అధ్యాయం - 3: శ్రద్ధని ఆశించే అవసరాన్ని విడిచిపెట్టటం
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

(Dropping attention-need)
ఇప్పుడు మనం అనాహత చక్రం గురించి తెలుసుకుందాం. ఇది గుండె ఉండే ప్రాంతంలో ఉంటుంది. సంస్కృతంలో అనాహతమంటే 'సృష్టించలేనిది’ అని అర్థం. మీరు ఎదుటివారి శ్రద్ధ, ప్రేమ, మీకు కావాలి అని అనుకున్నప్పుడు ఈ చక్రం బంధింపబడుతుంది. అదే మీరు స్వార్థం లేని ప్రేమని పంచినపుడు అలాగే ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకుండా వారిని ప్రేమించినపుడు ఈ చక్రం వికసిస్తుంది.
ధ్యానపద్ధతి మహా మంత్రధ్యానం. ఇది టిబెటియన్ బౌద్ధుల ధ్యాన పద్ధతి:
అనాహత చక్రం ప్రేమ, భావోద్రేకo, మనోభావాలకు సంబంధించినది. ఎప్పుడయితే మనం మనలో ప్రవహించే ప్రేమని కాకుండా, ఎదుటివారి ప్రేమని, మనపై వారి శ్రద్ధని ఆశిస్తామో, అప్పుడు ఈ చక్రం బంధించబడుతుంది. ఈ చక్రం అర్ధమే పుట్టించలేనిది. అంటే నిజమైన ప్రేమని బయట పుట్టించి మీలో నింపుకోలేరు. ఇది కేవలం మీలోనే ఉదయించాలి. అంతే.
ఇది మీ లోతైన అంతరంగాన్ని తెలుసుకున్నప్పుడు జరుగుతుంది. మనలో నిజమయిన ప్రేమ ఉంటే మనం బయట ప్రేమని, వారి శ్రద్ధని ఆశించము. మన అంతరంగంలోని ప్రేమ మనకు గొప్ప శక్తి అవుతుంది.
ఇతరుల శ్రద్ధను ఆశించటం అంటే ఏమిటి?
మనం ఏమి చేసినా, ఏమి ఆలోచించినా మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్నవారి అనుమతిని ఆశిస్తాము. మనం అందరి దగ్గరా మంచి అనిపించుకోవాలనే విషయం మీద చాలా శ్రద్ధ చూపిస్తాము. అయితే దీనిని మనం స్పష్టంగా, మనకి తెలిసే విధంగా చేయము. కాని లోతుగా విశ్లేషించితే మీరు ఇతరుల పొగడ్తలు, వారి అనుమతి లేనిదే స్వేచ్ఛగా ఉండలేరు అని తెలుస్తుంది. ఇతరుల అనుమతి, ప్రోత్సాహం కొరటమే ‘శ్రద్ధ’.
మన సమస్యలలో 80% కేవలం ఇతరుల శ్రద్ధ మనపై ఉండాలి అనుకోవటం, వారి అనుమతిని, ప్రోత్సాహాన్ని ఆశించటం వలన వస్తాయి. మీరు అలా కూర్చుని, ఒక రోజులో ఎదుటివారి అనుమతి కోసం, సంఘంలో మంచిపేరు కోసం మీరు చేసే పనులన్నీ ఒక పేపరు మీద వ్రాయండి. మీకే తెలుస్తుంది.
మీరు గమనిస్తే 24 గంటలూ మీ జీవితమంతా ఇతరుల అనుమతి కోసం, ఇతరుల ప్రోత్సాహం కోసం మాత్రమే గడిపినట్టు తెలుస్తుంది. ఇటువంటి అనుమతి మీ కుటుంబ సభ్యుల నుంచి కాని, మీ సమాజం నుంచి కాని మీరు ఆశిస్తూనే ఉంటారు. మీ పనులన్నీ ఇతరుల అనుమతి లేదా సంతకాల కోసమే.
మీరు ఒక పెద్ద రిజిస్టరు తీసుకుని అందులో ఒక కాలమ్‌లో మీరు ‘మంచి తండ్రి’ అని రాసుకుంటారు. మీరు మీ పిల్లలకు చేయవలసినదంతా చేసి వారి అనుమతి సంతకాన్ని మంచి తండ్రి కాలంలో వ్రాయలని ఆశిస్తారు. మీ భార్య, మీ యజమాని, మీ స్నేహితులు ఇలా మీ రిజిస్టర్ లో సరిపోయే పేర్లతో చాలా వరుసలు తయారుచేస్తారు. ఈ వరుసలన్నీ వాళ్ళ అనుమతి కోసం, వాళ్ళ సంతకాల కోసం ఉపయోగిస్తారు. అంతే మీరు చేసేది.
మరొక విషయం. వీళ్ళందరూ మీ దగ్గరికి కూడా సంతకాల కోసం వస్తుంటారు. మీరు కూడా వాళ్ళ రిజిస్టర్లో సంతకాలు చేయాలి. మనలో ప్రతి ఒక్కరం ఈ సంతకాల శిబిరాలలో పూర్తిగా గడిపేస్తాము. మనం మన సమాజం నుండి
వీలయినన్ని మంచి అభిప్రాయాలు సేకరించి వాటితో మనం ఎంత మంచివాళ్ళమో మనం మన సంఘానికి నిరూపించుతాము.
ఎందుకు మనం మనపై ఎదుటివారి అభిప్రాయానికి అంత విలువ ఇస్తాము? మన గురించి మన శక్తిపై ఆధారపడి ఎందుకు నిర్ణయాలు చేసుకోం? మన పని మనం చేసుకుపోవచ్చు, కాని ఎందుకు ఎదుటివారి నుంచి శక్తి సంపాదించుకోవటం? ఇవన్నీ కూడా రెండు విషయాల వలన జరుగుతాయి. మొదటిది మన గురించి మనకి ఏమి తెలియదు. మన గురించి ఎదుటివారి అభిప్రాయాల ద్వారా మాత్రమే మనం తెలుసుకుంటాము.
రెండవది ఎదుటివాళ్ళు తమ అనుమతిని ఇచ్చి, శ్రద్ధ చూపినపుడు వాళ్ళుమనకి శక్తినిస్తారు. ఆశక్తితో మనం నడుస్తాం. శ్రద్ధ అంటే శక్తి. అందుకే మనం ఎదుటివారు చూపే శ్రద్ధకి అంతగా పొంగిపోతాము.
ఈ శ్రద్ధ చూపటం అన్నది ఎలా ఉన్నా మనకి పరవాలేదు. చాలా ఇళ్ళల్లో, అత్తా కోడళ్ళు పోట్లాడుకుంటూనే ఉంటారు. ఎప్పుడూ ఒకరిమీద ఒకరు భర్త లేదా కొడుకుకి చాడీలు చెబుతూనే ఉంటారు. వాళ్ళు ఎంత పోట్లాడుకున్నా, కలసి లేనప్పుడు దిగాలుగా ఉంటారు.
ఇలా ఎందుకు జరుగుతుంది? వాళ్ళు అలా పోట్లాడుకునేటప్పుడు ఎదుటివారి శ్రద్ధ వారి మీద ఉంటుంది. ఈ సందర్భంలో ఒకమాట. మీరు అనుకూలమైన శ్రద్ధ మాత్రమే శక్తిని ఇస్తుంది అనుకోవద్దు. ఎదుటివారిపై ఎటువంటి శ్రద్ధ చూపినా అది వారికి శక్తిని ఇస్తుంది.
వాళ్ళిద్దరూ కూడా వారికి తెలియని స్థితిలో ఒకరిమీద ఒకరి శ్రద్ధని ఆ పోట్లాడుకోవటం ద్వారా పొంది అందులో ఆనందపడతారు. అందుకే ఎవరైనా ఎక్కడికైనా వెళితే వారిని మిస్ అవుతారు. ఇక్కడ వాళ్ళు కోల్పోయేది వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి చూపే శ్రద్ధ. అయితే ఇలా ఒకరినొకరు మిస్ అయినపుడు వారు ఎదుటివారి
సమక్షాన్ని కోల్పోయాము అని అనుకున్నపుడు వారు దానిని ప్రేమ అని చెబుతారు. వారు అలా అయినట్లు అనుకోవటానికి కారణం వారి మీద ప్రేమ అని చెబుతారు.
అది కచ్చితంగా నిజమే అయిఉండవచ్చు. కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవలసిన ముఖ్యవిషయం ఈ 'శ్రద్ధ' అనేదే శక్తి. అది మనని మంచి ఉత్సాహంగా ఉంచుతుంది. ఇది చాలా సూక్ష్మరూపంలో మనకి శక్తిని ఇస్తుంది. మనం ఆ సంగతిని తెలుసుకోలేము.
ఒక విషయం అర్థం చేసుకోండి. మనకి ‘ఏదో ఒకటి’ అవసరం అనుకుంటే ఆ ఏదో ఒకటి ప్రేమకాదు. అది శ్రద్ధ. మీకు ప్రేమ అవసరం లేదు. మీరే ప్రేమ, మీరు ఎప్పుడయితే ‘నాకు ప్రేమకావాలి' అని అన్నారో, ఎప్పుడయితే నన్ను ఎవరైనా ప్రేమించాలి అని అనుకుంటారో, మీకు నిజంగా కావలసినది ప్రేమకాదు. ఎదుటివారి శ్రద్ధ మీ మీద కావాలి.
నా దగ్గరకి వచ్చి కొందరు చెబుతుంటారు. ఈ పెద్ద వయస్సులో మా పిల్లలు మమ్ములని ప్రేమించటం లేదు అని అంటారు. అసలు వాళ్ళు చెప్పే మాటలకి అర్థం ఏమిటంటే వాళ్ళ పిల్లలు వారిపై తగినంత శ్రద్ధ చూపటం లేదు అని. అంటే ఆ వయస్సులో వారికి అవసరమైన శక్తి దొరకటం లేదు.
నిజానికి మన వయస్సు పెరిగే కొద్దీ మనం ఏకాగ్రతని మన మీద నిలుపుకోవాలి. మనకి వయస్సు పెరిగేకొద్దీ మనలో ఉన్న అనంత విశ్వశక్తి పై సున్నితపు స్పందన పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏమి జరుగుతుంది. మనం కావలసిన శక్తి కోసం, ఎదుటివారు మనపై చూపే శ్రద్ధ కోసం మనం ఎదుటివారి మీద మన జీవితమంతా ఆధారపడ్డాము. మనం ప్రేమ కేవలం మానవ సంబంధాలలో మాత్రమే ఉన్నది అని అనుకుంటాము. మనం మన అంతరంగంలో ఏముందో తెలుసుకోకుండా, దాని విషయంలో ఎటువంటి సున్నితమైన స్పందనా లేకుండా బ్రతికాము. పెద్ద వయస్సు వచ్చే సరికి బయట నుంచి వచ్చే ప్రేమని కోల్పోతున్నాము. ఎదుటివారి శ్రద్ధని కోల్పోతున్నాము. మీ కుటుంబసభ్యులు వేరే పనులలో బిజీ అయిపోతారు. మీతో మామూలుగా ఉంటారు. అప్పుడు మీరు వయసు వలన అని ఫిర్యాదులు చేస్తుంటారు.
మీరు ఎందుకు ఫిర్యాదు చేస్తారంటే, మీకు జీవితంలో ఇంత అనుభవం వచ్చినా, మీకు కావలసిన శక్తి మీ అంతరంగంలోనే ఉన్నది అని, అది బయట ప్రపంచంలో ఎక్కడా దొరకదని మీరు తెలుసుకోలేక పోయారు. అందుకే, వయస్సు పెరిగేకొద్దీ ఇంకా సంతోషంగా, ఎంతో శక్తితో ఉండవలసిన మీరు శక్తిహీనులుగా జీవిస్తున్నారు. మీ చుట్టు ప్రక్కలవారి నుండి మాత్రమే శక్తిని పొందటానికి అలవాటుపడిన మీరు, వారు ఇక మీద అటువంటి శక్తిని ఇవ్వనప్పుడు మీరు శక్తిహీనులవుతారు.
మీరు బయట ప్రపంచంలోని శక్తి వనురుల మీద అధికంగా ఆధారపడ్డప్పుడు, మీరు మానసిక వైకల్యం పొందుతారు. అలాగేవారి మీద మీరు భౌతికంగా ఆధారపడితే మీరు భౌతిక వైకల్యం పొందుతారు. అంతే, భౌతిక వైకల్యం అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు దానిని స్పష్టంగా చూడగలుగుతారు. కానీ మానసిక వైకల్యం మీకు తెలియదు. అందుకే మీకు మానసిక వైకల్యం ఉన్నది అని తెలుసుకోలేరు. ఎప్పుడయితే ఆ విషయం మీకు తెలియదో, దాని ఫలితాలని, అందువలన జరిగే పరిణామాలని ఊహించలేరు. ఎప్పుడయితే వాటి ఫలితాలు అనారోగ్య రూపంలో బయటపడతాయో అప్పుడు మీరు కారణాలు తెలియక ఆశ్చర్యపోతారు.
మీరు చిన్న పిల్లలు పేకలతో పెద్ద పెద్ద భవంతులు కట్టటం చూస్తుంటారు. పేకలని ఒక యాంగిల్లో అమర్చుతూ చాలా అంతస్తులు కడతారు. అది చూడటానికి పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ అందులో నుంచి మీరు ఒక్క కార్డు తీసినా, మొత్తం భవనమంతా కూలిపోతుంది. భవనం ఎత్తు ఎక్కువ అయ్యేకొద్దీ, అది త్వరగా పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అదేవిధంగా మిమ్ములని మీరు ఇతరుల అభిప్రాయాలతో ఒక పెద్ద భవనాన్ని నిర్మించుకున్నారు. మీరు మీ తల్లితండ్రుల దగ్గరనుంచి, స్నేహితులు, బంధువులు, టీచర్స్, తెలిసినవారు ఇలా ఎంతో మంది దగ్గర నుంచి జాగ్రత్తగా సేకరించిన వారి సంతకాలు, సర్టిఫికెట్లు, మీపై వారి అభిప్రాయాలతో మీరు అనే ఒక పెద్ద భవనాన్ని కట్టుకుంటారు. అది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అది చూసి మీరు చాలా సంతోష పడతారు.
కానీ వారిలో ఒక్క వ్యక్తి అయినా తన సంతకాన్ని కొట్టేసినప్పుడు లేదా తన సర్టిఫికెట్‌ని వెనక్కి తీసేసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? ఆ భవనం కూలిపోతుంది. మీ గురించి మీరు చాలా బాధపడతారు. మానసికంగా కుంగిపోతారు. ఈ ప్రపంచం మునిగిపోతుంది, ఇక అంతా అయిపోయింది అని కలవరపడిపోతారు.
చూడండి : చిన్న పిల్లలు కట్టుకునే పేకమేడలు కూలిపోతే మళ్ళీ ఆ కార్డులతో కట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ పేకలు వాళ్ళవి. కానీ మనం కట్టుకునే భవంతులు ఇతరుల కార్డులతో కడతాము. ఇతరుల సర్టిఫికెట్లతో కడతాము. అందుకే భవనం మీద మనకి ఎటువంటి నియంత్రణ ఉండదు. దానిని తిరిగి కట్టుకోలేము. ఎందుకంటే అందులో ఉపయోగించిన ఎదుటి వారి సర్టిఫికెట్లు, మనవి కాదు.
సరే, అలా అయితే ఇప్పుడు మనం ఏమి చేయాలి? ఆ భవనాన్ని కూలిపోకుండా కాపాడటానికి మన శక్తినంతా ఉపయోగించి ఎంతో కష్టపడతాము. దానిని జాగ్రత్తగా కాపాడుకుంటాము. ఎదుటివారు వారి సర్టిఫికెట్లు తీసేసుకోకుండా, వారి సంతకాలు కొట్టేయకుండా, వారి సమ్మతికి అనుగుణంగా ప్రవర్తించుతాము. వారికి నచ్చే పనులే చేస్తుంటాము. నిరంతరం వారి అభిప్రాయాల కోసం, వారి సమ్మతి కోసం మాత్రమే పని చేస్తుంటాము. చివరికి ఎదుటివాటి సమ్మతి, అభిప్రాయాలు మనకి ప్రాణాధారమవుతాయి.
ఒక చిన్న కథ:
ఒకామె ఆమె భర్తతో కలసి చీర కొనుక్కోవాలి అని షాపుకి వెళుతుంది. వాళ్ళు చాలా షాపులు చూస్తారు. చాలా చీరలు చూస్తారు. కానీ ఆమెకి ఏవీ నచ్చవు. భర్తకి నీరసం వచ్చేస్తుంది. అతను చివరికి ఆమెని ఇలా అడుగుతాడు "అసలు నీవు ఎలాంటి చీర కొనుక్కోవాలనుకుంటున్నావు?" అని. దానికి అతని భార్య, "నేను ఎలాంటి చీర కోసం చూస్తున్నానంటే, అది పడి చనిపోయే చీర" అని అంటుంది. భర్తకి ఏమీ అర్థంకాదు. అప్పుడు ఆమె అతనితో ఇలా అంటుంది. "ఎవరైనా నా చీర చూడగానే వాళ్ళు ఆశ్చర్యంతో క్రింద పడిచనిపోవాలి".
(అంతా పెద్దగా నవ్వుతారు)
మనం నిరంతరం ఏవిధంగా ఇతరుల నుంచి ఎలా సర్టిఫికెట్లు సేకరించాలా అని చూస్తుంటాము. మనం చేసే ప్రతి పనీ, మనకి తెలియకుండానే ఎదుటివారి అభిప్రాయానికి అనుగుణంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ప్రతీపని ఎదుటివారు ఏమంటారో అనేవిధంగా చేస్తాం. వాళ్ళు ఈ పనికి ఎలా స్పందించుతారో అనుకుంటూ చేస్తాము.
ఉదాహరణకి: మీరు ఒక బ్యాగ్ కొనాలి అని అనుకుంటారు. ఒకటి చూస్తారు. అది మీ దగ్గర ఉన్న డబ్బుకి మీ స్తోమతలో కొనేయగలరు. దానివలన మీకు ఉపయోగం ఉన్నది. కానీ మీకు తెలియకుండానే ఆ బ్యాగ్ పట్టుకుని బయటకి వెళ్ళినపుడు దానిని చూసిన వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించుతారు. అది ఎదుటి వారికి బాగుండదు అని నిర్ణయించుతారు. వెంటనే ఆ బ్యాగ్ వదిలేసి వేరే దానికోసం వెతుకుతారు. కానీ మీరు సర్టిఫికెట్ల కోసం వెతుకుతున్నారు అని అంటే మాత్రం మీరు ఒప్పుకోరు. ఎందుకంటే ఇదంతా మీకు తెలియకుండా జరిగిపోతుంది.
మనం ఎలా తయారవుతామంటే చివరికి 100 కాళ్ళు ఉండే గాజు పురుగులా తయారవుతాము. అది నడవాలంటే దానికి 100 కాళ్లు అవసరం. అదే విధంగా మన జీవితం నడవాలంటే ఒకేవిధంగా ఉండే అందరి అభిప్రాయాలు, సమ్మతి మనకి కావాలి. ఈ 100 కాళ్ళలో ఏ ఒక్కటి దెబ్బతిన్న, ఆ గాజుపురుగు మరి ముందుకు నడవలేదు. అది ఎక్కడ ఉన్నదో అక్కడే ఆగిపోతుంది. మనదగ్గర ఉన్న ఒక్క సర్టిఫికెట్టు పోయినా, లేదా ఏ ఒక్కరి దగ్గరనుంచైనా సమ్మతి లేకపోయినా మన పరిస్థితి ఏమవుతుంది. మనం మానసికంగా కుంగిపోతాము. ఇక అక్కడే మన జీవితం ఆగిపోయినట్టు అనుకుంటాము.
మనం ఎదుటివారిమీద ఎక్కువగా ఆధారపడిపోతే, మనం తప్పనిసరిగా మానసిక క్షోభకి గురి అవుతాము. ఇలా మానసిక కుంగుబాటుతో బాధపడేవారంతా, ఎదుటివారు తమ మీద శ్రద్ధ చూపాలి అని కోరుకునే వారే. కొంతకాలం గడిచేసరికి వారికి కావలసినంత శ్రద్ధ ఎదుటివారి నుంచి దొరకదు. అప్పుడు ఆ పరిస్థితిని ఎలా సంభాళించుకోవాలో వారికి తెలియదు. కొన్ని సందర్భాలలో కేవలం ఒక్కమాటతో మనుషులు మానసిక కుంగుబాటుకి లోనయిపోతారు. కానీ మనకి ఆ కుంగుబాటుకు కారణం తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాము? మందులు వాడటం మొదలుపెడతాము. మందులతో దానిని బాగుచేయాలి అనుకుంటాము.
అది మందులతో ఎలా నయమవుతుంది? మీ మానసిక క్షోభకి కారణం మీలోపల ఉన్నది. కానీ మీరు బయట మందుల సహాయంతో దానిని తొలగించాలని చూస్తున్నారు. నా దగ్గరకి ఎవరైనా ఇటువంటి మానసిక క్షోభతో వస్తే వారిని మహామంత్రధ్యానం చేయమంటాను. క్రమంగా మందుల వాడకం మానేస్తారు.
చూడండి: ఇటువంటి వారికి వారి శక్తి వారి లోనే ఉన్నది అని చూపించాలి. ధ్యానం వారికి ఆ విధమైన సహాయం చేస్తుంది. ధ్యానంతో వారు వారిలోని శక్తిని చూడగలుగుతారు.
వారు ఎంత నిజాయితీగా ధ్యానం చేస్తే, అంత బాగా శక్తిని వారిలోపల నింపగలరు. అప్పుడు అన్ని రకాల మానసిక కుంగుబాటు నుండి బయటకి రాగలుగుతారు. అలా కాకుండా మందులు వాడితే ఇంకా నెమ్మదిగా డల్‌గా అయిపోతారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం అవసరం. మీకు ఒక విషయం చెబుతాను. మీరు
శక్తిని బయట నుంచి తెచ్చుకుంటే అది మీలో కల్లోలం సృష్టిస్తుంది. మీరు దానిచేతిలో ఒక తోలుబొమ్మలా అయిపోతారు.
ఒక ప్రయోగం:
ఆరోగ్యంగా ఉన్న తెలివైన యువకుడు ఉదయాన్నే ఆఫీసుకి బయలుదేరుతాడు. అప్పుడు అతని భార్య అతనివైపు చూసి “మీరు చాలా నీరసంగా అలసిపోయినట్లు కనపడుతున్నారు. మీకు ఒంట్లో బాగానే ఉన్నది కదా?” అని అడుగుతుంది.
ఆ ప్రశ్నకి ఆ యువకుడు విసుక్కుని అలాంటి ఊహలు మానుకోమని చెప్పి బయటకి వస్తాడు. అతను కారు బయటకి తీస్తుంటే వాళ్ళ పక్కింటాయన ఆ యువకుడిని చూసి గట్టిగా ఇలా అడుగుతాడు “మీకు ఆరోగ్యం బాగానే ఉన్నదా? చూడటానికి ఏదోలా ఉన్నారు”. అతని మాటలకి ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు. అయినా సరే ఏదోలే అనుకుని కారులో ఆఫీసుకి వెళ్ళిపోతాడు.
ఆఫీసుకి వెళ్ళి, లోపలకి వెళ్ళబోతుంగా అక్కడ ఉన్న రిసెప్షనిస్టు “సార్, మీకు ఆరోగ్యం బాగా లేదనుకుంటా. ఆఫీసుకి ఎందుకు వచ్చారు?” అంటుంది.
ఆ ప్రశ్నకి ఆ యువకుడు “నాకు బాగానే ఉన్నది. అయినా చూస్తాను...............” అని లోపలికి వెళ్ళిపోతాడు. అతను పని చేసుకోవటం మొదలు పెట్టగానే అతని స్నేహితుడు వచ్చి “ఏమిటి అదోలా ఉన్నావు. ఆరోగ్యం బాగాలేదా? జ్వరంగా ఉన్నదా?” అని అడుగుతాడు.
దీనితో అతనికి నిజంగానే ఏదో అనారోగ్యం ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడే వాళ్ళ మేనేజరు వచ్చి ఆ యువకుడిని చూసి, “నీవు చాలా అనారోగ్యంగా కనిపిస్తున్నావు. ఇవాళ ఆఫీసులో పనిచేయగలవా? డాక్టర్ దగ్గరికి వెళ్ళవచ్చు కదా? అంటాడు. ఆ యువకుడికి నిజంగానే జ్వరం వచ్చినట్లు అనిపించింది. అప్పుడు అతను సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోతాను అని అడిగి ఇంటికి వచ్చేస్తాడు.
కారులో ఇంటికి బయలుదేరగానే అతనికి జ్వరం పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళగానే భార్య అతని నుదురు తాకి చూసి అతనికి జ్వరం బాగా ఉన్నది అని చెబుతుంది.
ఆరోగ్యంతో ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి మధ్యాహ్నానికి జ్వరంతో వెనక్కి వచ్చేస్తాడు. అతనికి జ్వరం ఎలా వచ్చింది. కేవలం కొంతమంది అతనితో నీకు ఒంట్లో బాగాలేదు అని చెప్పటంతో జ్వరం వచ్చింది. యూనివర్సటీవాళ్ళు, వీరి అందరినీ అలా చెప్పమని ముందే వారితో చెప్పి వుంచారు. అప్పుడు ఏమి జరిగింది? అతనికి నిజంగానే జ్వరం వచ్చింది. ఈ ప్రయోగాన్ని మొత్తం 11 మంది మీద చేశారు. 11 మంది చివరికి అనారోగ్యంతో తిరిగి ఇళ్ళకి చేరారు.
మీరు మీ లోపలి శక్తి మీద ఆధారపడకుండా బయట ప్రపంచంలోని శక్తి మీద ఆధారపడితే ఇలాగే జరుగుతుంది. బయటివారి ప్రభావంతో మీరు ఉన్నత స్థితి నుండి కిందకి దిగజారిపోతారు. మనం మన అంతరంగంలోని శక్తి మీద మాత్రమే ఆధారపడితే మనని ఎవరూ కదిలించలేరు.
మనం చాలా పనులు ఎదుటివారి ప్రశంసల కోసం వారి సమ్మతి కోసం మాత్రమే చేస్తాము. కానీ, ఆ పనులని మనం ప్రేమ లేదా బాధ్యత అనే పేరుతో చేస్తాము. నాతో చాలామంది అంటుంటారు. “స్వామీజీ, మేము ఎదుటివారి పొగడ్తల కోసం లేదా వారి సమ్మతి కోసం పనులు చేయము. ఇది మా బాధ్యత’ అని.
స్పష్టంగా అర్థం చేసుకోండి: ఎపుడయితే మీరు ఒక పనిని బాధ్యత అని చేస్తారో, మీరు ఆ పనిని ఎదుటివారి సమ్మతి కోసం చేసినట్టే. అలా చేయకపోతే వారు తమ సమ్మతిని ఆపేస్తారు అనే భయం. వాళ్ళు మిమ్మలని సమ్మతించేది వారు ఆశించినవన్నీ మీరు పూర్తిగా చేసినంతవరకు మాత్రమే. అలా చేసే సమయంలో ఏచిన్న పొరపాటు జరిగినా వారితో మీకుండే సంబంధాల విషయంలో మార్పు రావటం మీరు చూడగలుగుతారు. అది మీకు తెలుసు. అందుకే మీ విధి మీరు నెరవేరుస్తారు.
మీరు నాతో అనవచ్చు. “స్వామీజీ, నేను వారికి తండ్రిని. నేను వాళ్ళకి ఇవ్వవలసినవి ఇవ్వకపోతే ఎవరు వాళ్ళని పట్టించుకుంటారు?”. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. నేను పిల్లలకి లేదా ఎవరికి మీరు ఏమి చేయాలో అది చేయవద్దు అని అనటం లేదు. వాళ్ళు మీరు కన్న పిల్లలు. మీరు వారికి చూడవలసినవన్నీ చూడాలి. వారి వారి కాళ్ళమీద నిలబడి స్వతంత్రులయ్యేవరకు మీరు వారి విషయాలు చూడాలి. కానీ మీరు అలా చేసిన దానికి ఏమీ ఆశించకండి. అది ఒక పని. అది మీలోపల ఉన్న ప్రేమ యొక్క శక్తిని వెల్లడిచేసే ఒక పద్ధతి అని చేయండి. అంతే.
ఇప్పుడు మీరు ఏమంటారు, నేను ఇవన్నీ కూడా ఏమీ ఆశించి చేయటం లేదు అని. కానీ ఎప్పుడైతే ఎదుటివారి నుంచి మీరు అనుకునే స్పందన తగ్గుతుందో మీకు తెలుసు, మీరు ఎంత కంగారుపడతారో, ఎంత ఆశాభంగం పొందుతారో. అందంతా కూడా మీ మనసులో మీరు చేస్తున్న పనికి లేదా మీ బాధ్యతకి తగిన స్పందన రానందుకు మీరు పడే వేదన. ఈ బాధ మనిషి మనిషికి మారుతుంది. కానీ అందరిలోనూ అన్ని సందర్భాలలోనూ ఉంటుంది.
అలా మీలో జరిగినప్పుడు, మీరు లోపలి ప్రేమ అనే శక్తిని వెల్లడి చేసేందుకు ఈ పనులు చేయటం లేదు. కేవలం ఒక మామూలు, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి బాధ్యత, దానిని మీరు ప్రేమ అంటారు, దాని కోసం చేస్తారు. అది మీలో ఉన్న అత్యుత్తమమైన అనంత విశ్వశక్తితో చేయటంలేదు. మీ బాధ్యత కేవలం బయట ప్రపంచానికి సంబంధించిన ఒక వ్యవహారం మాత్రమే.
భగవద్గీతలో చక్కగా చెప్పబడింది.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా.
దీని అర్థం ఏమిటంటే, నీ పని కేవలం నీపని చేయటం మాత్రమే. దాని ఫలితాలని గురించి అసలు ఆలోచించవద్దు.
మీలో చాలా ప్రేమతో కూడిన శక్తి ఉన్నది. అందుకే మీరు ఎన్ని పనులైనా అలా చేస్తూ ఉండగలరు. ఎటువంటి కారణం లేకుండా, ఏమాత్రం ఆశించకుండా మీలోని
శక్తి తరంగాలని అలా వ్యాపింపచేయగలరు. మీరు ఆవిధంగా ఉన్నప్పుడు మీరు ఫలితాలని గురించి అసలు పట్టించుకోరు. ఫలితాలను పట్టించుకోవద్దు అని నేను అంటే అది నిరుత్సాహంతో, ఆశాభంగంతో, మానసిక కుంగుబాటుతో చేయమని కాదు. నా మాటలకి అర్థం ఏమిటంటే, మీకు అసలు ఫలితాలని ఎలా ఆశించాలో కూడా తెలియకపోవటం. ఎందుకంటే మీరు నిరంతరం మీలోపలి పరమానందకరమైన శక్తిని వెల్లడి చేస్తూ ముందుకి సాగిపోతూ ఉంటారే కాని ఆగి ఫలితాల గురించి ఆలోచించరు. అంతే. అందుకే మీరు ఫలితాలను ఆశించటం లేదు, అనికూడా చెప్పలేము. మీరు ఆనందంగా ముందుకి సాగిపోతుంటారు అంతే. ఇలా మీలో ప్రవహించే శక్తిని ప్రేమ అంటారు.
మీరు ఎదుటివారి నుంచి ఆశించటం మొదలుపెడితే దానికి అంతం ఉండదు. మీకు చెబుతున్నాను, అర్థం చేసుకోండి. మీ చుట్టుప్రక్కల ఉన్నవారినందరినీ తృప్తి పరచటం చాలా కష్టం. నిరంతరం అందరినీ సంతోషపెట్టటం, తృప్తి పరచటం సాధ్యమని మీరు అనుకుంటున్నారా? ఎప్పటికీ సాధ్యం కాదు. అది ఈ భూమి మీద సాధ్యపడే విషయం కాదు.
ఒక చిన్న కథ:
ఒక భార్య, భర్త తమ 50వ పెళ్ళిరోజుని జరుపుకుంటారు. భార్య ఆ సందర్భంగా భర్తకి రెండు షర్టులు బహుమతిగా ఇస్తుంది. భర్తకి చాలా సంతోషం కలుగుతుంది. ఇక ఆ రోజు వంటచేయొద్దు హోటల్‌కి వెళదాము అని భార్యతో అంటాడు. అవి వారికి చాలా సున్నితమైన క్షణాలు.
భర్త తయారయి, భార్య సంతోషపడుతుందని ఆమె బహుమతిగా ఇచ్చిన రెండు షర్టులలో ఒకటి వేసుకొని బయటకి వస్తాడు. అప్పుడు భార్య అతని వైపు చిరునవ్వుతో చూస్తుంది. కానీ వెంటనే ముఖం మార్చుకొని, “అంటే ఆ రెండవ షర్టు నచ్చలేదనేగా” అంటుంది.
(అంతా నవ్వులు)
ఎదుటివారిని పూర్తిగా సంతోష పరచలేము. ముందుగా మీరు తృప్తి చెందండి. మీలో మీరు పూర్తిగా ఫలసిద్ధి పొందండి. అది చాలు. మీలోని ఆ తృప్తి మీ చుట్టుప్రక్కల వారికి సంబంధించినది కాదు. అది కేవలం మీనుంచి పొంగిపొరలే శక్తి. మీ చుట్టుప్రక్కల ఎవరు ఉన్నా, లేకున్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఆ శక్తి అలా అనంత వాహినిలా మీ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అది చాలు.
ఎదుటివారికి ఎంతో కొంత మంచి చేయాలి. ఎదుటివారి మీద శ్రద్ధ చూపించటం వారిని ప్రేమించటం మంచిది. కానీ అది అంతా మీ అంతరంగం లోతులలో ఉండే ప్రేమ యొక్క శక్తితో జరగాలి కానీ భయంతోకాదు. ఏదో వాళ్ళు సర్టిఫికెట్లు వెనక్కి తీసుకుంటారు అనే భయంతో అలా చేయకూడదు. ఎదుటివారి అభిప్రాయాలపై ఎక్కువగా ఆధారపడకండి. అలా చేస్తే వారి అభిప్రాయాలు మీ జీవితంలో ముఖ్యమైపోతాయి. ఎదుటివారి నుంచి శక్తిని పొందటానికి చూడకండి. మీ మానసిక జీవనానికి ఎదుటివారి మీద ఆధారపడకండి.
మీ అందరి కోసం ఎదుటివారి మీద ఆధారపడితే మీ జీవితపు నియంత్రణ వారి చేతికి ఇచ్చిన వారవుతారు. మీరే మీకు గొప్ప శక్తి వనరులు కావాలి. నిరంతరం మీకు మీరే ప్రేరణ కావాలి. మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీ నిజమైన ఆనందం మీకు బయటవారిలో దొరకదు. ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే మీకు ఉండే సమస్యలు తీరినట్టే.
నేను మీకు ఇంతకు ముందు చెప్పాను: మీ గురించి మీకు తెలియదు. అందుకే మీరు సమాధానం కోసం సమాజంవైపు తిరుగుతారు. సమాజం చాలా ఆనందంగా తన సర్టిఫికెట్లని, ముద్రలని మీ మీద వేస్తుంది. మంచి తండ్రి, మంచి తల్లి, అందమైన వ్యక్తి, నీకు ఏమీరాదు....... ఇలా ఎన్నో రకాల ముద్రలని మీ మీద వేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, సరైన అడ్రస్ లేని పార్సిల్ ఒకచోట నుంచి వేరొక చోటకి తిరుగుతూ చాలా ముద్రలని వేయించుకుంటుంది. మనం కూడా ఒక ఆధారమైన పాయింట్ లేకుండా సమాజం చేత అలా ముద్రలు వేయించుకుంటాం.
మిమ్మలని మీరు మీ అంతరంగంలో నిలుపుకోలేకపోతున్నారు. అప్పుడు మీకు ఆ పార్సిల్ లోపల ఉండే పదార్థమే మీరు కాని బయట ఉండే ముద్రలు కావు అని తెలుసుకోలేరు. ఎందుకంటే ఆ విషయం మీకు తెలియదు. మీరు మిమ్మలని గురించి తెలుసుకోవటానికి పూర్తిగా సమాజం వేసిన ముద్రల మీద ఆధారపడుతున్నారు. కొంతకాలం గడిచాక, క్రమంగా మీలోపలి అసలు మీరయిన వ్యక్తిని మరచిపోయి కేవలం సమాజం వేసిన ముద్రలే మీరు అని అనుకుంటున్నారు. దీనితో మీలోని అనంత విశ్వశక్తితో సంబంధాన్ని పూర్తిగా తెంపేసుకుంటున్నారు.
ఎప్పుడైతే అనాహత చక్రం వికసించుతుందో, అది ఎప్పుడు ప్రకాశవంతమవుతుందో అప్పుడు మీలోపలి విశ్వశక్తి అన్ని దిశలకి వ్యాపించుతుంది. అది మీలో అంతులేని శక్తి అవుతుంది. అప్పుడు మీలో స్వార్థం లేని ప్రేమ ప్రవహించుతుంది. మీరు ఏమీ ఆశించకుండానే అందరినీ ప్రేమించుతారు. అందరితోనూ అన్నింటితోనూ, ఈ సర్వ సృష్టితోనూ చాలా ఆనందంగా ఉండగలుగుతారు.
ఒక చిన్న కథ:
బ్రహ్మసూత్రాలు అనేది మానవులకి ఇవ్వబడిన ఒక గొప్ప గ్రంథం. దీనిని ప్రపంచ వేదాంతాలన్నింటిలోని సారాంశం అని చెప్పవచ్చు. ప్రపంచంలోని వేదాంతాలన్నీ దీని నుంచి అభివృద్ధి చెందినవే. దీనిని గ్రంథాలకే గ్రంథమని చెప్పవచ్చు. దీనిని వేదవ్యాసుల వారు రచించారు.
ఒక జ్ఞానోదయం పొందిన యోగి ఈ గ్రంథాన్ని వాచస్పతి మిశ్రా అనే తన శిష్యుడికి ఇచ్చి దానిమీద వ్యాఖ్యానం వ్రాయమని చెబుతాడు. ఆయన దానితోపాటు, తన కూతురు బామతిని అతనికి ఇచ్చి వివాహం చేసి కొంతకాలానికి చనిపోతాడు.
వాచస్పతి మిశ్రా వ్యాఖ్యానం వ్రాయటం ప్రారంభించుతాడు. ఆయన నిరంతరం ఆ గ్రంథం వ్రాయటంలోనే నిమగ్నమయిపోతాడు. అది ఆయనలో ఒక తీవ్రమైన మార్పుని తెచ్చే ధ్యానంలా అయిపోతుంది. ఆ విధంగా ఆయన ఆ గ్రంథాన్ని రాస్తూ చాలా సంవత్సరాలు దానిలోనే నిమగ్నమయిపోతాడు.
ఆయన ఆ గ్రంథాన్ని రాస్తున్నంతకాలం ఆయన దేనినీ చూడలేదు. దేని గురించీ ఆలోచించలేదు. ఏ విషయాలు వినలేదు. అంతా పూర్తిగా గ్రంథ రచనలోనే నిమగ్నమయిపోయి చివరికి దానిని పూర్తి చేసాడు. ఇక ఆపుస్తకానికి పేరు పెట్టాలి. ఆపని మాత్రం మిగిలిపోయింది. అప్పుడు ఆయన ఆ గ్రంథంలోంచి బయటకి వచ్చి చూస్తాడు.
అక్కడ ఆయనకి ఒక వృద్ధురాలు దీపం వెలిగిస్తూ కనిపించుతుంది. ఆనయ చాలా ఆశ్చర్యపోయి ఆమెతో "మీరు ఎవరు? " అని అడుగుతాడు.
ఆ ప్రశ్నకి ఆమె, "పరవాలేదు. మీ పనిని పూర్తి చేయండి" అని అంటుంది.
అప్పుడు ఆయన, " ఈ గ్రంథం పూర్తయింది. మీరెవరో చెప్పండి" అని అంటాడు.
ఆమె, "నేను మీ భార్యని" అని జవాబు ఇస్తుంది.
వాచస్పతి మిశ్రా విభ్రాంతిగా ఆమె వైపు చూస్తాడు. అక్కడ జరిగిన దానికి ఆశ్చర్యపోతాడు.
అంటే ఆయన ఆ గ్రంథాన్ని రాస్తున్న 30 సంవత్సరాలు భార్య గురించి ఆలోచించలేదు. అది ఆయన నమ్మలేకపోయాడు.
ఆమెతో ఇలా అంటాడు, "నీవు ఎందుకు నాకు గుర్తుచేయలేదు?"
దానికి ఆమె, "ఎందుకు? మీరు గ్రంథ రచనలో పూర్తిగా నిమగ్నమయిపోయారు. మిమ్ములని మీ నిశ్చలతని భంగం చేయవలసిన అవసరం నాకు ఎప్పుడూ అనిపించలేదు" అని నెమ్మదిగా జవాబు చెబుతుంది.
అప్పుడు వాచస్పతి మిశ్రా ఇలా అంటాడు, "నీవు ఈ మానవుల కోసం నీ జీవితాన్ని మొత్తం త్యాగం చేసావు. ఆ త్యాగానికి ప్రతిఫలంగా నీకు నేను ఏమి ఇవ్వగలను".
అప్పుడు భామతి "మీకు సేవ చేయటంలో నేను చాలా ఆనందపడ్డాను. మీరు ఈ అద్భుతమైన గ్రంథాన్ని వ్రాసే సమయంలో మీకు సేవ చేయగలగటమే నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంకేమి అవసరం లేదు" అని జవాబు ఇస్తుంది.
వాచస్పతి మిశ్రాకి ఆనందంతో కళ్ళలో నీరు వచ్చింది. ఆయన భార్యకి చాలా మంచి బహుమతిని ఇస్తాడు. ఆయన జీవితాంతం వ్రాసిన ఆ అద్భుత గ్రంధానికి ఆమె పేరు పెడతాడు. ‘భామతి’ అని.
ఈ రోజున మానవత్వం మీద ఉండే ఒక అపురూపమైన, అద్భుతమైన గ్రంథం ఆమె పేరుతో ఉన్నది. అదే భామతి.
ఈవిధంగా భామతి ఈ ప్రపంచంలో శాశ్వతమయింది. ఆమెలోని నిస్వార్థ ప్రేమ, భక్తి ఆమెని ప్రపంచంలో శాశ్వతం చేసాయి. ఆమె ఆమెకి చాలు. అసలు ఇందులో అద్భుతమైన విషయం ఏమిటంటే ఆమె తన భర్తని, ఆయన నిశ్చలతని ఏమాత్రం భంగపరచలేదు. అది అలా చేయటం “ఇష్టం లేక కాదు”, “ఆ అవసరం లేక” అని ఆమె చెబుతుంది. ఈ రెండింటికీ చాలా తేడా ఉన్నది.
మనకి చాలాసార్లు ఎదుటివారి శ్రద్ధ మన మీద కావాలి అనిపిస్తుంది. కానీ వారిని విసిగించటం ఎందుకులే అని ఊరుకుంటాము. అలా చేయకూడదు అని ఉండిపోతాము.
కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే వ్యక్తి, భామతికి “ఆ అవసరం లేదు” అదే తేడా. ఆమె తన యవ్వనం వృధా అయిపోయింది అని అనుకోలేదు. అలా అని ఆమె ఏదో సర్దుకుపోలేదు. ఆమె తన సహజత్వంతో, తనదైన సహజ వ్యక్తిత్వంతోనే ఉన్నది. అంతే, అది ఆమెకి చాలు. తన భర్త ఏకాగ్రతని పాడుచేయవలసిన అవసరం ఆమెకి రాలేదు. ఆమె అంతరంగం లోపల శక్తి మీద ఏకాగ్రతని నిలిపింది. అందుకే బయట ప్రపంచ విషయాలు తనని ఏమాత్రం ప్రభావితం చేయలేదు.
భామతి మరణించాక కూడా జీవిస్తూనే ఉన్నది. కానీ మనం జీవిస్తూనే ఎన్నోసార్లు మరణిస్తుంటాము. అదే తేడా.
ఈరోజు మన ఇంట్లో మనం ఒక్క అరగంట ప్రశాంతంగా పేపరు చదవగలమా? మీ భార్య ప్రశాంతంగా ఒక్క అరగంట టి.వి. చూడగలదా?
(అంతా నవ్వుతారు)
మీరు పేపరు చదవటం మొదలు పెట్టగానే, మీ భార్య, అంతకు ముందురోజు జరిగిన విషయాలన్నీ చెప్పటం మొదలుపెడుతుంది. అంతేకాకుండా ఆమెని మీరు పట్టించుకోవడం లేదని గొడవ చేస్తుంది. మీకు న్యూస్ పేపరుంటే చాలు, ఇంక ఏమీ అవసరం లేదు అంటుంది.
అలాగే మీకు కూడా, మీ భార్య టి.వి.లో తనకి ఇష్టమైన సీరియల్ చూసేటప్పుడే ఆకలి వేస్తుంది, భోజనం వడ్డించు అంటారు. మీరు ఆ టి.వి.ని ఆ సమయంలో సీరియల్స్ వేస్తున్నందుకు తిడతారు. ఆ తరువాత ఇక జరిగే వాదనలు వేదనలు, గొడవలూ అన్నీ మామూలే.
ఒక కథ:
ఒక వ్యక్తి అతని భార్యతో హోటల్‌కి వచ్చి కూర్చుని కావలసినవి చెప్పి వాటికోసం చూస్తుంటారు. అతని భార్య "ఏమండి, మనం హోటల్‌కి వచ్చినప్పటి నుండి ఆ పేపరు చదువుతూనే ఉన్నారు" అని అంటుంది. వెంటనే భర్త సంజాయిషీ ఇస్తూ "అయ్యో! అలానా! సారీ! " అని అక్కడే ఉన్న వెయిటర్‌తో "నాకు ఇంకొక పేపరు తెచ్చిపెట్టగలవా?" అని అడుగుతాడు.
(అంతా నవ్వులు)
చూడండి. మనందరం నిరంతరం ఎదుటివారు మనలని పట్టించుకోవాలని చూస్తుంటాము. మనం మనలోని శక్తిని బయటకి అన్ని దిశలా వ్యాపించగల సమర్ధత ఉన్నా కూడా మనం, ఎదుటివారిని శక్తి కావాలని అని అడుగుతాము. అది మనకి దొరకనపుడు నిరుత్సాహపడతాము. దిగులుపడతాము. ఇదే మనలో కోపానికి మూలకారణం. మనలోని ఆశాభంగానికి మనలోని మానసిక క్షోభకి ముఖ్య కారణం.
మనం అడగటం మానేసి ఇవ్వటం మొదలుపెట్టాలి. మనం మనలోపలి శక్తిని అన్ని దిశలకూ వ్యాపింపచేయాలి. కానీ, నాకు శక్తి కావాలి అని ఎదుటివారిని అడగకూడదు. మనం నిరంతరం మనమే ముఖ్యం, మనమే కేంద్రం అనే ఆలోచనతో ఉంటాము. అందరూ మన మీద ఆసక్తి చూపాలనుకుంటాము. ఇలా మన మీద నుంచి ఎదుటివారి మీదకి మన ఏకాగ్రతని ఎలా మార్చాలో కూడా మనకి తెలియదు. మనం బయట ప్రపంచం మీద శ్రద్ధ తీసుకోవటం నేర్చుకోవాలి. అది ఎలా?
నేను ఇప్పుడు మీకొక చిన్న ఎక్సర్సైజు ఇస్తాను. మీరు ఇక్కడ ఉండే ఈ కొద్ది రోజులూ నేనుచెప్పినట్టు చేయండి. మీలో మీరు ఒక భాగస్వామిని ఎన్నుకోండి. ఆడవాళ్ళంతా మీలో ఒకరిని మీలోనే భాగస్వామిగా ఎన్నుకోండి. అలాగే మగవారు కూడా మీలో ఒకరిని ఎన్నుకోండి. మీ భాగస్వామి విషయంలో శ్రద్ధ చూపండి. వారికి కావలసినవి మీరే చేసి పెట్టండి. నిరంతరం మీ మొదటి శ్రద్ధ వారిమీదే ఉండాలి. వాళ్ళు సౌఖ్యంగా, సంతోషంగా ఉండేట్టు చూడండి. వారికి ఏమైనా కావాలా చూడండి. అంటే ప్లేటు ముందు మీరు లాగేసుకోకుండా వారికి ఇవ్వండి. వారికి వేడి నీరు కావాలంటే తెచ్చి ఇవ్వండి.
అయితే ఒక ముఖ్య విషయం మీ స్నేహితులు, బంధువులు మీకు తెలిసిన వారిలో భాగస్వామిని ఎంచుకోవద్దు. మీకు తెలియని వ్యక్తిని మీ దగ్గరలో నిలబడిన వారిని, యధాలాపంగా ఎన్నుకోండి.
మన జీవితమంతా మనం మనకోసమే బాధ పడుతుంటాము. లేదు అంటే మన దగ్గర బంధువుల గురించి బాధపడతాము. అది కూడా బాధ్యత కాబట్టి. దానినే మనం ప్రేమ అంటాము. మీరు ఈ ఎక్సర్ సైజు చేస్తే, నిస్వార్థ ప్రేమ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇది నిస్వార్థం ఎందుకంటే మీరు వారి నుంచి ఏమీ ఆశించటం లేదు.
(అందరూ వారి వారి భాగస్వాములను ఎంచుకున్నారు)
చూడండి. నిజమైన ప్రేమ చాలా లోతైనది. దానికి చాలా శక్తి ఉంటుంది. అది మీకు అనుభవమయితే కానీ తెలియదు. ప్రేమ శక్తి యొక్క ఒక్క విధమైన రూపమే. ఇది వ్యవహారం కాదు.
మీరు ఎవరినైనా కొత్తగా చూడగానే ప్రేమించగలరా?
లేదు స్వామీజీ!
ఎందుకు ప్రేమించలేరు.
వారు ఎవరో మాకు తెలియదు కదా! వారిని మేము ఎలా ప్రేమించుతాము?
సరిగ్గా అంతే. మీరు ఇదే విధంగా ఆలోచించుతారు. మీకు ఒక విషయం చెబుతాను. మీరు కొంచం వివేకంతో అర్ధం చేసుకోగలిగి, ధ్యానం చేయగలిగితే, మీరు కారణం లేకుండానే ఎవరినైనా ప్రేమించగలరు అని తెలుసుకుంటారు. మీరు రోడ్డు మీద ఉన్న చెట్లని ప్రేమించగలరు. మీరు వాటిని లాలించగలరు. అపుడు మీలో ప్రవహించే శక్తి యొక్క అనుభూతిని పొందగలుగుతారు. మీరు రోడ్డు మీద వెళుతూ అక్కడ మీకు తెలియని వారిని కూడా ప్రేమించగలుగుతారు. అసలు మీ అంతరంగపు ఉనికి, మీ అంతరాత్మ ఒక ప్రేమ. అంతే కాని అది మీకు ఉండే ఒక లక్షణం కాదు.
బహుశ: ఈ రోజుల్లో ప్రేమ అనే దానిని చాలా తప్పుగా అన్వయించి, తప్పుగా అర్ధం చేసుకునంతగా మరి దేనిని అంత తప్పుగా అర్ధం చేసుకుని ఉండరు. ఈ రోజులలో ప్రేమ అంటేనే ఒక వ్యవహారం. ఎవరైనా మీ గురించి చక్కగా చెబితే వారిని ప్రేమించుతారు. రేపు అదే వ్యక్తి మీకు వ్యతిరేకంగా ఏదైనా చెబితే వారిని ప్రేమించటం మానేస్తారు. ఇంకా కొంచం ముందుకు వెళ్ళి ఆ వ్యక్తిని ద్వేషించుతారు కూడా.
అంతే కాదు మీకు ఎప్పటి నుంచో తెలిసిన చిన్న నాటి స్నేహితుడైనా, లేదా మీరు ప్రతి రోజు నెట్లో చాట్ చేసే స్నేహితుడైనా, ఎవరైనా సరే మీ గురించి ఒక్క మాట వ్యతిరేకంగా అన్నా, వారు మీరు అంత దగ్గర అనిపించరు. తిరిగి వారితో ఇదివరకటి అనుబంధం ఏర్పడాలి అంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో మీ ప్రేమ ఎక్కడ ఉన్నది? అది కొంత కాలమైనా బాధలో ఉండిపోతుంది.
ప్రేమ అనేది మీరు ఆడే ఒక ఆట. ఈ ఆటలో ప్రేమ, ద్వేషం ఒక దాని తరువాత ఒకటి బయటికివస్తాయి. ఇటువంటి ప్రేమ ద్వేషం అనే బంధం అసలు ప్రేమ కాదు. స్పష్టంగా తెలుసుకోండి.
ఇది కేవలం ఒక వ్యక్తికి లేదా ఒక సంఘటనకి మీ నుంచి వచ్చే ప్రతి చర్య మాత్రమే. దీనినే మనం ప్రేమ అంటాము. కానీ ఇది నిజమైన ప్రేమ కాదు. కేవలం ఏదో ఒక విషయానికి సంబంధించిన చర్య మాత్రమే.
నిజమైన ప్రేమకి ఒక విషయంతో కానీ, ఒక వస్తువుతో కానీ పనిలేదు. అక్కడ ఏదీ లేకపోయిన ప్రేమ ఉంటుంది. నిజమైన ప్రేమ ఒక వస్తువు, ఒక విషయం, దానికి అటువంటి ఆధారాలు అవసరం లేదు. మరొక విషయం, మీరే ప్రేమ. అంతే. ఎవరైనా ఏవస్తువైనా మీ సమక్షం లోనికి రాగానే మీలోని ప్రేమ యొక్క అనుభూతిని పొందుతాయి. నిజమైన ప్రేమ ఒక నదిలా సహజంగా ప్రవహిస్తూ ఉంటుంది. దానిని వేరు వేరు ప్రదేశాలలో, వేరు వేరు విధాలుగా చూసి అందరూ ఎంతో ఆనందాన్ని పొందుతారు. నిజమైన ప్రేమ మననుంచి అదే విధంగా ప్రవహిస్తుంది. అప్పుడు మన చుట్టుప్రక్కల ఉన్నవారు మనలోని ప్రేమ వాహిని యొక్క అనుభూతిని పొందగలుగుతారు.
ప్రేమలో నిబంధనలు, షరతులు ఉండవు. మీలో ఉండే శక్తి మీ నుంచి పొంగిపొరలి అదే ప్రేమగా ప్రవహిస్తుంది. అప్పుడే మీరు గట్టిగా ముడివేయబడిన సంబంధాలను తెంచగలుగుతారు. అప్పుడే మీరు మిమ్మలని అందంగా, అద్భుతంగా వెల్లడి చేసుకోగలుగుతారు. మీరు ఒక ప్రేమ మూర్తిగా ఉంటారు. అర్ధమయినదా?
మీరు మీలో ఉండే నిజమైన ప్రేమని తెలుసుకోవాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది, ఇటువంటి ఉపన్యాసాలని, ఇటువంటి మాటలని పదే పదే వినండి. అవి మీలో ఒక నమ్మకాన్ని, ఒక నిశ్చయాన్ని నింపుతాయి. అవి మీ అంతరంగంలో ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తాయి. అందులో మీరు మార్పు చెందటం ప్రారంభించటానికి సహాయం చేస్తుంది. ఇక రెండవ పద్ధతి: ధ్యానం చేయటం. అది మీలో నిజమైన మార్పుని తేగలుగుతుంది.
మీరు నిత్య జీవితంలో, ఈ సంబంధాల విషయంలో బాగా లోతులలోనికి వెళ్ళ గలిగితే, మీరు ఇంతకాలం అనుకుంటున్నది ప్రేమ కాదు అని తెలుస్తుంది. అది కేవలం ఇచ్చిపుచ్చుకోవటమే అని అర్ధమవుతుంది. ఇదంతా కేవలం సర్దుకుపోవటం, రాజీ పడటం, ఒక బాధ్యత అనే భావన, కొంత భయం, కొంత అపరాధ భావం ఇలాంటివన్నీ అని అర్ధమవుతుంది. అంతే. ఇది నిజమైన ప్రేమ కాదు. ఇవన్నీ కూడా ప్రేమ పేరు మీద మీలో ఉన్నట్టుగా గుర్తించగలుగుతారు.
ధ్యానం మిమ్మలని మీ అంతరంగపు లోతులలోనికి తీసుకు వెళ్ళ గలుగుతుంది. అపుడు మీరు ప్రేమ అంటే మీకు ఉండే తప్పుఅర్ధాలలోపలి నుంచి పైకి రాగలుగుతారు. ధ్యానం మీ అంతరాత ్మదశలో పనిచేస్తుంది. అందుకే అది దగ్గర దారి. అలా కాకుండా మీరు జీవితానుభవం ద్వారా తెలుసుకోవాలని అనుకుంటే మీకు అది తెసుకోవటానికి ఒక జీవిత కాలం పడుతుంది. అదే ధ్యానం ద్వారా అయితే, అది మీ అంతరంగంలో ఒక ప్రదేశాన్ని సృష్టిస్తుంది. అప్పుడు మీరు ఈ అనుభూతులన్నీ ఆ ప్రదేశంలో పొందవచ్చు. ఇది మీకు ఏ వయస్సులోనైనా సాధ్యమవుతుంది.
ఒక్క విషయం అర్ధం చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఏ కారణం లేకుండా ప్రేమించగలరో, అప్పుడు మీరు ఎంతో విస్తృతం అవ్వగలుగుతారు. మీకు ఈ ప్రపంచం మీ జీవితానికంటే చాలా విశాలంగా కనిపిస్తుంది. ఎంతో ఆనందంగా కనిపిస్తుంది. అప్పుడు నిజమైన శక్తి మీలోనే ఉన్నది, బయట లేదు అని మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు మీకు గొప్ప శక్తివనరులుగా ఉండగలుగుతారు. అలాగే ఎదుటివారికి కూడా గొప్ప శక్తివనరుగా ఉంటారు. మీలోని శక్తి ఎదుటివారిని స్పృశించగలుగుతుంది. దానికి వేరే దారి లేదు. ఎందుకంటే అది మీలో పొంగి ప్రవహించుతుంది. అప్పుడు అందరూ మీవైపు ఆకర్షితులవుతారు. మీరు ఒక సంపూర్ణ వ్యక్తిగా, ఒక ప్రేమమూర్తిగా అవుతారు.
ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైన వివరాలు కావాలా?
ప్రశ్న: స్వామీజీ! తల్లీబిడ్డల మధ్య ఉన్న ప్రేమ ఎటువంటిది? అది నిస్వార్థ ప్రేమకదా?
తల్లి ప్రేమలో కూడా ఎంతో కొంత ఆశించడం అనేది ఉంటుంది. నేను ఈ విషయం చెప్పినప్పుడు చాలా మంది నాతో వాదించారు. మీకు వివరంగా చెబుతాను. తల్లికి పిల్లల మీద ప్రేమ నిజమే. కానీ చివరిలో దానిలో చూడలేని, మనకు కనపడని, ఎక్కడా వ్రాయని ఆకాంక్ష, ఆశించటం అనేవి ఆ ప్రేమలో ఉంటాయి. ఆమె పిల్లలు ఆమె ఆశించిన దానికి కొంచెం వ్యతిరేకంగా ఏమి చేసినా, ఆమె నుంచి వచ్చే మొదటి మాటలు, మీకు చిన్నప్పటి నుంచీ ఎంత చేసాను, ఎన్ని చేసాను ఇలాంటివన్నీ. వారి బంధంలో చిన్న మార్పు వస్తే చాలు ఆమె ఇవన్నీ బయటకి తెస్తుంది.
నిజమైన ప్రేమ అంటే మీలో ఉండే అనంత విశ్వప్రేమని, విశ్వశక్తిని బయటకి వెల్లడి చేయటమే. ఆ ప్రేమ అటువంటి వాదనలని గుర్తుంచుకోదు. దానికి కారణం లేకుండా ప్రవహించటం మాత్రమే తెలుసు. ఆ ప్రేమకి రికార్డులు దాచటం, అవసరమైనప్పుడు బయటకి తీయటం తెలియదు. దీనికి జరిగిపోయిన విషయాలను ఇప్పటి దానితో కలిపి వాదించటం తెలియదు. అది అలా ప్రవహింస్తుంది. ఎందుకంటే అది పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడూ ప్రశ్నించదు. ఎందుకంటే దానికి ప్రశ్నలు తెలియవు.
మీరు ఎప్పుడైతే జరిగిపోయిన విషయాలను, సంఘటనలను గుర్తు చేస్తారో దాని అర్థం మీరు ఏదో ఆశిస్తున్నారు అని. అంటే మీ ప్రేమ వెనుక మీ ఆకాంక్షలు దాగి ఉన్నాయి అని అర్ధం. అది ఆ విధంగా ఉన్నప్పుడు దానిని నిజమైన ప్రేమ అనo. అది అర్ధం చేసుకోండి.
ఇదే విధంగా బిడ్డలకి తల్లి మీద ప్రేమ కూడా ఏదో ఆశించటమే. కొడుకు తల్లిని ప్రేమించుతాడు. ఎందుకంటే తల్లి తన సంరక్షణ బాధ్యత తీసుకుంటుందని, తనని టైం ప్రకారం నిద్రలేపి, భోజనం పెట్టి బట్టలు సర్ది, అన్ని సమకూర్చుతుందని. ఇవన్నీ ఒక్క రోజుకూడా తప్పకుండా చేస్తుందని. అతని తల్లిని ఆరాధించుతాడు. ఎందుకంటే తల్లి తనకి అంతులేని సంతోషాన్ని ఇస్తుంది, తనకి అన్ని సౌకర్యాలు ఇస్తుంది.
ఒక చిన్న కథ:
ఒక అబ్బాయి స్కూల్లో భిన్నాలు నేర్చుకుంటూ ఉంటాడు. టీచర్ ఆ అబ్బాయిని ఇలా అడుగుతుంది. “ఒక కేకుని ఐదు భాగాలు చేసి ఇంట్లో అందరూ తలా ఒక ముక్కా తీసుకుంటే, నీకు వచ్చే భాగాన్ని భిన్న రూపంలో చెప్పు”.
దానికి ఆ అబ్బాయి ఇలా జవాబు ఇస్తాడు. “2/5 మేడం”.
టీచర్ ఆ అబ్బాయిని “ఎలా? నీవు భిన్నాలు బాగా నేర్చుకోలేదా?” అని అడుగుతుంది.
అప్పుడు అబ్బాయి “మా అమ్మ వాటా కూడా నాకే ఇచ్చేస్తుంది కదా మేడం” అంటాడు.
చూడండి తల్లి తన పిల్లల కోసం చాలా త్యాగాలు చేస్తుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడే విషయం, తల్లి ఏ దృక్పధంతో త్యాగం చేస్తుంది అనేది. అవన్నీ వారిలో పొంగి ప్రవహించే ప్రేమతో ఇవన్నీ చేస్తే అవి వారి మనసులలో రికార్డు కావు. ఒకవేళ అలా రికార్డు అయినా, అవసరమైనప్పుడు పరిస్థితులు వారికి అనుకూలంగా లేనప్పుడు అవన్నీ బయటకి రావు. వాళ్ళు ఎప్పుడైతే ఇది ఒక బాధ్యతగా చేస్తారో, అప్పుడు ఇలాంటివన్నీ వారిలో రికార్డు అయ్యి, ఆ తరువాత అవి బయటకి వస్తాయి.
సామాన్యమైన ప్రేమ చాలా ఆశిస్తుంది. కాదు అని ఎవరూ చెప్పలేరు. కానీ అది కాదు అని మీరు చెప్పటానికి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఈ ఆశించటం అనే అంశం ప్రేమలో ఎంత బాగా కలసిపోయిందంటే, దానిని గుర్తించటం మీకు చాలా కష్టం. ఎవరైనా మీకు ఆ విషయం చెబితే నమ్మటం చాలా కష్టంగా ఉంటుంది.
ఇటువంటి ప్రేమ సజావుగా జరిగినంత కాలం ఈ విషయాన్ని ఎవరు చెప్పినా నమ్మరు. కానీ మనం అప్పుడప్పుడూ వింటుంటాం. పిల్లలు ఇళ్ళలోంచి వెళ్ళిపోయారని. ఎందుకంటే అది చాలా చిన్న కారణం: వాళ్ళు వేరే కులం వారిని వివాహం చేసుకుంటారు. అది ఆ కుటుంబ ఆచారానికి ఎదురుదెబ్బ. అప్పుడు మీరు చెప్పే ప్రేమ అంత అకస్మాత్‌గా ఎక్కడ మాయం అయ్యింది.
అటువంటి సంఘటన జరిగే వరకూ కూడా ఆ పిల్లల మీద తల్లితండ్రులకి, కుటుంబ సభ్యులకి చాలా ప్రేమ ఉంటుంది. అది చాలా ఉన్నతంగా ఉంటుంది. మరి అంత అకస్మాత్‌గా దానికి ఏమయింది? అది అంత అకస్మాత్‌గా ఎలా మాయం అవుతుంది. అది నిజమైన ప్రేమ అయితే అంత అకస్మాత్‌గా మాయమవ్వగలదా? నిజమైన ప్రేమ నుంచి ఇటువంటి ప్రతిచర్య, ఇటువంటి స్పందన ఉండవు. నిజమైన ప్రేమ ఏ విషయంలోనూ అయోమయంలో పడదు. ఎందుకంటే ఏ విషయం కూడా నిజమైన ప్రేమ వాహినిని ఆపలేవు. దీనికి కారణం దానికి ప్రభావం అనే అంశాలు ఉండవు.
చిన్న చిన్న కుటుంబ విషయాలలో కూడా, మీరు లోతుగా అర్ధం చేసుకుంటే ఆ ప్రేమ అనేది ఎన్ని నిబంధనలతో ఉంటుందో మీకు తెలుస్తుంది. మీరు కొన్ని సంఘటనలని తిరిగి అమర్చి, ఆ విధంగా జరిగితే మీ కుటుంబ సభ్యులు ఎలా స్పందించుతారో ఊహించండి. అప్పుడు మీకు అర్ధమవుతుంది.
మీరు మీ పిల్లలకి ఇవ్వవలసిన సౌకర్యాలన్నీ ప్రేమ పేరుతో ఇస్తున్నంత కాలం వారు కూడా మీ మంచితనానికి మిమ్ములని ప్రేమిస్తుంటారు. ఇది మీరు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా వెళ్ళనంతకాలం బాగా జరుగుతుంది. మీలో ఎవరైనా ఎదుటివారి
ఆశయానికి వ్యతిరేకంగా ఏచిన్న పని చేసినా ఆ ప్రేమ అనేది పూర్తిగా మారిపోతుంది. దాని ఆకారం, రుచి, వాసన అన్నీ మారిపోతాయి. ఈ మార్పుకి పెద్దగా కష్టపడనవసరం లేదు. ఎందుకంటే అటువంటి ప్రేమ సహజమైన ప్రేమ కాదు కాబట్టి. అది అసహజమైనది, అసహజమైన రంగుల్లో ఉన్నది కాబట్టి.
బెదిరింపులతో ఉండే ప్రేమ అసలు ప్రేమ కాదు. అది కేవలం కుదుర్చుకున్న ప్రేమ. అలా అవసరానికి తగినట్టుగా కుదుర్చుకున్న ఏవిషయం సంపూర్ణమైనది కాదు. ఎప్పుడైతే ఏ విషయమైనా సంపూర్ణం కాదో, అది నిరంతరం బెదిరింపుల మధ్యనే ఉంటుంది. ప్రేమ అనేది ఒక ఉత్సవం అంతే కాని బాధ్యత కాదు.
మరొక విషయం: మనం ప్రేమకి, గౌరవానికి మధ్య కూడా కొంత అయోమయం చెందుతాము. స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు పూర్తిగా ప్రేమించినప్పుడు, మీరు ఏ పనిచేసినా అగౌరవం కలిగించే విధంగా ఉండదు. అంటే ఆ వ్యక్తి వెనుక ఉన్న శక్తి అతని చర్యని గౌరవంగాను లేదా అగౌరవంగాను చూపిస్తుంది.
మీలో ఉన్న శక్తి పరిపూర్ణమైనప్పుడు, మీరు దేనితోనైనా ముందుకి సాగగలరు. ఆ విషయంలో మీకు నమ్మకం లేకపోతే అప్పుడు మీరు గౌరవం అనే విషయంలో ఇరుక్కుపోతారు. మిమ్మలని నేను అగౌరవంగా ఉండమని చెప్పటం లేదు. నేను చెప్పేది కేవలం ఒక్కటే. మీ అంతరంగం ప్రేమతో నిండి ప్రవహిస్తుంటే, అప్పుడు మీ శరీర కదలికలు, మీ శరీర భాష ఎప్పుడూ అగౌరవంగా ఉండవు.
మీరు ప్రేమతో కాకుండా కేవలం గౌరవం అనే విషయంలోనే చిక్కుకుపోతే, అప్పుడు మీరు ఈ మొత్తాన్ని కోల్పోతారు. అప్పుడు మీరు ఎవరినీ ప్రేమించరు. కేవలం ప్రేమించుతున్నట్టుగా ఉంటారు. ఎప్పుడైతే మీరు ప్రేమని నటించుతారో అప్పుడు మీరు పరిపూర్ణతతో ఉండరు.
మీరు గౌరవం అనే విషయం మీద ఏకాగ్రతని నిలిపినప్పుడు, గౌరవాన్ని మీరు నటించుతారు. ఎందుకంటే అది సమాజపరమైన విషయం. అలా కాకుండా మీరు ప్రేమ మీద మీ ఏకాగ్రతని నిలిపితే, అప్పుడు గౌరవం అనేది ఒక ఆనందమయమయిన ఉపవస్తువు అవుతుంది. కాబట్టి మీ ఏకాగ్రతని ప్రేమ మీద ఉంచండి. అప్పుడు గౌరవం అనేది అప్రయత్నంగా వస్తుంది. గుర్తుంచుకోండి. గౌరవం జీవం లేనిది ప్రేమ జీవం కలది. గౌరవం దూరాన్ని సృష్టిస్తుంది, ప్రేమ దూరాన్ని చెరిపివేస్తుంది.
మన అందరికీ భగవంతుడు అంటే భయపడాలని, గౌరవించాలని నేర్పించుతారు. మనకి భగవంతుని ప్రేమించాలి అని ఎప్పుడూ నేర్పించరు. గుడిలో దేవుడి విగ్రహాలని ముట్టుకోనీయరు. మనని ఆ విగ్రహాలకి దూరంగా నిలబడి గౌరవంతో తలవంచుకు నిలబడమంటారు. మనకి భగవంతుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని నేర్పించుతారు.
అర్థం చేసుకోండి పిల్లలకి ముందు నేర్పించవలసినది "భగవంతుని ప్రేమించమని".
మీరు భగవంతుని కౌగిలించుకోలేకపోతే ఇక కౌగిలించుకోవటానికి ఈ ప్రపంచంలో మీకు ఏమీ ఉండదు. ఎందుకంటే సర్వస్వం ఈ సమస్త సృష్టి భగవంతుడు. మీరు మీ పిల్లలకి భగవంతుని కౌగిలించుకోకూడదు అని నేర్పించితే, మీరు వారికి భగవంతుడు మిగతా వారికంటే వేరు అని నేర్పించటమే. భగవంతుడిని ఒక పీఠం మీద కూర్చోబెట్టి, మీరు ఈ అనంత చైతన్య సృష్టికి దూరం అయిపోతున్నారు. అలా చేసి మీరు ఎంత కోల్పోతున్నారో మీకు తెలియటం లేదు.
మీరు కొంచెం సమాజపు తెలివితేటలు పెంచుకుని, ఎంతవరకు అవసరమో అంత వరకూ మాత్రమే ఈ గౌరవం అనే ఆటని తెలివిగా ఆడండి. అది చాలు. ఇటువంటి గౌరవం, వివేకంతోటి, పూర్తిగా వాస్తవాలని తెలుసుకోవటంతో వస్తుంది. అయితే అది మిమ్ములని, మీపైన ఉన్న ఏకాగ్రతని చెదరనీయదు. మీకు తక్కువ ప్రేమని ఇవ్వదు. అది వివేకంతో ఉంటుంది. అంతే.
ఒక చిన్న కథ:
ఒకామె వాళ్ళ అమ్మాయితో కలిసి ఎగ్జిబిషన్‌కి వెళుతుంది. అక్కడ చాలా జనం ఉంటారు. ఆ జనంలో ఆ అమ్మాయి తప్పిపోతుంది. తల్లి చాలా కంగారు పడిపోతుంది. ఆ అమ్మాయికోసం అంతా వెతుకుతూ ఉంటుంది.
అకస్మాత్తుగా ఆమెకి వెనుక నుంచి ఒక పిలుపు వినిపిస్తుంది "లక్ష్మీ భవానీ, లక్ష్మీ భవాని” అని. ఆమె వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆమె కూతురు నిలబడి ఉంటుంది. ఆమె వెంటనే పరుగుతో వెళ్ళి కూతురిని దగ్గరకి తీసుకుని ముద్దులు పెడుతుంది.
ఆ తరువాత ఆ అమ్మాయితో "అదేంటి? నువ్వు నన్ను 'అమ్మా' అని పిలవకుండా లక్ష్మీభవాని అని ఎందుకు పిలిచావు?" అని అంటుంది.
అప్పుడు ఆ అమ్మాయి ఇలా జవాబు ఇస్తుంది. “అలా పిలిస్తే ఉపయోగం లేదు కదా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అమ్మలు ఉన్నారు కదా".
చిన్నపిల్లలు తమ ఏకాగ్రతని వారిమీదే ఉంచుతారు. అందుకే వాళ్ళు ఉత్సాహంగా, జీవంతో ఉంటారు. వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉంటారు. వాళ్ళ శరీర కదలికలు, వాళ్ళ శరీర భాష, వారి అమాయకత్వం, వారి ప్రేమ ఇవన్నీ కూడా వారు ఏమిటో చెబుతాయి. దానికి వేరే మాటలు అవసరం లేదు. అందుకే చిన్న పిల్లలు ఏపని చేసినా అగౌరవంగా ఉండదు. ఎప్పుడైతే మైండ్ సమాజపు నిర్బంధాలలో ఇరుక్కుంటుందో వారిలో అమాయకత్వం మాయమయిపోతుంది. అప్పుడు అవసరమయిన మాటలని తయారు చేసుకోవాలి. లేనిది ఉన్నట్టుగా నటించాలి. ఎందుకంటే అమాయకత్వం అనే దానిని పూర్తిగా మర్చిపోతాం. పరిపూర్ణంగా ఉండలేము..
ప్రేమ బాధ్యత అయినప్పుడు అది బరువుగా ఉంటుంది. అది బరువుగా ఉన్నప్పుడు మీరు దానితో ఆనందంగా ఉండలేరు. మీ మీద ఒత్తిడి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకి ప్రేమించటానికి కారణాలు నేర్పించుతారు. చిన్న వయసు నుంచే వాళ్ళకి ప్రేమ కారణాలతో ఉన్నది అని అనుకుంటారు.
మనం పిల్లలకి భూమిని ప్రేమించాలి అని నేర్పించుతామా? ప్రకృతిని ప్రేమించటం నేర్పుతామా? కానీ వాళ్ళకి బంధువులని ప్రేమించటం నేర్పించుతాము. మనలని ప్రేమించమని చెబుతాము. వారికి ఉపయోగపడే ప్రతిఒక్కరినీ ప్రేమించమని చెబుతాము.
వాళ్ళకి ప్రకృతిని ప్రేమించటం నేర్పించగలిగితే వాళ్ళలో నిజమైన ప్రేమ విత్తనాన్ని నాటినవారము అవుతాము. నేను చాలా మంది తల్లితండ్రులని చూసాను. వాళ్ళు పిల్లలని చెత్త రోడ్లమీద లేదా ఖాళీ ప్రదేశాలలో వేయమని చెబుతారు. అలా చేసి ప్రకృతి అందాలు పాడుచేయనిస్తారు. వాళ్ళు కుటుంబ సభ్యులని ప్రేమించమని చెబుతారు. కానీ ప్రకృతిని తిడతారు. మీలో నిజమైన ప్రేమ ఉంటే మీరు ప్రకృతిని విమర్శించరు. మీలో నిజమైన ప్రేమ ఉండి ఉంటే మీరు ప్రకృతిని, మనుషులని సమానంగా ప్రేమించుతారు.
చూడండి. మీరు సరియైన విత్తనాన్ని నాటాలి. అప్పుడే సరియైన మొక్క వస్తుంది. మీరు పిల్లలలో సరియైన విత్తనం అనే భావాలని నాటి అవి మొలకెత్తి వికసించటానికి సరిపడా పరిస్థితులు వారికి నెలకొల్పాలి. ఇక్కడ మీకు ధ్యానం సహాయం చేస్తుంది. సరియైన విత్తనం నాటడానికి ధ్యానం సహాయం చేస్తుంది. మీలోపల ఆ విత్తనం మొలకెత్తి వికసించటానికి అనువైన ప్రదేశాన్ని తయారు చేస్తుంది. బయట నుంచి నిర్భందంగా విధించేది ఏమీ ఉండదు. ఎప్పుడైతే మీరు దేనినైనా బలవంతంగా విధించితే, దానికి వ్యతిరేకత వస్తుంది. లేదా దానిని ఒక బాధ్యతగా బరువుగా భావించుతారు.
మనం మాట్లాడే ఈ ప్రేమ ఒక మానసిక బానిసత్వం. ఒక మనిషికి ప్రేమ పేరు మీద మీరు బానిసత్వం చేస్తారు. దాంతో అతను ఒక పద్ధతిలో ప్రవర్తించాలని బలవంతంగా అలా ప్రవర్తించుతాడు. భౌతికమైన బానిసత్వంలో కనీసం మీరు బానిసగా బ్రతకటం చూడగలుగుతారు. ఈ మానసిక బానిసత్వం చాలా జిత్తులమారి. మీరు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సంఘటనతో పరిణితి పొందే వరకూ మీరు బానిసగా ఉన్నారు అని తెలియదు.
మనలో ఎందుకు ఇంత అపరాధభావం ఉంటుందో మీకు తెలుసా? ఎందుకంటే మనకి తెలిసిన ప్రేమ ఎప్పుడూ అపరాధ భావంతోనే మన దగ్గరికి వస్తుంది. ప్రేమ నిజమైనది, పరిపూర్ణమైనది, అయితే అది మీ నుంచి ప్రవహించే స్వచ్ఛమైన శక్తి
అయితే ఎప్పుడూ అపరాధ భావంతో ఉండదు. మీరు నిరంతరం అపరాధ భావంతో ఎందుకుంటారు, అంటే మీరు సరిపడా ప్రేమించనందుకు. అది సంపూర్ణ ప్రేమ కానందుకు. అంటే ప్రేమలో ఎక్కడో తప్పారు కాబట్టి. మీరు ఎందుకు సరిపడా ప్రేమించలేదు? ఎందుకంటే మీకు సామాన్యమైన ప్రేమనే నేర్పించారు కాని సంపూర్ణమైన ప్రేమని నేర్పించలేదు కాబట్టి.
ఒక విషయం చెబుతాను మీరు పూర్తిగా ప్రేమించితే మీలో అపరాధ భావం ఉండదు. అప్పుడు ఆ వ్యక్తి చనిపోయినా మీరు బాధపడరు. భౌతికంగా దూరం, అయినందుకు బాధపడతారు కానీ, వారు లేనందుకు మీరు ఏమీ పోగొట్టుకోరు. పరిపూర్ణమైన ప్రేమ అంటే ఎదుటివారి కోరికలు, ఆశలు, ఆకాంక్షలు పూర్తిగా ప్రవహించే ప్రేమని ప్రవహింప చేయటమే. అది శక్తివంతమైన ప్రేమ. వారు ఈ సర్వాంతర్యామిలో భాగమే అన్న గౌరవంతో వారిపై ప్రేమ కురిపించాలి.
మీరు ఈవిధంగా చేయగలిగితే వారితో మీ అనుబంధం చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు చనిపోయినా మీరు బాధపడరు. మీలో అపరాధ భావం ఉండదు. కుటుంబం మీలో నిరంతరం అపరాధ భావాన్ని ప్రవేశపెడుతుంది. ఎందుకంటే మీలో అపరాధ భావం ఉన్నప్పుడే అది మిమ్మలని నియంత్రించగలుగుతుంది. అపరాధ భావం అంటే ఏవో భావావేశాలకి వేలాడటం. ఎందుకంటే ఆ భావాలని మీరు పూర్తిగా శోధించలేదు కాబట్టి. మీలోనికి ఆ భావాన్ని ఎప్పుడూ రానీయకండి.
అలా అని మీకు ఏది అనిపిస్తే అది చేసి దాంతో తప్పుచేసాము అని బాధపడవద్దు, అని నేను మీకు చెప్పటం లేదు. అర్ధం చేసుకోండి. మీరు సంపూర్ణంగా జీవించండి. మీ అంతరంగం లోపలి నుంచి జీవించండి. పూర్తి వాస్తవాన్ని తెలుసుకొని, అర్ధం చేసుకుని జీవించినప్పుడు మీలో అపరాధ భావం రాదు. అంతే
నిజమైన ప్రేమ లెక్కలు వేయకుండా ఇస్తుంది. దానికి అడగటం తెలియదు. దానికి వ్యాపారం, వ్యవహారం తెలియవు. దానికి కేవలం ఇవ్వటం ఒక్కటే తెలుసు. దానిని మనం సృష్టించలేము. అది ఇలా ఉంటుంది. మీరు ఒక ప్లాస్టిక్ గులాబీని తయారు
చేయగలరు. కానీ దాని సహజమై సువాసనలని తీసుకురాగలరా? లేదు. అదేవిధంగా నిజమైన ప్రేమని తయారు చేయలేము. మీ నిత్యజీవితంలో మీకు తెలిసిన ప్రేమ ప్లాస్టిక్ గులాబి పువ్వు లాంటిది. సువాసన లేని పూవు. అది చూడటానికి నిజమైన గులాబీలా ఉంటుంది. కానీ పరిమళాలు ఉండవు.
నిజమైన గులాబి విరియాలంటే దానికి అనుకూలమైన పరిస్థితులని మీరు సృష్టించాలి. దానికి సరియైన మట్టి, సరిపడా నీరు ఉండాలి. అప్పుడే మొక్కచిగిర్చి పూలు వికసించుతాయి. అదేవిధంగా నిజమైన ప్రేమ వికసించాలంటే దానికి తగిన పరిస్థితులు కల్పించాలి. అవి వాస్తవాలని పూర్తిగా, లోతుగా తెలుసుకోగలగటం, స్పష్టత, మీ అంతరంగంలో లోతుగా అర్ధం చేసుకోవటం ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉంటే నిజమైన ప్రేమ మీలోపల వికసిస్తుంది.
నేను కాలేజీలో ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఒక అమ్మాయి నన్ను ఇలా అడిగింది. "స్వామీజీ, మీరు ప్రేమలో ఓడిపోయి సన్యాసి అయ్యారా?".
నేను ఆ అమ్మాయికి ఇలా జవాబు ఇచ్చాను. "నేను ప్రేమలో గెలిచాను. అందుకే సన్యాసినయ్యాను". ప్రేమలో ఓడిపోతే దేవదాసు అవుతారుగాని సన్యాసి కారు. మీరు ఎప్పుడయితే ఈ ప్రపంచాన్నంతా ప్రేమించగలరో అప్పుడే సన్యాసి కాగలరు. మీరు ఎప్పుడయితే ఈ ప్రపంచాన్ని ప్రేమించుతారో అదే నిజమైన ప్రేమ.
నిజమైన ప్రేమకి బంధుత్వాలు, సంబంధాలు తెలియవు. మామూలు ప్రేమకే ఆ సంబంధాలు. మామూలు ప్రేమలో మీరు మీ తండ్రిని ప్రేమించుతారు. ఎందుకంటే మీకు ఆనందాన్ని ఇస్తాడు కనుక. ఇలా మామూలు ప్రేమకి చాలా కారణాలు ఉంటాయి.
నిజమైన ప్రేమ అలా ఉండదు. ఆ ప్రేమ 'ఓ! ఇతను నాతండ్రి. కాబట్టి ప్రేమించాలి', అని చెప్పదు. అది అందరినీ, అన్నింటినీ ప్రేమిస్తుంది. అంతే. మామూలు ప్రేమలో గెలవటం, ఓడటం, అనేవి ఉంటాయి. నిజమైన ప్రేమలో గెలవటం ఉండదు. ఓడిపోవటం ఉండదు. అది అదే. అంతే. గెలుపు దానిని కనుక్కోవటంలో ఉంది.
చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరికైతే వేరే ఏదారి లేదో, అతనికి ప్రేమ లేనప్పుడు అతను సన్యాసి అవుతాడు. సన్యాసి అనగానే నిరాశతోనో, మానసిక కుంగుబాటుతోనో అన్నీ వదిలేసిన వ్యక్తి అని అనుకుంటారు. ఇలా చెప్పే వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారో అని బాధ అనిపిస్తుంది. అటువంటి అజ్ఞానం నుంచి వాళ్ళు అభిప్రాయాలు చెబుతారు. సన్యాసం అంటే అంతిమ వివాహం. ఆడైవంతో వివాహం.
నిజమైన సన్యాసి ఒక ప్రేమమూర్తి, కరుణామయుడు, దయాసాగరుడు, ఆయన నడచిన చోట గడ్డి మొక్క కూడా వాడిపోదు. ఇది కథ కాదు. ఇది నిజం. నిజమైన సన్యాసి కరుణని, ప్రేమని సదా ఈ అనంత సృష్టివైపు కురిపించుతూ ఉంటాడు. నిజమైన సన్యాసికి ప్రేమే ప్రార్థన : ప్రార్థనే ప్రేమ అని తెలుసు.
మీలో నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మీ ప్రార్థన ఆ ప్రేమని తెలియచేయటమే అవుతుంది. మీరాబాయి భజనలు ఏమిటి? ఆమె ప్రేమ వాహినలు. ఆమె జ్ఞానోదయం పొందిన గొప్ప భక్తురాలు. ఆమె ఈ అనంత సృష్టికి తమ ప్రేమని ప్రవహింపచేసింది. అందుకే ఆమె భజనలు ఈ రోజుకి కూడా అజరామంగా ఉన్నాయి. వాటి వెనుక ఉన్న శక్తి ఎప్పటికీ వెసిలిపోదు, తరగిపోదు. ఎందుకంటే అది విశ్వశక్తి. మామూలు ప్రేమ అన్ని సంవత్సరాలు అంతమంది మనసులో నిలబడిపోదు. కేవలం నిజమైన ప్రేమ మాత్రమే శక్తిని వ్యాపింపచేస్తుంది.
మీరాకి ఆమె భజనలే ఆమె ప్రార్థనలు. మీరు నిజమైన ప్రేమని కనుగొంటే దానికి వేరే దారిలేదు. ప్రార్థన ప్రేమ అవుతుంది. నిజమైన ప్రేమని కనుగొంటే ఏమీ ఆశించదు. అది పరిపూర్ణతతో ప్రవహిస్తుంది. మీరు ప్రార్థనలో అడగటం మానేస్తే మీరు నిజమైన ప్రేమని కనుగొంటారు.
మీకు తెలిసిన ప్రేమ ఒక బుద్ధిహీనత మాత్రమే. అది హార్మోన్లు పెట్టే హింస మాత్రమే. హార్మోన్లు మీ మైండ్ నుంచి బయటకి రావటమే మామూలు ప్రేమ. మీ మానసిక రూపాన్ని తృప్తిపరచటానికి ఎవరో ఒకరు కావాలి. ఎవరైనా మీకు మానసిక
ఆధారాన్ని ఇచ్చేవాళ్ళు మీకు కావాలి. మీకు రెండు నిమిషాలపాటు ఆధారంగా నిలబడే వాళ్ళు కావాలి.
మీ అవసరాలు తీర్చేవాళ్ళు కావాలి. మీకు డల్‌గా ఉన్నప్పుడు మిమ్మలని ప్రోత్సహించటానికి ఎవరో ఒకరు కావాలి. మీకు సానుభూతి చూపించే వారు కావాలి. మీ సమస్యలను, నిజమే అని నొక్కిచెప్పేవాళ్ళు కావాలి. దీనినే మీరు ప్రేమ అంటారు.
నిజమైన ప్రేమ పేరుకి, రూపాలకి అతీతమైనది. అది శరీరాలకి, మైండ్‌కి అతీతమైనది. కేవలం వీటన్నింటికీ అతీతంగా ఈ ప్రపంచాన్ని ప్రేమించగల వ్యక్తి మాత్రమే సన్యాసి. అతనే వివేకానందుడు కాగలడు.
వివేకానందుని జీవితంలో జరిగిన ఒక సంఘటన:
ఒరోజు వివేకానందుడు రాత్రి 2 గంటల సమయంలో అకస్మాత్‌గా నిద్రలేచి తన శిష్యులని నిద్రలేపుతారు. వాళ్ళు ఏం జరిగిందో అని కంగారు పడతారు. ఆయన వారితో తనకు ఎందుకో గాని చాలా బాధగా ఉన్నది అంటారు. ప్రపంచంలో ఎక్కడో ఏదో ప్రమాదం జరుగుతున్నది అని బాధపడతారు. ఆ ప్రమాదం తనలో చాలా వేదన కలిగిస్తుంది అని చెబుతారు.
మర్నాడు పేపర్లో, క్యూబాలో భయంకరమైన భూకంపం వచ్చిందని, చాలామంది చనిపోయారని వార్తలు వస్తాయి.
వివేకానంద స్వామి, ఎక్కడో ప్రపంచంలో జరిగిన ప్రమాదానికి ఇక్కడ ఆయన ఎంతో బాధ అనుభవించారు. ఇలా సున్నితంగా స్పందించటం సామాన్య మానవులకి సాధ్యమేనా? మన ప్రక్కింటి వాళ్లు అనారోగ్యంతో ఉంటే మనకి తెలియదు.
ఒక చిన్న కథ:
ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ డాక్టరుకి ఫోను చేసి "డాక్టరు గారు, మీరు ఇక్కడికి వచ్చి నా భార్యని చూడాలి అని అనుకుంటున్నాను" అని అంటాడు.
అప్పుడు డాక్టరు “ఎందుకు? ఆమె ఆరోగ్యం బాగాలేదా?” అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి “అవుననుకుంటా డాక్టర్! నిన్న మామూలుగానే నిద్రలేచింది. స్నానం చేసింది. వంట చేసింది. పిల్లలని స్కూలుకి పంపించింది. ఇల్లు శుభ్రం చేసింది. పని మనిషి రాలేదు. అందుకు సామాను తోమి, బట్టలు ఉతికి, పిల్లలని స్కూలు నుంచి తీసుకువచ్చింది. వాళ్ళతో హోంవర్క్ చేయించి నిద్రపోయింది. మధ్య రాత్రి లేచి తనకి నీరసంగా ఉన్నది అని అంటున్నది. బహుశా ఆమెకి చెకప్ చేయాలేమో” అని చెబుతాడు.
(అంతా నవ్వులు)
ఈ రోజులలో మనకి సున్నితత్వం అసలు ఉండటం లేదు. మనతో 24 గంటలూ, 365 రోజులూ ఉండే వ్యక్తితో మనకి ఎటువంటి సంబంధం ఉండటం లేదు. మనం సున్నితంగా, ఉత్సాహంగా ఉండాలి. మీ అంతరాత్మ ప్రేమమయమయినప్పుడు అది అప్రయత్నంగా జరుగుతుంది. దీని గురించి మీకు ఎవరూ ఏమీ చెప్పనవసరం లేదు. ఎవరూ చెప్పకుండానే మీకు వారి సమస్యలు అర్థమయిపోతాయి. అప్పుడు మీరు వారికి సహాయం చేస్తారు. ఇది మీకు చాలా సహజంగా ఉంటుంది.
కొంతమందికి అందరూ తమ మీద శ్రద్ధ చూపాలి అని లేని అనారోగ్యాన్ని నటించుతారు. అటువంటివారికి మనం ఏమీ చేయనవసరం లేదు. నేను మాట్లాడే సున్నితపు స్పందన అనేది మీరు అనంత చైతన్య సృష్టితో మీకు ఉన్న లోతైన సంబంధంతో మీలో కలిగే సహజమైన స్పందన. అది అనంత చేతన స్థితిపై మీకు కలిగే స్పందనగా మారుతుంది.
వివేకానందునిలో కలిగిన స్థితి భావాతీతమయిన ఒక మనోభావన కాని, సానుభూతి కాదు. సానుభూతి బాహ్యమయిన పైపైన చెప్పే మాట. మనందరం సానుభూతిని చూపించగలం. ఎవరైనా మనకి వాళ్ళ కష్టాలు చెబితే “అవునా!” అని వారి మీద సానుభూతిని చూపించుతాము. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఆమె భర్త ఆరోగ్యం బాగాలేదు అని చెబితే మీరేమంటారు, “అయ్యో! అలానా! నీకు చాలా కష్టం వచ్చింది. కానీ బాధపడకు, అతనికి తగ్గిపోతుందిలే" ఇలా మాట్లాడుతూ, సానుభూతి పేరు మీద వారి బాధలను మరొకసారి నిర్ధారించుతారు. అప్పుడు వాళ్ళు మిమ్ములని చాలా మంచివారని, వేరే వారి విషయంలో శ్రద్ధ తీసుకుంటారని మెచ్చుకుంటారు. మిమ్ములని ఇష్టపడతారు.
నిజానికి వారు మిమ్ములని ఎందుకు మెచ్చుకుంటారు? ఎందుకు ఇష్టపడతారు? ఎందుకంటే మీరు వారితో కష్టాలలో ఉన్నారు అని చెబుతారు. మీరు చాలా బాధని భరిస్తున్నారు అని అంటారు. అప్పుడు చాలా సూక్ష్మదశలో ఉన్నవారి అహంకారం తృప్తి పడుతుంది. వారికి చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే వారితో మీరు, చాలా కష్టాలని భరిస్తున్నారు అని చెప్పినందుకు, దీనినే సమాజం సానుభూతి అని అంటుంది.
యోగులు, గురువులు చూపించేది సానుభూతి కాదు. అది ఎదుటివారి కష్టాలను తమ అంతరంగంలో అర్థం చేసుకుని అనుభవించి దానిపై సున్నితంగా స్పందించే ఒక భావాతీత మానోధారణ లేదా ఎంపతీ. ఈ భావన ఉన్నప్పుడు ఎదుటివారి కష్టాలను తమ అంతరంగంలో అనుభవించుతారు. అందుకే కష్టాల విషయం ఎదుటివారు వీరికి చెప్పనవసరం లేదు. అదివారు వారిలోని విశ్వశక్తి సహాయంతో అర్థం చేసుకోగలుగుతారు.
గురువులు మీలో ఒకరయిపోతారు. ఎందుకంటే వారు అనంత చైతన్యంలో ఒక భాగమయి ఉంటారు కాబట్టి. మీరు మాత్రమే వారిని వేరుగా చూస్తారు. వారు మీలో ఒకరై ఉంటారు, కాబట్టి మీ కష్టాలని వారి హృదయంలో అనుభవించగలరు. వారికి అంతకంటే వేరే దారిలేదు. అలా వారిలోపలికి వచ్చే కష్టాలను భరించే శక్తి వారిలో ఉంటుంది.
మామూలు ప్రేమ వలన పిల్లలు జన్మించుతారు. నిజమైన ప్రేమలో మీ అంతరంగం జన్మిస్తుంది. మీకు మీరే కొత్త జన్మని ఇస్తారు. అదే మీలో జరిగే పెనుమార్పు, అదే రూపాంతరం. ఇది ఎలా ఉంటుందంటే గొంగళిపురుగు సీతాకోకచిలుకగా ఎలా రూపాంతరం చెందుతుందో, మీరు ఒక కొత్త వ్యక్తిగా రూపాంతరం చెందుతారు. అదే ఆత్మ సాక్షాత్కారం, లేదా ఆత్మజ్ఞానం, మీలో ఇంతకాలం నిద్రాణమయిన ఆ ప్రేమ అనే శక్తి ఇప్పుడు మేల్కొంటుంది.
వివేకానంద స్వామి "లేవండి! మేల్కొనండి," అని అంటే దాని అర్ధం మనం నిద్రపోతున్నామనా? అవునులే! మనం నిద్రపోతునట్టు తెలియకుండానే మనం నిద్రపోతాము. ఆ నిద్రలోనే మన తీర్పులు, నిర్ణయాలు ప్రకటించుతాము. ఆ నిద్రలోనే అందరినీ విమర్శించుతాము. మనం మేలుకొని ఉన్నామనుకొని విమర్శించుతాము. మనకి అన్నీ తెలుసు అనుకుంటాము. ప్రేమ అంటే కూడా బాగా తెలుసు అని అనుకుంటారు.
ఒక చిన్న కధ
ఒక వ్యక్తికి బాగా డబ్బు ఉన్న అత్త ఉంటుంది. అతను ఆమె ఇంటికి ప్రతి రోజు వెళ్ళి ఆమెని చూసి వస్తుంటాడు. అతనికి ఆమె ఆస్తి మీద ఆశ ఉంటుంది. అతను ఆమెని ఆనందింపచేయటానికి, ఎక్కువగా వెళుతుండే వాడు.
ఆమె దగ్గర రెండు పిల్లులు ఉన్నాయి. ఆమెకి ఆ పిల్లులు అంటే చాలా ఇష్టం. అతనికి ఆ విషయం తెలుసు. ఆమె దృష్టిలో పడాలి అని అతను ఆ పిల్లులని జాగ్రత్తగా చూస్తుంటాడు. అతని మనసులో ఆమె కొంత ఆస్తి అయినా అతనికి ఇస్తుందని, ఆమె వీలునామాలో తన పేరు ఉంటుంది అని అతని ఆశ. అందుకే అతను ప్రతి రోజూ ఆమె ఇంటికి వెళ్ళి, పిల్లులకి పాలుపట్టి, వాటితో ఆడుకుని, వాటితో చాలా సమయం గడిపి ఇంటికి వెళ్ళేవాడు.
అతను పిల్లులని అంత ప్రేమగా పెంచటం చూసి ఆమె చాలా ఆనందపడేది. అతను చేసే పనులన్నింటికీ ఆమె చాలా సంతోషపడేది.
ఆ తరువాత ఆమె చనిపోతుంది. ఆమె వీలునామాలో పిల్లులని ఆ వ్యక్తికి రాస్తుంది.
(అంతా నవ్వులు)
ఆమె అతనికి పిల్లులు అంటే చాలా ఇష్టం అని పిల్లులని ఇస్తుంది. అతను ఎంత ఆశాభంగం పొంది ఉంటాడో మీరు ఊహించగలరు. ఇన్ని నెలలూ అతని చూపించిన ప్రేమకి ఎంత బాధపడి ఉంటాడో కదా! తాను మోసపోయాను అనుకుంటాడు. అతనికి వళ్ళు మండిపోయి ఉంటుంది. కోపం, ఆశాభంగంతో అతను కుంగిపోయి ఉంటాడు.
మామూలు ప్రేమ ఉన్నప్పుడు మీరు మోసపోయాము అని చాలాసార్లు అనుకుంటారు. అందరూ సంపద కోసమో, ఏదయినా సహాయం పొందటం కోసమో, ఏదైనా సలహాకోసమో, ఇలా ఏదయినా అవసరం తీరటం కోసం ఎదుటివారిని ప్రేమించుతారు. ఆ విధంగా ఎదుటివారిని ఉపయోగించుకోవాలి అని చూస్తారు. ఇటువంటి ప్రేమ కేవలం ఏదో కారణాలతోనే ముడిపడి ఉంటుంది. ఇటువంటి ప్రేమ నిండా ఆకాంక్షలు, ఏవో ఆశించటాలు ఉంటాయి.
ఇవన్నీ చెబితే ఎవరూ నిజమని ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే వాళ్ళు మామూలు ప్రేమలో మునిగిపోయి ఉంటారు. వారికి కేవలం ప్రేమ అంటే ఇదే అని అనుకుంటారు. వారు చాలా మంచి ప్రేమికులం, బాగా ప్రేమిస్తాము అని అనుకుంటారు.
మీరు నిజాయితీగా కూర్చొని ఆలోచించితే, నేను చెప్పిన విషయం 'సత్యం' అని అర్థం చేసుకుంటారు. మీ గురించి మీరు నిజాయితీగా విచారణ చేసి చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఒకసారి కూర్చొని మీరు కొంచెం వ్యతిరేకంగా ప్రవర్తించితే మీ అమ్మా లేదా నాన్న గారు లేదా అక్క చెల్లెళ్ళు మీ విషయంలో ఎలా స్పందించుతారో ఊహించండి. అది చాలు. నేను చెప్పే విషయాలు మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు.
మనం నిరంతరం ఎవరో ఒకరి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాము. అంటే మనం నిరంతరం ఎదుటివారి నుంచి ఏదయినా పొందాలి అని చక్కటి దారులు ఏర్పరచుకుంటాము. ఈ సున్నితమయిన చక్కని దారినే మనం ప్రేమ అని పిలుస్తాము. ఇది కేవలం ఆస్తులు, సంపదలు పొందటానికే కాదు. దీనిని చాలా చిన్న విషయాలకి కూడా మనం ఉపయోగించుతాము. ఎదుటి వ్యక్తి మనకి ఇష్టమయిన పద్ధతిలో ప్రవర్తించాలి అని అనుకునప్పుడు మనం ఈ ప్రేమనే చూపించుతాము. వాళ్ళు మన ఇష్ట ప్రకారం నడచుకోవాలని మనం కూడా వారి ఇష్ట ప్రకారం నడచుకుంటాము. అలా ఆ ఇద్దరూ ఒకరికి అనుగుణంగా ఒకరు నడుచుకున్నంత కాలం వారు బాగా ప్రేమించుకుంటారు. ఎప్పుడైతే ఎవరైనా కొంచెం వ్యతిరేకంగా ప్రవర్తించితే అంతే, అంత ప్రేమా నిలువునా మునిగిపోతుంది.
ఉదాహరణకి : మీరందరూ నన్ను చాలా ప్రేమిస్తున్నాము అంటారు. మీలో ఒక్కొక్కరు నేను మీ పట్ల ఎలా ఉండాలనుకుంటారో నేను అలా ప్రవర్తించాలని ఆశిస్తారు. ఇప్పుడు నేను చేసే పని అదే. అప్పుడు ఏమవుతుంది? నేను మిమ్మలని చూసి ఒక్కసారి నవ్వలేదనుకోండి లేదా మీకు ఇష్టం లేని విషయం మీకు చెప్పాననుకోండి, అప్పుడు మీరు నేను మిమ్మలని ప్రేమించటం లేదు అని అనుకుంటారు. ఆ క్షణంలో మీకు నామీద ఉన్న ప్రేమంతా పోతుంది.
అప్పుడు మీరు ఏమని ఆలోచించుతారు. నేను అంత ప్రేమించలేదని, నాకు ప్రేమ లేదు అని అనుకుంటారు. మీరు ప్రేమ అని నడిపే ఆ వ్యవహారం చాలా బాధల్లో పడిపోతుంది. నేను అన్న విషయాలకి మీరు ఏవోవో ఊహించేసుకుంటారు. నేను ఏదో ఒక విషయం చెప్పినందుకు లేదా నేను మిమ్మలని చూసి నవ్వనందుకు మీరు ఇన్ని విధాలుగా అనుకుంటారు.
ఆ సమయంలో నేను ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండవచ్చు. లేదా మీలో అహం కొంచెం సర్దుకుంటుంది అని నవ్వి ఉండకపోవచ్చు. అంతే. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మీ మనస్సుకి ఎలా తోస్తే అలా అనుకుంటారు. మీ డిక్షనరీలో ఉన్న ప్రేమతో నా చర్యలని పోల్చుకుంటారు. అప్పుడు ఏమవుతుంది. మీరు గొప్ప వ్యథలో ఇరుక్కుపోతారు.
ఈవిధంగా మీరు ప్రేమని ఒక చిక్కు సమస్యలా చేస్తారు. నా విషయానికి వచ్చేసరికి నాకు ఆ సమస్యలు లేవు. ఎందుకంటే నేను ఈ సామాన్యమైన ప్రేమకి అతీతుడిని. మీరు ఒక్కసారి ఊహించండి. మీలో ఏ ఇద్దరికైనా ఇలా జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో. మొత్తమంతా కల్లోలలమయిపోతుంది. మీరు ఎక్కువ ప్రేమ నుంచి తక్కువ ప్రేమకి, తక్కువ ప్రేమ నుంచి ఎక్కువ ప్రేమకి ఇలా ముందుకీ వెనక్కీ కదులుతూ ఉంటారు. అంతే.
ప్రేమ, ఇంకా ఇతర భావావేశాల విషయం వచ్చేసరికి మీరు ఒకరిమీద ఒకరు ఎంతో ఆధారపడిపోతారు. ఆ ఆధారపడటం అనేది చాలా సూక్ష్మంగా, మోసపూరితంగా ఉంటుంది. మీరు ఎటువంటి కారణం లేకుండా ప్రేమించగలిగితే మీది స్వచ్ఛమైన ప్రేమ. అంతే. స్వచ్ఛమైన ప్రేమ దేనిమీదా ఆధారపడదు. అది కేవలం మీ మీద మాత్రమే ఆధారపడుతుంది. ఈ విషయం స్పష్టంగా తెలుసుకోండి. చాలామంది నాతో అంటుంటారు. స్వామీజీ! మేము మా పిల్లలని ప్రేమిస్తాము.
పిల్లలు చూసినప్పుడు వారి అమాయకత్వానికి ఆకర్షితులవుతారు. అది ఒక విషయం. అంతే కాకుండా వాళ్ళని చూస్తే మీకు గర్వంగా ఉంటుంది. మీ అహంకారాన్ని తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే వారు మీ సృష్టి. వాళ్ళకి మీరు అన్ని సదుపాయాలు ఇస్తారు. వాళ్ళని సంతోషంగా ఉంచుతారు. కానీ నేను చెప్పే విషయం ఏమిటంటే, ఈ ప్రేమ కూడా చాలా నిబంధనలతో, ప్రాముఖ్యాలతో నిండి ఉంటుంది. ఇది పూర్తిగా పిల్లలు, వారి ప్రవర్తన మీదా ఆధారపడి ఉంటుంది.
ఒక చిన్న కథ:
ఒక వ్యక్తి రోడ్డు వేస్తుంటాడు. పైన ఫినిషింగ్ వర్క్ అప్పుడే పూర్తి చేస్తాడు. ఇంతలో కొంతమంది పిల్లలు ఆ రోడ్డు మీద పరిగెడతారు. దాని మీద వారి కాలి అడుగులు పడతాయి. అతనికి చాలా కోపం వచ్చి వాళ్ళని బాగా తిడతాడు.
అప్పుడు అతని స్నేహితుడు, “ఏమిటి విషయం? నీకు పిల్లలు అంటే చాలా ఇష్టం కదా? అని అంటాడు.
దానికి ఆ వ్యక్తి “అవును. నాకు ఇష్టమే. కానీ ఇలా రోడ్డుమీద కాదు” అంటాడు.
(అంతా నవ్వుతారు)
మామూలు ప్రేమ నిరంతరం ఎక్కడో, ఏవో నిబంధనలతో వస్తుంది. లేదా ఏదైనా ఆకాంక్షతో ఉంటుంది. ఈ విషయాన్నే నేను మీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. మనం ఎదుటివారిని వారి పేరు ప్రతిష్టలు చూసి, లేదా వారు ఉన్న సందర్భం, వారి ఉన్న స్థితి ఇలా చాలా విషయాల ఆధారంగా వారిని ప్రేమించుతాము. ఇదంతా ఏదో ఒక విషయానికి అధీనమయి ఉంటుంది. కాని గురువు యొక్క ప్రేమ చాలా స్వచ్ఛమయినది. అది నిజమైన ప్రేమ. ఆయన మీరు అడగకుండానే మీ మీద ప్రేమని కురింపించుతాడు. ఆయన ప్రేమకి స్థలం, పేరు, సందర్భం ఇవేవి తెలియవు. ఆయన చెప్పే ప్రతి మాట ఆయనకి మీ మీద ఉన్న ప్రేమతో చెబుతాడు. ఆయన నిరంతరం మీ అభివృద్ధిని కాంక్షించుతాడు. ఆయన ప్రతి చర్యా ప్రేమతో నిండి ఉంటుంది. ఆయనకి ఉన్న ఒకే ఒక సహజ భావావేశం ప్రేమ. మిగతా భావావేశాలన్నీ మీ భాషలో ఆయన మీకు చెప్పే కొన్ని ప్రేమతో కూడిన మాటలు మాత్రమే.
నేను ఎప్పుడూ నా శిష్యులకి చెబుతుంటాను : నేను మీతో మృదువుగా నెమ్మదిగా ఉన్నాను అంటే నేను మిమ్మలని మోసం చేస్తున్నట్టు అర్థం. అదే నేను మీ మీద కోపంతో మండిపడితే నేను మీకు ఏదో నేర్పించుతున్నట్టు అర్థం. రెండు విధాలుగా కూడా మీరు అభివృద్ధి చెందుతారు. కొన్ని సార్లు నేను మీతో చాలా కరుణగా, మృధువుగా ఎంతో ప్రేమతో ఉంటాను. ఎందుకంటే మీలో మార్పు తేవాలని, మీరు మృధువుగా మారతారని. దాంతో మీరు మీ అంతరంగంలో వాస్తవాలు తెలుసుకునే స్థితికి వెళతారు. ఈ రెండు విషయాలలో కూడా నేను చూపించేది నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ.
గురువులు అనంత ప్రేమ సాగరంవంటివారు. వారికి కేవలం ఇవ్వటమే తెలుసు. ఆయనే ఈ సర్వాంతర్యామి అయిన సర్వసృష్టి. మీరు ఆయన దగ్గరికి ఒక పాత్రతో వెళితే ఆయనని ఆ పాత్రనిండుగా మీరు తీసుకెళ్ళవచ్చు. ఒక ముంత తీసుకువెళితే ఆయనని ఆ ముంతడే తీసుకువెళతారు. ఇదంతా మీకు ఆయనపై ఎంత దాహంతో ఉన్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతే మీకు బాగా దాహంగా ఉందనుకోండి ఆయన దగ్గరకి పెద్ద పాత్రతో వెళతారు. దాని నిండా ఆయనని మీరు తీసుకోవచ్చు.
కాని ఆయన నిరంతరం మిమ్మలని గమనిస్తూ అక్కడే ఉంటారు. మీకు ఇష్టమైన పాత్రతో మీరు ఆయన దగ్గరకి రావచ్చు. మీరు ఆయన మీద ప్రయోగించే మీ అనిశ్చితని, మీ మైండ్ ఆడే ఆటని, మీ తర్కాన్ని, మీ నిబంధనలని అన్నింటినీ గమనిస్తుంటాడు.
స్పష్టంగా అర్ధం చేసుకోండి. నేను భగవంతుడిని గాని లేదా గురువుని గానీ ప్రేమించమని మీకు చెప్పటం లేదు. మీకు భగవంతుడెవరో తెలియదు. ఆయనని ఎలా ప్రేమిస్తారు? మీరు చూడని దానిని ప్రేమించటం అంటే అది మీకు చాలా కష్టమైన పని. కానీ మీరు చూసే దానిని ప్రేమించవచ్చు కదా! మీరు జంతువులని, పక్షులని, మొక్కలని, మనుషులని మీరు చూసే సమస్త సృష్టిని మీరు ప్రేమించండి. వాటిని ఎటువంటి కారణం లేకుండా కేవలం మీ ఆనందం కోసం ప్రేమించండి.
వాటితో మీరు లోతైన సంబంధాన్ని ఏర్పరచుకుని అప్పుడు ప్రేమించండి. మీరు ఇలా చేయటం మొదలు పెట్టినప్పుడు మీరు ఈ సర్వచైతన్య సృష్టి మీద నమ్మకాన్ని పెంచుకుంటారు. ఎందుకంటే ఈ సృష్టి అనే ఆధారమైన దారం అన్నింటినీ కలుపుతూ అన్నింటి గుండా వెళుతుంది. నమ్మకం అనే దానిని మీ మీద బలవంతంగా
రుద్దలేము. అలా మీ మీద బలవంతంగా విధించితే మీరు దానిని వ్యతిరేకించుతారు. మీకు కోపం వస్తుంది. దానితో నమ్మకం అనే మాట మీద మీరు కొంత వ్యతిరేకతని చూపించుతారు. మిమ్ములని అనవసరంగా దాని మీద ఆధారపడేట్టు చేసారు అని బాధపడతారు. అలా కాకుండా నమ్మకం అనేది మీకు ఒక అనుభవం ద్వారా తెలిస్తే అది వేరే విషయం.
మీతో ఇటువంటి నమ్మకం ఏర్పడితే, క్రమంగా మీ ప్రేమ అనంత చైతన్య సృష్టిపై ప్రేమగా మారుతుంది. అదే భగవంతుని మీద ప్రేమ. అదే జీవాధారమైన విశ్వశక్తి మీద ప్రేమ. అ ప్రేమే అన్నిటినీ కలిపే ఆధారమైన ముఖ్య దారం. అప్పుడు ఈ సృష్టి వైపుకి మీ నుంచి ప్రేమ ప్రవహించుతుంది. అప్పుడు అంతిమ మతమయి కృతజ్ఞత, ప్రేమ అనే మతం మీలో నాటుకుంటుంది.
కృతజ్ఞత, ప్రేమ అనేవి పరస్పరం సంబంధం ఉన్న విషయాలు, మీరు మీ అంతరంగపు లోతులనుంచి కృతజ్ఞతా భావాన్ని చూపించితే, అప్పుడు మీలో కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. నిజమైన ప్రేమకి మొదటి మెట్టు కృతజ్ఞత. మీలో అసంతృప్తి ఉన్నంతకాలం మీలో నిజమైన ప్రేమ ఉండదు. కృతజ్ఞత, ప్రేమ కలసి ఉంటాయి. కృతజ్ఞత గురించి మరిన్ని వివరాలు సహస్రార చక్రం గురించి నేర్చుకునేటప్పుడు తెలుసుకుందాము.
నేను ఈ విషయాలు చెప్పేటప్పుడు కొందరు నాతో అంటుంటారు. "స్వామీజీ! నేను ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తాను. నేను చిన్న చీమకి కూడా హాని చేయను" అని. మీరు ప్రపంచాన్నంతా ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎందుకు మోసం చేసుకుంటారు. మీ ప్రక్క ఇంటివారిని మనస్ఫూర్తిగా ప్రేమించగలరా? నేను చెబుతున్నాను. ఇలాంటి మాటలు, ప్రపంచాన్నంతా ప్రేమిస్తున్నాను అని చెప్పే మాటలు చాలా తేలిక. ఎందుకంటే వాటిని నిరూపించనవసరం లేదు.
వారు నిరంతరం నేను ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాను అని చెబుతూనే ఉంటారు. కానీ వారు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతారు. అది చూపించటానికి వారు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. అసలు ఈ ప్రపంచం చేతితో తాకి తెలుసుకొనే వస్తువు కాదు. దీనికి స్పష్టత ఉండదు. మరి ఎలా ప్రేమిస్తున్నామని చూపించగలరు.
అదే వ్యక్తులని నీ ప్రక్కవారిని ప్రేమించు అనగానే సమస్య ప్రారంభమవుతుంది. అతని ముఖాన్ని ప్రతి రోజు చూడాలి. ఏదైనా కనపడేటట్టు చేసి మీరు ప్రేమిస్తున్నారని నిరూపించాలి. అందుకే అది మీకు ఒక సమస్య.
అటువంటపుడు చీమకి కూడా హాని చేయక పోవటం ఏవిధంగా గొప్ప విషయం. చీమ మీ సంపదలని తీసుకోగలదా? మిమ్మలని ఏమైనా చేయగలదా? అది మీకు దాని మీద గల ప్రేమని పరీక్షించగలదా? అది కళ్ళకే కనపడదు. కానీ దాని గురించి మీరు నాతో మాట్లాడతారు. ఇవన్నీ సత్యం నుంచి మీరు తప్పించుకోవటానికి చేసే పనులు.
మీరు ఒక్క విషయం అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీ సహజ సిద్ధమైన లక్షణం ప్రేమ. ప్రేమ శాశ్వతమైనది. మనకి ఉండే మిగతా భావావేశాలు వచ్చిపోతుంటాయి. అంతే. ఈ భావావేశాలన్ని నిజమే అనే ఆలోచనలలో మీరు చిక్కుకుపోతారు. అవి ప్రేమని నాశనం చేస్తున్నాయి అని అనుకుంటారు. అసలు ప్రేమని ఎవరూ నాశనం చేయలేరు. ప్రేమని నాశనం చేయగలిగి ఉంటే అది ఈ పాటికి ఎప్పుడో పూర్తిగా మాయమైపోయేది.
అలాగే మీరు నిజంగా ప్రేమించితే మీలో ఎటువంటి వ్యతిరేకపు భావావేశాలు ఉండవు. అవి మీ నుంచి మాయమైపోతాయి. ఒక గదిలో ప్రకాశవంతమయిన వెలుతురు ఉంటే అక్కడికి మీరు చీకటిని తేగలరా? మీరు దీపాల ప్రకాశాన్ని తగ్గించితేనే ఆ గదిలోనికి చీకటి వస్తుంది. అదే విధంగా మీలో నిజమైన ప్రేమ లేనప్పుడే మిగతా భావావేశాలు మీ లోపలికి వస్తాయి. మీరు ప్రేమతో
ప్రకాశించేటప్పుడు, మీలోపలికి ఎటువంటి భావావేశం ప్రవేశించదు. అనాహత చక్రం మీలో ప్రేమని ప్రకాశింపచేస్తుంది. ఎందుకంటే ఇది పొంగి ప్రవహించే శక్తిమయమైన ప్రేమ శక్తి.
మీకు కొన్ని సార్లు ఈ విధమైన అనుభవాలు జరిగి ఉంటాయి. మీరు ఏ పనిలోనైనా పూర్తిగా నిమగ్నమయిపోయి ఉంటే, మిమ్ములని మీరు మర్చిపోతారు. అలాంటి అనుభవం మీకు చాలా సార్లు జరిగి ఉంటుంది. అది ఏ పని అయినా సరే. మీరు మర్చిపోతారు. మీరు దేనినైనా పెయింట్ చేసేటప్పుడుగాని, చదివేటప్పుడు గాని బొమ్మలు వేసేటప్పుడు..... ఇలా ఏదైనా. ఏ విషయంలోనికైనా మీరు లోతుగా వెళితే, మిమ్ములని మీరు మర్చిపోతారు. మీకు బాగా తలనొప్పిగా ఉన్నదనుకోండి ఏదయినా పూర్తిగా నిమగ్నమయ్యే పని చేయండి. మీ తలనొప్పిపోతుంది.
చూడండి : మీరు నిరంతరం మీ తల గురించి అనుకుంటుంటే, తలనొప్పి అలానే ఉంటుంది. ఏ క్షణాన అయితే మీరు ఒక విషయంలోనికి లోతుగా వెళతారో, అప్పుడు మీరు మీ తలని మర్చిపోతారు. అప్పుడు తల నొప్పి మాయం అవుతుంది. ఎప్పుడయితే మీకు మరలా తల గుర్తువస్తుందో, అప్పుడు మీకు తిరిగి తలనొప్పి మొదలవుతుంది. మీరు ఏ భావావేశంలోనికైనా లోతుగా వెళితే అది మాత్రమే అక్కడ ఉంటుంది. మీరు ఉండరు. దీనినే మనం "పరిపూర్ణత" అంటాము.
ఎప్పుడయితే 'మీరు' మాయం అవటం అనేది మీరు కొన్ని క్షణాలపాటు అనుభవమవుతారో, దానిని మీరు మరింత తీవ్రంగా,పూర్తిగా ప్రతి పనిలోనూ చేస్తే, మీరు మాయం అవటం అనే అనుభవాన్ని చాలా సార్లు పొందవచ్చు . అది ఎక్కువ సేపు కూడా ఉంటుంది. అప్పుడు మీకు పనులలో నిమగ్నమైచేయటం అలవాటవుతుంది. అప్పుడు మీరు ఉండరు. అలా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండవచ్చు, ఉండకుండా చేయవచ్చు . అప్పుడు మీరు బయట చేసే పని నుంచి స్వతంత్రులవుతారు.
అలాగే మీరు నిజమైన ప్రేమతో ప్రకాశించుతుంటే, మిమ్మలని మీరు మర్చిపోతారు. మీరు కేవలం ప్రేమని మాత్రం అనుభూతి చెందగలరు. మీరే ప్రేమగా మారిపోతారు. ఎప్పుడయితే మీరే ప్రేమగా మారిపోతారో మీరు ప్రతి దానిని కరుణతో చూడగలరు. కరుణ మీ నుంచి ప్రవహించుతూ ఉంటుంది. అప్పుడు మీరు మీ చుట్టుప్రక్కల ఇంకా చాలా భాధ్యతలని తీసుకోగలరు. ఆ భాధ్యతలని మీరు ఏదో సేవచేస్తున్నాము అనే అహంకారంతో తీసుకోరు. మీలో పొంగి ప్రవహించే శక్తి వలన ఆ భాధ్యతలని తీసుకుంటారు.
ప్రేమ, భాధ్యత ప్రక్క పక్కనే ఉంటాయి. ఎప్పుడయితే మీరు నిజముగా పూర్తిగా ప్రేమిస్తారో అప్పుడు మీరు పూర్తి బాధ్యతని తీసుకుంటారు. చాలా మంది అనుకుంటారు, సన్యాసం అంటే బాధ్యతల నుంచి పారిపోవటం అని. మీకు చెబుతున్నాను సన్యాసం అంటే కుటుంబ బాధ్యతలు ప్రక్కనపెట్టి, పెద్ద కుటుంబమైన ఈ ప్రపంచ బాధ్యతని, మొత్తం మానవత్వం యొక్క బాధ్యతని తీసుకుంటారు. ఈ కుటుంబం మామూలు కుటుంబం కన్నా కోట్ల రెట్లు పెద్దది. వారికి ఇది అర్ధం కాక విమర్శించుతారు.
మీరు ఎక్కువ బాధ్యత తీసుకునే కొద్దీ మీరు మరింత విస్తృతం అవుతారు. బాధ్యతని తేలికగా వదిలివేయవచ్చు. మీరు అలా వదలనప్పుడు, ఆ బాధ్యతని మీరు పూర్తిగా తీసుకోవాలి. అప్పుడు మీరు ఇంకా వికసించుతారు. మీలో దైవశక్తి అప్రయత్నంగా ప్రవహిస్తుంది. నేను చికిత్స క్లాసులలో ఆ సాధకులకి చెబుతుంటాను. మీకు ఎంత వీలయితే అంత బాధలు పడే వారి బాధ్యత తీసుకోమని చెబుతాను. వీలయినంత మందిని బాధల నుంచి బయటకి తీయమని చెబుతాను.
మీ చుట్టుప్రక్కల ఉన్న బాధలకి మీరు కొంత బాధ్యత తీసుకోగలిగితే, దానిని తగ్గించాలనే తాపత్రయంతో మీరు ఆ బాధల వైపు నిలబడతారు. చాలా మంది అనుకుంటారు, మా కుటుంబానికి చేస్తే చాలు అని. అలా ఉన్నప్పుడు మీరు కుంచించుకుపోతారు. మీరు, మీ పరిధి, విస్తారం కాదు. మీలో అభివృద్ధి జరగాలి అంటే మీరు విస్తృతమవ్వాలి. మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు మీలో శక్తి నలువైపులా వ్యాపిస్తుంది. అప్పుడు అనంత చైతన్య సృష్టి మీ ద్వారా ప్రవహించుతుంది.
కొంత మంది నాతో అంటుంటారు "స్వామీజీ, నా కుటుంబాన్ని నేను బాగా చూసుకుంటే చాలదా?" అని. మీకు చెబుతున్నాను: మీ చుట్టూ ఒక హద్దు ఏర్పరచుకోవటానికి మీరు చెప్పే ఒక కుంటిసాకు ఇది.
దీనితో మీ పరిధి మరింతగా చిన్నది అయిపోతుంది.
మీరు,చాలా ప్రసిద్ధి అయిన బౌద్ధ ధర్మాలను విని ఉంటారు:
బుద్ధం శరణం గచ్ఛామి.
ధర్మం శరణం గచ్ఛామి.
సంఘం శరణం గచ్ఛామి.
దీని అర్ధం: నేను బుద్దునికి అధీనుడిని. నేను ధర్మానికి అధీనుడిని. నేను సంఘననికి లేదా బుద్ధునిచే స్థాపించిన సంఘానికి అధీనుడిని.
బుద్ధునికి లేదా గురువుకి అధీనులవటం చాలా సులభం. దాని కోసం మీరు ప్రత్యేకంగా ఏమీ కష్టపడనవసరం లేదు. గురువులు దైవత్వంతో నిండినవారు. కాబట్టి వారికి అధీనమనవటం మీకు కష్టమయిన పని కాదు. చాలా మంది నాతో అంటుంటారు. ఎప్పుడయితే నన్ను చూస్తారో అప్పుడు వాళ్ళకి నామీద నమ్మకం ఏర్పడుతుంది అని. అది గొప్ప విషయం కాదు. నాలోని విశ్వశక్తి మిమ్మలని నావైపుకి ఆకర్షించుతుంది. అంతే.
ఆ తరువాత ధర్మం: నేను బుద్ధుని బోధనలకు అధీనుడిని. ఇది మొదటి దాని కంటే కొంచెం కష్టం. ఎందుకంటే మీరు ఎప్పుడయితే ఈ మాట చెబుతారో మీరు
దానిని ఆలోచించాలి. ఉదాహరణకి నేను మిమ్ములని శాశ్వతానందమయిన నిత్యానందంలో ఉండమంటాను. అదే నేను బోధించే సందేశం, అప్పుడు మీరు ఏమంటారు? "లేదు స్వామీజీ అది సాధ్యపడని విషయం" అని అంటారు. స్పష్టంగా తెలుసుకోండి. నేను కేవలం సాధ్యపడే విషయాలని మాత్రమే చెబుతాను. మీరు అనుకుంటారు. ఈయన జ్ఞానోదయమయిన గురువు. ఈయనకి మన నిత్య జీవితం గురించి ఏమీ తెలియదు అని. అలా అనుకుంటే అది తప్పు.
నేను చెప్పేవన్నీ మీ నిత్య జీవితంలో మీకు సాధ్యపడే విషయాలే. మీకు నా అనుభవాలనే చెబుతున్నాను. నేను ఏవో కొన్ని మాటలని మీకు బోధించటం లేదు. ఆ విషయాన్ని ముందుగా అర్ధం చేసుకోండి. మిమ్ములని శాశ్వతానందంలో ఉండండి అని చెబితే, మిమ్ములని నేను ఎటువంటి శాశ్వతానందాన్ని అనుభవిస్తున్నానో దాని లోనికి రమ్మని చెబుతున్నాను. ఇది పూర్తిగా సాధ్యపడే విషయం. నేను మీ ముందు అదే స్థితిలో ఉన్నాను.
తరువాత ధర్మం: నేను బుద్ధునిచే నిర్మింపబడిన సంఘానికి అధీనుడిని. ఇక్కడ అసలు సమస్య ప్రారంభమవుతుంది. ఈ విషయంలో వాళ్ళు చాలా పెద్ద బాధ్యతని తీసుకోవలసి వస్తుంది.
అర్ధం చేసుకోండి: గురువులు వారి శరీరంలో కంటే వారు సృష్టించిన ప్రత్యేక కార్యక్రమం లోనే ఎక్కువగా జీవించుతారు. వారిలో కేవలం 33% శక్తి మాత్రమే ఉంటుంది. మిగతా 66% వారు స్థాపించిన ప్రత్యేక కార్యక్రమంలోను, వారి బోధనలలోను ఉంటుంది. వారు అటువంటి బాధ్యతని తీసుకుంటారు. ఆ బాధ్యతలోనే జీవిస్తారు. నేనెప్పుడూ చెబుతుంటాను. నేను నాశక్తిని నా కార్యక్రమాల నుంచి తెచ్చుకుంటాను. కాని నేను తీసుకునే భోజనం నుంచి కాదు.
గురువులు ఎవరూ కర్మలు చేయటానికి జన్మించరు. వారిలో తీరని కోరికలు అంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే వారు పూర్తిచేయటానికి కర్మలేమీ ఉండవు. వారు కేవలం సంపూర్ణమైన, నిజమైన ప్రేమతో, కరుణతో జన్మించుతారు. ఈ మానవులని ప్రకాశవంతులుగా చేయటానికి జన్మించుతారు. గురువుల దీర్ఘజీవనం వారి ప్రత్యేక కార్యక్రమాల వేగము, అందులోని తీవ్రత అనేవి నిర్ణయించుతాయి. ఎందుకంటే వారి జన్మకి కారణం ఆ ప్రత్యేక కార్యక్రమాలే.
గురువులు వారి శరీరంలో కంటే, వారి బోధనలలో, వారి కార్యక్రమాలలో ఎక్కువగా జీవించుతారు. అందుకే నేనెప్పుడు చెబుతుంటాను మీరు నా రూపాన్ని వదిలేయండి, నా శక్తికి స్పందించండి అని.
కానీ మీరేం చేస్తారు? మీరు ఆ పని చేయకుండా, నన్ను పట్టుకుని ఉంటారు. ఆ పని చేయటం మీ నిజమైన పని. మీరు కేవలం నా రూపానికే ప్రాముఖ్యానిస్తున్నారు. ఇది ఎప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు,
ఒక విషయం అర్థం చేసుకోండి: ఎప్పుడయితే మీరు దైవ సంబంధమైన కార్యక్రమంలో నిమగ్నమయితే మీరు రెండు పనులు చేస్తున్నట్టు అవుతుంది: మొదటిది మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ధ్యానం చేయటం; రెండవది సమాజానికి సేవ చేయటం. రెండవది ఉపవస్తువు మాత్రమే. ఈ పని చేస్తున్నప్పుడు మీలో కలిగే మార్పు నేను మీకు చేసే ముఖ్యమైన పని. అది, మీలో మార్పు తేవటం.
నా పని మీలో నిరంతరం మార్పుతేవటం. అది చాలా రకాలుగా జరుగుతుంది. అందులో ఒకటి ఈ మిషన్ పని చేయటం. నేను ఏమి చెబుతున్నానో అర్థమవుతున్నదా?
కాబట్టి బాధ్యతని సంతోషంగా తీసుకోండి. మీకు ఎక్కువ బాధ్యతని అప్పచెప్పినా, 'సరే' అనండి. మీరు“లేదు, కాదు” అనకుండా ‘సరే’ అంటే చాలు. మిగతా విషయాలు సర్వాంతర్యామి అయిన ఈ సృష్టి చూసుకుంటుంది.
మీకు మైసూర్‌పాక్ తెలుసు కదా! చాలా ప్రసిద్ధి అయిన స్వీటు అది. చూడటానికి చాలా గట్టిగా ఉంటుంది. కానీ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అది మీకు చాలా శక్తిని ఇస్తుంది. అలాగే మీరు బాధ్యతకి సరే అంటే చాలు. దానిని పూర్తి చేయటానికి మీకు శక్తి వస్తుంది. మీరు బాధ్యత తీసుకోగానే మీకు కావలసిన శక్తి మీలోనికి వస్తుంది. అదే ప్రేమతో నిండిన సర్వాంతర్యామి యొక్క విశ్వశక్తి. అది మీలోపలే ఉన్నది.
బాధ్యత తీసుకోవటానికి మీరు అనంత చైతన్య సృష్టి మొత్తాన్ని ఎటువంటి బేధాలు లేకుండా ప్రేమించగలగాలి. ఎటువంటి బేధాలు లేకుండా ప్రేమించలిగినప్పుడు మీరు భార్యతలని కూడా ఎటువంటి బేధాలు లేకుండా తీసుకోగలుగుతారు. బాధ్యత అంటే అప్రయత్నంగా స్పందించటం. ఎప్పుడయితే మీరు ఎటువంటి ఆలోచనా, ప్రణాళికా లేకుండా బాధ్యతని అప్రయత్నంగా తీసుకుంటారో, ఎప్పుడయితే బాధ్యతకి అప్రయత్నంగా స్పందించుతారో మీరు సాధించినట్టే.
ఎరైనా ప్రశ్నలు అడుగుతారా?
ప్రశ్న: స్వామీజీ! నాకు ప్రేమించాలని ఉన్నది. కానీ అలా ఉండలేకపోతున్నాను.
పూర్తిగా ప్రేమలో ఉండటం అనేది అహంకారానికి పెద్ద సవాలు. పూర్తిగా ప్రేమలో ఉండటం అంటే సర్వాంతర్యామిలో ఐక్యమయిపోవటమే. అది అహంకారానికి పెద్ద సమస్య. ప్రస్తుతం మీ వ్యక్తిత్వం చీలికలై ఉన్నది. ఏకమొత్తంగా లేదు. అలా భాగాలుగా ఉన్నప్పుడు వివిధ భాగాలు వేరుగా ప్రవర్తించుతాయి. మీరు తప్పించుకుంటారు అంతే. ప్రేమించాలి అంటే మీలో భిన్నత్వం ఉండకూడదు. కానీ అలా ఉండటానికి మీరు భయపడతారు. మీలో భిన్నత్వం లేకపోతే మీరు అభివృద్ధి చెందుతారు,.
భినత్వం లేకుండా ఉండాలంటే మీరు ఒక కొత్త వ్యక్తిగా రూపాంతం చెందాలి. కాని మీలోని అహంకారం అలా జరగనీయదు. మీరు ప్రేమతో నిండిపోతే మీ
అహంకారం కరిపోతుంది. అంతకుముందు మీ అహంకారం చాలా గట్టిగా ఉండేది. అది మీకు బాగుంటుంది. ఎప్పుడైతే మీ అహంకారం కరిగిపోతుందో మీరు ఏదో పోగొట్టుకున్నట్టుగా, మీ వ్యక్తిత్వం మొత్తం పోయినట్టుగా అనుకుంటారు.
మీరు కనీసం ఒక్కసారైనా అలా పోనీలే అనుకుంటే, అప్పుడు మీరు గొప్ప స్వేచ్ఛని పొందుతారు. ఆ స్వేచ్ఛ మీకు మీ అంతరంగం నుంచి వస్తుంది. కాని అహంకారాన్ని వదిలివేయటానికి మీకు ధైర్యం కావాలి. అప్పుడే మీరు ప్రేమతో నిండగలరు. మొదటి అడుగులా కనీసం మీ లోతైన అంతరంగాన్ని తెలుసుకోండి. అప్పుడు అది అప్రయత్నంగా జరుగుతుంది. వాస్తవాలని లోతుగా తెలుసుకోవటానికి పనికి వచ్చే తాళంచెవి.
అర్థం చేసుకోండి: మీరు పేరులకి, రూపాలకి అతీతంగా ప్రేమించగలిగితే, మీరు ఏమీ పోగొట్టుకోరు. కేవలం మీరుకాని దానిని మాత్రమే పోగొట్టుకుంటారు. అదే మీలోని ఊహలు, భ్రమలు, వాటిని మీరు తప్పనిసరిగా వదిలివేయాలి. మీరు పొందినది నిజము. అందుకే నమ్మకంతో ఉండండి. ఎప్పుడైతే మీరు అనంత చైతన్యంలో (సర్వాంతర్యామిలో) ఐక్యమయిపోతారో, అప్పుడు భయపడకండి.
మీరు అలా ఐక్యమవటాన్ని ఆపకండి. అలా చూస్తూ ఉండండి. మీ అంతరంగంలో జరిగే దానిని గమనించండి. అప్పుడు మీరే ఎంత తెలివి తక్కువగా మీ అహంకారాన్ని పట్టుకుని వేలాడారో తెలుస్తుంది. మీరు అలా చేయటంవలన ఎంత కోల్పోయారో మీరు అప్పుడు తెలుసుకుంటారు. ఈ అహంకారం అనే ముసుగు వెనుక ఉండి ఎంత తెలివి తక్కువ పని చేసారో మీకు అప్పుడు అర్ధమవుతుంది.
మరొక విషయం అర్ధం చేసుకోండి: నిజమైన ప్రేమ ఎప్పుడూ లెక్కలు కట్టదు. మైండ్ ఎప్పుడూ లెక్కలు కడుతుంది, కాని హృదయానికి లెక్కలు రావు. మీరు ఈ సమయంలోనే మైండ్ నుంచి హృదయానికి మారాలి. ఇప్పటి వరకూ మీ మైండ్ చెప్పినవి చాలా విన్నారు. ఇక నుంచి మీ హృదయం చెప్పే మాటలు వినండి
అప్పుడు మీరు విచారించరు. మీరు హృదయంతో జీవించినంతకాలం జీవితంలో ఎప్పుడూ దేనికీ విచారపడరు. ఎందుకంటే మీరు పరిపూర్ణంగా జీవించుతారు.
మీరు మీ మైండ్‌తో నిజమైన ప్రేమని అనుభవించలేరు. దానిని మీరు కేవలం హృదయంతో మాత్రమే అనుభవించగలరు. ప్రేమని మీ అంతరాత్మతో మాత్రమే అనుభవించగలరు. అంతరంగంలోని ముఖ్యభాగమైన మీ ఉనికి పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. దానికి ఎటువంటి ఆలోచనలుకానీ, మాటలు కానీ తెలియవు. దాని లోపలికి ఎటువంటి ఆలోచనలు ప్రవేశించలేవు. దానికి ప్రేమ భాష తప్ప మరే భాషా రాదు.
అందుకే గురువు పదే పదే చెబుతారు. మీ అంతరంగం లోతులలోనికి వెళ్ళండి. అక్కడ ఉన్న అసలైన మిమ్ములని కనుగోనండి అని. ఆ మధ్య భాగమే నిజమైన మీ లక్షణం. అదే నిజమైన మీరు. కానీ మిమ్ములని మీరు చాలా చోట్ల, సంబంధాలలో, మనుషులలో చూసుకోవటానికి ప్రయత్నింస్తుంటారు. దానితో మీరు మిమ్ములని నిరంతరం కోల్పోతున్నారు. ఇదే మీరు అంతరంగంలోనికి మీరు చూసుకోవలసిన సమయము. ఇదే మీరు బయటకి చూడటం ఆపేసే సమయం. ఇప్పటి వరకూ మిమ్ములని మీరు చాలా మోసం చేసుకున్నారు. అది చాలు. ఇక ముందుకి సాగండి.
మనం నిరంతరం ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటాము. ఎందుంటే మనకి నిజమైన ప్రేమ రుచి తెలియదు. అది ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తికి బాగా దాహం వేస్తుందనుకోండి. ఆ వ్యక్తి నిరంతరం మంచి నీళ్ళ గురించే మాట్లాడతాడు. దాని గురించే కలలు కంటాడు. ఎప్పుడయితే అతని దాహం తీరుతుందో ఇక నీళ్ళ గురించి మాట్లాడడు. అందుకే నిజమైన ప్రేమని మనం అనుభవించాలి. ఆ ప్రేమ మిమ్ములని సర్వసృష్టితో ఐక్యం చేయాలి. అప్పుడే మనం దాని గురించి మాట్లాడటం మానేస్తాము.
సర్వచైతన్య జగత్తు యొక్క ఉనికి మిమ్మలని చేతులు చాచి ఆహ్వానిస్తుంది. అది మిమ్మలని చుట్టుకుని తనలో ఐక్యం చేసుకుంటాను అంటుంది. మీరు దానికి సిద్ధంగా ఉంటే ఆ చైతన్యం మిమ్మలని తనలో కలిపేసుకుంటుంది. మీరు వికసించిన హృదయంతో ధైర్యంగా వెళ్ళగలిగితే చాలు. మీరు ఆ చైతన్య శక్తిని కలువగలుగుతారు అందులో కలిసిపోతారు.
మీరు సర్వాంతర్యామి యొక్క కౌగిలిని అనుభవించాలి అంటే మీరు ఇంకా ఉన్నతమైన చేతనస్థితిలో ఉండగలగాలి. మీరు ఇప్పుడు చేరుకునే ప్రదేశాన్ని ఇంతకుముందు ఎప్పుడూ మీరు చూడలేదు. మీరు ఈ అనంత చైతన్యం యొక్క ప్రేమలో పడేది అత్యున్నత స్థాయికి చేరటానికే.
ప్రేమ అంటే అధీనులవటం. కానీ మనలో చాలా మందికి ఇది ఒక పోరాటమే. మనం మనతోనే పోరాటం చేస్తాము. అలాగే సర్వాంతర ఉనికితో కూడా పోరాడతాము. అధీనులు అవ్వాలి అంటే ఒప్పుకుని అధీనులు అవటం కాదు. లోతుగా అర్ధం చేసుకొని అధీనులవ్వాలి. ప్రేమ రాజీపడటం కాదు. మీరు ఎప్పుడయెడతే రాజీ పడతారో అది ప్రేమ కాదు. ఎప్పుడు మీరు అర్ధం చేసుకుని అందులో కరిగిపోతారో అదే ప్రేమ.
మీరు గురువుతో ఉన్నప్పుడు మీకు ప్రేమని కనుక్కోవటానికి ఒక జీవిత కాలం అవకాశం ఉంటుంది. మీరు చనిపోయి, నిజమైన ప్రేమతో పునర్జన్మ పొందవచ్చు. మీరు ఎప్పుడయితే దీనికి సిద్ధంగా ఉన్నారో, ఎప్పుడయితే దీనికి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలరో, అప్పుడు ఉన్నతమైన చేతన స్థితిలోనికి ఒక పెద్ద అడుగువేయటానికి మీరు సిద్ధపడినట్టే.
ప్రేమ ఒక పదార్ధం అయితే ఆ ప్రేమ మీరే. మీరే ప్రేమ అయిపోతారు అంతే. అప్పుడు మీరు ఏకారణం లేకుండానే అన్నింటినీ, అందరినీ ప్రేమించగలుగుతారు. మీరు చెట్లని, పూలని, భూమిని ఒకటేమిటి సర్వప్రాణులని, అన్నింటినీ ప్రేమంచుతారు. మీరు ప్రేమని అలా వ్యాపింపచేస్తారు. అప్పుడు మీరు ఈ విశ్వంలో ఒక భాగమయిపోతారు మీకు విశ్వశక్తికి మధ్య అడ్డుగోడలన్నీ కరిగిపోతాయి. అప్పుడు అనంత చైతన్యంలో మీరు కలసిపోతారు.
చూడండి. మీరు ప్రేమలో వృద్ధి చెందితే అప్పుడు మీరు అందులో అన్నింటినీ అందరినీ ఉంచటం నేర్చుకుంటారు. మీరు గురువుని చూస్తే ఆయన ఏ విధంగా సర్వాన్ని తనలో ఇముడ్చుకున్నాడో అర్థమవుతుంది. ఆయన ఎవరిని తీసివేయరు. ఆయనకి ఎవరిలోనూ, ఎందులోనూ లోపాలు కనిపించవు. ఆయనే ఒక స్వచ్ఛమయిన ప్రేమ. అంతే. స్వచ్ఛమైన ప్రేమకి లోపాలు కనపడవు.
సర్వ చైతన్య సృష్టి స్వచ్ఛమయిన ప్రేమ. సమాజం స్వచ్ఛమయిన ప్రేమకి వ్యతిరేకి. లోతుగా చూస్తే సమాజం సర్వాంతర్యామికి, సర్వసృష్టి అయిన భగవంతునికి కూడా వ్యతిరేకమైనదే. సమాజం చేసే పూజలన్నీ కపటం. ఆ పూజలు వెనుక అది దాక్కుంటుంది. పూజలంటే ఎక్కడా లోతుగా వెళ్ళకపోవటమే. సమాజం పూజలు పేరిట తప్పించుకుంటుంది. మీరు పూజలు చేసేటప్పుడు మీరు ఏమీ చేయనవసరంలేదు. మీరు పూజలు చేస్తుంటే ఎవరూ ఏమీ అనరు. ఎందుకంటే మీరు పూజ చేస్తున్నారు కాబట్టి. అప్పుడు మీ అంతరంగానికి ఏమవుతుంది? అక్కడ ఎటువంటి అభివృద్ధీ ఉండదు. అది ఎక్కడ ఉన్నదో అక్కడే ఉండిపోతుంది.
మీరు అలా వెళ్ళిపోతే, ప్రతి దానిని అంతం లేకుండా ప్రేమిస్తే, సమాజం మిమ్ములని సమ్మతించదు. మిమ్ములని పిచ్చివాళ్ళు అంటుంది. అది కేవలం సమాజ ప్రేమనే ఒప్పుకుంటుంది. సమాజపు ప్రేమ ఇచ్చిపుచ్చుకునే ప్రేమ. ఆ ప్రేమ కారణం ఉంటేనే వస్తుంది.
మీకు చెబుతున్నాను. నిరంతరం మీ హృదయంతో ప్రేమిస్తూనే ఉండండి. మీరు మానవద్దు. ప్రతి దానిలో సర్వాంతర్యామిని చూడండి. మొక్కల సున్నితత్వాన్ని మీ హృదయంతో అనుభవించండి. జంతువులని మీసొంత వాటిలా ప్రేమించి
ఆదరించండి. ప్రతి మనిషి భగవంతునిలో భాగమే అన్నట్టుగా చూడండి. అది నిజమైన ప్రేమ. గుడిలో దేవుడిని పూజించటం చాలా సులభం. కానీ నిజమైన పూజ ప్రతి దానిలో, ప్రతి ఒక్కరి లో భగవంతుణ్ణి చూడగలగటమే. మీ ప్రక్కింటివారిని భగవంతునిలా చూడటమే పూజ. ఎవరూ కూడా ఏవిషయంలో కూడా మూలలలోనికి వెళ్ళరు. అదే సమస్య. భగవంతుని మూలాలు ప్రేమ. భవంతుని మూలాలు ఆయనని ప్రతిదానిలో చూడటంలోనే ఉంటాయి. కానీ అలా మూలాలలోనికి వెళ్ళటానికి భయపడతారు. ఏదో పైపైన జీవించేస్తూ వారిని వారు మోసం చేసుకుంటారు. వాళ్ళు మిమ్ములని కూడా ఒక స్థితి దాటి ముందుకు వెళ్ళనీయరు. దేనినీ పరిశోధించనీయరు. వాళ్ళు వారికి తెలిసినదే సత్యం అని అంటారు.
ధైర్యంగా మీ అంతరంగం లోనికి వెళ్ళి ప్రేమించండి. అప్పుడు మీరు చూసే ప్రతి దానిలోను ఒక ఆధారమయిన చైతన్య సృష్టి యొక్క దారాన్ని మీరు చూడగలుగుతారు. అప్పుడు మీరు చూసేవన్నీ కల్పనలే అప్పుడు ప్రతి దానిని మీరు ప్రేమించటం మొదలు పెడతారు. అలా ప్రేమించటానికి మీకు కష్టం అనిపించదు. ఎందుకంటే ప్రతిదానిలోనూ చైతన్య శక్తిని సర్వాంతర్యామిని మాత్రమే చూడగలుగుతారు.
అయితే మీరు మీలోపల ఈ మార్పుని జరగనీయాలి. అప్పుడే ఇది జరిగే అవకాశం ఉంటుంది. మీలో జరిగే ఏ మార్పు అయినా అది మీ చేతన స్థితిలో జరిగే ఒక మార్పు మాత్రమే. అది ఏ రకమైన స్విచ్ కాదు. ప్రేమ మాత్రమే ఈ అనంత చైతన్యంలో మీరు కూడా ఒక భాగమే అనే అనుభూతిని మీకు ఇవ్వగలదు.
మీరు భగవంతుని గురించి లేదా చైతన్యం గురించి కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడవచ్చు. కాని మీకు ఎటువంటి అనుభవమూ లేకుండానే అయిపోతుంది. కాకపోతే మీ అహంకారం గట్టిగా, చక్కగా ఉంటుంది. ఎందుకంటే మీకు భగవంతుడిని గురించి చాలా తెలుసుకున్నాము అనే ఆలోచనతో ఈ అహంకారం చాలా తృప్తిగా ఉంటుంది. కానీ మీరు లోపలికి చూసుకుంటే మీకు ఏ విధమైన అనుభవం ఉండదు. ఎప్పుడయితే మీకు సరియైన అనుభవం జరగదో, మీరు ఇంకా ఇంకా మాటలని వింటూ, పోగుచేసుకుంటూ దానిలో చిక్కుకు పోతారు. ఎందుకంటే మీరు మాట్లాడటం ఆపేయగానే, మీకు అక్కడ ఏమీ ఉండదు. అంతా శూన్యం. మీరు ఆనందపడటానికి మీకు ఎటువంటి అనుభూతి గాని, అనుభవంగాని ఉండవు.
మీరు సర్వ సృష్టితో మీ ప్రేమని, అనుభూతిని పొందండి. అప్పుడు మీకు జరిగే ప్రతి చిన్న విషయంతోను భగవంతుని అనుభవాల ఆనందాన్ని అనుభవించుతారు. ఇక్కడ మీరందరూ ఉన్నారు కాబట్టి నేను ఇంత మాట్లాడుతున్నాను. లేకపోతే నేను ఈ మర్రి చెట్టు, ఈ మొక్కలు వీటితో మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ ప్రతి ఆకుతో మాట్లాడతాను. అదే నిజమైన ప్రేమ బాష.
మీరు కొన్ని సంవత్సరాలుగా, అన్ని ప్రాణులలో మానవుడు తెలివైన, ఉత్తమమైన ప్రాణి అని చెబుతున్నారు. స్పష్టంగా తెలుసుకోండి. జంతువులు కూడా జంతువులు కాదు. ఈ భూమి మీద ప్రతి అణువు, ప్రతి కణము దైవత్వంతో నిండినవే. అవన్నీ సర్వాంతర్యామిలో ఒక భాగమే. మీరు ఈ విషయాన్ని అర్ధం చేసుకోగలిగితే. మీరు మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి దానిని, ప్రతి ప్రాణిని పట్టించుకుంటారు, ప్రేమించుతారు.
మీ శరీరానికి ప్రేమ అవసరం లేదు కానీ మీ అంతరాత్మకి ప్రేమ కావాలి. మీరు కరిగిపోవటానికి ప్రేమ ఒక సాహసం. ఎప్పుడైతే మీరు అనేది లేదో, అప్పుడు ప్రేమ ఉంటుంది. కానీ మనం లేకుండా ఉండే స్థితికి రావాలంటే మనకి ధైర్యం కావాలి. అందుకే దానిని పట్టుకొని ఉంటాము. నిబంధనలు లేని ప్రేమ నుంచి వెనక్కి లాగుతుంటాము.
ఎవరైతే కరిగిపోవటానికి సిద్ధంగా ఉన్నారో ఎవరైతే అంతా కరిగిపోయి సర్వాంతర్యామి యొక్క అనుభవాన్ని పొందాలనుకుంటున్నారో, వారే ధైర్యవంతులు. మీకు తెలిసిన ప్రేమ నాలుగు గోడల మధ్య పోరాటం మాత్రమే. పూర్తి రక్షణలో పోరాడతారు. నిజమైన ప్రేమ అనేది బహిరంగంగా వీధిలో జరిగే పోరాటం. ధైర్యవంతులు మాత్రమే ఈ బహిరంగ పోరాటంలో పోరాడి గెలవగలుగుతారు. నాలుగు గోడల మధ్య పోరాడితే మీకు చాలా రక్షణగా ఉంటుంది. అది మరణం లాంటిది. అప్పుడు వారు జీవశ్ఛవాలుగా ఉంటారు. మీరు బహిరంగ పోరాటానికి సిద్ధమయినప్పుడు మీరు జీవకళతో ఉత్సాహంగా ఉంటారు.
మరొక విషయం అర్ధం చేసుకోండి: బహిరంగ పోరాటానికి మీరు భయపడనవసరం లేదు. మీరు సర్వాంతర్యామి అయిన అనంత చైతన్యం దయా రక్షణలో పోరాటం చేస్తున్నారు అని తెలుసుకోగలిగితే, మీరు భయపడరు. ఎందుకంటే ఆ పోరాటంలో మీరు ఓడిపోయినా మీరు పడేది ఆ చైతన్యం ఒడిలోనికే. అయితే నిలబడి పోరాడగలిగే ధైర్యం మీకు ఉండాలి. ఇది మీ నుంచి మీరు తీసుకోవలసిన మొదటి అడుగు. మిగతా విషయాలు సర్వ చైతన్య సృష్టి చూసుకుంటుంది.
ఇదంతా మీరు మీ కుతూహలం కంటే కొంచం ముందుకి వచ్చి సత్యాన్ని తెలుసుకోగలగాలి. మీకు కేవలం కుతూహలం ఉంటే సరిపోదు. అలా అయితే మీరు వస్తారు, ఏదో చేసేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా మీలో సత్యాన్ని తెలుసుకోవాలన్నా కుతూహలంతో పాటు, జ్వలించే కోరిక కూడా ఉంటే అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకోవటమే కాదు, ఆ అనుభూతిని కూడ పొందుతారు. మీలో కేవలం కుతూహలం మాత్రమే ఉంటే మీలో భక్తి, అంకితభావం ఉండవు. మీలో ఎప్పుడయితే జ్వలించే కోరిక ఉంటుందో అప్పుడు అంకిత భావం ఉంటుంది. దానితో పాటు ఆ పని పట్ల భక్తి ఉంటుంది. ఆ అంకిత భావం మీలో ఉన్న మూలంగానే మీరు ఇక్కడికి ఇలా పదే పదే రాగలుగుతున్నారు.
మీరు నానుంచి పారిపోవాలని ప్రయత్నించినా వెళ్ళలేరు. అలా వెళ్ళి మీరు కొంత కాలం ఉండగలుగుతారు. ఆ తరువాత మీరు వచ్చేస్తారు. మీరు నిజమైన ప్రేమని తెలుసుకోవాలంటే ఆ తీవ్రత మీలో ఉండాలి.
మీరు ఎంత ప్రేమించగలరో అంత ప్రేమించండి. కానీ తిరిగి ఏమీ ఆశించకండి. ఏదో ఒక కారణంతో ప్రేమించితే అది ప్రేమ కాదు. అది వ్యాపారం మాత్రమే. మీరు కారణం లేకుండా ప్రేమించగలిగినప్పుడు, మీరు మీ జీవితంలో ఎదురైన ప్రతి వ్యక్తిని, ప్రతి ప్రాణినీ, అన్నింటినీ ప్రేమించగలిగినప్పుడు, మీలో అద్భుతమైన అంతరంగపు శక్తి విడుదల అవుతుంది. అది చాలా ఆనందంగా ఉంటుంది. మీరు అప్పుడు చాలా అందంగా ఉంటారు, అది మీ భౌతిక రూపంతో పనిలేని అందం.
మరొక విషయం: ఇటువంటి నిబంధనలు లేని ప్రేమ మీకు తిరిగి ఏమీ ఇవ్వదు అని అనుకోవద్దు. అది మీకు ఎన్నో వరాలని వివిధ రూపాలలో ఇస్తుంది. అయితే ఆ వచ్చే వరాలని చూసే స్థాయికి మీరు ఎదగాలి. అలాగే ఆ వచ్చేవాటివలవ మీరు ప్రభావితం కాకూడదు. మీరు మీ ప్రేమని ఇలాగే కొనసాగించాలి. ప్రేమ కోసం ప్రేమిస్తూ ఉండండి. మీలోని వివేకము మిమ్మలని అవి చూసేటట్టుగా చేస్తుంది. ఆ వివేకమే మిమ్మలని వాటి ప్రభావంలో పడకుండా మిమ్మలని సదా శాశ్వతానందంలో ఉండేలా చూస్తుంది.
మీ హృదయంలో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. మీరు అప్పుడు ఒక కొత్త వ్యక్తిగా రూపాంతం చెందుతారు. మీరు మీలో మార్పుని చూడగలరు. అలాగే ఎదుటివారిలో కూడా చూడగలుగుతారు. అప్పుడు మీ చుట్టుప్రక్కల వాళ్లు మీ మీద గౌరవాభిమానాలు పెంచుకుంటారు. వారికి అర్థం కాని వికాసాన్ని మీలో వారు చూస్తారు. మీ నుంచి నలుదిశలా వెదజల్లబడే శక్తిని వారు అనుభవిస్తారు.
మీరు ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రేమించాలి అంటే, మీరు స్వేచ్ఛగా ఉండాలి. ఎప్పుడైతే మీరు స్వేచ్ఛా, స్వతంత్రాలు కలిగి ఉంటారో, అప్పుడు మీరు సమస్యలు లేకుండా, కారణాలు లేకుండా ప్రేమించగలరు. స్వతంత్రం అంటే అర్థమేమిటి? అంటే కులము, మతము, ప్రాంతము, కుటుంబము, బంధువులు ఇటువంటి బంధాలు లేకపోవటమే. మీరు ఇటువంటి బంధాలలో చిక్కుకుపోతే
మీ ప్రేమ కూడా అంతటితో ఆగిపోతుంది. అలా బంధాలలో ఉండే ప్రేమ నిజమైన ప్రేమ కాదు. హద్దులు ఉన్నప్పుడు, బంధాలు ఉన్నప్పుడు మీరు ఎలా ప్రేమించగలరు. అది అసలైన ప్రేమకి ఉన్న నిర్వచనానికి వ్యతిరేకము.
నేను మిమ్మలని మీ కుటుంబము, మీ మతము ఈ విషయాలని వదిలివేయమని చెప్పటం లేదు. వీటి సందర్భంలో మాత్రమే ప్రేమని చూడవద్దు అంటున్నాను. అంతే. మీరు ప్రేమించేటప్పుడు సర్వ స్వతంత్రులుగా ప్రేమించండి. మీరు ఎప్పుడు స్వతంత్రులవుతారు. మీరు ఇటువంటి బంధాల నుంచి బయటకి వచ్చినప్పుడు, మీరు ఇటువంటి వాటితో గుర్తింపులు తెచ్చుకోనప్పుడు, మీరు ఎప్పుడయితే సర్వసృష్టికి చెందినవారని అనుకుంటారో, అప్పుడు మీరు ఎటువంటి హద్దులు, బంధాలు లేని ప్రేమని ఇవ్వగలరు.
నేను ఎప్పుడూ చెబుతుంటాను. మీరు నా ప్రేమని మీ అందరిలో చూడగలిగినప్పుడు నిజమైన ప్రేమని చూడగలుగుతారు. ఎందుకంటే, మీకు ఇంతకు ముందే చెప్పాను, నన్ను ప్రేమించటం తేలిక అయిన విషయం. అదే ప్రేమని మిగతా వారిపట్ల కూడా చూపించగలిగితే అప్పుడు మీరు నిజమైన ప్రేమ దారాన్ని పట్టుకున్నట్టే. అప్పుడు మీరు అనంత చైతన్య సృష్టి పట్ల, ప్రతి ప్రాణి పట్ల ప్రేమని కలిగి ఉంటారు. అప్పుడు మీరు క్రమంగా ప్రతి ఒక్కరినీ అనంత చైతన్యంలో భాగంగా కౌగిలించుకో గలుగుతారు.
ఇప్పుడు మనం చిన్నది, చాలా శక్తివంతమైన ధ్యానం "మహామంత్ర ధ్యానం" పద్ధతిని నేర్చుకుందాం. ఇది అనాహత చక్రానికి సంబంధించిన ధ్యాన పద్ధతి.
మహామంత్ర ధ్యాన పద్ధతి: మొత్తం సమయం 30 నిముషములు.
మహామంత్ర ధ్యాన పద్ధతి ప్రాచీన టిబెట్ బౌద్ధుల ధ్యాన పద్ధతి. దీనిని గుండె దగ్గర ఉన్న అనాహత చక్రాన్ని మేలుకొలపటానికి ఉపయోగించుతారు. ఈ ధ్యానం చేస్తే మీ మైండ్ స్థిరంగా దృఢంగా ఉంటుంది. మాములుగా మీ మైండ్ ఆలోచనలతో ఊగుతూ ఉంటుంది. ఈ ధ్యాన పద్ధతి మీ మైండ్‌ని స్థిరంగా దృఢంగా ఉంచి, మైండ్ లేని స్థితికి వెళ్ళేందుకు సిద్ధం చేస్తుంది. ఇది అనంతంలోనికి వెళ్ళగలిగేందుకు ఉపయోగపడే ఒక స్ప్రింగ్ బోర్డు లాంటిది.
ఈ ధ్యానం చేస్తే మీలో శక్తి ప్రవహించుతుంది. మీరు శక్తితో ప్రకాశించుతారు. అప్పుడు మీరు ఎదుటి వారి నుంచి వారి శ్రద్ధని ఆశించరు. మీలో పొంగి ప్రవహిస్తున్న శక్తిని, ప్రేమని ఇతరులకి ఇస్తారు. ఈ ధ్యానం చేసేటప్పుడు మీరు మీ మాలలని మెడలో వేసుకోండి. మీరు ధ్యానం చేసే సమయంలో మీలో సృష్టింపబడే శక్తిని ఇది నిలువ చేస్తుంది.
మీరు ఈ ధ్యానాన్ని ఖాళీ కడుపుతో చేయాలి. ఉదయం చేస్తే బాగుంటుంది. లేదా భోజనం చేసాక రెండు గంటల తరువాత చేయండి. మీరు ఈ ధ్యానాన్ని ఒంటరిగా అయినా చేయవచ్చు లేదా సమూహంలోనైనా చేయవచ్చు. మీరు సమూహంలో చేస్తే, మీరు ధ్యానం చేసిన ప్రదేశం శక్తితో నిండుతుంది. ఈ పద్ధతిని మీకు వివరించుతాను.
నేల మీద కూర్చోండి. మీ తల, మెడ, వెన్నుముక నిలువగా ఉండాలి. నేలమీద కూర్చోలేని వారు కుర్చీలో కూర్చోవచ్చు. విరామంగా కళ్ళు మూసుకుని కూర్చోండి. అలా కళ్ళు మూసుకున్నాకా కూడా మీకు కనురెప్పల వెనుక ఏవో బొమ్మలు రూపాలు కనపడతాయి. వాటిని నియంత్రించటానికి మీకళ్ళు రాళ్ళలా గట్టిపడిపోయాయి అనుకోండి. క్రమంగా రూపాలు పోతాయి. మీకళ్ళ కదలికలు మీ ఆలోచనలను బట్టి ఉంటాయి. అందుకే కళ్ళు కదలికలని ఆపేయమని చెప్పేది. దాని గురించి మరీ ఎక్కువగా అనుకోవద్దు. ధ్యానంలోనికి వెళ్ళండి.
మీ పెదాలని దగ్గరగా మూసి మ్....మ్.... అనే శబ్దాన్ని చేయండి. ఈ శబ్దం మీలోపలి నుంచి రావాలి. మీరు తలని ఒక అల్యూమినియం పాత్రలో పెట్టి హమ్మింగ్ చేస్తే ఎలాంటి శబ్దం వస్తుందో, ఇది అలానే ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇది ఓం కాదు హం కాదు. కేవలం మ్... మ్.....మీ పెదాలను గట్టిగా మూసి మ్ అని శబ్దం చేయటమే. దీనిని ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి . మీరు తరువాత ఊపిరి తీసేవరకూ ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. దీనిని లోతుగా మీ నాభి ప్రాంతం నుంచి చేయాలి. ఎంత గట్టిగా చేయగలిగితే అంత గట్టిగా చేయండి.
మీరు ప్రతీ హమ్మింగ్ శబ్దం తరువాత ప్రయత్నపూర్వకంగా లోతుగా ఊపిరి తీసుకోవద్దు. అవసరమైనప్పుడు శరీరవమే శ్వాస తీసుకుంటుంది. కంగారుపడవద్దు. ఆ శబ్దాన్ని చేయటానికి మీ పూర్తి అంతరంగాన్ని నిమగ్నం చేయండి. మీరు ఆ శబ్దమయిపోవాలి. మీ శరీరమంతా మ్ శబ్దంతో నిండిపోవాలి. కొంత సమయమయ్యేటప్పటికి మీ ప్రయత్నం లేకుండానే ఆ శబ్దం వస్తుంది మీరు కేవలం వింటారు.
20 నిముషాల తరువాత హమ్మింగ్ శబ్దాన్ని ఆపండి. కేసెట్లో అనే మాట వస్తుంది. అది రాగానే మానేసేయండి. ఆ శబ్దం ఆగిపోయాక కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా 10 నిముషాలు ఉండండి. చిరునవ్వు ముఖంతో అందంగా ఉండండి. మీకు ఏమైనా ఆలోచనలు వస్తే రానీయండి. వాటిని అలా చూస్తూ ఉండండి. మీ మైండ్ లో జరిగేవాటిని టి.వి చూస్తున్నట్లుగా చూడండి. వాటిని ఆపాలని చూడవద్దు. వాటి మీద మీ అభిప్రాయాలు చెప్పవద్దు. నిశ్శబ్దంగా ఆనందంగా ఉండండి. 20 నిముషాలు మీలో సృష్టించమబడిన శక్తి ఇప్పుడు మీలో ప్రతి భాగానికి వెళుతుంది. ఇది అన్ని మూలలకి వెళ్ళి శుభ్రపరుస్తుంది. ఆ శక్తి చాలా లోతులలోనికి వెళుతుంది.
(అందరూ మహామంత్ర ధ్యానాన్ని సాధన చేస్తారు.)
చివరలో స్వామీజీ ఈ విధంగా చెబుతారు: ఓం శాంతి, శాంతి శాంతి:
నెమ్మదిగా చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ నిశ్శబ్దాన్ని మీతోనే ఉండనీయండి తరువాత సెషన్లో కలుద్దాము.
ధన్యవాదములు.
