KAILASA Library/ఆనంద స్పురణ_తెలుగు (Ananda Spurana Telugu)/పరమహంస శ్రీ నిత్యానంద ఎవరు?Sign in
ఆనంద స్పురణ_తెలుగు (Ananda Spurana Telugu)

పరమహంస శ్రీ నిత్యానంద ఎవరు?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

పరమహంస నిత్యానంద మూడవ సహస్రాబ్దిలో జ్ఞానోదయమయిన యోగీశ్వరుడు, కారణజన్ముడు. ఆధునిక మానవుల జీవన సరళికి, వారి సమకాలీనపు సమస్యలకి చక్కగా సరిపోయే విధంగా ఆధ్యాత్మిక విషయాలని అందిస్తున్న విప్లవాత్మక జ్ఞానయోగి రాజఋషి. ఆయన జ్ఞానోదయం పొంది అత్యున్నత చేతనస్థితికి చేరి నిత్యానంద స్థితిలో స్థిరపడిన తపోనిధి. తనలోని అద్భుతమయిన శ్వాశతానందం, నిత్యానందం యొక్క అనుభవాన్ని ప్రతి ఒక్కరికీ ఇవ్వాలి అనే సంకల్పంతో ఈ ప్రపంచంలోనికి వచ్చారు. ఆయన ప్రేమ, కరుణ మూర్తీభవించిన పావనమూర్తి. తనలోని అపార కరుణతో తాను పొందిన పరమానందాన్ని ఒక వరంలా మనకి ఇవ్వడానికి సామాన్యులకు దూరమయిన ఆధ్యాత్మికతని, ప్రాచీన యోగ, వేదాల ఆధారంగా మనం ఆనందస్థితిని పొందే విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో మన మధ్యకి వచ్చారు. ఈ సందర్భంగా పరమహంస నిత్యానంద తన శిష్యులతో ఒక అందమయిన సామెత చెబుతుంటారు, “ఆనందం పంచుకుంటే పెరుగుతుంది. దుఃఖం పంచుకుంటే తగ్గుతుంది” అని. తాను పొందిన ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం కూడా పొందేలా చేయాలనేది ఆయన లక్ష్యాలలో ఒకటి. ఆ ఆనందేశ్వరుని ఉద్దేశం సర్వమానవాళిని నిత్యానంద స్థితికి తీసుకువెళ్ళాలి అని, ఆ ఆనందం మనమే అని చెప్పటం.

ఆనందం గురించి పరమహంస నిత్యానంద వివిధ ప్రవచనాలలో కార్యక్రమాలలో చాలా స్పష్టంగా వివరిస్తారు. ఆ వివరాలు పై ప్రశ్నలన్నింటికీ జవాబులని ఇవ్వటమే కాకుండా, మనలో ఉన్న అస్పష్ట భావాలని స్పష్టంగా చూపించగలుగుతాయి. మనలో ఉన్న చాలా అనుమానాలు నివృతి అవుతాయి. మనం వెతికేది, మనం నిజంగా కోరుకున్న ఆనందం ఏమిటో తెలుస్తుంది. మనం అనుకునే ఆనందానికి మన అంతరాత్మ వెతికే నిజమయిన ఆనందానికి తేడా తెలుస్తుంది.

పరమహంస ఆనందం గురించి చెప్పిన వివరాలు ఆయన మాటలో ఇలా ఉంటుంది :

మానవులలో ఉండే ప్రతి లక్ష్యం ఆనందస్థితిని చేరాలి అని మాత్రమే. ఎవరయినా నాకు ఆనందం అవసరం లేదు, నాకు సంతోషం ఆనందం అనే విషయాల మీద ఆసక్తి లేదు అని అనగలరా? మనలో ప్రతి ఒక్కరు వెతికేది ఆనందం కోసమే. మనం ఎంత మేధావులమయినా, ఎంత ఆధునికులమయినా అందరూ కోరుకునే అంతిమ లక్ష్యం ఆనందం. మనం ఈ ఆనందం కోసం ఐశ్వర్యం ద్వారా, అధికారం ద్వారా, కీర్తి ద్వారా ఇంకా చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నాము. ఇలా మనం జీవితాంతం ప్రయత్నిస్తున్నాము. కానీ దానిని పొందటం లేదు. అయితే మనం వెతికేది కేవలం ఆనందం కోసమే అని మనలో 99% మందికి తెలియదు. ఎందుకంటే ఈ వెతకటం అనేది అచేతన స్థితిలో జరుగుతుంది. అసలు శాశ్వతానందమే మన జీవితాశయం అని మనలో చాలా మందికి తెలియదు, దానిని ఒప్పుకోము కూడా.

అయితే అందరూ ఒప్పుకునే ఒక విషయం ఉన్నది, మనం ఎంత సాధించినా మన జీవితాలలో ఏదో ఒక లోటు ఉన్నది. ఎంత ప్రయత్నించినా, ఎన్ని మార్గాలలో వెళ్ళినా ఆ లోటుని పూరించలేకపోతున్నాము అని తెలుసు. మనలో ఆ శూన్యం ఎప్పుడూ ఉంటుంది.

అందుకే మనం అంత సంపాదించినా ఇంకా వెతుకుతున్నాము. ప్రపంచమంతా వెతుకుతున్నాము. కానీ ఆ వెతికేది దొరకటం లేదు. ఎందుకు?

ఎందుకంటే మనకి కావలసిన ఆనందం మనలోనే ఉన్నది, కాని బయట ప్రపంచంలో లేదు. అది బయట ప్రపంచంలో దేనికీ సంబంధించినది కాదు. ఆనందం మన అంతరంగంలో, మన లోపల ఉన్నది. అది మన నిజమైన ఉనికి. అదే మనం కోరుకునే, శాశ్వతమయిన ఆనందస్థితి. అయితే మనందరం ఆ ఆనందం కోసం బయట ప్రపంచంలో వెతుకుతున్నాము. మన లోపల ఆనందాన్ని వదలి తప్పు అడ్రస్లో దాని కోసం వెతుకుతున్నాము. మరి తప్పు దారిలో వెళితే, తప్పు అడ్రస్లో వెతికితే మనకి నిజంగా కావాలసినది మనకి దొరకదు కదా! అప్పుడు ఏం చేస్తున్నాము, మనకి ఏదైనా కొంచెం ఆహ్లాదకరమయినది, అనుకూలమయినది జరగగానే 'ఆహా! నాకు ఆనందం దొరికింది' అని ఆనందపడిపోతున్నాము. కాని అది నిజమైన ఆనందం కాదు. అది మరి కొద్దిసేపటికే శూన్యంగానో, ఏదో వెలితిగానో లేదా దుఃఖంగానో మారిపోతుంది. తిరిగి మరలా ఆ ఆనందం కోసం వెతకటం, ఏవో కొన్ని వస్తువుల వెనుక లేదా కొందరు వ్యక్తుల వెనుక దాని కోసం పరిగెడుతున్నాము. అలా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి విసిగిపోతున్నాము. ఆ విసుగు దుఃఖముగా, క్షోభగా ఆ తరువాత మానసిక వ్యధగా మారుతుంది.

మీ లోపల ఉన్నదే నిజమైన మీకు కావలసిన ఆనందం. మీరు దానిని తెలుసుకున్నప్పుడు, ఆ స్థితికి చేరసలిగినప్పుడు మీలో శూన్యం ఉండదు. లోటుపాట్లు, వెలితి, నిరాశ, దుఃఖం ఏవీ మీ దగ్గరకి రావు.

పరమహంస నిత్యానంద మనం అనుకునే ఆనందానికి, నిజానికి మన లోపల ఉన్న అసలయిన ఆనందానికి తేడా చక్కగా వివరించుతారు.

మనం ఆనందం అని అనుకొని బయట ప్రపంచంలోని విషయాల ఆధారంగా పొందేది ఆనందం కాదు. అది కేవలం సంతోషం మాత్రమే. సంతోషం అనేది ఒక తాత్కాలిక స్థితి. అది చాలా చంచలమైనది. కొద్దిసేపు చాలా సంతోషంగా ఉంటుంది, మరికాసేటికి అది పూర్తిగా మాయం అయిపోతుంది. ఉదాహరణకి ఎవరయినా మిమ్మలని మెచ్చుకున్నారనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది. వెంటనే ఎవరయినా విమర్శించితే ఆ సంతోషం అంతా ఆవిరి అయిపోతుంది. కానీ మన లోపల ఉండే ఆనందం శాశ్వతమైనది. అది ఎప్పుడూ అలా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది.

పరమహంస ఆనందాన్ని చక్కని చిన్న మాటలతో నిర్వచించుతారు. ఆనందం అంటే అంతం లేనిది తగ్గించలేనిది, పోగొట్టలేనిది. ఆనందాన్ని ఎవరూ సృష్టించలేరు, దానిని లేకుండా చేయలేరు. దానిని తగ్గించలేరు ఎక్కువ చేయలేరు. అది ఎప్పుడయినా, ఎటువంటి స్థితిలోనైనా ఏ సమయంలోనైనా ఎటువంటి సందర్భంలోనైనా అది అదే స్థితిలో ఉంటుంది. ఆనందం అంటే, అది అదే.

సంతోషం అనేది కేవలం ఒక తాత్కాలిక భావం. దానికి వ్యతిరేకాలు ఉంటాయి. సంతోషం ఉన్న దగ్గర తప్పనిసరిగా దుఃఖం ఎక్కడో ఒక చోట ఉంటుంది. సంతోషం తరువాత బాధ లేదా దుఃఖం అనేవి సహజం. ఆనందం ఒక భావన కాదు అది ఒక శాశ్వత స్థితి. దీనికి వ్యతిరేకాలు లేవు. ఆనందం ఉన్న చోట ఆనందమే వుంటుంది. ఆనందస్థితి ఆనందాన్ని కలిగిస్తుంది. అంతే.

మనలోని సంతోషం అనేది పూర్తిగా మన బయట ప్రపంచం, దానిలోని వ్యక్తులు, వస్తువులు, సందర్భాలు, సంఘటనలు, సమయం, ఇలా అన్నింటి మీదా ఆధారపడి ఉంటుంది. సంతోషం మీద బయట ప్రపంచపు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. అందుకే సంతోషం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది.

ఆనందం అనేదాని మీద ఎవరి ప్రభావం ఉండదు. దానిని సాధించలేరు. అధీనం చేసుకోలేరు. ఆనందస్థితి మిమ్ములని తన అధీనంలోనికి తీసుకుంటుంది. మీరు ఆ స్థితిలో స్థిరపడతారు.

సంతోషం కలగాలి అంటే కచ్చితంగా ఒక కారణం ఉండాలి. అసలు కారణం ఏమీ లేకుండా సంతోషం ఎలా కలుగుతుంది? ఇదే మనం అడిగే ఒక ప్రశ్న. అలా కారణం లేకుండా కలిగే సంతోషం ఉంటుంది అని చెబుతారు పరమహంస నిత్యానంద. దానినే ఆనందం, పరమానందం అంటారు. ఆ ఆనందంలో స్థిరపడితే నిత్యానందస్థితిని చేరి నిత్యానందులయిపోతారు. ఆ స్థితిలో ఆనందం ఏకారణం లేకుండానే పొంగి ప్రవహించుతూ ఉంటుంది.

మన లోపల ఉన్న నిజమయిన, మనదైన ఆ ఆనందస్థితిని మనం ఎలా తెలుసుకోగలం? ఆ ఆనందస్థితిని మనం ఎలా పొందగలం? అసలు మనం ఆ ఆనందాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము?

పరమహంస నిత్యానంద మనలో పరమానందం నిక్షిప్తమయి ఉన్నది అని స్పష్టంగా చెబుతున్నారు. అయితే అది మనలోపల ఉన్నది అని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? మనం ఎందుకు దాని దగ్గరకి వెళ్ళలేకపోతున్నాము? నిత్యానందస్వామి ఈ విషయాన్ని వివరంగా స్పష్టంగా ఇలా చెబుతారు : మనం పుట్టినప్పుడు మనం మనతోనే ఉంటాము. క్రమంగా సమాజం మనని తన గుప్పిట్లోనికి తీసుకుంటుంది. తన నిబంధనలతో, మన వ్యక్తిత్వాన్ని విభజించి, మనకి కొన్ని షరతులు విధించి మనని నియంత్రించటం ప్రారంభిస్తుంది. అప్పుడు మన ఏకాగ్రత మొత్తం బయట ప్రపంచం మీద, వ్యక్తులు, సంబంధ బాంధవ్యాల మీద, వస్తువుల మీద ఇలా పూర్తిగా బయట ప్రపంచం మీద స్థిరపడిపోతుంది. అప్పుడే మనలో మన అనే భావాలు సమాజం నుంచి ప్రవేశించుతాయి. అవి మనలోని మనకి, మన అసలయిన అంతరంగానికి మధ్య గట్టి గోడలని నిర్మించుతాయి.

అప్పుడు మనం మన ఉనికిని ఎదుటివారి అభిప్రాయాల ఆధారంగా లేదా సమాజం యొక్క ఆధారంగా లేదా పోలికల ద్వారా మాత్రమే నిర్ణయించగలుగుతాము. అప్పుడు మనకి మన అంతరంగానికి దూరం ఇంకా పెరిగిపోతుంది. అసలు మన అంతరంగాన్ని మర్చిపోతాము.

ఇదే సమయంలో మనవి కాని కోరికలు మనలోనికి పంపబడతాయి. అవి ఎదుటి వారి నుంచి సమాజం నుంచి మనం అప్పు తెచ్చుకున్న కోరికలు. ఆ కోరికల వెంట అసంతృప్తి, నిరాశ, బాధ మాత్రమే వస్తాయి. ఎందుకంటే ఆ కోరికలు మనవి కాదు కాబట్టి. కోరికలు మనవి అయితే అవి తీరినప్పుడు ఆనందం, తృప్తి కలుగుతాయి.

ఇది ఎలా ఉంటుందంటే, మనం ఇంట్లో సరిగా గాలి రాకపోతే సీలింగ్ ఫ్యాన్ కొనాలి అని షాపుకి వెళతాము. ఆ షాపులో మన ఆఫీస్ కోలీగ్ కూలర్ కొనాలి అని వస్తాడు. అతను కూలర్స్ చూస్తుంటాడు. అప్పుడు ఆ క్షణంలో ఫ్యానువలన ఎన్ని ఇబ్బందులో ఆ ఫ్యాను అనేది ఎంత ఉపయోగం లేని వస్తువో మనకి ఆకస్మాత్గా తెలుస్తుంది. అప్పుడే కూలర్ యొక్క అనంతమయిన ఉపయోగాలు, ఆ కూలర్ కొంటే అది మన జీవితంలో తెచ్చే అద్భుతమయిన మార్పులు, అకస్మాత్‌గా మన జీవితంలో పెరిగిన నాణ్యత 3డి చిత్రాలతో రంగురంగులుగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సరే అప్పుడు ఏం చేస్తాం, అప్పు చేసో లేదా మరోవిధంగా కూలర్ కొని, చాలా సంతోషంగా ఇంటికి వస్తాము. కొంచంసేపయిన తరువాత మీభార్య, ఎదురింటి వారి ఎ.సి. గురించి మాట్లాడగానే కూలర్ నుంచి వేడిగాలులు రావటం మొదలవుతుంది. అప్పుడు కూలర్ ఉపయోగంలేని పనికిరాని వస్తువు అయిపోతుంది. ఇప్పుడు మన ఆరాటం ఎ.సి. ఎలా కొనాలి అని. ఇప్పుడు మన పరుగు దాని వెనుక ప్రారంభం అవుతుంది. కూలర్ కొన్న ఆనందం కొంతసేపు కూడా ఉండదు. కాని దానితోపాటు వచ్చిన బాధ, అసంతృప్తి పర్వతం అంత ఎత్తు పెరిగిపోతుంది.

ఈ సందర్భంగా పరమహంస నిత్యానంద ఒక విషయమం చెబుతారు. మీరు మీ సొంత కోరికలని మాత్రమే తీర్చుకోగలిగితే మీరు నిదానంగా, ప్రశాంతంగా, తృప్తిగా, ఆనందంగా, ప్రతిక్షణం ఒక ఉత్సవంలా ఉంటారు. కోరిక మీది కానప్పుడు మీలో ఒత్తిడి పెరిగి, అత్యత, అశాంతి, కంగారు, కోపం, బాధ, నిరాశ పెరిగిపోతాయి. అందుకే ఆనందం అనేది మన కోరికలు తీర్చుకోవటంలో లేదు. బయట ప్రపంచంలో దొరికే వస్తువులలో లేదు. అది మీలోనే ఉన్నది అని చెబుతారు.

మనం ఎన్నో గొప్ప పనులు సాధించుతాము. అవి కూడా మనకి శాశ్వతమయిన ఆనందాన్ని ఇవ్వవు.

ఉదాహరణకి : చదువుకునే రోజులలో, క్లాస్ ఫస్ట్ వస్తే నాకు ఇంకేమీ అవసరంలేదు. చాలా ఆనందంగా ఉంటాను అనుకుంటాము. దాని గురించి చాలా శ్రమపడతాము. సాధించుతాము, సంతోషపడతాము. కొద్దిరోజులు గడవగానే, నాకు ఉద్యోగం వస్తే చాలా ఆనందంగా ఉంటుంది అనుకుంటాము, దానికోసం శ్రమపడతాము, ఆ తరువాత పెళ్ళయితే ఇక నా ఆనందానికి అవధులు ఉండదు, అని చాలా గట్టిగా అనుకుంటాము. ఆ తరువాత ఇద్దరు పిల్లలు చాలు, ఒక చిన్న అందమైన ఇల్లు, ఒక కారు, పిల్లలు స్థిరపడితే చాలు, మంచి పేరుప్రతిష్ఠలు, అవార్డులు ఇలా.....జరిగిపోతుంది. చివరలో ‘అబ్బా! ఈ బాధ్యతలు తీరి రిటైర్ అయిపోతే అంతా ఆనందమే అనుకుంటాము. కానీ రిటైర్ అయినవాళ్ళు ఎంతమంది ఎటువంటి బాధ, అశాంతి లేకుండా ఆనందంగా ఉన్నారు? మళ్ళీ మొదలు... అంతా శూన్యం, దుఃఖం, నిరాశ, అసంతృప్తి అంతే. అంటే ఇన్ని సాధించాకా కూడా మనం శాశ్వతంగా సంతోషంగా ఉండలేము. పరమానందం పొందలేము. ఎందుకంటే మనం అంతర్లీనంగా వెతికేది ఈ ఆనందం కాదు. ఆ అసలయిన ఆనందం దొరికేవరకూ, ఈ దేశానికి చక్రవర్తి అయినా కూడా అదే శూన్యం ఉంటుంది.

సరే! మరి మనం ఆ ఆనందాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? ఎందుకంటే అసలు మనకి మన అంతరంగంలో మన సొంతమైన ఒక ప్రపంచం ఉన్నది అని తెలియదు. రెండవ విషయం మనం బయట చూసేవేవి మన ‘నిజమైన మనకి’ కావలసినవి కావు. అది ఎలా ఉంటుందంటే విపరీతమయిన దాహం వేసే సమయంలో తియ్యటి చల్లటి కూల్‌డ్రింక్ తాగితే దాహం కొంతసేపు ఆగుతుంది. ఆ తరువాత అది రెట్టింపు అవుతుంది. ఎందుకంటే మనకి నిజంగా కావలసినది మంచినీరు. ఎంత రుచిగా ఉన్నా, ఎంత ఖరీదు అయినదయినా, ఎంత మధురంగా ఉన్నా, మనకి కావలసిన మామూలు నీరు ఇచ్చే తృప్తి, ఆనందం ఆ సమయంలో ఆ కూల్‌డ్రింక్ ఇవ్వలేదు కదా!

మరొక విషయం, మన లోపల ఉన్న ఆనందం మీద మనలో ఉండే వ్యతిరేక భావాలు, మన ఆలోచనలు పొరలు పొరలుగా ఆ ఆనందాన్ని కప్పివేస్తాయి. కాలం గడిచే కొద్దీ ఆ పొరలు బాగా గట్టిపడిపోయి, అదే మన నిజమైన ఉనికి అనే భ్రమలో ఉండిపోతాము.

ఎప్పుడయినా మనం ప్రయత్నించి మన ఆనందాన్ని చేరాలి అని అనుకోగానే మన లోపల అర్థం లేని, ఒకదానితో ఒకటి సంబంధంలేని ఆలోచనల ప్రవాహం అధికమయిపోతుంది. ఆ ఆలోచనలు ఆగినప్పుడే మనం మనలోపలికి వెళ్ళగలం. ఆలోచనలతోపాటు మనలో కలిగే భావావేశాలయిన కోపం, అసూయ, అత్యాశ, బాధ, అహంకారం, భయం, కామం ఇలాంటివన్నీ కూడా అడ్డుకుంటుంటాయి.

అంతేకుండా మనం నిజమైన ఆనందస్థితిని పొందాలి అంటే మనం శారీరకంగా, మానసికంగా, భావావేశాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఇటువంటి ఆరోగ్యం పొందాలి అంటే మనలో ఉండే శక్తి కేంద్రంలయిన చక్రాలు పరిశుభ్రంగా వుండి విశాలంగా వికసించి చైతన్యంగా ఉండాలి.అప్పుడు అవి మనకి శక్తిని ఇస్తాయి. ఆ శక్తి మనని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆ పరిస్థితిలో మనం మన అంతరంగంలోనికి చేసే ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులూ ఉండవు. ఉన్నా వాటిని మనం సులభంగా తీసివేయగలం, వాటిని అధిగమించగలం.

అయితే మనం ఏవిధంగా మన ఆనందాన్ని మనం చేరుకోవడానికి అడ్డంకులు సృష్టించే వాటిని ఆపగలం? దానికి ఏదయినా ఒక పరిష్కారం ఉన్నదా?

పరమహంస నిత్యానంద దానికి ఒక నమ్మకమయిన పరిష్కారాన్ని చెబుతారు. ఆయన మాటలలో, "ధ్యానం చేయండి. మీ ఆనందాన్ని అందుకోవడానికి వచ్చే అడ్డంకులను ధ్యానం ఆపుతుంది. మీరు నిరాటంకంగా మీ ఆనందస్థితివైపు వెళ్ళి,ఆ స్థితిని చేరవచ్చు" అని చెబుతారు. అప్పుడు మనం పొందే ఆనందమే నిజమయినా ఆనందం.

సంతోషం కలగాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండాలి. కారణం లేకుండా ఎలా సంతోషం కలుగుతుంది? ఇది మనకి అంతు చిక్కని ప్రశ్న. అలా ఏ కారణం లేకుండా కలిగే సంతోషాన్ని నిత్యానందం, ఆనందం లేదా పరమానందం అంటారు. అది ఏ కారణం లేకుండానే మనలోంచి పొంగి ప్రవహిస్తుంది. అది పొందే మార్గమే ధ్యానం.

మనం ధ్యానం ద్వారా మనలోపలి ఆ ఆనందాన్ని తెలుసుకొని ఆ స్థితిని పొందటాన్ని నిత్యానందస్వామి ఆనందస్ఫురణ అంటారు. ధ్యానం మన లోపల నిక్షిప్తమయిపోయిన ఆనందాన్ని వికసింప చేస్తుంది. ఆ ధ్యాన కార్యక్రమం ద్వారా మనలోని ఆనందాన్ని బయటకు తెచ్చి దానిని తెలుసుకోగలుగుతాము. దానిని మనస్ఫురణకి తెచ్చుకోగలుగుతాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆనందస్ఫురణ కార్యక్రమం అని స్వామి నిత్యానంద అంటారు.