KAILASA Library/ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?/ధ్యానం నేను ఎవరిని? అనే ప్రశ్నకు జవాబు చూపిస్తుంది?Sign in
ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?

ధ్యానం నేను ఎవరిని? అనే ప్రశ్నకు జవాబు చూపిస్తుంది?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

నీవు ఎవరివి? నేను ఎవరిని? ఈ ప్రశ్నలు అతి సామాన్యమైన ప్రశ్నలు. మన నిత్య జీవితంలో ఎన్నో సార్లు ఈ ప్రశ్న అడుగుతాము, ఈ ప్రశ్న వింటాము. ఇవి మనకి సుపరిచితమైన ప్రశ్నలు.

ఈ ప్రశ్న నీవు ఎవరివి అని అనగానే మనకి కళ్ళముందుకు వచ్చే జవాబు ఒక దృశ్యం. అది మన ఆరు అడుగులో లేదా 5.5 అడుగులో ఉన్న శరీరం. వెంటనే మనం ఏమని జవాబు ఇస్తాము. 'నేను సుబ్బారావుని' 'నేను లక్ష్మీ భవానీని' అని. దీని అర్థం ఏమిటి అంటే, నేను అనగానే ఈ శరీరం నేను అని మనం అనుకుంటాము.

పరమహంస నిత్యానందస్వామి తన ప్రతి ప్రవచనంలోనూ ఈ విషయాన్ని పదే పదే చెబుతుంటారు. పరమహంస 'నేను' అనే విషయాన్ని ఎంతో చక్కగా వివరించతారు. ఆయన ఈ విషయాన్ని ఇలా వివరిస్తారు.

మీరు ముందుగా అర్థం చేసుకోవలసిన విషయం నీవు వేరు నీ శరీరం వేరు అని. నీ శరీరం నీకు తాత్కాలిక నివాసం మాత్రమే. అది నిన్ను మోస్తూ తిరిగే ఒక వాహనం. ఈ ఆరడుగుల శరీరం నీవు కాదు. కానీ మీకు మీ శరీరం పైన ఉన్న ప్రేమ మీ శరీరమే మీరు అనే భ్రమని కలిగిస్తుంది.

నీవు ఎవరు? అనగానే నీ శరీరం మాత్రమే ముందుగా నీ కళ్ళు ముందుకు వస్తుంది. అది చాలా చిన్నదయిన అత్యల్పస్థాయిలో ఉండే నీకు సంబంధించిన ఒక గుర్తింపు. నీవు ఎవరు అని మళ్ళీ రెట్టించి అడిగితే వెంటనే నేను సుబ్బారావుని, నేను డాక్టరుని, నేను పిల్లల డాక్టరుని, 25 సంవత్సరాల వైద్య అనుభవం ఉన్న డాక్టరుని అని చెబుతారు. ఇది మీ మేధస్సుతో మీరు అంటే ఏమిటో మీకు మీరు వేసుకున్న మరొక గుర్తింపు. అది కూడా మీరు అంటే ఉండే ఒక అత్యల్ప గుర్తింపు ముద్ర మాత్రమే కాని మీరు కాదు.

ఇంకా రెట్టించి నీవు ఎవరు? అని అడిగితే, ఇంకాస్త లోతుగా ఆలోచించి నేను ఒక మంచి నమ్మకమయిన, హస్తవాసిగల వైద్యుణ్ణి. మంచి తండ్రిని, ఆదర్శవంతమయిన స్నేహితుణ్ణి. నమ్మకమయిన భర్తని, దేశభక్తిగల పౌరుణ్ణి, దైవభక్తిగల భక్తుణ్ణి అని చెబుతారు. ఇదంతా ఏమిటి? ఏమిటి అంటే మీరు అంటే ఏమిటో సమాజం తన అభిప్రాయాన్ని గుర్తింపు ముద్రలుగా మీ మీద అంటించిన ముద్రలు, గుర్తింపులు. అవి ఎంత బలంగా ఉంటాయంటే మనం అంటే అదే అని చాలా గట్టిగా నమ్మి ఎదుటి వారిని నమ్మించే అంతగా మనలో స్థిరపడిపోతాయి, ఆ గుర్తింపులు వాటి నుంచి మనం ఎట్టి పరిస్థితిలోనూ బయటకి రాలేము.

ఈ విషయాన్ని వివరిస్తూ పరమహంస నిత్యానంద ఒక చక్కని ఉపమానాన్ని చెబుతారు. మీరు ఒక పార్శిల్ చేసి పోస్టు చేశారనుకోండి. దాని మీద తప్పు డ్రస్ వలన చాలా చోటులకి ఆ పార్శిల్ తిరుగుతుంది. అది వెళ్ళిన ప్రతి చోట ఆ ఊరి పోస్టల్ ముద్రలు పడతాయి. ఇప్పుడు ఆ పార్శిల్ అనగానే ఆ ముద్రలే అనుకుంటామా లేకపోతే అందులో ఉన్న వస్తువు ఏమిటో అది అనుకుంటామా?

మీ పరిస్థితి కూడా అంతే. సమాజం వేసిన ముద్రలనే 'మీరు' అని భ్రమపడుతున్నారు. అసలయిన మీరు మీ అంతరంగంలో ఉన్నారు. అది కనపడకుండా ముద్రలు ఉన్నాయి కాబట్టి, ఆముద్రలే మీరు అని అనుకుంటున్నారు.

మీ అసలయిన మీరు ఏమిటో ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకంటే మీ మీద సమాజం వేసిన ముద్రలు, మీ నిజమయిన అసలయిన ఉనికిపై గట్టి పొరలుగా ఏర్పడిపోతాయి. వాటి మీద మీ మేధస్సుతో సంపాదించిన జ్ఞానం మరింత గట్టి పొరని ఏర్పరుస్తాయి.దానితో పాటు అహంకారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి, దానిని పెంచిపోషించే కార్యక్రమంలో మరిన్ని గట్టి పొరలని ఏర్పరుస్తున్నారు. ఈ పొరలన్నీ కాలం గడిచే కొద్దీ ఒక బలమైన రాతి గోడలుగా ఏర్పడి మిమ్మలని మీ నిజమైన ఉనికికి దూరం చేస్తున్నాయి. అసలయిన మిమ్మలని మీరు వదిలేసి, ఈ భ్రములని, గోడలని, రాతి గోడలలోని రాళ్ళని చూసి మీరనుకుని ఆవిధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే అందరికీ అంతులేని అశాంతి, అసంతృప్తి మానసిక వ్యధ. అసలయిన మీ ఉనికికి ఆనందం లేనప్పుడు బాహ్యంగా మీరు ఎంత సాధించినా, ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా చివరికి మీకు మిగిలేది అసంతృప్తి, అశాంతి. అందరిలో ఉండే అసహనం, అశాంతికి ఇదే అసలయిన కారణం.