ధ్యానం చేయడానికి అందరూ అర్హులేనా ?
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ఈ ప్రశ్న చాలామందికి కలుగుతుంది. నాకు అనారోగ్యం, నాకు మానసిక వ్యధలు ఉన్నాయి, నేను ఎటువంటి నియమాలు పాటించను, నాకు క్రమశిక్షణ లేదు.... కాబట్టి నేను ధ్యానం చేయవచ్చునా? నాకు అర్హత ఉన్నదా? నా ఈ వయస్సులో నాకు ధ్యానం ఉపయోగపడుతుందా?
పరమహంస నిత్యానంద స్వామిని చాలా మంది ఈ ప్రశ్న అడుగుతుంటారు. అన్ని ప్రశ్నల సారాంశము...నేను ధ్యానం చేయవచ్చునా? దానికి కావలసిన అర్హత ఏమిటి?
ఈ ప్రశ్నలు అడిగినప్పుడు పరమహంస చాలా అందమైన చిరునవ్వునవ్వి ఒక అందమైన కథని చెబుతారు. ఈ కథ ఆధ్యాత్మిక జీవితానికి, యోగా, ధ్యానం నేర్చుకోవడానికి నేను అర్హుడనేనా? అన్న ప్రశ్నకి సంబంధించినది. ఒకరోజు ఒక వ్యక్తి భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వచ్చి "భగవాన్, నేను ఆధ్యాత్మికమైన జీవితంలోనికి ప్రవేశించటానికి అర్హుడనేనా” అని వినయంగా అడుగుతాడు.
అప్పుడు రమణమహర్షి తనదయిన శైలిలో “నీవు జీవించి ఉన్నావా?” అని అడుగుతారు. ఆ యువకుడు ఆశ్చర్యపోయి, “నేను జీవించి ఉన్నాను, భగవాన్”, అని జవాబు ఇస్తాడు.
“అలా అయితే ఆధ్యాత్మిక జీవితానికి నీవు పూర్తిగా అర్హుడవే”, అని భగవాన్ చిరునవ్వుతో బదులు చెబుతారు.
పరమహంసకి చాలా ఇష్టమయిన కథ ఇది. ఆయన పదే పదే చెప్పేమాట, అర్హత ఉండటం, అర్హత లేదు అనటం అంతా అబద్ధపు మాటలు. అసలు మీరే ధ్యాని అని ఆయన అంత గట్టిగా, నమ్మకంగా చెప్పినప్పుడు, ఇక అర్హత, అనర్హత అనే ప్రసక్తిలేదు కదా! ధ్యానం అందరూ అన్ని వయస్సులవారు, అన్ని సమయాలలో నిరభ్యంతరంగా చేయవచ్చు అని పరమహంస చెబుతారు.
ధ్యానం చేయటానికి నియమాలు నిష్ఠలు లేవు. అలా అని మీకు ఎవరయినా చెబితే మీరునమ్మవద్దు. అర్హత లేదు అని అనటానికి ఎవరికీ అధికారం లేదు. అలా ఎవరయినా అంటే వారు మిమ్ములని కంట్రోలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం. అటువంటి వారిని మీరు విశ్వసించనవసరంలేదు. అలా మీ అర్హత గురించి ప్రశ్నించేవారిని మీరు పట్టించుకోవద్దు. మీకు నచ్చిన విధంగా ధ్యానం చేయండి.
ధ్యానం ఎంతసేపు చేయాలి ? ఎన్ని రోజులు చేయాలి ?
ధ్యానం ఎన్ని గంటలు చేయాలి? ఎన్ని రోజులు చేయాలి? ఈ ప్రశ్నలు అర్థం లేని ప్రశ్నలు. ఎందుకంటే ధ్యానం అనేది మీ జీవితాలకి అదనంగా కలుపుకునే ఒక వస్తువు కాదు, ఒక సౌకర్యంకాదు. అదేవిధంగా దీనిని ఇన్ని యూనిట్లు పోందాలి ఇంత పరిమాణంలో సాధించాలి అని అనుకునే భౌతిక వస్తువు కాదు. ధ్యానం అంటే మీ జీవితం, మీ జీవనసరళి ధ్యానంగా మారిపోవాలి. మీ ప్రశ్న ఎలా ఉన్నది అంటే, నేను రోజుకి ఎన్నిసార్లు ఊపిరి తీసుకోవాలి? అని అడిగినట్లే. ఊపిరి తీయటమే మీజీవితం, మీజీవితమే ఊపిరి; ధ్యానం కూడా అంతే కావాలి.
జ్ఞానోదయం పొందిన యోగులు ఉండేది ఈ స్థితిలోనే. వారు ఏపని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, నిరంతరం ధ్యాన స్థితిలోనే ఉంటారు. అందుకే అంత మనోహరమైన ఆనంద స్థితిలోనే ఉంటారు. మనం ఎప్పుడుయినా కలతతో కోపంతో, అసంతృప్తితో ఉన్న యోగులని చూస్తామా? ఎప్పుడుయినా జ్ఞానోదయమయిన వారిలో అసహనాన్ని అశాంతినీ చూడగలమా? లేదు ఎందుకంటే వారి జీవితమే ధ్యానం. వారు ధ్యానం చేయరు. ధ్యాన స్థితిలో ఉంటారు. వారు ధ్యానులు. ధ్యానమే వారి జీవితం.
ఈ సందర్భంలో పరమహంస నిత్యానంద ఒక చిన్న కథ చెబుతారు. ఒక గురుకులంలో ఉండే ఇద్దరు శిష్యులు మంచి స్నేహితులు . ఒకరోజు వారు ఇద్దరూ గురువు గారిని ఒక విషయంలో అనుమతి అడగాలి అని ఆయన కుటీరం దగ్గరికి వస్తారు. ముందు ఒక శిష్యుడు లోపలకి వెళ్ళి, కొద్దిసేపటిలోనే ఏడుస్తూ బయటికి వస్తాడు. ఆ తరువాత రెండవ శిష్యుడు లోపలకి వెళ్ళి, నవ్వుతూ ఆనందంగా బయటికి వస్తాడు. రెండవ శిష్యుడు తన స్నేహితుడిని ఏమయింది అని అడుగుతాడు.
మొదటి శిష్యుడు ఏడుస్తూ, "గురువుగారిని నేను ధ్యానం చేస్తూ పొగ తాగవచ్చా (సిగరెట్ కాల్చవచ్చా) అని అడిగాను. ఆయన నా చెంప మీద చెళ్ళున కొట్టి బయటికి వెళ్ళి పొమ్మన్నారు" అని చెప్పి, "మరి నీవిషయం ఏమయింది అని అడుగుతాడు".
ఆ ప్రశ్నికి రెండవ శిష్యుడు, "నేను గురువు గారిని పొగతాగుతూ ధ్యానం చేయవచ్చునా అని అడిగాను, ఆయన నిరభ్యంతరంగా ధ్యానం చేయవచ్చు, అని చెప్పి నన్ను మెచ్చుకుని పంపించారు. అంతేకాని ధ్యానం చేస్తూ పనులు చేయటం కాదు" అని జవాబు ఇస్తాడు. ధ్యానం మన జీవితం కావాలి. మనం చేసే ప్రతిపని ధ్యానంగా మారాలి.
జీవితం ధ్యానంగా మారటం అంటే ఏమిటి ? ప్రతిపని ఏవిధంగా ధ్యానం అవుతుంది ?
ఈ ప్రశ్నికి పరమహంస చాలా సులభరీతిలో ఇలా చెబుతారు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను; ధ్యానం అంటే వర్తమానంలో ఉండటమే. మీరు భూతకాలం నుంచి (గడచిపోయిన విషయాలగురించి మదనపడటం) భవిష్యత్ కి అతి వేగంగా దూకుతూ ఉంటారు. మీరు ఈ రెండు పాయింట్లుకి మధ్య ఎంత వేగంగా తిరుగుతుంటారంటే, వర్తమానం అనే పాయింటు దగ్గర అసలు ఉండరు. అతి సూక్ష్మమయినంత సమయంకూడా వర్తమానంలో ఉండరు. ఎప్పుడయితే మీరు వర్తమానంలో ఉంటారో, అప్పుడు ధ్యానంలో ఉన్నట్టే. మీరు వర్తమానంలో ఉన్నారా? లేదా? అనే ఆలోచనా ఉండదు. మీలో మీరు మాట్లాడుకునే అంతరంగపు మాటలు అసలు ఉండదు. మీరు కేవలం ఆ క్షణంలో ఏపని చేస్తున్నారో అది మాత్రమే మీ లోపల ఉంటుంది.
మీరు కొన్ని సార్లు అనుకోకుండా లేదా తెలిసో తెలియకో, కొన్ని పనులు చేసేటప్పుడు, అందమైన కవిత చదివేటప్పుడు, ఒక బొమ్మని పెయింట్ చేసేటప్పుడు, ఒక చక్కని పాటని వ్రాసేటప్పుడు మీ పరిసరాలని, మిమ్ములని మీరు మరచిపోయి కేవలం చేస్తున్న ఆ పనిలోనే నిమగ్నమై పోతారు. అప్పుడు మీకు మరొక ఆలోచన ఉండదు. దానినే నేను ధ్యాన స్థితి అంటాను. మీరు ఆ విధంగా, చేసే ప్రతిపనినీ చేస్తే మీ జీవితమే ధ్యానం అయిపోతుంది.
మీరు కొన్ని సందర్భాలలో, కొందరి విషయాలలో ఒకమాట వింటుంటారు. అతను ఆ పనిని ఒక తపస్సులా చేస్తున్నాడు. అతను ఆ గ్రంథ రచననని ఒక తపస్సులా చేసి పూర్తిచేసాడు. ఇలా అంటుంటారు. తపస్సు అంటేనే ధ్యానం. కాబట్టి జీవితాన్ని ధ్యానంగా మలచుకోవచ్చు. ప్రతిపనినీ ధ్యానంలా చేయవచ్చు. అలా చేయగలిగినప్పుడు మీరు మీ అంతరంగ ప్రపంచంలోనూ, బయట ప్రపంచంలోనూ ఎంతో నైపుణ్యంతో పనులు చేయగలుగుతారు. మీ జీవితం యొక్క నాణ్యత మీరు ఊహించనంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది.
జ్ఞానోదయమైన యోగులు, గురువులు జీవితాన్ని ధ్యానంలా గడుపుతారు. అందుకే అంత పెద్ద పెద్ద పనులని ఎంతో మాములుగా, సునాయసంగా చేసేయగలుగుతారు. వారి కార్యక్రమాలని గమనించితే సామాన్యులకి అది అసాధ్యం అని అనిపిస్తుంది. ఈ విషయాన్ని వివరిస్తూ పరమహంస శ్రీ నిత్యానంద, ధ్యానమే జీవితంగా గడపగలిగిన వారికి ఈ ప్రపంచంలో అన్ని అద్భుతాలు సుసాధ్యమే అని చెబుతారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ పరమహంస సంవత్సర కేలండరే. ఒక సంవత్సరంలో స్వామీజీ పాల్గొన్న కార్యక్రమాలు, ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఇచ్చిన ప్రవచనాలు గమనిస్తే ఇది సామాన్యులకి అసాధ్యం అని తెలుస్తుంది. ఆయన ఒక సంవత్సరంలో కచ్చితంగా ఒక ప్రపంచ పర్యటన చేస్తారు. వందల కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది సామాన్యులకి అసాధ్యం.

నిత్య జీవితంలో చేసే పనులని సమన్వయంతో చేయగలమా ?
జ్ఞానోదయమయిన యోగులకి, గురుదేవులకి ఇదంతా సుసాధ్యమేనేమో? కాని నిత్య జీవితంలో ఎన్నో పనులు, బాధ్యతలు, సమస్యలు, రకరకాల ఒత్తిడులు వీటి మధ్య ప్రతి పనినీ ఏ విధంగా ధ్యానంలా చేయగలం? అసలు ఒక సమన్వయంతో పనులు చేయగలమా? లేకపోతే లౌకిక విషయాలని, ప్రాపంచిక విషయాలని పూర్తిగా వదిలివేయాలా? ఇదంతా చాలా అయోమయంగా ఉన్నది. అని కొంతమంది అడుగుతుంటారు. వారికి స్వామి ఈ విధంగా చెబుతారు: ధ్యానం మన రోజువారి చేసుకునే ఏ పనికి వ్యతిరేకి కాదు. ధ్యానం అనేది ఒక చర్యకాదు ఒక పని కాదు, అలాగే అది ఏ పనికీ, ఏ చర్యకీ అడ్డంకు కాదు, సరికదా ఎంతో దోహదకారిగా ఉంటుంది.
ఒక్కసారి మీరు నిశ్చలంగా ఉండగలిగే నైపుణ్యాన్ని నేర్చుకోగలిగితే, ఎవరూ, మీ నిశ్చలతని భంగపరచలేరు. మీరు మీ అసలయిన ఉనికిని నిశ్చలంగా ఉంచగలిగితే, ప్రతి పనీ ధ్యానంలా చేయగలుగుతారు. అప్పుడు మీకు బయట ప్రపంచంలో మనుషులు, సంఘటనలు, వస్తువులు అనేవి ఏవీ పట్టవు. మిమ్మలని అవి ఏమీ చేయలేవు. అటువంటి నిశ్చలస్థితిని మీరు పొందగలగాలి. ఆస్థితిని చేరాలి అంటే మీరు ఈ క్రింది విషయాలని గ్రహించాలి.
మీరు మీ అంతరంగంలోని అసలయిన మీ ఉనికిని కనుగొని దానితో సంబంధం ఏర్పరచుకోవాలి. అసలు ముందుగా మీరు అనుకునే ‘మీరు’, అసలయినది మీరు కాదు. మీ అంతరంగంలో ఎన్నో రకరకాల గట్టి పొరల క్రింద కప్పబడిన అసలయిన ‘మీరు’ అనే మీ ఉనికి ఉన్నది అని మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీరు పూర్తిగా మీతోనే ఉండగలగటం నేర్చుకుంటారు.
మీరు కేవలం మీతోనే ఉండగలగటం అంటే మీ ఏకాగ్రతని, మీ తెలుసుకునే తత్వాన్ని మీ అంతరంగంలో కేంద్రీకరించటమే . ఆ విధంగా ఉండటంలోని ఆనందపు అనుభూతిని మీరు పొందగలగాలి. అయితే సాధన ద్వారా మీరు ఆ స్థితిని చేరగలరు. ఈ రోజునుంచీ ప్రతిరోజు అరగంట అలా ఉండటాన్ని సాధన చేయండి. క్రమంగా అలా ఉండే సమయాన్ని పెంచుతూవెళ్ళండి. ఎప్పుడయితే మీరు ఈ స్థితిలో సౌకర్యంగా ఇమిడిపోగలరో, అప్పుడు అదే నిశ్చలతతో బయట పనులు చేయటం ప్రారంభించండి.
మీరు ప్రతి రోజు చేసే చిన్న చిన్న పనులతో ఈవిధంగా ప్రయత్నించి చూడండి. మీరు నడచేటప్పుడు, భోజనం చేసే సమయంలో మీ ఏకాగ్రతని మీమీద, మీ అంతరంగంలోని మీ ఉనికి మీద కేంద్రీకరించండి. ఎప్పుడయితే ఈ విధమయిన చిన్నచిన్న పనులని నిశ్చలతతో చేయగలుగుతారో, క్రమంగా పెద్దపనులు చేసే టప్పుడు కూడా ఆస్థితిలో చేయటం సాధన చేయండి , ఇది క్రమంగా సాధన చేస్తే, అటువంటి నిశ్చలతనిలో ఉండగలుగుతారు.
మీరు ఎప్పుడయితే ఈ విధంగా పనులు చేయటానికి అలవాటు పడతారో, బయట ప్రపంచంలో చూడటానికి మీరు మామూలుగా అన్ని పనులు చేస్తున్నట్టుగానే ఉంటుంది. అయితే మీ జీవన సరళిలో ఎంతో నాణ్యత కనిపిస్తుంది. మీరు చేసే పనులు చాలా నైపుణ్యంతో చేయగలగటం, మీరు స్పష్టంగా గమనించగలుగుతారు. అప్పుడు మీరు మీ జీవితాన్ని మరింత స్పష్టతతో జీవించగలుగుతారు. ఎప్పుడయితే మీ ఏకాగ్రత కేవలం మీ అంతరంగం మీద, మీ ఉనికి మీద కేంద్రీకృతమవుతుందో మీరు చాలా సృజనాత్మకతతో పని చేయగలుగుతారు.
అదే సమయంలో మీరు మీ అంతరంగంలో లోతయిన నిశ్చలతని, నిశ్శబ్దాన్ని అనుభవించుతారు. ఏ విషయం మిమ్ములని సులభంగా కదిలించలేవు. నిజానికి ప్రతి వ్యక్తి కోరుకునే ఒక అద్భుత వరం ఈ స్థితి.
కాబట్టి మీరు అందరూ ప్రతీ పనీ ధ్యానంలా చేయగలరు. మీ జీవితాన్ని ధ్యానంగా మలచుకోగలరు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మనముందు ఉన్న జ్ఞానోదయమయిన యోగులు, గురువులు. నిశ్చలతలోని అద్భుతమయిన అందాలు చూడాలి అంటే జ్ఞానోదయమయిన గురువుల సమక్షంలోనే చూడగలం. ఎందుకంటే వారు ధ్యానం యొక్క లోతులని చివరి వరకూ చూసి ఆస్థితి యొక్క అద్భుతాన్ని అనుభవించారు. వారు నిరంతరం ధ్యాన స్థితిలోనే ఉంటారు.
ధ్యానం మామూలు మనిషిని మహాత్మునిగా మార్చగలదు, అని కూడా మనకి తెలుస్తుంది. ధ్యానం మన ప్రాచీన యోగులు మనకి అందించిన ఒక అద్భుతమయిన వరం, అని ఈ మహాధ్యానులని చూసినప్పుడు మనకి అర్థం అవుతుంది.
ధ్యానం వలన ఇంకా ఏమయినా లాభాలు ఉన్నాయా?
ధ్యానం అనే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియని కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో లక్షల మంది అనుసరించి నిత్యజీవితంలోనూ, ఆధ్యాత్మిక జీవితంలోనూ అద్భుతాలని సాధించారు అని అందరికీ తెలుసు. ఒక సాధారణ వ్యక్తిని మహాజ్ఞానిగా, మహార్షిగా, మర్మయోగిగా మలచగలిగే శక్తి ధ్యానానికి ఉన్నది అని మన పురాణాలు చెబుతాయి. అయితే ఈ విషయాలు ఏవీ సామాన్య మానవులకి అందుబాటులో లేవు. తెలిసిన అతి కొద్ది విషయాలు ధ్యానంలో పూర్తి అవగాహన లేకుండా సగం తెలిసిన విషయాలని మిడిమిడి జ్ఞానంతో ఇంతవరకు ప్రచారం చేసినవి మాత్రమే మనకి తెలుసు.
ఈ సందర్భంలో పరమహంస నిత్యానంద స్వామి ఈవిధంగా అంటారు: అర్ధ సత్యం (Half truth) అబద్ధం కంటే ప్రమాదకరమయినది అని. అంతేకాకుండా సత్యాలు అనుభవాల నుంచి వెల్లడి అయినప్పుడు అవి సూటిగా మనలోనికి చొచ్చుకుపోగలుగుతాయి. ఆ సత్యాలు తమతో పాటు ఆ సత్యాన్ని వివరించే గురుదేవుల ఆశీర్వాద బలాన్ని, ఆయన మన కోసం పంపించే శక్తిని తీసుకువస్తాయి. అందుకే జ్ఞానోదయమయిన యోగీశ్వరుల ద్వారా వెల్లడి అయ్యే సత్యాలు మనని అభివృద్ధి వైపు తీసుకువెళతాయి. మనకి మంచి చేస్తాయి. వారు చూపిన మార్గంలో నడవగలిగితే ఆధ్యాత్మికంగా అత్యున్నత శిఖరాలని చేరగలుగుతాము.
ధ్యానం వలన మనకి లాభాలు ఉన్నాయా అన్న ప్రశ్నకి పరమహంస నిత్యానంద చాలా వివరంగా జవాబు ఇస్తారు. ఆయన ధ్యానం మనకి, ముఖ్యంగా ఆధునిక మానవులకి ఏవిధంగా ఉపయోగపడుతుందో ఈ విధంగా చెబుతారు.
ధ్యానానికి మనిషికి యొక్క ఉన్నతస్థితికి అసలు సంబంధం ఏమిటి?
ముందుగా ధ్యానస్థితి అంటే ఏమిటో చూద్దాము. మనస్సు (మనలోని ఆలోచనా వ్యవస్థ, దీనినే మైండ్ అంటాము) నిరంతరం భూత భవిష్యత్ ల మధ్య అత్యంత వేగంగా తిరుగుతూ ఉంటుంది. మన ఆలోచనలతో మనం ఆవిధంగా నిరంతరం తిరుగుతూ ఉంటాయి అనే విషయం మనకి తెలియదు. ఎందుకంటే మనలో జరిగే చాలా పనులు (లోపల, బయట ప్రపంచంలో) మన అచేతన స్థితిలో జరుగుతుంటాయి. అవే పనులు చేతనస్థితిలో జరిగితే మనకి అసలు మైండ్‌తో అవసరం ఉండదు. మైండ్ అనేది లేనప్పుడు మనకి శారీరక సమస్యలయిన అనారోగ్యాలు ఉండవు, ఇక మానసిక సమస్య అన్న ప్రసక్తే ఉండదు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.
మనకి కలిగే 99 శాతం అనారోగ్యాలు మానసికమైనవే అవి డాక్టర్స్ అంటారు. శాస్త్రవేత్తలు దానిని నిరూపించారు కూడా. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బి.పి., డయాబిటిస్, గుండెకి సంబంధించిన సమస్యలు, చర్మవ్యాధులు మొదలయినవన్నీ మన మానసిక స్థితి నుంచి వచ్చినవేనని నిరూపించారు.
దీని అర్థం ఏమిటంటే మనం చేసే పనులు చేతనస్థితిలో చేయగలిగితే ఈ అనర్ధం జరగదు. అసలు ఆలోచనలు, చేతనస్థితికి ఉండే సంబంధం ఏమిటి? చేతన స్థితి యొక్క నాలుగు స్థితులు అర్ధం చేసుకుంటే ఈ విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది.
| ఆలోచనలతో | ఆలోచనలు లేకుండా | |
|---|---|---|
| 'నేను' అనే స్పృహతో | జాగ్రృతి దశ | తురియ దశ |
| 'నేను' అనే స్పృహ లేకుండా | స్వప్న దశ | సుషుప్తి దశ |
పైన ఇచ్చిన పటంలోని విషయాలు గమనించితే మన చేతనస్థితి యొక్క స్థితులు మనకి తెలుస్తాయి.
అవి 1. ఇందులో జాగృతి దశ, అంటే మనం మెలకువగా ఉన్న దశ. ఈ దశలో మనకి ఆలోచనలు ఉంటాయి. మన మీద మనకి స్పృహ ఉంటుంది. నేను అనేది తెలుస్తుంది. ఈ దశలో మైండ్ (మనస్సు) శరీరం రెండూ శ్రమ పడుతుంటాయి.
2. మరొకదశ, స్వప్న దశ : ఇందులో మనకి ఆలోచనలు ఉంటాయి కానీ మన మీద మనకి స్పృహ ఉండదు. అది నిద్రావస్థ. అక్కడ మన ఆలోచనలు కలల రూపంలో ఉంటాయి. ఆ స్థితిలో శరీరానికి విశ్రాంతి ఉంటుంది. కానీ మైండ్‌కి విశ్రాంతి ఉండదు. 3. తరువాత దశ సుషుప్తి దశ. ఇది గాఢమయిన నిద్రావస్థ. ఈ స్థితిలో మన మీద మనకి స్పృహ ఉండదు. నేను అనేది అసలు ఉండని దశ అదే విధంగా అసలు ఆలోచనలు లేని దశ. మైండ్, శరీరం రెండూ పూర్తి విశ్రాంతిలో ఉంటాయి. కానీ ఈ గాఢమయిన నిద్ర నేటి మానవులకి అరుదయిన విషయం. ఎందుకంటే మనకి కలత నిద్ర కూడా కరువయిన రోజులు కదా.
4. ఇక చివరిదశ తురియ దశ. దీనినే సమాధి స్థితి అని అంటాము. ఈ స్థితిలో ఆలోచనలు అసలు ఉండవు. ఆలోచనలు సున్నాస్థాయిలో ఉంటాయి. కానీ పూర్తిగా నేను అనే స్పృహ ఉంటుంది. నేను అనేది తెలుస్తుంది. ఈ స్థితిలోనే పూర్తి వర్తమానంలో మనం ఉండగలిగే దశ. ఈ దశలోనే మనిషి జ్ఞానోదయాన్ని పొంది శాశ్వత ఆనందస్థితిలో ఉండగలడు. ఈ స్థితిలోనే అతను సర్వాంతర్యామికి చేరువకాగలడు.
