ధ్యానం అంటే ఏమిటి?
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
ధ్యానం అంటే మన అంతరంగ ప్రపంచంలోనికి వెళ్ళి, అక్కడి అద్భుతాల అనుభవాన్ని పొందటమే అని స్వామీజీ చెబుతారు. ధ్యానం లేదా మెడిటేషన్ అంటే ఏకాగ్రత కాదు, లేదా అది ఏదో ఒక విషయంపై మనం లోతుగా ఆలోచించటం కాదు.
స్వామి చాలా సూక్ష్మీకరించి ధ్యానం అంటే పరమానందంలోనికి వెళ్ళే అందమయిన ఒక నమ్మకమయిన మార్గం అంటారు. ఎప్పుడయితే మీ మైండ్‌లో భూత, భవిష్యత్లకి సంబంధించిన ఎటువంటి ఆలోచనా ఉండదో, మీరు పూర్తిగా వర్తమానంలో ఎటువంటి ఆలోచనా లేని స్థితిలో ఉంటారో, అదే ధ్యానం. అది మీకు ఆనందం యొక్క నిజమయిన అనుభవాన్ని ఇస్తుంది.
కాబట్టి ధ్యానం అంటే ఆలోచనలు లేకుండా పూర్తి వర్తమానంలో ఉండగలగటమే. అంతే. అంతకుమించి మీరు ఏమీ చేయనవసరం లేదు. అలా అన్ని ఆలోచనలనీ ఆపగానే మీలో జరిగే వికాసమే ధ్యానం. అటువంటి ధ్యానం మిమ్మలని పరమానందంలోనికి తీసుకువెళుతుంది. ధ్యానం ద్వారా ఆనందం వికసించుతుంది.
ధ్యానం మనకు పరమానందాన్ని ఇవ్వటంతో పాటు, మన లోపల అత్యఅల్ప స్థాయిలో ఉండే శక్తిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలుగుతుంది. అంతే కాకుండా అత్యున్నతమైన విశ్వశక్తిని మనకి అందుబాటులోకి తేగలుగుతుంది. ఆశక్తి మనలో సాఫీగా, స్వేచ్ఛగా ప్రవహించి మనని శక్తివంతులని చేసే శక్తి కేంద్రాలని (చక్రాలని) చైతన్యవంతం చేస్తుంది. చక్రాలు (శక్తి కేంద్రాలు) అంటే ఏమిటి?
ప్రాచీన కాలం నుంచి రుషులు, యోగులు, అనేక సందర్భాలలో ఈ చక్రాల గురించి మనకు చాలా విస్తారమైన వివరణలతో చెప్పినట్టు వేదాలలో, ఉపనిషత్తులలో ఉన్నాయి.
చక్రాలు సాధారణ మానవులలో కోటు బటన్ సైజులో ఉంటాయి. వాటిని శుభ్రపరిచి, శక్తివంతం చేస్తే అవి చాలా విస్తారం అవుతాయి. అవి విస్తారమైయి చైతన్యవంతముగా ఉంటే మన లోపల శక్తి ప్రవాహం నిరాటంకంగా ప్రవహిస్తు ఉంటుంది. అటువంటి వారు తమ పనులను ఎంతో సమర్ధవంతముగా ఆహ్లాదముగా చేయగలుగుతారు. అటువంటి వారి జీవిత గమనం ఎంతో నాణ్యతతో ఉత్తమ స్థితిలో ఉంటుంది.
అదే విధంగా మనలో వ్యతిరేకపు ఆలోచనలు, వ్యతిరేకపు భావావేశాలు, ఈ చక్రాలని ముడుచుకుపోయేలా చేస్తాయి. అప్పుడు మనం శక్తిహీనులుగా, బలహీనులుగా ఉంటాము. చక్రాలు అంటే మనిషి శరీరం లోపల ఉండే సూక్ష్మమయిన శక్తి కేంద్రాలు. అవి సాధారణ కంటికి కనపడవు. అవి భౌతికంగా మనలో ఉండవు. అయితే కిర్లియన్ ఫోటోగ్రఫీ అనే ఒక ప్రక్రియ ద్వారా వాటిని ఫోటోలు తీయగలిగారు.
మన శరీరంలో చాలా శక్తి కేంద్రాలు ఉంటాయి. వీటిలో ఏడు చక్రాలు ప్రముఖమయినవి. వాటిని సరియైన దిశలో చైతన్యపరచితే అవి మన శరీరక, మానసిక,భావావేశాత్మక, ఆధ్యాత్మిక స్థితిపై చాలా ప్రభావాన్ని చూపించుతాయి. ఆ చక్రాలు బంధింపబడితే మనం శక్తిహీనులమవుతాము. మనం చేసే పనులలో ప్రావీణ్యం ఉండదు. మనం శారీరకంగా, మానసికంగా చైతన్యంగా ఉండలేము.
పరమహంస నిత్యానంద చాలా ధ్యాన పద్ధతులని మనకి పరిచయం చేసారు.వాటిలో ఈ ఏడు చక్రాలని శుభ్రపరచి చైతన్యం చేయు మార్గాలను, వాటిని శక్తివంతం చేయగల ఏడు విభిన్న ధ్యానపద్ధతులని ప్రత్యేకంగా నేర్పించుతారు. ఇవి మనం ఆనందస్థితికి చేరటానికి కావలసిన ప్రాథమిక, ప్రముఖ ధ్యాన పద్ధతులు. ఒక్కొక్క ధ్యాన పద్ధతి ఆయా చక్రాలని బంధించే భావావేశాలని తొలగించి, ఆ చక్రాన్ని చైతన్యపరచి, వికసించేలా చేస్తాయి. ఆ ధ్యాన పద్ధతులు చక్రాలను శక్తివంతం చేస్తాయి.
ఈ ఏడు ధ్యాన పద్ధతులని నేర్పించే కార్యక్రమమే ఆనందస్పూరణ కార్యక్రమం. పరమహంస నిత్యానంద సామాన్యమానవుల అవసరాలకి తగిన విధంగా ఆధునిక జీవన సరళికి అనుగుణంగా ఉండే విధంగా ప్రపంచంలో ఏ దేశానికి, ఏ సంస్కృతికి, ఏ మతానికి చెందిన వారయినా సులభంగా అర్థం చేసుకొని సాధన చేసే విధంగా ఆనంద స్ఫురణ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనినే అమెరికా, కెనడాలలో లైఫ్ బ్లిస్ ప్రోగ్రాం అంటారు. ఇది రెండు రోజుల శిక్షణా కార్యక్రమం. స్వామీజీ చేత శిక్షణ పొంది, ఆయనచే నియమించబడిన ఆచార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతారు. ఆనందస్ఫురణలో నిత్యానందస్వామి ఏడు ప్రత్యేకమయిన భావావేశాలని వివరించతూ, అవి మన మీద ఏవిధమయిన వ్యతిరేక ప్రభావాన్ని చూపించుతాయి, ఏవిధంగా ఆ భావానికి సంబంధించిన శక్తికేంద్రం అయిన చక్రాన్ని బంధించుతుంది, ఆ భావాన్ని ఆ వ్యతిరేక శక్తివలయాలని ఏ ధ్యాన పద్ధతి ద్వారా ఛేదించవచ్చునో వివరంగా చెబుతారు. ఈ ధ్యాన పద్ధతులని సాధన చేస్తే మన అంతరంగంలో ఉండే నిజమయిన, శాశ్వతమయిన ఆనందం వికసించి దానిని మన స్ఫురణకి తెస్తుంది. అందుకే ఇది ఆనందస్ఫురణ.
ఇప్పుడు కొన్ని వ్యతిరేకపు భావావేశాల గురించి చూద్దాము. అవి మన ఆరోగ్యంపైన, మన ఆనందం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకుంటే, వాటిని మనలోనికి రాకుండా చూడవచ్చు. ఎదుటివారి నుంచి శ్రద్ధని ఆశించటం :
మనలో ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం లేకుండా, పెద్దా చిన్నాల అనే వయస్సులో తేడా లేకుండా, పేదవారు, ధనికులు, చదువుకున్నవారు, నిరక్షరాస్యులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మన మీద శ్రద్ధ చూపించాలి అని అనుకుంటారు. మన మీద ప్రేమ చూపించాలి అని ఆశిస్తుంటాము. ఆ కోరిక ఎంత తీవ్రంగా ఉంటుందంటే మనం చేసే ప్రతి పనినీ ఎదుటివారు ఆమోదించాలి. లేకపోతే మనం మానసికంగా కుంగిపోతాము. మనం జీవించాలి అంటే ప్రతి ఒక్కరూ మనని మన ప్రతి పనీకీ మెచ్చుకుంటూ వారు మన మీద శ్రద్ధ చూపాలి, వారు మనని ప్రేమించాలి అని ఆశించుతాము. ఇలా ఆశించటం తప్పుకాదు, నేరం అంతకంటే కాదు. కానీ ఈ శ్రద్ధ ఆశించటం అనేది సూక్ష్మంగా మనని శక్తిహీనులని చేస్తుంది. ఎదుటివారి శ్రద్ధ అనే శక్తికి అలవాటుపడి, అటువంటి శక్తి మనకి దొరకనప్పుడు మన జీవితాలు కుంగి కూలిపోతాయి. ఆ నిరాశ మానసిక క్రుంగుబాటుకి దారితీస్తుంది.
మనం ఎదుటివారి మీద, సమాజం మీద ఎంత ఎక్కువగా ఆధారపడిపోతామో, పరమహంస నిత్యానంద చాలా చక్కగా వివరించుతారు.
అందరూ ఒక పెద్ద రిజిష్టరు తీసుకొని అందులో ఒక కాలమ్‌లో మంచి తండ్రి అని రాసుకుంటారు. మీరు మీ పిల్లలకి చేయవలసినదంతా చేసి వారు మిమ్మలని ‘మంచి తండ్రి’ అని మెచ్చుకుంటూ ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి దానికి సంబంధించిన కాలమ్‌లో వారు సంతకం చేయాలి అని ఆశించుతారు. ఆ సర్టిఫికెట్ చూసుకొని ‘ఆహా! నేను మంచి తండ్రిని’ అని అనుకుంటారు. అదే విధంగా మీ భార్య, యజమాని, స్నేహితులు, తల్లిదండ్రులు ఇలా అందరి సంతకాల కోసం ఆ రిజిష్టరు పట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లని పోగుచేసుకొని, వారు అందులో ఏమని రాస్తే అదే మీరు అనుకుని గట్టిగా నమ్ముతారు. వారు మంచి వ్యక్తి అంటే నిజమనుకుంటారు. కాదు అసమర్థుడు అంటే నిజమనుకుంటారు. అంతేకాని తాను నిజంగా ఏమిటి అనిఎప్పుడూ అనుకోరు.
స్వామి ఈ సందర్భంగా మనని ఆలోచింపచేసే ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు మనం మనపై ఎదుటివారి అభిప్రాయాలకి అంత విలువ ఇస్తాము? మన గురించి మన శక్తిపై ఆధారపడి ఎందుకు నిర్ణయాలు తీసుకోలేము?
మన పనిని మనలోని శక్తితో చేసుకుపోవచ్చు. మరి ఎందుకు ఎదుటివారు ఇచ్చే శక్తి మీద ఆధారపడతాము?
ఈ ప్రశ్నలకి సమాధానం పరమహంస నిత్యానంద ఈ విధంగా చెబుతారు.
మన గురించి మనకి ఏమీ తెలియదు.
మన గురించి ఎదుటివారి అభిప్రాయాల ద్వారా మాత్రమే తెలుసుకుంటాము. ఎదుటివాళ్ళు మనని మెచ్చుకొని, సర్టిఫికెట్ ఇచ్చి మన మీద శ్రద్ధ చూపినప్పుడు వాళ్ళు మనకి శక్తిని ఇస్తారు. ఆ శక్తితో మనం ముందుకి వెళ్తాము. శ్రద్ధ అంటే శక్తి. అందుకే మనం ఎదుటి వారు చూపే శ్రద్ధకి అంత పొంగిపోతాము. వాళ్ళు వ్యతిరేకంగా ఏమయినా అంటే పూర్తిగా కుంగిపోతాము. అదే డిప్రెషన్ అంటే.
ఇది ఎలా ఉంటుందంటే, చిన్న పిల్లలు పేకలతో మేడలు కడతారు.అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ అందులోంచి ఒక పేకముక్క తీసినా మొత్తం భవనమంతా కూలిపోతుంది. భవనం ఎత్తు పెరిగేకొద్ది అది త్వరగా కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అదేవిధంగా మనం అందరి దగ్గరా పోగుచేసుకున్న సర్టిఫికెట్లతో 'మనం' అనే పెద్ద పెద్ద భవంతులని నిర్మిస్తాము. ఎప్పుడయినా ఎవరయినా ఒక్క సర్టిఫికెట్ తీసుకోగానే 'మనం' అనే భవంతి కూలిపోతుంది.పిల్లల విషయంలో అది ఒక ఆట కాని మన విషయంలో అది జీవితం. అంతేకాదు పిల్లలు ఆడే పేకలు వార సొంతం. భవనం కూలగానే తిరిగి మరలా కట్టుకుంటారు. కానీ మన విషయంలో దురదృష్టం ఏమిటంటే ఆ సర్టిఫికెట్లు మనవి కావు. తిరిగీ ఆ భవనం నిర్మించుకోలేము.
ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎవరూ వాళ్ళ సర్టిఫికెట్లని వెనక్కి తీసుకోకుండా చాలా జాగ్రత్తగా కాపలా కాస్తుంటాము. భవనం ఎప్పుడు కూలిపోతుందో అనే భయంతో జీవిస్తూ ఎదుటివారి అభిప్రాయాలకి విలువ ఇస్తూ గడిపేస్తాము. వారి అభిప్రాయాలకు అనుగుణంగా మన జీవితాన్ని మలచుకుంటాము. అందుకే మనలో ఇంత మానసిక వ్యధ ఉంటుంది.
మనం ఎదుటివారి మీద ఎక్కువ ఆధారపడిపోతే, మానసిక క్షోభకి గురి అవుతాము. మానసిక కుంగుబాటు (డిప్రెషన్స్)తో బాధపడేవారంతా ఎదుటివారు తమ మీద శ్రద్ధ చూపాలి అని కోరుకునే వారే. ఎప్పుడయితే వారికి ఎదుటివారి శ్రద్ధ దొరకదో అప్పుడు మానసికంగా కుంగిపోతారు. దానిని మానసిక వ్యాధి అని నిర్ధారించి మందులు వాడతారు. మన మానసిక క్షోభకి కారణం మన లోపల ఉన్నప్పుడు బయట మందులు ఏవిధంగా ఆ వ్యాధిని బాగుచేయగలవు? దాంతో మరికొన్ని సైడ్ఎఫెక్ట్స్ వస్తాయి.
స్వామీజీ ఇలా చెబుతారు : ‘నా దగ్గరకి ఎవరయినా మానసికంగా కుంగిపోయి, మందులు వాడుతున్నవారు వస్తే వారిని మహామంత్ర ధ్యానం చేయమంటాను. క్రమంగా వాళ్ళు మందులు వాడకం మానేస్తారు. చూడండి మీరందరూ తెలుసుకోవలసిన ముఖ్య విషయం, మీకు కావలసిన శక్తి మీలోపలే ఉన్నది. దానిని తెలుసుకున్నప్పుడే మీరు ఎదుటివారు ఇచ్చే శక్తి మీద ఆధారపడి జీవించరు. అప్పుడు మీరు స్వేచ్ఛగా ఆనందంగా జీవించగలుగుతారు. మీకు మానసిక వ్యధ ఉండదు.
మీరు జీవించటానికి ఎదుటివారి శ్రద్ధ ప్రేమ మీద ఆధారపడితే మీ జీవితపు నియంత్రణని ఎదుటివారికి ఇచ్చినవారవుతారు. మీరే మీకు గొప్పశక్తి వనరులు కావాలి. మీ నిజమయిన ఆనందం, తృప్తి మీలోనే ఉన్నాయి. దానిని బయట వ్యక్తులు మీకు ఇవ్వలేరు.
అదే విధంగా ఎదుటివారి నుంచి ప్రేమను ఆశించినా, మీరు ఎదుటివారిని నిబంధనలు షరతులతో ప్రేమించిన మీకు మిగిలేది వ్యధ మాత్రమే.
మనం చాలా పనులు ఎదుటివారి ప్రశంసలు కోసం వారి సమ్మతి కోసం మాత్రమే చేస్తాము. కానీ, ఆ పనులని మనం ప్రేమ లేదా బాధ్యత అనే పేరుతో చేస్తాము. నాతో చాలామంది అంటుంటారు. “స్వామీజీ, మేము ఎదుటివారి పొగడ్తల కోసం లేదా వారి సమ్మతి కోసం పనులు చేయము. ఇది మా బాధ్యత” అని. స్పష్టంగా అర్థం చేసుకోండి: ఎప్పుడైతే మీరు ఒక పనిని బాధ్యత అని చేస్తారో, మీరు ఆ పనిని ఎదుటివారి సమ్మతి కోసం చేసినట్లే. అలా చేయకపోతే వారు తమ సమ్మతిని ఆపేస్తారు అనే భయం.
మీలో చాలా ప్రేమతో కూడిన శక్తి ఉన్నది. ఎందుకంటే మీరు నిరంతరం మీ లోపలి పరమానందకరమైన శక్తిని వెల్లడి చేస్తూ ముందుకి సాగిపోతూ ఉంటారే కాని ఆగి ఫలితాల గురించి ఆలోచించరు. మీరు ఆనందంగా ముందుకి సాగిపోతుంటారు అంతే. ఇలా మీలో ప్రవహించే శక్తిని ప్రేమ అంటారు.
మీరు ఎదుటివారి నుంచి ఆశించటం మొదలుపెడితే దానికి అంతం ఉండదు. నిరంతరం అందరినీ సంతోషపెట్టటం, తృప్తి పరచటం సాధ్యమని మీరు అనుకుంటున్నారా?
మీరు కొంచం వివేకంతో అర్థం చేసుకోగలిగి, ధ్యానం చేయగలిగితే, మీరు కారణం లేకుండానే ఎవరినైనా ప్రేమించగలరు అని తెలుసుకుంటారు. మీరు రోడ్డు మీద ఉన్న చెట్లని ప్రేమించగలరు. మీరు వాటిని లాలించగలరు. అప్పుడు మీలో ప్రవహించే శక్తి యొక్క అనుభూతిని పొందగలుగుతారు. మీరు రోడ్డు మీద వెళుతూ అక్కడ మీకు తెలియని వారిని కూడా ప్రేమించగలుగుతారు. అసలు మీ అంతరంగపు ఉనికి, మీ అంతరాత్మ ఒక ప్రేమ. అంతేకాని అది మీకు ఉండే ఒక లక్షణం కాదు.
షరతులు లేని స్వచ్ఛమైన ప్రేమ స్వేచ్ఛని ఇస్తుంది. పరమహంస చెప్పే ప్రేమ అటువంటిదే. అది జ్ఞానోదయమైన యోగీశ్వరుల ప్రేమ, దైవ ప్రేమ. అందుకే స్వామీజీ చెబుతారు. మీ ఎదుట ఎవరు ఉన్నారు? వారు నా ప్రేమకి అర్హులేనా? వారికి ఎంత ప్రేమ ఇవ్వాలి? అని అనుకోకుండా ప్రేమని అందరికి పంచండి. అందరినీ కారణం లేకుండా, నిబంధనలు లేకుండా ప్రేమించండి. అలా ప్రేమించి వారి నుంచి ఏమీ ఆశించకండి. ఇదే నిజమయిన ప్రేమ. కాని మనకి తెలిసిన ప్రేమ, అది తల్లిదండ్రులు పిల్లల మధ్య అయినా లేదా భార్యాభర్తల మధ్య అయినా, స్నేహితులు, ప్రేమికులు ఎవరి మధ్య ఉన్న ప్రేమ అయినా ఎదుటివారి నుంచి ఏదో ఒకటి బహిరంగంగా కానీ, అంతర్లీనంగా కాని ఆశిస్తుంది. అందుకే ఆ ప్రేమ బాధని మాత్రమే మిగుల్చుతుంది.

పరమహంస శ్రీ నిత్యానంద

మన శరీరంలోని ఉన్న 7 శక్తి కేంద్రాలు (చక్రాలు)
అనాహత చక్రం :
అనాహత చక్రం గుండె ఉండే ప్రాంతంలో ఉంటుంది. సంస్కృతంలో అనాహత అంటే 'సృష్టించలేనిది' లేదా 'పుట్టించలేనిది' అని అర్థం. అనాహత చక్రం ప్రేమ, భావోద్రేకం, మనోభావాలకు సంబంధించినది. మీరు ఎదుటివారి శ్రద్ధ, ప్రేమ మీకు కావాలి అని అనుకున్నప్పుడు ఈ చక్రం బంధింపబడుతుంది. అదే మీరు స్వార్థం లేని ప్రేమని పంచినప్పుడు, మీరు షరతులు నిబంధనలు లేకుండా ప్రేమించినప్పుడూ ఈ చక్రం వికసించుతుంది. దీని అర్థం ఏమిటి అంటే నిజమైన ప్రేమని బయట పుట్టించి మీలో నింపుకోలేరు అని. అది కేవలం మీలోనే ఉదయించాలి. అంతే
ఇది మీ లోతయిన అంతరంగాన్ని తెలుసుకున్నప్పుడు జరుగుతుంది. మనలో నిజమైన ప్రేమ ఉంటే మనం బయట ప్రేమని, ఎదుటి వారి శ్రద్ధని ఆశించము. మన అంతరంగంలో ప్రేమ మనకి గొప్పశక్తి అవుతుంది. మహా మంత్ర ధ్యాన పద్ధతి :
మహామంత్ర ధ్యాన పద్ధతి ప్రాచీన టిబెటియన్ బౌద్ధుల ధ్యానపద్ధతి. ఇది గుండె ప్రాంతంలో ఉండే అనాహత చక్రాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఈ ధ్యానం చేస్తే మీ మైండ్ స్థిరంగా, దృడంగా ఉంటుంది. ఈ ధ్యానం చేసినప్పుడు మీలో శక్తి ప్రవహించుతుంది. మీలో పొంగి ప్రవహించే శక్తిని ప్రేమని ఇతరులకి ఇవ్వగలుగుతారు.
ఈ ధ్యానం చేయటానికి మొత్తం 30 నిముషాలు టైం పడుతుంది. దీనిని ఖాళీ కడుపుతో చేయాలి. ఉదయం పూట చేస్తే బాగుంటుంది. భోజనం చేసాక రెండు గంటలు ఆగి ధ్యానం చేయండి. ఈ ధ్యానాన్ని ఒంటరిగా అయినా చేయవచ్చు లేదా సమూహంగా చేయవచ్చు. మీరు ధ్యానం చేసిన ప్రదేశ్ం శక్తితో నిండుతుంది. మీరు నేల మీద కూర్చొని కళ్ళు మూసుకొని, పెదాలు దగ్గరగా మూసి మ్....మ్..... అనే శబ్దం చేయండి. ఇది మీ లోపలి నుంచి, నాభి ప్రాంతం నుంచి రావాలి. ఇది కేవలం మ్...... శబ్దం హం కాదు ఓం కాదు. మ్ అనే శబ్దాన్ని ఎంత లోతుగా, గట్టిగా చేయగలిగితే అంతసేపు చేయండి. మ్ అనే శబ్దాన్ని ఎంత సేపు చేయగలిగితే అంతసేపు చేయండి. అలా 20 నిముషాలు చేసాక ఆపండి. అలా 10 నిముషాలు నిశ్శబ్దంగా ఉండండి. చిరునవ్వు ముఖంతో ఉండండి. ఏవయినా ఆలోచనలు వస్తే రానీయండి. వాటిని ఆపటానికి ప్రయత్నించకండి.
ఈ ధ్యానం ప్రతిరోజు సాధన చేయటానికి అనువయినది. దీనిని ముందుగా ధ్యానపీఠంలో శిక్షణపొంది, వారిచే నియమించబడిన ఆచార్యుల పర్యవేక్షణలో చేయాలి. మీ అంతట మీరు చేయవద్దు.
వ్యథ, బాధ, దుఃఖం లేని జీవితం :
ప్రతి వ్యక్తిలో సామాన్యంగా, తప్పనిసరిగా ఉండే ఒక భావం బాధ. బాధలు అనేవి ప్రతివ్యక్తిలో ఉంటాయి. అన్ని వయస్సుల వారిలో, అన్ని సంస్కృతీ సంప్రదాయాల వారిలోనూ, ధనవంతులు పేదలు, పండింతులు, పామరులు అందరిలోనూ బాధ అనేది ఉంటుంది.
నిత్యానందస్వామి బాధల గురించి చాలా చక్కగా చెబుతారు. ‘అందరికీ బాధలు ఉంటాయి. ఎవరికైనా బాధలు లేకపోతే, అది వారికి మరీ బాధాకరం. అలా బాధపడటానికి బాధలు లేనివారు అభద్రతా భావంతో విలవిలలాడతారు. దేనిగురించి బాధపడాలా అని ఆలోచిస్తారు’.
స్వామీజీ ఈ విషయం గురించి చాలా వివరాలు ఇస్తారు. బాధలుపడే వారంతా ప్రతి విషయానికి బయట ప్రపంచాన్ని, అందులోని వ్యక్తులని లేదా సంఘటనలని తప్పుపడతారు. మనలోని బాధలకి బయట ప్రపంచం కారణమయితే కనీసం ఒక వ్యక్తి అయినా దానిని ఛేదించి బాధల నుంచి విముక్తి పొందరా? అంటే మన బాధలకి బయటప్రపంచం కారణం కాదు. మనమే బాధ్యులము అని చెబుతారు.
బాధ అంటే ఏమిటో నిత్యానందస్వామి ఈ విధంగా చెబుతారు “బాధ అనేది ఏదైనా ఒక సంఘటనకి మీ నుంచి వచ్చే స్పందన” ఏ విషయమైనా మిమ్మలని బాధించాలి అంటే ఆ సంఘటనకి మీరు ఎలా స్పందించాలి అని నిర్ణయించుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది.
అయితే ఈ స్పందన అనేది ఆ సంఘటన జరిగినప్పుడు దాని గురించి మన లోపల మనం అర్థం లేకుండా మాట్లాడుకోవడం వలన జరుగుతుంది. అంటే అసలు ఈ బాధ అనేది నిరంతరం మీ లోపల మీరు మాట్లాడుకునే అర్థంలేని మాటలు సమూహం. ఉదాహరణకి మీ స్నేహితునికి చాలా మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పాడనుకోండి. వెంటనే మీరు ఇలా ఆలోచించారను కోండి, “అతనికి చాలా మంచి ఉద్యోగం వచ్చింది. జీతం అలవెన్సు చాలా ఎక్కువ. కానీ నా పరిస్థితి ఏమిటి ఈ సంగతి నా భార్యకి తెలిస్తే ఏమనుకుంటుంది. నేను కూడా ఒక కొత్త ఉద్యోగం వెతుక్కోవాలా? కానీ నేను దురదృష్టవంతుడిని. నాకు ఏదీ కలసిరాదు”.... ఇలా అంతులేని ఆలోచనలతో నిండిపోతారు. ఇలా ఎన్నో మాటలు వస్తాయి. దీనినే బాధ అంటారు. మిమ్మలని మీరు బయట ప్రపంచంతో పోల్చుకోవటమే బాధపడటం అంటే. అందుకే నిరంతరం ‘అయ్యో వాళ్ళు’ ఏమనుకుంటారో అని బాధపడుతుంటాము.
ఈ సందర్భంగా మనకి తెలియని రహస్యమొకటి స్వామి చెబుతారు. బాధపడటం మైండ్‌కి ఆహారం లాంటిది, అహంకారానికి ఆధారం లాంటిది. అందుకే అందరూ సమస్యలలో ఉండటానికి ఇష్టపడతారు. అలా ఉన్నప్పుడే మీరు సంపూర్ణమయిన వ్యక్తిని అని అనుకుంటారు. అందుకే అందరూ నిజంగా బాధలని ప్రేమిస్తారు.
బాధ అంటే మన మనస్సులో నిరంతరం సాగే అంతరంగపు మాటల ప్రవాహం. వీటినే మనం ఆలోచనలు అంటాము. ఈ ఆలోచనలు అన్ని కలిపితే అది మన మానసిక స్థితి అవుతుంది. అదే మన మనస్సు లేదా మైండ్. ఇవే మన జీవితాలని నిర్దేశించుతాయి. ఈ విధంగా మీ మనస్సే మీ జీవితాన్ని తాను జీవిస్తుంది.
ఈ బాధల నుంచి బయటపడాలి అంటే, మీరు మీ బాధలని అంగీకరించాలి. మీరు వాటిలోపలికి లోతుగా వెళ్ళగలగాలి. అప్పుడు ఈ సమస్యలన్నీ మీరు సృష్టించుకున్నవే అని మీకు అర్థమవుతుంది. మీరు సచేతన స్థితిలో ఉండగలిగితే మీరు మీ మైండ్ ని మీ ఇష్టప్రకారం ఉపయోగించుకోవచ్చు
ముందుగా మీరు మీతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోండి. అప్పుడు మీకు బయటవారితో అవసరం ఉండదు. మీ మైండ్ వెనుకకి ధైర్యంగా వెళ్ళండి. మీకు అపాయింట్మెంట్ ఇచ్చుకోండి. అప్పుడు మీరు మీ ఆలోచనలని తెలుసుకునే తత్వంలో గమనించండి. క్రమంగా మీ ప్రతి ఆలోచనని పరిశీలించండి. మీకు వచ్చే వ్యతిరేకపు ఆలోచనలని చిరునవ్వుతో చూడండి. మీకు కలిగే వ్యతిరేక సంఘటనలని చూసి, “నీవు నన్ను ఏమీ చేయలేవు” అని చెప్పండి. అప్పుడు ఆ వ్యర్థపు ఆలోచనలు మీలో బాధని సృష్టించవు.
మీరు బాధపడటానికి మరొక కారణం మీరు నిరంతరం జరిగిపోయిన విషయల గురించి అపరాధభావంతో అయినా ఉంటారు లేదా జరగబోయే విషయాల గురించి ఆతృతతో అయినా ఉంటారు. ఈ విధంగా ఇటువంటి ఆతృత, అపరాధ భావాలతో మిమ్మలని మీరు బరువుగా చేసుకుంటారు. మీలో 80% శక్తి కేవలం దీనికే ఖర్చు చేస్తారు. మీరు బాధల నుంచి స్వేచ్ఛ పొందాలి అంటే పూర్తిగా వర్తమానంలోనే ఉండండి.
మీలో ప్రవాహంలా వచ్చే ఆలోచనలని ఒక పరిశీలకుడిగా గమనించండి. కానీ వాటిని ఆపటానికి ప్రయత్నించవద్దు. ఆపడంవలన మీరు మీకు ఉన్న బాధలకు మరొక బాధను కలుపుతున్నారు. అది బాధలని ఎలా ఆపాలి అనేది. వాటిని అణచకండి. అవి మరింత విజృంబించుతాయి.
మీరు మీ భావావేశాలలో ఎంతగా చిక్కుకుపోయారంటే, మీరు వాటి నుంచి వేరుపడటం ఎలాగో తెలియనంతగా. ఎప్పుడయితే ఈ ఆలోచనలని పరిశీలించటం మొదలుపెడతారో అవి క్రమంగా మాయం అయిపోతాయి. క్రమంగా మీలో మార్పు వచ్చి మీరు ఒక కొత్త వ్యక్తిగా రూపాంతరం చెందుతారు. అప్పుడు మీలో బాధలు, కష్టాలు ఉండవు. ఏ వ్యక్తీ ఏ సంఘటన మిమ్మలని ప్రభావితం చేయవు. ఎందుకంటే వాటిని చూసి చిరునవ్వు నవ్పితే, అవి ఏమనుకుంటాయి, ‘అబ్బే నేను ఈ వ్యక్తిని ఏమీ చేయలేను. నాకు ఇక ఇక్కడ పనిలేదు’, అని మిమ్మలని వదిలి వెళ్ళిపోతాయి. యోగులు ఉండేది ఈ స్థితిలోనే.
మణిపూరక చక్రం :
మణిపూరక చక్రం నాభిస్థానంలో ఉంటుంది. సంస్కృతంలో మణిపూరక అంటే మణుల పట్టణం అని అర్ధం.
మనం నిరంతరం బాధపడుతుంటే ఈ చక్రం బంధింపబడుతుంది. బాధ ల గురించి బాధ పడటం మానేస్తే ఈ చక్రం వికసించి చైతన్యవంతమవుతుంది.
బాధలు మణిపూరక చక్రంతో దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. వ్యతిరేకపు ఆలోచనలు, వ్యతిరేకపు భావాలు సరాసరి వెళ్ళి మణిపూరక చక్రాన్ని ప్రభావితం చేస్తాయి. మనం జాగ్రత్తగా గమనించితే మనలోని వ్యతిరేకపు ఆలోచనలు నాభిప్రాంతం నుంచి రావటం తెలుస్తుంది.
స్వామిజీ, ఈ చక్రం గురించి చెప్పేటప్పుడు స్పష్టంగా ఒక విషయాన్ని వివరించుతారు :
మీకు సమస్యలు ఉన్నప్పుడు, మీరు నియంత్రించలేని, పరిష్కరించలేని కష్టం కలిగినప్పుడు మొట్టమొదటి మీ నాభి ప్రాంతం ప్రభావితం అవుతుంది. అప్పుడు మీ కడుపు భాగంలో బరువుగా అవుతుంది. అందుకే అంటారు 'బాధని నేను జీర్ణించుకోలేకపోతున్నాను' అని. నిరంతరం బాధలు ఉంటే మణిపూరక చక్రం బంధింపబడుతుంది.
మణిపూరక శుద్ధిక్రియ ధ్యానం :
దీనిని ప్రాచీన క్రైస్తవం నుంచి తీసుకొని సుఫీలు జిబ్బరీష్గా అభివృద్ధి చేశారు. ఈ ధ్యానం మీలో లోతుగా నాటుకుపోయిన బాధలను బయటికి తీసి మణిపూరక చక్రాన్ని శుభ్రం చేస్తుంది. ఈ ధ్యానాన్ని ఖాళీ కడుపుతో చేయాలి.
నిలబడి కళ్ళు మూసుకోండి. మీ మణిపూరక ప్రాంతంలోనికి బాగా లోతుగా వెళ్ళండి. అక్కడ ఎంత బరువుగా ఉంటుందో ఒక్కసారి అనుభూతితో తెలుసుకోండి. అక్కడ మీ ఏకాగ్రతని నిలపండి. అక్కడ వున్న కోపాన్ని బాధలని గుర్తు చేసుకోండి.
ఇప్పుడు మీరు ఏవైనా అర్థం లేని శబ్దాలని ఎంత గట్టిగా చేయగలిగితే అంత గట్టిగా చేయండి. ఈ శబ్దాలు మీ నాభిప్రాంతం నుంచి రావాలి. అలా అరవటానికి మీకు తెలిసిన భాషని, అందులో పదాలని వాడవద్దు. మీకు మీ శక్తి కొద్దీ మీలోని వ్యతిరేక భావాలని బయటికి రప్పించండి. పూర్తిగా దీనిలో నిమగ్నమవ్వండి. ఇంకేమీ ఆలోచించవద్దు. 20 నిముషాలు అయ్యాక ఆపండి. 10 నిముషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ ఆలోచనలని గమనించండి. మీ మణిపూరక ప్రాంతం తేలికగా అయిన అనుభవం పొందుతారు. మీరు ఇప్పుడు తేలికగా సంపూర్ణమయిన ఆనందలో ఉంటారు.
ఈ ధ్యానం ఖాళీ కడుపుతో చేయాలి. ధ్యానపీఠం ఆచార్యుల పర్యవేక్షణలో నేర్చుకున్న తరువాత మాత్రమే ఈ ధ్యానం చేయాలి. కల్పనలని, ఊహలని వదిలివేయటం :
మనం పరిపూర్ణమయిన స్వచ్ఛమయిన ఆనందస్థితిని చేరటానికి ఉండే మరొక అడ్డంకు మనలో ఉండే కల్పనలు ఊహలు. ఇవి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో, ఇతర సంబంధ భాంధవ్యాలలో చాలా ప్రభావాన్ని చూపించుతాయి.
అన్నింటికంటే మన సంబంధ బాంధవ్యాలలో ముఖ్యమైన సమస్య లైంగిక సంబంధమైన సమస్య. నిజానికి ఇది ఒక సమస్య కాదు. కొన్ని భావాలు చిన్నతనం నుంచి మన లోపల నిలువ అయిపోయి దానితో సమస్యలు వస్తుంటాయి.
ఈ సమస్య గురించి పరమహంస నిత్యానంద చాలా చక్కగా స్పష్టంగా వివరించుతారు. జీవశాస్త్రం ప్రకారం స్త్రీ పూర్తిగా స్త్రీ కాదు ఆమె 51% స్త్రీ, 49% పురుషుడు. అదేవిధంగా పురుషుడు 51% పురుషుడు, 49% స్త్రీ. అయితే సమాజం చిన్నతనం నుంచి మనలో ఆ రెండవ భాగాన్ని, ఆ లక్షణాలని ప్రదర్శించనీయకుండ అణిచివేస్తుంది. పురుషుడు స్త్రీ లక్షణాలని చూపించటానికి ఒప్పుకోదు. అదే విధంగా స్త్రీని పురుష లక్షణాలని చూపనీయదు.
వారిలోని అర్ధ భాగం అణిచివేయబడటంతో తాము పోగొట్టుకున్నభాగం కోసం బయట ప్రపంచంలో వెతకటం ప్రారంభించుతారు. అక్కడ అందుబాటులో ఉండే మాస్ మీడియా అయిన సినిమాలు, టి.విలు, ఎడ్వర్టైజ్మెంట్లు ద్వారా ఒక అందమైన రూపాన్ని తమ మైండ్‌లో తయారు చేసుకుంటారు. ఆ రూపానికి తోడు ఇలా ఉండాలి అలా ఉండాలి అనే అభిప్రాయలు ఏర్పరచుకుంటారు. ఆ విధమయిన అభిప్రాయంతో జీవితభాగస్వామిని చూస్తారు. అప్పుడు తన భాగస్వామితో తన ఊహలలోని వ్యక్తితో పోల్చి చూస్తే ఎక్కడా సంబంధం ఉండదు. అసలు అలా జరగటం అసంభవం. ఎందుకంటే ఊహలలోని వ్యక్తి కల్పన, నిజ జీవితంలోని వ్యక్తి సత్యం. ఇప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి.
ఇప్పుడు ఏమి చేస్తారంటే తమ భార్య/ భర్తనీ తమ ఊహలలోని రూపంలా మార్చాలని ప్రయత్నాలు మొదలుపెడతారు. భార్య, భర్త తమ చేతిలో ఒక ఉలిని సుత్తిని పట్టుకొని తన ఊహలకి అనుగుణంగా ఎదుటి వ్యక్తిని చెక్కటం ప్రారంభించుతారు. అందుకే ఏ ఇంటిని గమనించినా మనకు వినపడేది ఆ చెక్కుడు శబ్దాలే. ఈ విషయాలు చెబుతూ సరదాగా మనకి చురుక్కుమనే నిజాన్ని స్వామి ఇలా చెబుతారు " వివాహంలో తాళిబొట్టు ఇచ్చే బదులు సుత్తి, ఉలి ఇస్తే ఇటువంటి వారికి బాగుతుందేమో!" అని.
చెక్క లేదా రాతిని చెక్కితే అందమయిన బొమ్మలు, విగ్రహాలు వస్తాయి. కానీ మనిషిని చెక్కితే మిగిలేది బాధ. అది ఒకరకమయిన హింసలాంటిదే. ఇటువంటి చెక్కుడు వలననే ధర్మక్షేత్రాలుగా ఉండే గృహాలు కురుక్షేత్రాలుగా మారిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధం వృధా పూరితం అవుతుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకం అనేవి లేకుండా పోతున్నాయి.
ఇదేవిధంగా తల్లితండ్రులు పిల్లలను చెక్కుతారు. తమ జీవితాలని పిల్లలద్వారా జీవించాలని చూస్తారు. స్వామీజీ ఈ సందర్భంగా ఇలా చెప్పారు. 'నేను ఒకసారి కొంతమంది పిల్లలని కలిసినప్పుడు వాళ్ళు నాతో, మా నాన్నగారు నేను ఇంజనీర్ మాత్రమే అవ్వాలి అంటున్నారు, మా తల్లితండ్రులు నన్ను మెడిసన్ చదవమంటున్నారు..... ఇలా ఉన్నాయి వారి మాటలు ఇది కూడా హింస పెట్టటమే' అని అన్నారు.
ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. స్వామీజీ చాలా గట్టిగా ఇలా చెబుతారు. జీవించి ఉన్న ఏ వ్యక్తీ ఊహలలో ఉన్నట్టు జీవించలేరు. ఎందుకంటే ఊహలలోని రూపం నిజాల నుంచి తయారయినది కాదు. మీరు నిజాల నుంచి, మీ చుట్టు ప్రక్కల ఉన్న వ్యక్తుల నుంచి ఊహలతో రూపాన్ని తయారు చేసుకుంటే పరవాలేదు. కానీ మీరు సినిమాల నుంచి, అడ్వటైజ్మెంట్స్ నుంచి తయారు చేసుకుంటారు. అందుకే చివరిలో మీకు మిగిలేది ప్రేమ కాదు, వ్యధ, బాధ.
అయితే మనం ఏమి చేయాలి. స్వామీజీ దీనికి ఒక చక్కని పరిష్కారం చెప్పారు. మీరు మీ మైండ్‌లో మీ భార్య లేదా భర్త పట్ల ఏర్పరచుకున్న అభిప్రాయాలని అదేవిధంగా మీ ఊహలోని రూపాన్ని ఒక ప్రక్కన పెట్టండి. మీ భార్యని ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చూడండి. అదే ఆమెని మొదటిసారి చూస్తున్నాను అన్నట్టు చూడండి. ఆమె ప్రతి మాట, చేసే ప్రతి పనినీ కొత్త విషయంలా గమనించండి. అసలు ఎటువంటి అభిప్రాయానికీ రావద్దు. ఆమెపై ప్రేమతో ఉండండి. ఆమె మాటలు రెచ్చగొట్టే విధంగా ఉన్నా మీరు తెలుసుకునే తత్వంతో వినండి. వాదించవద్దు. అలా 24 గంటలు ఉండండి. అప్పుడు మీకు ఉన్న సమస్యలకి మీ దృక్పథమే కారణం అని తెలుస్తుంది.
మీరు అనవచ్చు, మరి నా భార్య మారనవసరం లేదా? ఆమె ఎలా స్పందించుతుందో కదా! అని. ఈ ప్రశ్నకి స్వామీజీ కచ్చితమైన జవాబు ఇస్తారు, "మీ లోపల ఎదుటివారిని మార్చగల శక్తి ఉన్నది. మీలో మార్పురాగానే మీ భార్య అప్రయత్నంగా మారిపోతుంది. మీరు ఈ విధంగా చేయగలిగితే మీరు మీ భార్య ఇద్దరూ వికసించటానికి తోడ్పడినవారవుతారు. మీకు ఒక్కసారి ఒక 24 గంటలు ఇలా ప్రయత్నించి చూడండి మీ ఇద్దరూ వికసించటానికి మార్గం అదే ఏర్పడుతుంది”.
పరమహంస నిత్యానంద ఇక్కడ ఒక అద్భుతమైన సూక్ష్మసత్యాన్ని చెబుతారు,“మీరు చేసే సృష్టి భగవంతుని సృష్టితో పోటీకి వెళ్ళగలదా? మీ సృష్టి అంతకంటే గొప్పగా ఉంటుందా?”
మీ భార్య, భర్త, పిల్లలూ ఇలా అందరూ ఆ భగవంతుని సృష్టి. మనం ఆ సృష్టిని మార్చి ఇంకా అద్భుతంగా చేయగలమా? కచ్చితంగా చేయలేము. మరి ఎందుకు ఈ తాపత్రయం. వ్యక్తిని వ్యక్తిగా మీ జీవితంలోనికి ఆహ్వానించగలిగితే జీవితం ఆనందమయంగా ఉంటుంది.
మీ కోరిక స్వచ్ఛమయినది అయితే, అందులో మీకు అత్యాశలు అపరాధ భావాలు లేకపోతే అప్పుడు మీరు అందులో లోతుగా వెళ్ళగలుగుతారు మీరు అందులోంచి బయటకి వచ్చి వికసించగలుగుతారు. ముందు మీరు మీ శరీరాన్ని, ఎదుటివారి శరీరాన్ని ప్రేమించటం నేర్చుకోండి. మీ శరీరంలో పరమానందం నిరంతరం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు దానిని బయటికి రానీయటం లేదు. ఎందుకంటే మీరు మీ ఊహలలో చిక్కుకుపోయారు. ఎప్పుడయితే మీరు ఊహలని వదిలివేస్తారో, అప్పుడు మీరు ఆనందాన్ని తెలుసుకోగలరు.
మూలాధార చక్రం :
మూలాధార చక్రం వెన్నుముక క్రింది భాగంలో ఉంటుంది. సంస్కృతంలో మూలాధార అంటే అనంతసృష్టికి ఆధారమయిన అని అర్థం. మూల అంటే వేర్లు, ఆధార అంటే ఆధారం. అంటే సమస్త సృష్టికి ఆధారమయినది అని అర్థం.
మనం కల్పనలు, ఊహలలో ఉంటే ఈ చక్రం బంధింపబడుతుంది. కల్పనలు వదిలివేసి సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ చక్రం వికసించి చైతన్యవంతమవుతుంది. ఇది లైంగిక పరమయిన విషయాలకి సంబంధించిన చక్రం. మనలోని 80% శక్తి మూలాధారం చక్రంలో ఉంటుంది. ఈ చక్రాన్ని మనం ప్రత్యేకంగా శక్తివంతం చేయనవసరం లేదు. అందులో శక్తిని సరియైన పద్ధతిలో ఉపయోగించగలిగితే మన జీవితం మరింత నాణ్యతతో ఉంటుంది. దుఃఖహరణ ధ్యానం :
ఈ ధ్యాన పద్ధతిని కాళార్ణవ తంత్రం నుంచి తీసుకున్నారు. దీనిని 30 నిముషాలు చేసే విధంగా స్వామి రూపొందించారు. ఈధ్యానం ఉదయం ఖాళీ కడుపుతో చేయాలి. ఈ ధ్యానాన్ని 21 రోజులు చేస్తే మీలో స్పష్టమయిన మార్పు కనిపిస్తుంది. మీకు తెలియని అందమయిన ప్రకాశం మీలో కలుగుతుంది. ఈ ధ్యానం ఒక మానసిక స్నానం లాంటిది.
దుఃఖహరణ ధ్యానాన్ని మూడు దశలలో చేయాలి మొదటిదశ 10 నిముషాలు. ఈ దశలో లయబద్ధంగా, లోతుగా శ్వాసతీసుకోవాలి. అలా శ్వాశ తీసుకోవటానికి అనువుగా మీరు నిలబడి పైకి కిందకి మోకాళ్ళు వంచుతూ, చేతులు పైకి క్రిందకీ కుంగుతూ పక్షి ఎగురుతున్న విధంగా చేయాలి. మీరు శ్వాశ తీసుకునేటప్పుడు కిందికి వంగాలి. శ్వాస వదిలేటప్పుడు పైకి లేవాలి.
ఆ తరువాత పది నిముషాలు మీ శరీరంలోని ప్రతి భాగం కాలి వేళ్ళు దగ్గర నుంచి తల వరకూ ఒకదాని తరువాత ఒకదానిని టెన్స్ చేయాలి. అంటే బిగదీసి తరువాత వదుల చేయాలి. అలా పది నిముషాలు చేయాలి.
తరువాత పది నిముషాలు కూర్చొని హూ అనే శబ్దాన్ని చేయాలి. అది కేవలం హూ అనే శబ్దం. మీరు విరామంగా నవ్వు ముఖంతో ఉండాలి. హెచ్చరిక : ఈ ధ్యాన పద్ధతిని మొదటిసారి ధ్యానపీఠం ఆచార్యుల పర్యవేక్షణలో మాత్రమే నేర్చుకొని చేయాలి. మీ అంతట మీరు చేయకూడదు. ఏవయినా శారీరక, మానసిక సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. భయాన్ని ఎదుర్కొనటం :
మనలో ప్రతి ఒక్కరికీ రకరకాల భయాలు ఉంటాయి. చీకటంటే భయం, ఒంటరిగా వెళ్ళాలంటే, క్రొత్తవారంటే, సాహసం చేయాలి అంటే, పైకి ఎక్కాలి అంటే, నీరు అంటే ఇలా చాలా భయాలు ఉంటాయి. ఈ సందర్భంలో పరమహంస నిత్యానంద ఒక చిన్న సత్యాన్ని మనముందు ఉంచుతారు. 'మనకి ఉన్న భయాలన్నీ మరణానికి సంబంధించిన భయాలే. కాకపోతే వేరువేరు రూపాలలో ఉంటాయి. అయితే అవి ప్రత్యక్షంగా ఉండవు' అని చెబుతారు.
అసలు మరణం అంటే ఏమిటి? మనం ఏమని జవాబు ఇస్తాము? మరణం అంటే జీవితం చివరలో జరిగేది అని. కాని నిత్యానందస్వామి ఇది మన జీవితంలో ప్రతిక్షణం జరుగుతుంది అని చెబుతారు. మన జీవితం మొత్తాన్ని మరణం అనే విషయం నియంత్రిస్తుంది. మరణం మన జీవితానికి పరాకాష్ట. మన జీవితం అంతా దీనివైపు నిర్దేశింపబడి ఉన్నది.
మనం మరణం గురించి లోతుగా అర్ధం చేసుకుంటే అందులో రహస్యాలని, అద్భుతాలని తెలుసుకోగలిగితే మన జీవిత రహస్యాలని తెలుసుకోగలం. మరణం అంటే మరొక రూపంలోనికి కొనసాగింపులా దీనిని చూడాలి. లేకపోతే జీవితాన్ని పొగొట్టుకుంటాము. మరణం మనకి గొప్ప గురువు.
పరమహంస నిత్యానంద కఠోపనిషత్ లోని నచికేత కథ చెబుతూ మరణం గురించి నాలుగు అద్భుతమయిన అమృతవాక్కులు చెబుతారు.
మనం మరణాన్ని వెతుకుతూ వెళితే అక్కడ మరణం ఉండదు.
ఒక వేళ మరణం అక్కడ ఉన్నా మనని భయపెట్టదు. అది మనని ప్రేమిస్తుంది. మరణం గొప్ప గురువు.
మరణం మనకి అంతిమ బహుమతి ఇస్తుంది.అదే జ్ఞానం.
మనిషి తన భౌతిక రూపాన్ని అతిగా ప్రేమించుతాడు.అందుకే అంత బాధ పడతాడు.కాని ఈ శరీరం ఆత్మకి ఒక వాహనం లాంటిది.
మీరు మరణ భయాన్ని జయించితే మరణాన్ని జయించినట్టే. ఎందుకంటే మరణం మరోక ఊహ మాత్రమే. మరణం అంటే మరోక రూపం లోనికి మారే ప్రక్రియ అని అర్థం చేసుకోవాలి.అప్పుడు జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.
మనకి ఉన్న కొన్ని భయాలు,మన ఐశ్వర్య, పేరుప్రతిష్ఠలు పోతాయనే భయం. మన ఆరోగ్యం పాడవుతుందేమో అనే భయం మానసిక స్థిరత్వం పోతుందేమో అన్న భయం. తెలియని భగవంతుడు అంటే భయం. దెయ్యాలు భూతాలు అంటే భయం అయితే ఇవన్నీ కూడా మరణభయం యొక్క వివిధ రూపాలే అంటారు స్వామీజీ.
స్వామీజీ మన జీవితం పూర్తిగా జీవించాలి అని చెబుతారు.పూర్తిగా జీవించటమంటే మీ నిజమైన కోరికలని స్పష్టతతో తెలుకునే తత్వంతో గుర్తించి ఆ కోరికలని మాత్రం తృప్తి పరుచుకోవాలి.అప్పుడు జీవితంలో పరిపూర్ణతని అనుభవించుతారు. మరణించాలి అంటే భయపడరు.
మీరు మీ అంతరంగ లోతుల్లోనికి చూడగలిగితే మనకి ఉండేది మరణ భయం కూడా కాదు. జీవితాన్ని సరిపడా జీవించలేదు అన్న భయం. అబద్దపు జీవితాన్ని గడిపాము అన్న భయం.పరిపూర్ణత పొందలేదు అన్న భయం.ఇక్కడే మరణ భయం ప్రారంభమవుతుంది.
స్వామీ ఈవిధంగా కూడా చెబుతారు, లోతయిన వ్యక్తిత్వంతో మీరు జీవించగల స్థాయిలో జీవించండి. మీరు స్పష్టతతో పూర్తి సంతృప్తి పొందే విధంగా జీవించండి. అప్పుడు మీకు మరణం అంటే భయం ఉండదు.
మన భయాలన్నీ కూడా మనం పోగొట్టుకోవడానికి అక్కడ ఏమిలేదు అనే విషయం స్పష్టంగా మనకి తెలియకపోవటమే.మరణాన్ని దగ్గరగా ఎదుర్కొన్న వారికి అక్కడ పోగొట్టుకోవడానికి ఏమిలేదు అని తెలుసు.
మీకు ఉన్న భయాలన్నీ కూడా 'భయం అంటే ఉండే భయాలే'. మీరు తెలివితేటలతో వాటిని దులిపివేస్తే,అవి ఆధారంలేని నీడలని మీకర్ధమవుతుంది.
అదే విధంగా కీర్తి ప్రతిష్ఠలు,అధికారం,పరువు ఇవన్నీ మీరు కల్పించుకున్న ఊహలే. మీరే వాటికి ప్రాణం ఇచ్చి అభివృద్ధి చేసి,అవి పోతాయేమో అని భయపడుతూ ఉంటారు వాటికి నిరంతరం కాపలా కాస్తుంటారు.ఇదంతా మీ అహంకారానికి కాపలాకాసే పద్ధతి.
చీకటిని చూసి ఎందుకు భయపడతారు.చీకటి చాలా అందంగా ఉంటుంది. మీరు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు అక్కడ అంతా చీకటే. ఈ ప్రపంచంలోనికి వచ్చాక మీకు చీకటితో సంబంధం తెగిపోయింది. చీకటిని గాఢమయిన ప్రేమతో చూడగలిగితే,అమ్మ గర్భం అనే అనుభూతితో చూస్తే చీకటి అంటే భయం అనిపించదు.
భయాన్ని ఎలా అధిగమించాలో చెబుతూ స్వామీజీ ఇలా అంటారు:భయం మిమ్ములను గుడ్డివాళ్ళని చేస్తుంది. అది మీలో వివేకాన్ని,ఆలోచనా శక్తిని మాయం చేస్తుంది.అందుకే భయాన్ని లోతుగా అర్థం చేసుకోండి.అలా తెలుసుకోగలిగినప్పుడు మీలో ఉండే మామూలు శక్తి ఉన్నతమైన శక్తిగా మారుతుంది.మీలో వివేకం పెరుగుతుంది.దానిని అణచటానికి ప్రయత్నించకూడదు.దానిని తెలుసుకోగలగటం ఒక్కటే దారి. మీరు భయాన్ని అణచివేస్తే దానిని పోగొట్టుకునే అవకాశం కోల్పోతారు.భయాన్ని తెలుసుకోగలిగితే మరణం సంభవించినా దానివైపు చూడగలుగుతారు,దానిని స్వాగతించుతారు. ఎప్పుడయితే మరణ భయం పోతుందో మిగతా భయాలు కూడా పోతాయి.
స్వాధిష్ఠాన చక్రం:
స్వాధిష్ఠాన చక్రం నాభికి రెండు అంగుళాల దిగువున ఉంటుంది. స్వాధిష్ఠాన అంటే మీ ఉనికి ఎక్కడ స్థిరపరచుకున్నదో అని అర్థం. భయం ఈ చక్రాన్ని బంధిస్తుంది. భయాన్ని,మరణ భయాన్ని అంగీకరించటం ద్వారా ఈ చక్రాన్ని వికసింపచేయవచ్చు.
నిర్భయధ్యానం (చీకటి ధ్యానం) :
నిర్భయధ్యాన పద్ధతిని వేదాంతం నుంచి తీసుకున్నారు. ఈ ధ్యానం మీ శరీరాన్ని దాటిన అనుభవాన్ని ఇస్తుంది. దీనిని క్రమంగా చేస్తుంటే చీకటిలో ఉండే విశ్వశక్తి మిమ్ములను శక్తివంతం చేస్తుంది.ఇది స్వాధిష్ఠాన చక్రాన్ని శక్తితో నింపుతుంది. ఇది 30 నిముషాలు ధ్యానం.
నేలమీద కాని కుర్చీలో కాని సౌకర్యంగా కూర్చోని కళ్ళుమూసుకొని మీరు దట్టమయిన అడవిలో ఒక చీకటి గుహలోనికి ప్రవేశించి అక్కడ కూర్చున్నారు అనుకోండి.అక్కడ ఎంత చీకటిగా ఉన్నది అంటే మీరు స్పర్శ ద్వారా తప్ప మీకు మీ శరీరం కనిపించనంత చీకటిగా ఉన్నది.
మీరు ఆ చీకటిని శ్వాసించండి.నెమ్మదిగా మీ శరీరం ఆ చీకటిలో కరగిపోవటాన్ని అనుభవించండి.మీ శరీరం చీకటిలా అయిపోయింది అనుకోండి.
(చివర ఐదునిమిషాలలో), మీ శరీరాన్ని అన్ని స్పర్శలతో ఉన్నట్టు అనుభూతి పొందండి.మీ శరీరాన్ని నెమ్మదిగా కూర్చున్న పద్ధతికి కదిలించండి. మీరు గుహలోంచి బయటకి వచ్చి,అడవి బయటకి వచ్చి,మెడిటేషన్ హాలుకి వచ్చేయండి.
(హెచ్చరిక) ఈధ్యానం ఆచార్యుల పర్యవేక్షణలో చేయాలి.మీరు ఒంటరిగా ఈ ధ్యానం చేయవద్దు.
అసూయనుంచి స్వేచ్ఛ పొందటం:
అసూయ గురించి పరమహంస నిత్యానంద ఈ విధంగా చెబుతారు.మనం ఎప్పుడయితే ఇతరుల ఉన్నతిని చూసి భరించలేమో అప్పుడు మనలో అసూయ పుడుతుంది.పోల్చుకోవటం విత్తనమయితే అసూయ దాని ఫలం.పోల్చుకోవటం అసూయ అనేవి ఏమి లేవు.మనమే వాటిని సృష్టించుతాము.
మనం పోల్చుకోవటంలో ఎంత బిజీగా ఉంటామంటే,అందులో పడిపోయి అసలు విషయాలని వాటిలా చూడము.దాంతో చాలా విషయాలు మిస్ అయిపోతున్నాము.పోలికకి నిశ్చయమయిన ఉనికి లేదు.అర్థం చేసుకోవటమనే ధృక్పదాన్ని మీ మైండ్ లోనికి ప్రవేశపెడితే పోలికని అధిగమించగలరు.అది ఎలా అంటే చీకటిని బయటికి పంపటానికి దీపాన్ని(వెలుతురుని)ఎలా తెస్తారో ఇది కూడా అంతే.
మీరు పోల్చుకోవటం అసూయ అనే విషయాలని లోతుగా చూడగలిగినట్లయితే అవన్ని మీ మైండ్ ఆడే ఆటలు అని మీకు తెలుస్తుంది.మీరు మీవి కాని కోరికలవెంట్ పరిగెత్తవద్దు.మీకు ఏదైనా కావాలి అనిపించినప్పుడు మీతో మీరు కూర్చోని అది నిజంగా మీకు అవసరమా అని ఆలోచించండి.మీరు కేవలం మీ కోరికలతోనే జీవించగలిగితే మీరు ప్రశాంతంగా మరణించగలుగుతారు.
స్వామి చాలా స్పష్టంగా ఇలా చెబుతారు: 'నా అనుభవం' నుంచి మీకు చెబుతున్నాను.ఈ అనంత చైతన్య సృష్టి మీకు అన్నింటినీ ఇస్తుంది కానీ మనం అసంతృప్తికి అలవాటుపడి మనం పొందిన వాటి అనుభూతిని పొందే సున్నితత్వాన్ని పోగోట్టుకున్నాము. నిరంతరం ఇంకా కావాలి ఇంకా కావాలి అంటున్నాము. అందుకే మన అంతరాత్మలోనికి దృష్టిని నిలిపి సఫలమయిన జీవితం జీవించటం లేదు.
నిర్మాణాత్మక పోలికలో మీరు మీకు తెలియని విషయాలని ఇతరులనుంచి తెలుసుకుంటారు. అది పోలిక కాదు జ్ఞానాన్ని సంపాదించటం. అది మంచి పద్ధతి.
ఈ రోజులలో మరొక కుంగుబాటుని చూస్తున్నాము. జీవితంలో సాధించవలసిన ఐశ్వర్యం, పేరుప్రతిష్ఠలు అన్నీ సాధించి, సంపాదించవల సినదంతా సంపాదించుతారు. కాని వాళ్ళలో సాధించామన్న తృప్తి ఉండదు. వాళ్ళలో పెద్ద శూన్యం ఏర్పడుతుంది. నేను ఎందుకు ఇంతకాలం ఇలా పరిగెడుతున్నాను అని బాధ పడతారు. దీనినే స్వామీజీ విజయపు కుంగుబాటు తనం అంటారు. ఇది చివరికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. దీనికి కారణం వారికి కాని కోరికల వెంట పరిగెత్తారు. ఈ స్థితినుంచి బయటికి రావటానికి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది, అని స్వామీజీ చెబుతారు.
మానసిక కుంగుబాటు నుంచి బయటపడాలి అంటే ఆ విషయాన్ని లోతుగా అర్ధం చేసుకోవాలి మీరు చేసే పనులు చేతనస్థితిలో చేయాలి. ప్రతి పనినీ తెలుసుకునే తత్వంతో చేయాలి.
అసూయ విషయంలో స్వామీజీ చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతారు. అసూయ అనేది ఒకరితో పోల్చుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఎవరయినా మీకంటే అందంగా ఉంటే బాధపడవద్దు. భగవంతుడు కళాకారుడు కాని ఇంజనీరు కాదు. ఆయన సృష్టిలో ప్రతి వ్యక్తి అందమయిన వాడే, ప్రత్యేకమయినవాడే. అందంగా ఉన్నారు, లేదు అని అనుకోవటం కేవలం మీ కల్పన. మీకు ఎంతకావాలో అంత అందంగా ఉంటారు. మీకు తెలుసా, ఏ కళ్ళు అయితే మరొకరి మీద ఉండవో ఆ కళ్ళలో అందం, అమాయకత్వం ఉంటాయి. భగవంతుడు మీకు ఇచ్చిన దాని మీద నమ్మకం పెంచుకోండి. మిమ్మలని మీరు పూర్తిగా స్వీకరించినపుడు మీలో అద్భుతమైన స్వేచ్ఛ, మీ మీద మీకు అంతులేని నమ్మకం ఏర్పడుతుంది.
ఒక విషయం నమ్మండి. అసూయ మీరు కాదు. మీరు ఎప్పుడయితే దానిని చూసి నవ్వగలరో అప్పుడు దానిని గమనించగలుగుతారు కాని దానిలో నిమగ్నమవ్వరు. మీరు ఈ ప్రపంచంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి. మీలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా లేరు అని తెలుసుకోండి.
మీరు ధ్యానం చేస్తే మీలో వాస్తవాన్ని తెలుసుకునే శక్తి వృద్ధి అవుతుంది. మీరు పూర్తి అంకితభావంతో ఉన్నప్పుడే మీ గమ్యాన్ని చేరటానికి ఎంత కష్టమైనా భరించతారు. దానికి తోడు ధైర్యం కూడా ఉంటే మీరు మీ లక్ష్యం వైపు ఒక పెద్ద అడుగు వేయగలుగుతారు. మీకు ధైర్యం రావాలి అంటే మీరు బయటవారి వైపు చూడకుండా, కేవలం మీ లోపలికే చూడండి. మీ అంతరంగంలో మార్పులు జరుగుతాయి.
మీరు మీకున్న శక్తిలో 80% ఇతరులతో పోల్చుకోవడానికి అసూయ చెందటానికి ఖర్చు చేస్తున్నారు. ఆ శక్తిని కూడా మీ అభివృద్ధికి ఉపయోగించగలిగితే మీ పనులలో సామర్థ్యం పెరుగుతుంది. మీ జీవన ప్రమాణంలో నాణ్యత ఉంటుంది. మీరు మీ అంతరంగ ప్రపంచంలో ఆనందంగాను, బయట ప్రపంచంలో రారాజుగా బ్రతకగలరు.
మీలోపలి అంతులేని వివేకాన్ని కనుక్కోవటమే జీవితమంటే. అందుకే పోల్చుకోవటం ఆపివేసి మీలోని అంతరంగాన్ని కునుక్కోండి. అదే మీకు నిజమైన అభివృద్ధికి ఆధారం. మీ అంతరంగం వైపు తిరగండి. అందులోని శాశ్వతమైన పరమానందాన్ని, నిత్యానందాన్ని కనుగొనండి.
విశుద్ధి చక్రం :
విశుద్ధి చక్రం గొంతుక దగ్గర ఉంటుంది. సంస్కృతంలో విశుద్ధి అంటే శుద్ధికి అశుద్ధికి అతీతమైనది. మనం ఒకరితో పోల్చుకుని అసూయ చెందినప్పుడు ఈ చక్రం బంధించబడుతుంది. మనం ఎప్పుడయితే మన వ్యక్తిత్వాన్ని, మన పూర్తి సృజనాత్మకతని వెల్లడి చేస్తామో అప్పుడు ఈ చక్రం వికసించుతుంది. విశుద్ధి అంటే స్వచ్ఛమైనది. అంటే విశుద్ధి చక్రం ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది. దీనికి కల్మషం అంటదు. కాబట్టి ఈ చక్రాన్ని శుభ్రం చేయవలసిన అవసరం లేదు. అందుకే పోల్చుకోవటం అనేది కేవలం ఈ చక్రాన్ని కమ్మే ఒక నీడ మాత్రమే. ఆ నీడ కూడా ఆధారం లేనిది.
విశుద్ధి చక్రం సృజనాత్మకతకి గొప్పపీఠం. ఈ చక్రంలో శక్తివిడుదల అయితే మీలో అద్భుతమైన సృజనాత్మకత యొక్క ప్రవాహం మీకు అందుతుంది.
శక్తి సాగర ధ్యానం :
శక్తి సాగర ధ్యాన పద్ధతి జెన్బౌద్ధుల నుంచి తీసుకోబడినది. ఈ ధ్యానం విశ్వశక్తిని పొందడానికి ఉపయోగపడుతుంది. ఈ ధ్యానంలో ముఖ్యాంశం మీ శరీరం కదిలేటప్పుడు కూడా మీ ఏకాగ్రతని విశుద్ధి చక్రం మీద నిలపటం.
మీరు నిలబడి విశుద్ధి చక్రం మీద ఏకాగ్రతని నిలపండి. మీరు నిలబడ్డ దగ్గరే నడవటం మొదలుపెట్టండి. క్రమంగా వేగం పెంచండి. మీకు అసౌకర్యంలేనంత వరకూ నడవండి. నిరంతరం మీ ఏకాగ్రత విశుద్ధి మీద ఉండాలి. అలా 20 నిముషాల చేశాక ఆపండి. ఆ తరువాత పదినిముషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. విశుద్ధి చక్రం మీద ఏకాగ్రతని నిలపండి. మీరు నడచేటప్పుడు వచ్చిన శక్తిని ఇప్పుడు మీ శరీరం గ్రహించుతుంది.
హెచ్చరిక : మొదటిసారి ఈ ధ్యాన పద్ధతి చదివినవారు దీనిని ప్రయత్నించవద్దు. నిత్యానంద ధ్యానపీఠం వారి ఆచార్యుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మీకు గుండె సంబంధమైన, మరే విధమైన సమస్యలు ఉన్నా మీరు ఈ ధ్యానం చేసే ముందు డాక్టర్ని సంప్రదించాలి.
ఈ ధ్యానం ఖాళీకడుపుతో ఉదయాన్నే చేస్తే మంచిది. భోజనం చేశాక రెండు గంటల తరువాత మాత్రమే చేయాలి.
అహంకారాన్ని వదిలివేయటం :
మనం పరమానంద స్థితిని తెలుసుకునే మార్గంలో ఉండే అతి పెద్ద అడ్డంకు, అతి పటిష్టమైన గోడ అహంకారం, గంభీరత లేదా సీరియస్‌నెస్. ఇలాంటి వాళ్ళు జీవితాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఏదైనా ఒక విషయానికి అత్యధికమైన ప్రాధాన్యతని ఇస్తారు. ఇటువంటివారు జీవితం నుంచి ఏదో ఒకదానిని అధికంగా ఆశించే తత్త్వం కలిగివుంటారు.
ఈ విషయాన్ని వివరించుతూ పరమహంస నిత్యానంద గంభీరంగా ఉండటం అనేది అనారోగ్య చిహ్నం అంటారు. అంతేకాకుండా మనకి వచ్చే చాలా రకాల అనారోగ్యాలకి కారణం కూడా ఈ సీరియస్‌నెస్ అని స్వామీజీ చెబుతారు. స్వామీజీ మరొక ముఖ్యమైన విషయం కూడా చెబుతారు. ఏదయినా ఒక పనిని మనస్పూర్తిగా, నిమగ్నమయి చేయటం అంటే సీరియస్‌నెస్ కాదు. మీరు మీ శక్తికొద్దీ పని చేయాలి కాని ఫలితాల గురించి సీరియస్‌గా పట్టించుకోకూడదు. ఏ పని అయినా సీరియస్‌గా చేస్తే ఆ పనిలో ఆనందాన్ని పొందలేరు. అలాంటి వాళ్ళు నవ్వలేరు. ఎందుకంటే గంభీరంగా ఉన్నవాళ్ళు నవ్వలేరు. మీరు మనస్పూర్తిగా, కుతూహలంతో ఆనందంగా పనిచేయగలిగితే, ఆడుతూపాడుతూ పనిచేస్తారు. అప్పుడు మీకు సమస్యలు ఉండవు.
సామాన్యంగా సీరియస్‌గా ఉండే వారిలో అహంకారం ఉంటుంది. వారికి వారిపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. అలాంటివారు నిరంతరం సీరియస్‌గా ఉండి ఆ తరువాత సంతోషపడవచ్చులే అనుకుంటారు. వాళ్ళు ఆ తరువాత కూడా సంతోషంగా ఉండలేరు.
అదే విధంగా పనులు ఖచ్చితంగా చేయాలి అని హడావుడి పడకూడదు. కచ్చితంగా (ఫర్ఫెక్ట్గా) అనే విషయం మిమ్మలని మానసికంగా కుంగదీస్తుంది. మీరు కచ్చితంగా చేయాలి అని చూడవద్దు. సంపూర్ణంగా చేయటానికి ప్రయత్నించండి. కచ్చితం, సామర్థ్యం అనే మాటలని పట్టించుకోవద్దు. ఇవన్నీ మైండ్ ఆడే ఆట.
అందుకే కచ్చితము అనేది మీకు ఆనందాన్ని ఇవ్వదు కాని మీ అహంకారానికి తృప్తిని ఇస్తుంది. కాని ఇది ఆత్మ తృప్తి కాదు. అందుకే కచ్చితమయిన వాళ్ళు అహంకారులు. వీళ్ళు తప్పు చేస్తామేమో అని భయపడుతుంటారు. వారి శ్రద్ధ అంతా తప్పు మీద మాత్రమే ఉంటుంది. అంటే ఫలితం మీద మాత్రమే ఉంటుంది కానీ చేసే పని మీద ఉండదు.
ఇటువంటి అహంకారం ఉన్నవాళ్ళు నిరంతరం తప్పు చేస్తామేమో అనే భయంలో ఉంటారు. అలా ఎవరయినా వారి తప్పుని ఎత్తి చూపించిస్తే వాళ్ళు అహంకారం దెబ్బతింటుంది. అది వాళ్ళు భరించలేరు. వాళ్ళు నిరంతరం అహంకారానికి ఎటువంటి దెబ్బ తగలకుండా కాపాడుకోవటానికి వాళ్ళు శక్తిని మొత్తం ఉపయోగించుతారు.
తప్పు చేస్తామేమో అని భయపడే వారికి పరమహంస నిత్యానంద ఈ విధంగా చెబుతారు. తప్పు చేయటం తప్పు కాదు. అలా తప్పు చేసినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. తప్పులు చేయకూడదని అతి జాగ్రత్తగా ఉన్నవాళ్ళు అసలు తప్పు చేయకూడని స్థితిలో తప్పు చేస్తారు. అది సరిదిద్దుకోలేనిది అవుతుంది.
కాని ఒక ముఖ్యవిషయం. కావాలని తప్పు చేయవద్దు అలాగే చేసిన తప్పు మళ్ళీ చేయవద్దు. ఈ విషయం బాగా అర్థం చేసుకొని ముందుకి సాగండి చేసిన తప్పు చేయటం, కావాలని తప్పు చేయటం పూర్తిగా తెలివి తక్కువతనమే.
జీవితాన్ని బరువుగా సీరియస్‌గా గడపవద్దు. తేలికగా హాయిగా సంతోషంగా, ఉత్సాహంగా, కుతూహలంతో గడపండి. మీరు గడచిపోయిన కాలం యొక్క అపరాధభావాలతో, భవిష్యత్ కాలపు అత్యతలు వీటినన్నింటినీ మీ మైండ్‌లో మోస్తూ బరువుగా, గంభీరంగా ఉంటారు. మీరు భూత భవిష్యత్లని మోయనవసరం లేదు. మీరు వర్తమానంలో ఉండండి అది చాలు హాయిగా తేలికగా ఉండగలరు.
హాయిగా నవ్వండి. అహంకారులు మనస్పూర్తిగా, హాయిగా నవ్వలేరు. ఎవరూ ఏదీ మాన్పలేనంతగా మనలోని బాధలని నవ్వు మాన్పగలుగుతుంది. నవ్వు ఒక శక్తివంతమైన ధ్యానం. నిష్కపటం, నవ్వు కలసి ఉంటాయి. కానీ గంభీరత (అహంకారం) నవ్వు కలసి ఉండవు.
నవ్వు పరిపూర్ణమైనది. నవ్వినప్పుడు ఆ శక్తి అన్ని వైపులా వ్యాపించుతుంది. అది అందరికీ అంటుకునే లక్షణం కలిగి ఉంటుంది. నవ్వుతూ ఎవరయినా ఒక సమూహంలోనికి వస్తే అందరూ ఆహ్లాదంగా అయిపోతారు.
స్వామీజీ ఒక విషయం గట్టిగా చెబుతారు. మీరు అహంకారంతో నిండిపోయినప్పుడు మీరు అంతరాత్మకి చాలా దూరం అయిపోతారు. ఎప్పుడయితే మీలోని అహంకారం కరిగిపోతుందో అప్పుడు మీరు సర్వ చైతన్యంలో సర్వాంతర్యామిలో ఒకటిగా అయిపోగలుగుతారు. మీరు ఈ అనంత చైతన్య సృష్టితో పాటు సాగిపోతే,మీ జీవితంలో ప్రతిక్షణం ఆనందంగా గడపగలుగుతారు. మీరు సున్నితంగా సహజంగా జీవించగలుగుతారు. మీరు అహంకారంతో ఉంటే సహజంగా, సున్నితంగా, సృజనాత్మకంగా ఉండలేరు.
అహంకారం చాలా రకాలుగా ఉంటుంది. అది నెమ్మదిగా తెలుసుకోలేని విధంగా ఉండవచ్చు. ఉదాహరణకి వినయంగా ఉంటూ నిరంతరం అహంకారాన్ని కాపాడుకుంటారు. అది చాలా ప్రమాదకరమయినది. దానిని త్వరగా గుర్తించలేము. దానిని తొలగించటం కూడా చాలా కష్టం. ఇంకొకరకమయిన అహంకారం చురుకుగా ఉంటుంది. దానిని గుర్తించటం తేలిక, అదే విధంగా సమాజ పరమయిన అహంకారం విజ్ఞానంతో వచ్చేది. మీరు పెద్ద అయ్యేకొద్దీ పుస్తకాల ద్వార, మరొక విధంగా పోగుచేసుకున్న జ్ఞానం మీలోపల ఒక మానసిక రూపంలా అవుతుంది. అప్పుడు మీరు దేనిని చూసిన ఆ మానసిక రూపం ద్వారానే చూస్తారు. దాంతో ఈసృష్టిలోని అద్భుతాలని చూడలేరు. క్రమంగా ఈ జ్ఞానంలో స్థిరపడిపోతారు. అది మరీ ప్రమాదకరం.
స్వామీజీ ఈ విధంగా కూడా చెబుతారు. మీరు మీలోని అబద్ధపు గుర్తింపులు, సమాజం అంటించిన ముద్రలు తొలగించండి. మీ అహంకారం ఆడే ఆటలు గుర్తించండి. అహంకారాన్ని, ఆ గుర్తింపులను వదిలివేయటమే అధ్యాత్మికత. మిమ్ములను భగవంతుడి నుంచి వేరు చేసేది అహంకారం మాత్రమే. అహంకారం ఉన్నప్పుడు మీరు స్థిరంగా ప్రేమించలేరు.
స్వామీజీ ఎప్పుడు ఒక విషయం స్పష్టంగా చెబుతుంటారు, మీరు సృష్టిని జయించలేరు. సృష్టి మిమ్మలని జయించుతుంది. మీరు అహంకారాన్ని వదిలివేస్తే మిమ్మలని మీరు జయించుకుంటారు. మీరు ఈ అనంత సృష్టితో, భగవంతునితో కలిసిపోయి జీవితాన్ని ఒక శాశ్వత ఉత్సవంలా జరుపుకుంటారు.
ఆజ్ఞాచక్రం:
ఆజ్ఞ చక్రం రెండు కనుబొమ్మలు ముక్కు కలిసే ప్రదేశంలో ఉంటుంది.సంస్కృతంలో ఆజ్ఞ అంటే ఆజ్ఞాపించటం లేదా శాసించటం అని అర్థం.ఆజ్ఞ చక్రాన్ని చక్రాలన్నింటిలోనూ ప్రధాన చక్రంగా వర్ణించవచ్చు.
సీరియస్ గా ఉన్నప్పుడు,అహంకారంతో ఉన్నప్పుడు ఈచక్రం బంధింపబడుతుంది.అమాయకత్వంతో సామాన్యంగా ఉండటం,అహంకారాన్ని వదిలివేయటం వలన ఈచక్రం వికసించుతుంది.
ఆజ్ఞచక్రాన్ని చక్రాలలో రాజా చక్రంగా వర్ణించుతారు.అన్ని మతాలలోనూ ఈచక్రం గురించి కొంత సమాచారం ఉంటుంది.ఆజ్ఞచక్రం వికసించితే మనం ఒక కొత్త పరిధిలో ప్రవేశించుతాము. అప్పుడు మనలోని మనఃశక్తి,బుద్ధి పూర్తిగా వికసించుతాయి.చాలా దేవుడి చిత్రాలలో మూడవకన్ను చూపించుతారు.మూడవ కన్ను అంటే పూర్తిగా వికసించిన ఆజ్ఞ చక్రం మనలోని అహంకారానికి, తీవ్రతకి, గంభీరతకి, మనగురించి మనం అతిగా ఆలోచించుకునే తత్వానికి సంబంధించిన చక్రం.
దివ్యనేత్ర ధ్యానం :
దివ్యనేత్ర ధ్యానం ఆజ్ఞ చక్రాన్ని వికసింపచేస్తుంది. ఆజ్ఞ చక్రాన్ని వికసింపచేస్తే అది మీకు విశ్వ వివేకానికి సంబంధాన్ని నెలకొల్పుతుంది.
దివ్యనేత్ర ధ్యానం జొరాష్ట్రియన్ నుంచి తీసుకొనబడినది. దీనిలో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఆజ్ఞ చక్రాన్ని శుభ్రం చేస్తుంది. రెండవ భాగం దానిని శక్తివంతం చేస్తుంది.
మీరు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి దాని ఎదురుగా కూర్చోండి. కళ్ళు మూసుకొని ఐదు నిముషాలు ఆజ్ఞ చక్రం మీద ఏకాగ్రతని నిలపండి. మీరు మీ మూడవ కన్ను లోపల నుంచి బయటికి చొచ్చుకు వచ్చినట్టుగా చూడాలి. అది మీ ఆజ్ఞ చక్రం నుంచి బయటకు డ్రిల్లింగ్ చేస్తూ చొచ్చుకు వచ్చినట్టుగా చూడాలి. ఆ తరువాత కళ్ళు తెరచి దీపం వైపు చూడండి. దీపాన్ని మీ మూడవ కంటితో చూస్తున్నట్టు చూడాలి. కళ్ళు కొంచం మూసినట్టు అవుతుంది. కళ్ళలో నీరు కారవచ్చు. అలా జరగనీయండి. అలా ఐదు నిముషాలు చూడండి.
కళ్ళు మూసుకొని ఆజ్ఞా చక్రం మీద ఏకాగ్రతని నిలపండి. మళ్ళీ మీ మూడవ కన్ను ద్వారా దీపాన్ని చూడండి. 5 నిమిషాల తరువాత కళ్ళు మూసుకోండి. ఆజ్ఞా చక్రం మీద ఏకాగ్రత నిలపవద్దు. రిలాక్స్ అయినట్టు కూర్చోండి. ఆ తరువాత మెల్లగా కళ్ళు తెరవండి.
మొదటిసారి ఈ ధ్యానం చేసేవారు ధ్యానపీఠం ఆచార్యుల పర్యవేక్షణలో చేయాలి. మీ అంతట మీరు మొదటిసారి ప్రయత్నించవద్దు.
అసంతృప్తి నుంచి కృతజ్ఞతకి :
సంతృప్తి, కృతజ్ఞత అనేవి ఆనందమయిన జీవితానికి అద్భుతమయిన మార్గాలు. మనలో నిక్షిప్తమయిన పరమానంద స్థితిని చేరే దారిలో ఉండే మరొక అడ్డంకు అసంతృప్తి, కృతజ్ఞతా భావం లేకపోవటం.
కానీ మనం మన జీవితంలో ఈ రెంటింటినీ వదిలేసాము. ఎన్ని కోరికలు తీరినా అసంతృప్తి అలాగే ఉంటుంది. భగవంతుడు మనకు ఎన్నో అద్భుతమయిన వరాలు ఇచ్చాడు. అందమయిన జీవితం, మనని ఆనందపరచే ప్రకృతి ఇలా ఎన్నో వరాలు కానీ మనం ఏమి చేస్తాం. పొందిన అద్భుత వరాలను మర్చిపోతున్నాము. తీరిన కోరికలకి అసలు ఆనందపడము. ఒక వరం లభించగానే, ఒక కోరిక తీరగానే, ఆ తరువాత ఏమిటి : తరువాత.... తరువాత.... మనం ఈ విధంగా ఆ తరువాత కోరికల కోసం ప్రార్థించుతాము. అంత అద్భుత వరాలు పొందినందుకు కనీసం ఒక్కసారి కూడా భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేయము. అసలు అప్పుడు భగవంతుడు గుర్తురాడు.మనకు భగవంతుడు ఎప్పుడు గుర్తుకు వస్తాడు. మనకి ఏదయినా అవసరమైనప్పుడో, ఏదయినా కష్టం కలిగినప్పుడో అప్పుడు మాత్రమే భగవంతుడిని గుర్తు చేసుకుంటాము.
మనం చేసే పూజగాని ప్రార్ధన కాని భగవంతుణ్ణి ఇది కావాలి అది కావాలి అని అడగటమే. స్వామీజీ ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెబుతారు. మనం భగవంతుణ్ణి ఇది కావాలి అని అడగటమే కాదు బేరాలాడుతాము కూడా. నీవు నాకు ఇది చేస్తే నీకు ఇంత ఇస్తాను లేదా నీకు అది చేస్తాను అంటాము. భగవంతుణ్ణి తిన్నగా మన వ్యాపారాలలోకి దింపేస్తాము.
ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి అని పరమహంస నిత్యానంద చెపుతున్నారు. భగవంతుడు మనం కోరిన కోరికలన్ని తీర్చటం మనకు మంచిది కాదు. భగవంతుడికి అద్భుత శక్తులే కాదు, అద్భుతమైన బుద్ధి కూడా ఉంటుంది. మనకు నిజంగా ఏమికావాలో, ఏది అవసరం లేదో, భగవంతుడికి చాలా బాగా తెలుసు. ఏ కోరిక తీర్చితే మనం అభివృద్ధి పొందగలమో, ఆనందంగా ఉండగలమో, ఆ కోరికలు మాత్రమే తీర్చుతాడు. దీని కోసం మనం ప్రత్యేకంగా భగవంతుని కోరనవసరం లేదు. ఆయన మన తల్లి తండ్రి. ఆయన కంటే మన మంచి చెడు ఆలోచించగల శక్తి ఎవరికి ఉన్నది. ఈ విషయం అర్ధం చేసుకొని నిరంతరం భగవంతుని పట్ల కృతజ్ఞతతో ఉండాలి.
ప్రపంచంలో రెండురకాల మతాలు ఉన్నాయి. కృతజ్ఞత ఆధారంగా ఉండే మతాలు అలాగే ప్రార్ధన ఆధారంగా ఉండే మతాలు. ప్రార్ధనల మతాలు కేవలం ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటుంది. మనకి చిన్నతనం నుంచి ప్రార్ధన లేదా పూజ అంటే అడగటమనే నేర్పించుతారు. ప్రార్ధన చేయటం తప్పుకాదు. కానీ అసలు సమస్య ప్రార్ధన రూపంలో ఇది కావాలి, ఆ తరువాత.... ఆ తరువాత ఇలాగే సాగిపోతుంది. ప్రార్ధన మనని ధ్యానంలోనికి తీసుకెళ్ళగలగాలి. ధ్యానం అంటే కృతజ్ఞత చూపించటం. ధ్యానంలో కృతజ్ఞత ప్రార్ధన అవుతుంది. అప్పుడు మీ అంతరాత్మ పరమానందాన్ని పొందుతుంది.
మనం నిరంతరం ఈ సర్వాంతర్యామికి కృతజ్ఞులమై ఉండాలి. సదా మనలని రక్షిస్తూ, మనకి సమస్తం సమకూర్చుతున్న ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలపాలి. మీరు తనకి కావాలి అనే ఆ సర్వాంతర్యామి మిమ్మలని కాపాడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకొని కృతజ్ఞత చూపించాలి. మీరు ఆ విషయం తెలుసుకోలేకపోతే మీరు నిరుత్సాహంగా, కుంగుబాటు తనంతో ఉంటారు. మీరు ఈ ప్రపంచంలో సర్వం పోగొట్టుకున్న వ్యక్తిలా అయిపోతారు. మీరు సర్వాంతర్యామి పట్ల కృతజ్ఞతతో ఉండగలిగితే మీరు మీ చుట్టూ అద్భుతాలు చూడగలుగుతారు.
కొందరు భగవంతుణ్ణి భయంతో ప్రార్ధించుతారు. అలా చేయటం ద్వారా చిన్నతనం నుంచి భగవంతుడు అంటేనే తప్పు అర్ధాన్ని వారి మనసులో పెంచుతున్నారు. స్వామీజీ ఎంతో అందంగా ఇలా చెబుతారు : పిల్లలకి భగవంతుడు అనే ఈ అనంత చైతన్య సృష్టిని ప్రేమించమని చెప్పండి. భగవంతుణ్ణి ఆనందంతో ప్రేమతో కౌగలించుకోమని చెప్పండి. వారిని భయం పేరుతో గౌరవం పేరుతో భగవంతుడికి దూరం చేయకండి.
మతాన్ని భయంతో అనుసరించితే అది మిమ్మలని ఎక్కడికీ తీసుకెళ్ళదు. అది మీలో ఎటువంటి వృద్ధికి సహాయం చేయదు. భగవంతునికి లోతైన ప్రేమ కృతజ్ఞతాభావాలు చూపుతూ మతాన్ని అనుసరించాలి. భగవంతుణ్ణి నిరంతరం ప్రేమతో కృతజ్ఞతతో పూజించండి.
మీ మైండ్ మీకు భగవంతునికి మధ్య ఉండి భగవంతునితో మాట్లాడనీయదు. మీరు మీ మైండ్‌కి అతీతంగా వెళ్ళగలిగితే ఈ అనంత చైతన్యంలోని అందాలని చూడగలుగుతారు. మీ అంతరాత్మ నిత్యానందంతో నిండిపోతుంది. అప్పుడు మీరు స్వేచ్ఛని, పరమానందాన్ని అనుభవించగలరు.
భగవంతుడు మనం అడగకుండా మనకి ఎన్నో వరాలు కురిపించాడు. కాని మనం, మనం పొందిన వరాల గురించి మర్చిపోయి ఇంకా ఇది కావాలి అది కావాలి అని అంటుంటాము. ఒక్కసారి ఆలోచించండి మనకి చక్కని శరీరం, ప్రపంచాన్ని చూడగలిగే కళ్ళు, ఎక్కడికైనా తీసుకెళ్ళగల కాళ్ళు, ఏపని అయినా చేయగల చేతులు, గొప్ప సూపర్ కంప్యూటర్ కంటే వందరెట్లు శక్తివంతమయిన మెదడు, ఇన్ని వరాలని ఆ దేవుడు మనకి ఇచ్చాడు కదా. వేలుకి డైమండ్ ఉంగరం లేదు అని బాధపడతాం కాని ఆ రింగ్ పెట్టుకునే అద్భుతమయిన వేలు ఇచ్చినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పం.
కేవలం కోరికలతో నిండిపోయిన వ్యక్తికి ఎన్ని కోరికలు తీరినా తృప్తి ఉండదు. కృతజ్ఞతా భావం ఉండదు. ఒక కోరిక తీరగానే, 'ఆ తరువాత' 'ఆ తరువాత' అనటమే సరిపోతుంది. మనకు తీరిన కోరికలతో ఆనందాన్ని పొందలేడు. కోరిక, కృతజ్ఞత కలసి ఉండవు. మీరు కోరికలతో జీవిస్తుంటే కృతజ్ఞతతో జీవించలేరు. మీరు ఎప్పుడయితే కృతజ్ఞతతో జీవిస్తారో అప్పుడు మీకు కోరికలు ఉండవు. మీకు ఏదయితే లభిస్తుందో అది ఆ సమయానికి మీకు ఉండే అవసరాలని తీరుస్తుంది. మీరు అడిగే లోపలే మీకు అన్ని దొరుకుతాయి. అప్పుడు అడగవలసిన అవసరం ఉండదు.
మనం ఏ పనినైనా ప్రేమతో కృతజ్ఞతతో చేస్తే, అందులో పరిపూర్ణత ఉంటుంది. మీరు భగవంతుడిని నమ్మి, ఆ విశ్వశక్తి మీద నమ్మకం ఉంచగలిగితే ఆ సర్వాంతర్యామి మిమ్మలని ఈ భూమి మీద దేవుడిగా చేస్తాడు. మరొక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడూ ఇలా అనుకుంటారు. నేను సంతోషంగా ఉండాలి అంటే కష్టపడాలి. కష్టపడడటం మంచిదే కాని కష్టపడటానికి సంతోషానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ విశ్వశక్తి మీకు నిరంతరం ఇస్తూ ఉంటుంది. మీరు ఆనందంగా ఉండాలా వద్దా అనేది మీ నిర్ణయం.
మీరు మరొక విషయం అర్ధం చేసుకోవాలి. మీకు జరిగే ఏ విషయానికైనా, ఎవరూ బాధ్యులు కారు. అంతాకూడా మీరు చేసుకున్న నిర్ణయాలే. అయితే ఆ విషయం మీకు తెలియదు. అందుకే బయటవారిని నిందిస్తారు. చివరికి జీవితాన్ని నిందిస్తారు.
మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ జీవితంలో ఇంతవరకూ పొందినవన్నీ ఒక లిస్టు, మీరు ఇంకా కావాలి అని అనుకున్నవి మరొక లిస్టు తయారు చేయండి. వీటిలో ఏ లిస్టు చూడాలి అన్నది మీ నిర్ణయం. మనం పొందిన లిస్టు మాత్రమే చూస్తే జీవితం సంతోషంగా ఉత్సాహంగా ఉంటుంది. పొందాలి అని అనుకున్న లిస్టు చూస్తే నిరాశగా అసంతృప్తిగా ఉంటుంది.
నిజమైన కృతజ్ఞత అన్నది మీ అంతరంగం లోతుల నుంచి పొంగి ప్రవహించే ఒక భావన. ఈ కృతజ్ఞతకి దేనితో సంబంధం ఉండదు. అత్యాశ ప్రేమ ద్వేషం ఏవీ ఈ కృతజ్ఞతా భావాన్ని కదిలించలేవు. మీరు ఎప్పుడైతే సర్వాంతర్యామితో సంబంధాన్ని నెలకొల్పగలుగుతారో అప్పుడు నిజమైన కృతజ్ఞత అన్నది మీ లోపల ఉదయిస్తుంది. అప్పుడు అప్రయత్నంగానే కృతజ్ఞత అంటే ప్రార్థన అని తెలుస్తుంది.
ధ్యానం మీలో కృతజ్ఞతా భావాన్ని, తృప్తిని కలిగిస్తుంది. మీరు నిరంతరం ధ్యానం చేస్తుంటే మీ చేతన స్థితి విశాలమవటం తెలుసుకుంటారు. మీరు సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటే మీలో పొంగిపొరలే శక్తిని మాటలలో వర్ణించలేము. అదే కృతజ్ఞతాభావంలో ఉండే గొప్పదనం, అందం. సహస్రార చక్రం :
సహస్రార చక్రం తల పై భాగంలో ఉంటుంది. సంస్కృతంలో సహస్రార అంటే వేయిరేకులు అని అర్ధం. ఈ చక్రం వికసించినప్పుడు వేయిరేకుల పద్మంలా ఉంటుంది. యోగులకు, గురువులకు ఈ చక్రం వికసించినప్పుడు వాళ్ళ తల మీద వేయి రేకుల పద్మం వికసించినట్లుగా ఉంటుంది అని అంటారు. అందుకే ఈ చక్రానికి ఆ పేరు వచ్చింది.
అసంతృప్తి, జీవితాన్ని తేలికగా యధాలాపంగా తీసుకునే తత్వం ఈ చక్రాన్ని బంధించుతుంది. కృతజ్ఞతాభావం, ఆత్మతృప్తి ఉన్నప్పుడు ఈ చక్రం వికసించుతుంది. సహస్రార ధ్యానం :
దీనిని సుఫీలు ధ్యానపద్ధతి నుంచి తీసుకున్నారు. చేతితో పూలు పట్టుకొని సహస్రార చక్రం మీద ఏకాగ్రతని నిలిపి చేసే ధ్యానం. మీ శరీరంలో మిగతా భాగాలని మర్చిపోవాలి. తలమీద ఏకాగ్రత నిలిపి విరామంగా చిరునవ్వుతో ఉండండి.
మీ అంతరంగం నుంచి అందరికీ కృతజ్ఞతలు తెలియచేయండి. మీ తల్లిదండ్రులకి గురువులకి అన్నతమ్ములకి, బంధువులకి భార్యా, భర్తకి పిల్లలకి మీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి, స్నేహితులకి అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేయండి. మీ శరీరానికి అందులో ప్రతి భాగానికి కృతజ్ఞతలు తెలపండి. మిమ్మలని పటిష్టంగా చేసిన మీ శత్రువులకి కృతజ్ఞత చెప్పండి. గురుదేవులకి, సర్వాంతర్యామి అయిన భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేయండి.
మీరు సరిపడా సమయం తీసుకొని అందరికీ పేరుపేరున కృతజ్ఞత తెలియజేయండి. మీ లోపలి నుంచి, లోతయిన అనుభూతి నుంచి కృతజ్ఞతలు తెలపండి. మీరు కృతజ్ఞతగా మారండి.
మెల్లగా కళ్ళు తెరచి ఆ పూలని భగవంతుని పాదాల దగ్గర ఉంచండి.