంత పని చేసినా అలసట ఉండదు. ధ్యానం ద్వారా మీరు కూడా ఆశక్తిని పొందవచ్చు. అప్పుడు మీరు కూడా అలసట, నీరసం లేని జీవితాలని గడపవచ్చు. ఇదే ధ్యానంలోని గొప్పదనం అని స్వామి ఎంతో స్పష్టంగా, వివరంగా చెబుతారు. ధ్యానం అత్యల్పస్థాయిలో ఉండే శక్తిని ఉన్నతస్థాయికి తీసుకువెళ్ళగలుగుతుంది.

ప్రతి మనిషిలో భావావేశాలు ఉంటాయి. అవి ఒక్కొక్కరిలో ఒక్కొక్కస్థాయిలో ఉంటాయి. భావావేశాలు వ్యతిరేకంగానూ ఉంటాయి. అనుకూలంగానూ ఉంటాయి. మనిషిలోని ప్రతి ఆవేశం శక్తితో కూడుకొని ఉన్నవే. వ్యతిరేకభావావేశాలయిన కోపం, అత్యాశ, కోరిక, అసూయ, అసంతృప్తి, బాధ, భయం ఇవన్నీ కూడా శక్తితో నిండినవే. ఆ భావావేశం కలిగినప్పుడు శక్తి విడుదల అవుతుంది. అయితే వ్యతిరేక భావావేశాలలోని శక్తి అత్యల్పస్థాయిల ఉంటుంది. అది మానవుల అభివృద్ధికి ఏమాత్రం సహాయం చేయదు. అది అభివృద్ధి నిరోధకంగా పని చేస్తుంది.

ధ్యానం ద్వారా అత్యల్పస్థాయిలో ఉండే వ్యతిరేకశక్తిని అత్యున్నత శక్తిగా మార్చవచ్చు. ఉదా : ప్రాపంచిక సౌఖ్యాల మీద కోరిక చాలా బలంగా ఉందనుకోండి. మీరు ఆ కోరికని అణచటం ద్వారా మరింత హాని చేసుకుంటారు. అత్యధికమయిన కోరిక, అత్యాశ కూడా మానవుల పతనానికి కారణం. కాబట్టి ఏమి చేయాలి. ఆ కోరిక అనేది దానంతట అదే మనని వదిలివేయాలి. ఆ పరిస్థితికి మనం చేరగలిగే మార్గం ధ్యానం. తీవ్రంగా, క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే ఈ వ్యతిరేకపు భావావేశాలని మనం వదిలివేయనవసరం లేదు. అవే మనని వదిలి వెళ్ళిపోతాయి.

వ్యతిరేకపు భావాలు ఆలోచనలు లేనప్పుడు మనలోని శక్తి ఉన్నత దశలో ఉంటుంది. అది అత్యున్నత శక్తి. ఆ శక్తితో దేనినైనా సాధించవచ్చు. ఆ శక్తి మీ అంతరంగ ప్రపంచంలోనూ బయట ప్రపంచంలోనూ మీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

ఇక్కడ సామాన్యంగా ఒక ప్రశ్న వస్తుంది. ధ్యానం చేస్తే కోరికలు మనని ఎలా వదిలి వేస్తాయి? ఇది చాలా మామూలుగా జరిగే స్థితి. ధ్యానంలో ఉండే ఆనంద పారవశ్యాలు శాశ్వతమయినవి. మీ కోరిక తీరిన తరువాత మీరు పొందేది కేవలం సంతోషం. ఎప్పుడయితే నిజమయిన ఆనందపు అనుభూతిని మీరు ఒక్కసారి అనుభవించుతారో ఇక కోరికల మీద, మిగతా భావావేశాల మీద ఎటువంటి శ్రద్ధ ఉండదు. ఎప్పుడయితే అవి మీ శ్రద్ధని కోల్పోతాయో ఇక వాటికి మీ దగ్గర ఆహారం దొరకదు. అవి మీ నుంచి వెళ్ళిపోతాయి.

ఈ విధంగా ధ్యానం మిమ్ములని అత్యున్నత శక్తి దశకి తీసుకువెళ్ళగలుగుతుంది. ఈ కారణం వలననే యోగులు,ఋషులు ఏ మాత్రం ప్రపంచ సౌక్యాలు లేకుండానే పరమానందంలో ఉండగలుగుతారు. వారు కేవలం ప్రాథమిక అవసరాలకి సరిపడా వస్తువులని ఉంచుకుంటారు. కానీ వారు ధ్యానం ద్వారా మహోద్భుతమైన ఆనందాన్ని పొందుతారు.

ధ్యానం మిమ్మలని భౌతికంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది : "మంచి ఆరోగ్యం అంటే అనారోగ్యలక్షణాలు లేకపోవటం కాదు. మీ లోపల ఉన్నతమైన ఉనికిని (ఆత్మని) కలిగి ఉండే స్థితి. మనం ఏదో అనారోగ్యాన్ని కలిగించుకొని, తిరిగి దానిని బాగుచేసుకునే మామూలు మనుషులం కాదు. మనం పరమానందాన్ని కలిగి ఉన్న ఆనంద జీవులం. మనం జన్మించినది ఆ పరమాందపు అనుభూతిని పొందటానికి, ఆ ఆనందపు పారవశ్యాన్ని మన అంతరంగంలో మన ఉనికిలో నిరంతరం తేలి ఆడే విధంగా చేయటానికి. దీనినే నేను మంచి ఆరోగ్యం అంటాను" - పరమహంస నిత్యానంద.

పరమహంస నిత్యానందస్వామి మనిషి యొక్క ఆరోగ్యస్థితి గురించి చాలా విపులంగా, విస్తారంగా చెబుతారు. ఆయన తన శిక్షణ కార్యక్రమంలో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తారు. ప్రత్యేకించి ఈ అంశం మీద ఆరోగ్యస్ఫురణ అనే కార్యక్రమాన్ని రూపొందించారు.

మనిషి యొక్క ఆరోగ్యం గురించి పరమహంస ఈ విధంగా చెబుతారు. మంచి ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంతో ఉండే స్థితి. మీకు ఎటువంటి అనారోగ్యం లేదు అని డాక్టరు సర్టిఫికెట్ ఇస్తే మీరు భౌతికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులు అని అర్థం. అదే విధంగా మనం ఎదుటి వ్యక్తితో ఉన్నప్పుడు మనలో ఎటువంటి కలతా లేకుండా ఉంటే, మీరు ఎవరితోనైనా స్వేచ్ఛగా, మీపై ఎటువంటి ఒత్తిడి లేకుండా సంభాషించగలిగితే, మీ మానసిక స్థితి బాగుంది అని అర్థం. అదేవిధంగా మీలో వ్యతిరేకపు ఆలోచనలు ఉండకూడదు. బాధలు, అసూయ, అసంతృప్తి అహంకారం, అత్యాశ మీలో ఉండకూడదు. వీటి అన్నింటినుంచి మీరు స్వేచ్ఛగా ఉండగలిగినప్పుడు మీరు మానసికంగా ఆరోగ్యవంతులు. ధ్యానం మిమ్ములని ఇటువంటి మంచి ఆరోగ్యకరమయిన స్థితిలో ఉంచుతుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే మనలో ఉండే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. క్రమంగా బి.పి, డయాబిటిస్, గుండె సంబంధమయిన వ్యాధులు తగ్గుముఖం పడతాయి. మీరు వీటి కోసం వాడే మందుల త్వరగా ఫలితాలని ఇస్తాయి. క్రమంగా మందుల వాడకం తగ్గించవచ్చు.

అదేవిధంగా మానసిక సమస్యలకి కూడా మంచి మందు ఈ ధ్యానం. ముఖ్యంగా మానసిక కుంగుబాటుతో బాధపడేవారికి ధ్యానం అద్భుతంగా పనిచేస్తుంది. నేటి ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమయిన జబ్బుగా డిప్రెషన్ లేదా మానసిక కుంగుబాటుతనాన్ని గుర్తించారు. ఇది నిశ్శబ్దంగా మనిషిని నాశనం చేస్తుంది. క్రమంగా ధ్యానం చేయటం ద్వారా డిప్రెషన్కి వాడే మందులని తగ్గించవచ్చు. కొంతకాలానికి క్రమంగా మందులు పూర్తిగా మానివేయవచ్చు. డిప్రెషన్కి ధ్యానం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే డిప్రెషన్కి వాడే మందుల ప్రభావం శరీరక ఆరోగ్యం మీద ఉంటుంది. ఆ మందులకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ధ్యానం చేస్తే అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ధ్యానం వలన ఇతర ఉపయోగాలు :

ధ్యానం చేయటం వలన మనిషిలో సంపూర్ణమయిన ప్రగతి ఉంటుంది. చక్కని ఆధ్యాత్మిక జీవితానికి మంచి ఆధారాన్ని ఏర్పరుస్తుంది. అందరిలో మానవ సంబంధాలు మంచి దశలో అభివృద్ధి చెందుతాయి. చిన్న చిన్న కలతలు, కలహాలు తగ్గిపోతాయి. అందరూ శాంతి ప్రేమతో మెలుగుతారు. సహనం పెరుగుతుంది. అశాంతి, అసహనం,కోపం తగ్గుతాయి.

పరమహంస నిత్యానంద స్వామి లక్ష్యం కూడా ఇదే. ధ్యానం ద్వారా ప్రతి వ్యక్తిలో వ్యక్తిగతమయిన మార్పు తీసుకువచ్చి దాని ద్వారా ప్రపంచంలో మార్పు తేవాలి. అప్పుడు ప్రపంచంలో హింస, యుద్ధాలు, పోరాటాలు, దాడులు ఏవీ ఉండవు. ధ్యానం చేసినప్పుడు వ్యాపించే అనుకూల శక్తి తరంగాలు మనిషిలోని వ్యతిరేకపు ఆలోచనలని తగ్గించివేస్తాయి. అదే విధంగా మనిషిలో హింసాప్రవృతిని తగ్గిస్తాయి.

ధ్యానం చేయటానికి నేను ఏవిధంగా సిద్ధమవ్వాలి :

ఈ ప్రశ్నకి పరమహంస మనకి కొన్ని మార్గదర్శక సూత్రాలని ఇస్తారు. ఇక్కడ మనం ఒక ముఖ్యవిషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం అనేది ఒక పని కాదు, ఒక చర్య కాదు. కొన్ని పద్ధతుల ద్వారా మనం ధ్యానస్థితికి చేరాలి. ఆ పద్ధతులని మన సౌలభ్యం కోసం ధ్యానపద్ధతులు అని అంటాము. ఈ పద్ధతులని పాటించే విషయంలో మనం కొంచెం శ్రద్ధవహించి, స్వామీజీ చెప్పిన సూత్రాలని అర్థం చేసుకుని పాటించితే ఫలితాలను త్వరగా, పూర్తిగా అనుభవించగలం. పరమహంస ధ్యానానికి సిద్ధమవ్వటానికి ఈ క్రింది విషయాల మీద శ్రద్ధ చూపమంటారు.

ధ్యానం చేయటం నిజాయితీగా చేయండి :

స్వామీజీ ముందుగా ఇలా చెబుతారు. ధ్యానం, దాని ఫలితాలని మిమ్మలని నమ్మమని చెప్పను, నమ్మవద్దు అని చెప్పను. అదే విధంగా దీని మీద నమ్మకం ఉంచమని చెప్పను. కానీ ధ్యానాన్ని విశ్వసించండి. ధ్యానాన్ని ప్రయోగాత్మకంగా అనుభవించి, అప్పుడు దానిని విశ్వసించండి.

పరమహంస తన ప్రతి ప్రవచనంలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతారు. నేను మీతో మామిడి పండు తియ్యగా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ మాటని మీరు నమ్మవద్దు. అలా అని నమ్మను అని అనవద్దు. మీరు ఆ పండు తిని రుచి చూసి అప్పుడు ఆ సత్యాన్ని విశ్వసించండి. ఆ సత్యాన్ని మీ అంతట మీరు ప్రయోగాత్మకంగా అనుభవించి తెలుసుకుని అప్పుడు దాని మీద మీ విశ్వాసాన్ని ఉంచండి.

అదేవిధంగా ధ్యానానికి ఒక అవకాశం ఇవ్వండి. దానిని విప్పారిన మనస్సుతో వికసించిన అంతరంగంతో చేయండి. ధ్యానం చేయాలనే నిజమైన కుతూహలంతో చేయండి. దాని ఫలితాలని అర్థం చేసుకోగల మైండ్ (మానసిక స్థితితో) తో చేయండి. ఆ విధంగా ధ్యానం చేయటానికి నిజాయితీగా సిద్ధపడండి.

ఆశావాదంతో ధ్యానం దరికి చేరండి :

నేను మీకు చెప్పే రెండవ ముఖ్య విషయం మీరు ధ్యానం ప్రారంభించేముందు మీకు మంచి జరుగుతుంది అనే ఆశావాదంతో మొదలుపెట్టండి, అంతే కాని నిరాశతో కాదు. నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను అర్ధం చేసుకోండి : పరమానంద స్థితి అనేది కేవలం యోగులకి, రుషులకి చెందిన సంపద కాదు. మీరందరూ కూడా కచ్చితంగా ఆస్థితిని పొందగలరు.

ఆ స్థితి పొందాలి అంటే మాకు యోగా, ధ్యానం ఇలాంటివి రావు, అసలు ఆధ్యాత్మిక అంటేనే తెలియదు. అంత గొప్ప స్థితిని సామాన్యమానవులమయిన మేము చేరగలమా? అని మనలాంటి వారు అడిగే ప్రశ్నలకి పరమహంస మనోహరమైన చిరునవ్వుతో ఇలా జవాబు ఇస్తారు : శాశ్వతమైన పరమానంద స్థితి పొందటానికి మీరు ఏమీ తెలుసుకుని ఉండనవసం లేదు. దీనికి మీరు ఏ అర్హతలు సంపాదించనవసరం లేదు. భగవాన్ రమణమహర్షి చెప్పినట్టు మీరు జీవించి ఉంటే మీరు పరమానందస్థితికి చేరటానికి అర్హులే.

మీరు ఒక విషయం అర్ధం చేసుకోండి : భగవంతుడు మీకు ఎటువంటి నిబంధనలని విధించలేదు. మీకు ఎటువంటి హద్దులూ కల్పించలేదు. మరి మీరెందుకు మీ మీద ఇన్ని నిబంధనలని విధించుకుంటారు. ఎదుటి వారిని సమాజాన్ని మీ మీద ఎందుకు నిబంధనలని, హద్దులని కలిగిందనిస్తారు. మీరు ధ్యానం చేయాలన్నా, యోగా నేర్చుకోవాలన్నా,ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని సాధించాలన్నా, ఆ సర్వాంతర్యామి గురించి లేదా మీ అంతరంగపు లోతులలోని అద్భుతాల గురించి తెలుసుకోవాలన్నా ఎవరి అనుమతి అవసరం లేదు. దానికి ఎటువంటి అర్హతా అవసరం లేదు. మీకు సంకల్పం ఉంటే చాలు. అందుకే ముందుగా ధ్యానం చేయటానికి ఒక చక్కని కచ్చితమయిన లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. అప్పుడు మీరు కచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుతారు.

ఆహ్లాదంగా, ఒక ఆటలా ధ్యానం చేయండి :

ధ్యానం అంటే ఒక గొప్ప సాహసం. నిజానికి అది మీ జీవితంలో మీరు చేసే ఒక పెద్ద ప్రయోగం. అందుకని మీరు ధ్యానం అనగానే గంభీరంగా (సీరియస్‌గా) అయిపోయారనుకోండి, ధ్యానంలో ఉండే అందాన్ని, ఆనందాన్ని మీరు పోగొట్టుకుంటారు.

నేను మీకు చాలా సార్లు చెప్పాను. ఎందుకో తెలియదు కాని ఆధ్యాత్మికత అనగానే అది ఒక సీరియస్ వ్యవహారం అనుకుంటారు. వెంటనే మీరు కూడా చాలా గంభీరంగా అయిపోతారు. అంతేకాదు ఆధ్యాత్మిక గురువులు అంటే సీరియస్‌గా ఉండాలి అని అనుకుంటారు. మీరు మరొక విషయం కూడా అనుకుంటారు. సీరియస్‌గా ఉంటేనే మనం పరిణితి చెందాము అని, గంభీరత అనేది పెద్దరికానికి గుర్తు అని. అందుకే ఆధ్యాత్మిక రంగంలో వారు చాలా మంది చాలా సీరియస్‌గా ఉంటారు. వారు పొరపాటున కూడా నవ్వరు. మీకు నేను చెబుతున్నాను. స్పష్టంగా అర్థం చేసుకోండి : ఆధ్యాత్మికత అంటే సీరియస్‌నెస్ కాదు. అది గంభీరంగా చేసే వ్యాపారం కాదు. ధ్యానం అంటే గంభీరంగా ఉండే స్థితి కాదు. ధ్యానం అంటే జీవితం ఒక లీల అని తెలుసుకోవటమే. ఇదంతా సర్వాంతర్యామి ఆడే జగన్నాటకం అని తెలుసుకోవటమే. జీవితం ఒక నాటకమయినప్పుడు, మన చుట్టూ ఉండే సర్వసృష్టి భగవంతుడుఆడించే నాటకంలో భాగమయినపుడు ఇక సీరియస్‌గా ఉండవలసిన అవసరం ఏమున్నది?

ధ్యానం అనగానే మీరు సీరియస్‌గా, బరువుగా అయిపోవద్దు. ధ్యానాన్ని ఒక పండుగలా, ఒక ఉత్సవంలా చేయండి. అందులో ఆనందాన్ని పొందండి. ఇది ఒక అందమయిన ఆహ్లాదకరమయిన ఆట. నవ్వు ముఖంతో, ఆనందగా ధ్యానం చేయండి. ధ్యానాన్ని ఎంజాయ్ చేయండి. అంతేకాని దానిని ఒక బరువుగా, ఒక బాధ్యతగా చేయవద్దు.

నేను మీకు ఒక చిన్న సంఘటనని చెబుతాను. ఒకసారి ఒక ఆధ్యాత్మిక కాన్ఫరెన్స్ జరుగుతుంది. దానికి చాలామంది బౌద్ధ గురువులు సన్యాసులు వస్తారు. ఆ కాన్ఫరెన్స్‌లో అందరూ ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది చాలా పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఈసారి ఒక బౌద్ధగురువు వంతు వచ్చింది. ఆయన స్టేజి మీదకి వెళ్ళి నవ్వటం మొదలుపెట్టాడు. ఆయన అలా నవ్వుతూనే ఉన్నాడు. ఆయన అంతరంగం లోపలి నుంచి నవ్వసాగాడు. ఆ నవ్వుతో ఆయన పూర్తిగా కదిలిపోసాగాడు.

హోలులో అందరూ ముందుగా ఆశ్చర్యపోయి ఆయనని చూడసాగారు.ఆయన నవ్వు హోలంతా వ్యాపించింది. నెమ్మదిగా హోలులోని ప్రేక్షకులు కూడా నవ్వటం ప్రారంభించారు. ఎందుకు నవ్వుతున్నారో కూడా తెలియకుండా అందరూ నవ్వుతున్నారు. ఇంకా, ఇంకా నవ్వుతున్నారు. అందరి నవ్వులతో ఆ హోలు అంతా శక్తి తరంగాలు ఏర్పడ్డాయి. అందరూ ఏదో తెలియని ఆనందస్థితికి, ఒక ఉన్నత స్థితికి చేరుకున్నారు. చివరిలో ఆ గురువు గారు ఇదే నిజమైన ఆధ్యాత్మికత అంటే ముగించారు.

నవ్వు ఒక చక్కని ధ్యానం. మనం నవ్వుతున్నప్పుడు మనలోపల వ్యర్థపు మాటల ప్రవాహం ఆగిపోతుంది. మన మైండ్ పూర్తి విశ్రాంతిలో ఉంటుంది. అందుకే మనసుతీరా నవ్వాక మనలో శక్తి ప్రవహించి కొత్త ఉత్సాహంతో ఉంటాము. అంతేకాదు నవ్వుకి మరొకరికి (అంటుకొనే) వ్యాపించే లక్షణం ఉన్నది. అందుకే దీనిని ఒక అందమైన ధ్యానం అంటాను. నేను నిర్వహించే ధ్యాన కార్యక్రమాలలో ఈ నవ్వుని తప్పనిసరిగా ఒక ధ్యాన పద్ధతిలా చేయించుతాను. ఆ ధ్యానం తరువాత అందరూ ఎంత ఉత్సాహంగా ఉంటారు. ముఖాలు ప్రకాశవంతంగా అవుతాయి. అందుకే మీరు వీలయినప్పుడు నవ్వండి. నవ్వు ముఖంతో ధ్యానం చేయండి.

ధ్యానం సహనంతో చేయాలి :

చాలామంది ఆధ్యాత్మిక శిక్షణా తరగతులకి వచ్చినప్పుడు మొదటిరోజే, మొదటి క్లాసులోనే వారికి ఏవో ఆధ్యాత్మిక అనుభవాలు జరుగుతాయి అని ఆశించుతారు. దాంతో ఏకాగ్రత అంతా ఫలితాల మీద ఉంటుంది.

అసలు నేటి సమాజంలో అన్నీ ఇన్స్టెంట్ ఫలితాలే కావాలి కదా. ప్రతి దానికి వెంటనే ఫలితం కావాలి. మనిషిలో దేనికైనా ఎదురుచూసే సహనం పూర్తిగా పోయింది. అన్నింటికంటే ముందు వచ్చే భావం అసహనం. అనుకున్న దానికంటే అరనిమిషం ఆలస్యమయితే చాలు అరవై సార్లు వాచ్ చూసుకుంటాము. పరమహంస నిత్యానంద మనని ఈ అసహనం నుంచి బయటకి తేవటానికి చాలా సహాయం చేస్తారు. ముఖ్యంగా ఆయన నిర్వహించే ధ్యాన కార్యక్రమాలలో మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇచ్చే శిక్షణ ఈ అసహనం అనే అలవాటుని తప్పించటమే. ఆయన ప్రతి శిక్షణా తరగతిలో ముందుగా చెప్పేమాట 'ఫలితాలని మొదటి క్లాసులోనే ఆశించకండి' అని. మనలో మనకి తెలియకుండా చాప కింద నీరులా నిశ్శబ్దంగా వచ్చి చేరే డిప్రెషన్ లేదా మానసిక కుంగుబాటు అనే వ్యాధికి, మనం నిరంతరం బాధపడే వత్తిడికి కారణం ఈ అసహనమే. అందుకే పరమహంస మనకి ఈ శిక్షణకి ఇస్తారు. సరే ఈ విషయంలో స్వామి ఏమి చెబుతారో చూద్దాము.

మీరు ధ్యానం మొదలుపెట్టినరోజేనే అద్భుతాలు జరుగుతాయి అని ఆశించకండి. ఆ రోజునే సర్వాంతర్యామి, భగవంతుడు మీ దగ్గరకి వచ్చేస్తాడు అని ఎదురు చూడకండి. ఇంకా ఫలితాలు రాలేదు ఎలా అని బాధపడకండి. అసలు ఫలితం గురించి వ్యథ చెందకండి. అలా ఫలితాల గురించి ఆలోచింయితే మీరు ధ్యానం చేయలేరు.

Paramahamsa Nithyananda

మీకు ఒక చిన్న కథ చెబుతాను :

ఒకసారి మూడు కోతులకి ఒక పండిన మామిడిపండు దొరుకుతుంది. ఆ మూడు కోతులు నేను తింటాను, నేను తింటాను అని పోట్లాటికి దిగుతాయి. చివరికి ఇలా కాదని వాటికి గురువులాంటిది పెద్దది అయిన మరొక కోతి దగ్గరకి ఆ మామిడి పండుని తీసుకొని వెళతాయి. గురువు కోతి వాటి వాదనలు, ప్రతివాదనలు విని, ఈ విధంగా తీర్పు చెబుతుంది.

ఇక్కడ ఉన్నది ఒక్క కాయ. కాబట్టి దీనిని నేను తిని ఇందులో టెంకని (విత్తనం) మీకు ఇస్తాను. మీ ముగ్గురూ కలసి దానిని నాటండి. మొక్క మొలచి పెద్ద చెట్టు అయ్యి చాలా కాయలు కాస్తుంది. ఇక మీ ఇష్టమొచ్చినన్ని కాయలు తినవచ్చు, అని చెబుతుంది. దీనికి కోతులు ఒప్పుకొని టెంకని పాతుతాయి. అందులో మొదటి కోతి రోజూ నీరు పోస్తాను అంటుంది : రెండవది ఎరువులు వేస్తాను అంటుంది, మూడవ కోతి దానిని జాగ్రత్తగా కాపాడతాను అంటుంది.

ఈ విధంగా చాలా కాలం గడచిపోతుంది. కానీ మొక్కరాలేదు. మూడు కోతులు గురువు దగ్గరకి వెళ్ళి తమని మోసం చేసిందని గొడవ పెట్టుకుంటాయి. అప్పుడు గురువు కోతి “మీరు ఏమి చేసారు” అని అడుగుతుంది. అప్పుడు మొదటి కోతి నేనురోజూ మర్చిపోకుండా నీరు పోస్తున్నాను అంటుంది. రెండవ కోతి ఎరువులు వేశాను అని చెబుతుంది. మూడవ కోతి నేను దానిని జాగ్రత్తగా కాపలా కాస్తున్నాను. అంతేకాదు ప్రతి రోజు విత్తనాన్ని బయటికి తీసి మొక్క వచ్చిందా లేదా అని కూడా చూస్తున్నాను అని చాలా గొప్పగా చెబుతుంది.

మనం కూడా అలానే చేస్తాము. అందుకే మనకి ఫలితం కనిపించదు. కాబట్టి మీరు ఫలితాల గురించి ఆతృత పడవద్దు. ధ్యానం అనే ఒక కార్యక్రమం, మీలో అభివృద్ధి జరిగేలా చూడండి. అంతేకాని అత్యాశతో ఫలితాలను గురించి బాధపడకండి. ఎప్పుడైతే మీ ఏకాగ్రత ఫలితాల మీదకి వెళుతుందో, మీలో జరగవలసిన ప్రగతిని ఆపినట్లు అవుతుంది. కాబట్టి సహనంతో ధ్యానం చేయండి. ఒంటరిగా మీతో మీరు ఉండే విధంగా చూసుకోండి. పరమహంస ఈ ప్రశ్నికి చేయవచ్చు అని చెబుతారు. అయితే ఆయన మనకి కొన్ని సూచనలు ఇస్తూ మనం ధ్యానం ప్రారంభించటానికి కొన్ని విషయాలని వివరిస్తారు. వాటిలో ముఖ్యమైనవి ఈవిధంగా ఉంటాయి.