మనిషి సహజ సిద్ధంగా ఆనందమయ స్వేచ్ఛా జీవి
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతీ వ్యక్తి మరణించేవరకు ప్రతిక్షణం వెతికేది ఆనందం కోసం. ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా అతనిలో అంతర్లీనంగానో, బహిరంగంగానో ఉండే విషయం ఆనందం కావాలి అనే కోరిక. దానిని ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని పొందటానికి మనం చేయగల ప్రయత్నాలన్నీ చేస్తాము. నిజం చెప్పాలి అంటే 'ఈ పని చేస్తే మీరు వచ్చే జన్మలో ఆనందంగా ఉండగలరు', అని ఎవరైనా భరోసా ఇస్తే అది ఎంత కష్టమయిన పని అయినా సరే చేస్తాము.
మనకి అర్థమయినా కాకపోయినా, మనం తెలుసుకోగలిగినా, తెలుసుకోలేకపోయినా 'ఆనందం కావాలి' అనేది ప్రతి మనిషికీ ఉండే ఒక ప్రముఖమయిన, బలమయిన కోరిక. ఆ కోరిక అనే శక్తి మనని మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది.
మనం నిరంతరం ఆ ఆనందంకోసం అంత కష్టపడుతున్న ఎందుకు ప్రతి మనీషీ ప్రతి నిమిషం ఆనందంలో ఉండలేకపోతున్నారు? మరి ఇంత ఆరాటపడుతూ, ఆ ఆనందం కోసం ఇంత శ్రమ పడుతున్నాము అంటే ప్రపంచమంతా ఆనందమయమయి పోవాలి కదా! దుఃఖము, బాధ, వ్యధ, అసంతృప్తి, నిరాశ, అనేవి ఎక్కడా కనిపించకూడదు. మనం ఎన్నో సాధించుతాము. గొప్ప చదువులు చదువి, ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడి, చాలా ఆస్తి సంపాదించి, మంచి కుటుంబాన్ని ఏర్పరచుకుని.... ఇలా చాలా సాధించాక చివరికి మనలో శూన్యం ఏర్పడుతుంది, కానీ శాశ్వతమయిన ఆనందం కలగటం లేదు?
ఎందుకు మనం నిత్యం శాశ్వతమయిన ఆనందస్థితిలో ఉండటం లేదు?
నిరంతరం ఆనందం కోసం అంత శ్రమ పడుతుంటే ఎందుకు అది మనకి దొరకటం లేదు?
ఇంత సాంకేతిక పరిజ్ఞానం, ఇంత ఐశ్వర్యం ఇవన్నీ ఉండి కూడా మనం ఎందుకు నిరంతరం ఆనందంలో ఉండలేకపోతున్నాము?
కోట్లమంది ప్రజలు ప్రపంచమంతా, ఇంకా వీలయితే చంద్రుడు, అంగారక గ్రహాలలో కూడా నిరంతరం ఆనందం కోసం వెతుకుతూనే ఉన్నారు. మరి ఎందుకు అసలయిన ఆనందాన్ని పొందలేక పోయారు?
ఇలా ప్రశ్నల లిస్ట్ రాస్తూ వెళితే చాలా పెద్దది అవుతుంది. ఎందుకు మనం ఇంత కష్టపడినా శాశ్వతంగా, తిరిగి పోగొట్టుకోలేని ఆనందాన్ని పొందలేకపోతున్నాము? అసలు నిజంగా ఆ ఆనందం అనేది ఉన్నదా? అసలు ఈ ప్రశ్నలకి జవాబు దొరుకుతుందా?
జవాబు ఉన్నది, అటువంటి ఆనందం, ఉన్నది అని పరమహంస శ్రీ నిత్యానంద చెబుతున్నారు.