KAILASA Library/పూలమామయ్యసీ శ్రీనిత్యానంద చెప్పిన చిన్న కథలో పెద్ద సత్యము/Sign in
పూలమామయ్యసీ శ్రీనిత్యానంద చెప్పిన చిన్న కథలో పెద్ద సత్యము

పూలమామయ్యసీ శ్రీనిత్యానంద చెప్పిన చిన్న కథలో పెద్ద సత్యము

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

Paramahamsa Nithyananda

పరమహంస శ్రీ నిత్యానంద

చెప్పిన చిన్న కథలలో పెద్ద సత్యాలు

Portrait

ఇంటర్నేషనల్ వేదిక్ హిందూయూనివర్సిటీ ట్రస్ట్
(ఏ డివిజన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వేదిక్ యూనివర్సిటీ)
ఇండియా ప్రచురణ
కాపీరైట్ 2007
మొదట ప్రచురణ డిసెంబరు 2007

Ebook ISBN : 979-8-88572-942-0

ఈ పుస్తకానికి సంబంధించిన అన్ని హక్కులు నిత్యానంద ధ్యానపీఠం యొక్క సొంతం.
నిత్యానంద ధ్యానపీఠం నుంచి వ్రాతపూర్వకంగా అనుమతి తీసుకోకుండా బహిరంగంగా లేదా
వ్యక్తిగత వినియోగం కోసం ఇందులోని ఏ భాగాన్ని యాంత్రికంగా, ఫోటోగ్రాఫిక్ లేదా ఫోనోగ్రాఫిక్
ప్రక్రియ లేదా ఏ ఇతర ప్రక్రియ ద్వారా పునర్ముద్రించటం నిషిద్ధం.

ఈ పుస్తకం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నిత్యానందా ధ్యానపీఠం వారు చేపట్టే
ధర్మకర్తృత్వ కార్యక్రమాల కోసం వినియోగించటం జరుగుతుంది.

నిత్యానంద ధ్యానపీఠం శ్రీఆనందేశ్వరి దేవాలయం

నిత్యానందగిరి, పాశంబండ, సాతంరాయ్ విలేజ్,
షంషాబాద్, రంగారెడ్డి జిల్లా. ఫోన్ : 9347065288, 9866500350
www.nithyananda.org

Photograph of a person dressed in traditional attire standing near a stone structure

కథలు మానవ సంస్కృతిలో ఒక ముఖ్య భాగము. మనిషి మాటలు నేర్చి, కల్పనలు అల్లటం నేర్చుకున్న నాడే కథలకి అంకురార్పణ జరిగింది. కథలు లేని సాహిత్యం బహుశః ప్రపంచంలో ఎక్కడా లేదేమో. కథలు చెప్పటం ప్రాచీనమైన ఒక కళ. కథలలో పురాణ కథలు, జానపద కథలు, సమకాలీన జీవిత కథలు ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. కథలు చిన్నవైతే కథానికలు అంటాము. మరీ పెద్ద కథలయితే నవలలు అంటాము.

భారతీయ సాహిత్యం, సంస్కృతిలో పెనవేసుకుపోయిన అంశం కథ. ప్రపంచదేశాలతో పోల్చిచూస్తే భారతీయ కథలు బహుప్రాచీనమయినవి. అవి నేటికి సజీవంగా అలరారుతున్నాయి. బహుశః ప్రపంచంలో వినే కళలో భారతీయులు వేల సంవత్సరాలుగా నిష్ణాతులు అయినందుకు కథలు అంత ప్రాచర్యాన్ని పొందాయేమో. వారి శ్రవణ శక్తి అమోఘం .అందుకు ఉదాహరణ, కొన్ని వేల సంవత్సరాలుగా మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వినటం ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి జాగ్రత్తగా బదిలీ అయ్యాయి. వాటిని ఈ మధ్య కాలంలోనే బహుశః మూడు నుంచి నాలుగువేల సంవత్సరాల క్రితం మాత్రమే అక్షర రూపంలో తాళ పత్రాల మీద రచించారు. ఈ శ్రవణ శక్తి వలన కూడా నేటికీ కథలు అజరామంగా ఈ భూమి మీద ఉన్నాయి. కథలు లేని పురాణాలు, కథలు లేని ఏ కార్యక్రమాలు మనకి ఉండవు.

కథ అంటే మనలోని భావాలకి ఊహలని కల్పనలని మేళవించి, వినటానికి ఇంపుగా, చదవటానికి చక్కగా తయారు చేసి చెప్పటమే. కథని సృష్టించటం, దానిని అందంగా మలచటం, ఇంకాస్త అద్భుతంగా చెప్పటం అనేది గొప్ప కళ. కథలు సృజనాత్మకతకి, మేధస్సుకి, అసంతృప్తితంగా స్పందించ గల నేర్పుకి చక్కని ఉదాహరణ.

కథలని సృష్టించే సృజనాత్మకత గురించి పరమహంస శ్రీ నిత్యానంద ఒక చక్కని మాట చెబుతారు. 'ఎప్పుడైతే మేధస్సుతో పాటు హృదయం కూడా కలుస్తుందో అక్కడ సృజనాత్మకత ఉంటుంది. అందులోంచి కళ ఉద్భవిస్తుంది'. కథలు సృజనాత్మకతకి ఉదాహరణలు. మనలోని భావాలని స్పష్టంగా చిన్న చిన్న మాటలలో ఎదుటివారికి సూటిగా అర్ధమయ్యే రీతిలో చెప్పగల నేర్పుని కథలు అంటాము. చెబుతున్న సందర్భాన్ని మనకి స్పష్టం చేయటానికి కథలని ఉపయోగిస్తాము. మనం సూటిగా చెప్పలేని విషయాలని కథల రూపంలో అద్భుతంగా చెప్పవచ్చు. అందుకే కథలు సృష్టించే కళాకారునికి దొరికే తృప్తి అనంతమయినది. ఈ సందర్భంగా పరమహంస శ్రీ నిత్యానంద ఈ విధంగా చెబుతారు. 'ఒక పద్యాన్ని వ్రాసిన (కథని వ్రాసిన) కవి, ఒక బిడ్డకి జన్మనిచ్చిన తల్లి కంటే ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే బిడ్డకి జన్మనిచ్చే తల్లి గర్భం కడుపులో ఉంటుంది. అదే కవికి హృదయంలో ఉంటుంది. అదే ఫలసిద్ధి పొందిన ఆనందం. పరమహంస శ్రీ నిత్యానంద మరొక అందమయిన విషయాన్ని కూడా తన ప్రవచనాలలో చెబుతుంటారు.

సృజనాత్మకత భగవంతునికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే సృజనాత్మకత హృదయానికి సంబంధించినది. హృదయం ఎప్పుడూ భగవంతునికి చేరువాకాలాని ఆతృత పడుతుంది. కాని మేధస్సు లౌకిక ప్రపంచానికి దగ్గరవడానికి ఆతృత పడుతుంది. అందుకే కళాకారులు సర్వాంతర్యామికి దగ్గరగా ఉంటారు.

బహుశః ఈ కారణం వలననేమో ఎక్కడ ఆధ్యాత్మికత ఉంటుందో అక్కడ కథలు, పాటలు, పద్యాలు, నాట్యాలు, భజనలు, కీర్తనలు, సంగీతం ఉంటాయి. కానీ అక్కడ గణిత శాస్త్ర సూత్రాలు, లేదా మరొక శాస్త్ర థియరీలు, గణాంకాలు, లెక్కలు ఇలాంటివి ఉండవు. అసలు మేధస్సుకి సంబంధించిన ఏ విషయం అక్కడ కనిపించదు.

అక్కడ మీకు కేవలం హృదయం మాత్రమే కనిపిస్తుంది. అదే ఆధ్యాత్మికత. అదే భగవంతుని సమక్షం. అక్కడ కూడా లెక్కలు కడుతున్నాము అంటే అది ఆధ్యాత్మికత కాదు అది కేవలం వ్యాపారం.

కథ అనే మాట చాలా చిన్నది. అలాగే కథలు కూడా చిన్నవే. అలా అని వాటిని మనం చిన్న చూపు చూడకూడదు. ఈ సందర్భంలో శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు (1891) కథల గురించి వాటి గొప్పదనం గురించి చాలా చక్కగా చెబుతారు. ఆయన ఈ విధంగా అంటారు " కథలు కల్పించటానికి గొప్ప ప్రతిభ ఉండాలి. అవి చెప్పటానికి నేర్పు ఉండాలి. అవి అర్థం చేసుకోవటానికి బుద్ధి సూక్ష్మత ఉండాలి” అని. కథల ద్వారా చెప్పే విషయం సూటిగా, సున్నితంగా హృదయాలని తాకుతుంది. అందుకే ఆ విషయం మనకి ఎంత కాలమయినా గుర్తుంటుంది. మన చిన్నప్పుడు తాతయ్య చెప్పిన అనగనగా ఒక రాజు కథ మర్చిపోయిన వారు అసలు మనకి కనిపించరు. ఆ కథ మొత్తం మనకి గుర్తుంటుంది. కాని నిన్న మొన్న నేర్చుకున్న సూత్రాలు, థియరీలు, నిర్వచనాలు, పాఠాలు అసలు గుర్తు ఉండవు. ఎందుకంటే అవి మేధస్సుకు చేరుతాయి.

కథలు స్ఫూర్తిని ఇస్తాయి. స్తబ్దతగా ఉన్న మనస్సుని ఉత్సాహపరుస్తాయి. నిరుత్సాహంగా ఉన్న వారిలో చైతన్యాన్ని నింపుతాయి. కథలు కల్పించిన కళాకారుడికి ఆ కథ ఇచ్చే తృప్తి అనంతమయినది, ఎంతో విలువయినది. అదే విధంగా ఆ కథకి శ్రోత అయిన కళాపోషకుడు పొందే ఆనందం వెలకట్టలేనిది. అందుకే కథలకి మనకి అంత చక్కని అనుబంధం ఏర్పడినది.

కథ మనిషిని మనస్విగా మార్చుతుంది, వ్యక్తిని తపస్విని చేస్తుంది. భోగిని త్యాగిగా తయారు చేయగలుగుతుంది. అదే విధంగా నిరాశావాధిని అన్వేషిగా చేయగల శక్తి కథకి ఉన్నది. రాముడి కథ ఎంతమంది సామాన్యులని రుషులుగా చేసిందో మనందరికీ తెలుసు. ఛత్రపతి శివాజీని అంత గొప్పవీరునిగా మలచటంలో అమ్మ చెప్పిన కథలు ప్రభావం ఎక్కువ అని మనం చదివాము.

ఇక్కడ కథల గురించి మంచి ప్రాచుర్యంలో ఉన్న కథ ఒకటి మన భారతీయ సాహిత్యంలో ఉన్నది. అదే పంచతంత్ర. ఒక రాజుగారు తన కుమారులని గొప్ప మేధావులుగా, మంచి పరిపాలనా దక్షులుగా చేయాలి అని నిర్ణయించి వారిని మంచి గురుకులానికి పంపిస్తారు. ఆ రాజకుమారులు చాలా దుడుకువారు. చదువు సంధ్యలు వారి దగ్గరికి వచ్చేవి కాదు. క్రమశిక్షణ లేదు, భయం భక్తి వారికి అసలు లేదు. గురువులు మహారాజుకి నమస్కరించి రాజకుమారులకి విద్యాబుద్ధులు నేర్పించటం తమ శక్తిని మించిన పని అని సెలవు తీసుకునేవారు. రాజకుమారులని చాలా గురువుల దగ్గరకి పంపించాడు, కానీ ఫలితం శూన్యం.

రాజకుమారుల విషయం రాజుగారికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఆ సమయంలో మహామంత్రి రాజుగారి కులగురువుని రాజ్యానికి ఆహ్వానించి సమస్యని వివరించి, ఈ సమస్యవలన మహారాజుగారు ఏవిధంగా మానసికంగా కుంగిపోయారో చెబుతాడు. అప్పుడు రాజగురువు రాజుని ఓదార్చి ఒక రోజు మొత్తం రాజకుమారులతో గడిపి, రాజు దగ్గరకి వస్తాడు. ఆయన రాజుతో, “మహారాజా! రాజకుమారులని నా వెంట నా ఆశ్రమానికి తీసుకువెళతాను. వీరిని విద్యావంతులని చేసి తిరిగి నీ రాజభవనానికి వస్తాను” అని వాళ్ళని వెంట పెట్టుకుని ఆశ్రమానికి వెళతాడు.

ఇంతమంది గురువులు చేయలేని పని ఈయన మాత్రం ఏం చేస్తాడులే అని అందరూ అనుకుంటారు. రాజగురువు రాజకుమారులకి చిన్న చిన్న అందమయిన కథలని చెబుతూ అన్ని శాస్త్రాలు భోదించుతాడు. వారికి యుద్ధ నైపుణ్యాలు, యుద్ధతంత్రాలు, సామాజిక జీవితంలో ఉండే విశేషాలు, మోసాలు, కుతంత్రాలు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం ఈవిధంగా రాజకుమారులకి కావలసిన శాస్త్రాలన్నీ నేర్పించుతారు. అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న కథల రూపంలోనే నేర్పిం చుతాడు. వారు శాస్త్రాలు నేర్చుకుంటున్నారు అన్న విషయం తెలియకుండా నేర్చుకుంటారు. చివరికి మహామేధావులుగా మారి రాజభవనానికి తిరిగి వస్తారు.

కాబట్టి కథలకి అంతశక్తి ఉన్నది అని భారతదేశంలో ఎప్పుడో ప్రాచీన కాలంలోనే నిరూపించబడినది.

సరే మనందరం కథలని ఎందుకు ఇష్టపడతాం? దీనికి జవాబు మరొక ప్రశ్న ఉన్నది. మనం అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసి ఎందుకు అంత ఆనందంపడతాం? ఎందుకు అంత ఇష్టపడతాం? ఇది కూడా అంతే. కథలలో ఉండే భావాలు, విషయాలు సమస్యలు, పరిష్కారాలు అన్నీ మనకి సంబంధించినవే. మన ప్రతిబింబాన్ని అందంగా చూపిస్తున్నాయి కాబట్టి మనం కథలని ఇష్టపడతాము.

పరమహంస శ్రీ నిత్యానంద స్వామి కూడా పంచతంత్రంలో గురుదేవుల మాదిరిగానే మన అందరినీ కథల ద్వారా సత్యాన్ని అర్థం చేసుకునేలా చేస్తారు. ఆయన తన ప్రతి ప్రవచనంలో ఎన్నో చిన్న చిన్న కథలు చెబుతూ తాను చెప్పదలిచిన అంశాన్ని సూటిగా మన హృదయంలోనికి పంపించుతారు.

పరమహంస శ్రీ నిత్యానంద స్వామి చెప్పే ప్రతి మాట ఒక సత్యం. అది విశ్వ జనీయత కలిగిన ఒక నిర్దిష్ట ప్రమాణం. సత్యం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. అది మనకి ఒక ఘాతంలా తగులుతుంది. అందుకే సత్యం చేదుగా ఉండి మననికి గుచ్చుకుంటుంది. ఆ పదునైన సత్యాలు అగ్నిశిఖలా దూసుకు వస్తే మనం తట్టుకోలేము, అందుకే ఆ సత్యాల నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తాము అని పరమహంసకి తెలుసు. పంచతంత్ర కథలోని రాజకుమారులూ ఆ చేదు గుళికలు రుచించక, మనం గురువుల నుంచి, సత్యాల నుంచి తప్పించుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని కూడా పరమహంసకి తెలుసు. విశ్వమేధస్సుతో నింపబడిన ఆ జ్ఞానోదయమయిన యోగీశ్వరుడు, మనని తప్పించుకోనీయరు.

స్వామి ఆ బాణాలని సుకుమార సుమాల మాలగా, అగ్ని శిఖలని చల్లని శ్రీ గంధంలా తయారు చేసి, ఆ సత్యాలని మన దగ్గరకి మృధువుగా, మధురంగా ఆహ్లాదకర రీతిలో పంపించుతారు. దానికి ఆయన వాడే అతి శక్తి వంతమయిన పద్ధతి చక్కని చిన్న కథలు. అప్పుడు ఎటువంటి బాధ, శ్రమ లేకుండా, చేదు తెలియకుండా ఆ సత్యాలు సూటిగా మన హృదయంలోనికి వెళతాయి. అవి మనని బాధించవు సరికదా ఆహ్లాదపరుస్తాయి. అదే, పరమహంస శ్రీ నిత్యానంద స్వామి యొక్క కరుణాపూరితమయిన మేధస్సు, ప్రేమ పూరితమయిన అపార ఆదరణ. ఇంత యుక్తిగా, అంత శక్తివంతమయిన విషయాలని సామాన్యులమయిన మన లోపలికి అత్యంత ఆహ్లాదకరమయిన రీతిలో పంపించ గల నేర్పు, మేధస్సు ఆ పరమహంసకి తప్ప ఎవరికి ఉంటుంది?

పరమహంస నిత్యానంద స్వామీజీ ఎవరు?

భారతదేశాన్ని వేద భూమి, దేవ భూమి అంటారు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద అవతారపురుషులు, భగవత్ స్వరూపులు అవతరించి సామాన్య మానవులని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. ఆ పరంపరలో, ఈ నాటి ఆధునిక కాలంలో పరమహంస శ్రీ నిత్యానంద స్వామి మనకోసం వచ్చిన మహాత్ముడు. ఆయన జ్ఞానోదయమయిన మన మధ్య ఉన్న యోగీశ్వరుడు.

పరమహంస నిత్యానంద 1978లో తమిళనాడులో జన్మించి, పదహారవ ఏట, హిమాలయాలకి వెళ్ళి అక్కడ కఠోర తపస్సు చేశారు. ఆయన పరివ్రాజకునిగా భారతదేశమంతా కాలినడకన తిరిగారు. ఇండియా, నేపాలులోని హిమాలయ ప్రాంతాన్నీ తిరిగారు. అక్కడ ఆయన ఎందరో ఋషులని, యోగులని కలిసి వారి దగ్గర యోగా, తంత్ర, ధ్యానం మొదలయిన ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రాలని క్షుణ్ణంగా నేర్చుకున్నారు.

స్వామీజీ హిమాలయాలలో తపస్సు చేసుకునే రోజులలో ఆయనకి మహావతార్ బాబాజీ కనపడి ఆయనని పరమహంస నిత్యానంద అని పిలిచి, దీవించి మాయం అయిపోయారు. అయితే ఆ సమయంలో ఆయనకి అది బాబాజీ తనకి ఇచ్చిన పేరు అని అర్ధం కాలేదు. కొంత కాలం గడిచాకా ఒక యోగీశ్వరుడు స్వామీజీకి సన్యాస దీక్షని ఇచ్చి ఆయనకి 'పరమహంస శ్రీ నిత్యానంద' అని పేరు పెట్టారు. అప్పుడు స్వామీజీకి మహావతార్ బాబాజీనే తనకి ఆ పేరుని ఇచ్చారు అని అర్ధమయినది.

పరమహంస శ్రీ నిత్యానంద స్వామి కఠోర తపస్సు ఫలితంగా జనవరి ఒకటి 2000 సంవత్సరంలో ఆయనకి జ్ఞానోదయమయ్యి ఆయన శాశ్వతానంద స్థితిని చేరారు.

జ్ఞానోదయం పొందిన తరువాత స్వామీజీ దక్షిణ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయన ఏకైక లక్ష్యం, తాను పొందిన ఆనందాన్ని అందరికీ పంచి పెట్టాలి. తప్పుదారిలో ఉండే ఆధ్యాత్మికతని సరియైన మార్గంలో నిలపాలి, ముఖ్యంగా భారతీయ ఆధ్యాత్మికత, యోగా, ధ్యానం పైన పాశ్చాత్యదేశాలలో చాలా తప్పు ప్రచారాలు జరుగుతున్నాయి. అది సరికాదు అని చెప్పటానికి నిత్యానందస్వామి నిర్ణయించుకున్నారు.

ఆయన నేటి సమాజంలో ఉన్న సమస్యలు, వ్యధలు అన్నీ కూడా చాలా వరకూ సామాన్యమయినవే అని, వాటిని చిన్న చిన్న సాధనలతో తొలగించవచ్చని నిరూపించారు. స్వామి ముఖ్యలక్ష్యం, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలో మార్పుని తీసుకురాగలిగే ప్రపంచంలోని సమస్యలన్నీ మాయం అయిపోతాయి, ముఖ్యంగా హింసాప్రవృత్తి, డిప్రెషన్, అత్యాశ ఇటువంటి సమస్యలని చాలా సులభంగా తొలగించవచ్చు అని అంటారు.

ప్రపంచంలోని ఇన్ని సమస్యలకి అసలయిన కారణం మనకి ఏమి కావాలో మనకి తెలియకపోవటం. మనకు తెలియని దాని కోసం, అక్కడ లేని దాని కోసం మన శక్తినంతా ఉపయోగించి పరుగులు పెడుతున్నాము. లేని దాని కోసం పరుగెడితే మనం ఏమీ సాధించలేము. దాంతో మానసికంగా కుంగిపోవటం, శారీరకంగా చాలా అనారోగ్యాలని తెచ్చుకొని అనేక సమస్యల ఊబిలో కూరుకుపోతున్నాము. దీనితో అశాంతి, అసహనం, అసంతృప్తి, అహింసా ఇలాంటివన్నీ కుటుంబాలలో, సమాజంలో చివరికి ప్రపంచమంతా వ్యాపించిపోయాయి. అది ఎంతలోతుగా వ్యాపించినది అంటే ఈ లక్షణాలు లేని వ్యక్తులు కానీ, ప్రదేశాలు కాని మనకి కనపడటం లేదు.

ఈ సమస్యలన్నింటికి పరమహంస నిత్యానంద చాలా సులభమయిన, ఆచరణ యోగ్యమయిన, అందరికీ అందుబాటులో ఉండే ఒక సూత్రాన్ని చెప్పారు. అది "వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిలో మార్పు తీసుకురావటం ద్వారా ప్రపంచంలోని సమస్యలని అధిగమించవచ్చు. అదే విధంగా ప్రపంచాన్ని మార్చవచ్చు. వ్యక్తిగత మార్పుని ధ్యానం ద్వారా సాధించవచ్చు. దీని ద్వారా ప్రపంచంలో నిత్యానందాన్ని పరమానంద స్థితిని స్థాపించవచ్చు.

ధ్యానంతో పాటు, స్వామీజీ మనలోని సమస్యలకి, ప్రపంచంలోని సమస్యలకి కారణాలని మనకి స్పష్టంగా చూపిస్తూ, అవి ఏవిధంగా సమస్యలని సృష్టిస్తున్నాయో, ఆ సమస్యలని మనం ఏవిధంగా ధ్యానం ద్వారా పరిష్కరించవచ్చునో నేర్పించుతారు. ఈ సందర్భంలో స్వామీజీ చెప్పే సత్యాలు మనని నిర్ఘాంతపోయేలా చేస్తాయి. కొన్ని నమ్మలేని విధంగా ఉంటాయి. అటువంటి సత్యాలని స్వామీజీ మనకి మనోహరమయిన, ఆహ్లాదకరంగా ఉండే చిన్న చిన్న కథల ద్వారా ఆ నొప్పి తెలియకుండా నేర్పించుతారు. అటువంటి కొన్ని కథలని ఒక పుస్తక రూపంలో తీసుకువచ్చాము. ఇవి పిల్లలకి, పెద్దలకి, బాగా చదువుకున్న వారికి, అందరికీ అర్థమయ్యేవిధంగా మలిచాము.

మీ శరీరాన్ని, మిమ్మలని మీరు ప్రేమించటం నేర్చుకోండి?

పరమహంస శ్రీ నిత్యానంద మనం నమ్మలేని నిజాన్ని, మనం ఆశ్చర్యపోయే సత్యాన్ని ఒకదానిని చాలా చమత్కారంగా చెబుతారు. అది ‘మీ శరీరాన్ని, మిమ్మలని మీరు ద్వేషించుతారు’. ఈ మాట వినగానే మనం నమ్మం, కానీ స్వామీజీ వివరంగా ఉదాహరణలతో చెప్పినపుడు, నమ్ముతాము, ఆశ్చర్యపోతాము.

స్వామీజీ ఈ విధంగా చెబుతారు. ‘నా శరీరంతో సౌకర్యంగా ఉన్నాను. నా శరీరం నాకు చాలా బాగున్నది’ అని చెప్పేవారు చాలా అరుదుగా కనిపించుతారు. వాళ్ళు కూడా నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను అని అనరు, సౌకర్యంగా ఉన్నాను అంటారు.

శరీరం అంటే ఏమిటి?

శరీరం అంటే మీరు కాదు. ఈ శరీరం మిమ్మలని మోస్తూ తిరిగే ఒక వాహనం. ఈ జీవితం అనే సముద్రాన్ని దాటించే నౌక. మీకు నివాసాన్ని కల్పించిన గృహం అంతే. అయితే మీరు ఏ పని చేయాలి అని అనుకున్నా శరీరం కావాలి. శరీరం సహాయసహకారాలు లేకపోతే ఏమీ సాధించలేరు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా, సౌకర్యంగా ఉంచుకోవాలి. అంతేకాదు శరీర సహాయం మీకు కావాలి కాబట్టి శరీరంతో మీరు మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి, దానిని ప్రేమించాలి. అయితే దాని మీద ప్రేమ మిమ్మలని దాటి వెళ్ళిపోకూడదు. మీ శరీరం మీ కంటే గొప్పది కాదు. అది మీ యొక్క తాత్కాలిక నివాసం. ఈ జన్మలో మీరు చేయవలసిన పని అయిపోగానే ఇక ఆ ఇంట్లో వుండరు. దానిని వదిలి వేస్తారు.

అదే విధంగా శరీరాన్ని ద్వేషించకూడదు. నేను అందగాలేను, నేను పొడవుగా లేను, పొట్టిగా లేను ఇలాంటివన్నీ అర్థం లేని విషయాలు. ఇవన్నీ ఇతరులతో పోల్చుకోవటం వలన కలిగిన భ్రమలే. ఈ విధంగా చాలా మంది మానసికంగా కుంగిపోతారు.

స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరందూరా ఆ భగవంతుని చేత ప్రత్యేకంగా సృష్టించబడినవారు. భగవంతునికి మీరు కావాలి. అందుకే భగవంతుడు మిమ్మలని సృష్టించాడు. మీ ద్వారా ఈ ప్రపంచానికి ఏదో చేయాలి అని సంకల్పించాడు. అయితే మీరు ఒక విషయం అడగవచ్చు. భగవంతుడు అందరినీ అందంగా సృష్టించవచ్చు కదా! అని.

అవును. భగవంతుడు అందరినీ అందంగా అద్భుతంగా సృష్టించాడు. కాదని ఎవరయినా చెప్పగలరా? ఆయన మేధస్సు కంటే గొప్పదా వీరి మేధస్సు? ఆయన సృష్టిని ప్రశ్నించేంత మేధసుస ఉన్నదా మనకి?

అర్థం చేసుకోండి, భగవంతుడు ఇంజనీరు కాదు. ఏదో ఒక మూస తీసుకొని మనుషులని ముద్రించటానికి. ఆయన అందమయిన హృదయం ఉన్న కళాకారుడు. ప్రతి మనిషినీ అతని జీవితానికి సరిపడే విధంగా తీర్చిదిద్దుతాడు. అతను ఈ ప్రపంచంలో ఏ కర్మలు చేయటానికి వచ్చాడో దానికి అనుగుణంగా అతనిని తీర్చిదిద్దాడు. మహామేధో సంపన్నుడయిన భగవంతుని పనికి మనం లోపం చూపాలా? మీరు ఆయనకి సలహాలు చెప్పనవసరం లేదు కదా! ఆయన ఎవరిని అయినా ఒక లక్ష్యం కోసం సృష్టిస్తారు. దానికి తగినట్టు వారిని తయారు చేస్తాడు. మనలో లోపం అనేది కేవలం సమాజం సృష్టి లేదా మన భ్రమ.

ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మనని మనం ద్వేషించుతాము. మనని నియంత్రించాలని (కంట్రోలు చేయాలని) చూసే సమాజం మీ శరీరం గురించి ఇటువంటి అర్థం లేని వ్యతిరేక అభిప్రాయాలని పంపించి, మనం తక్కువ అని అనుకునేలా చేసి అప్పుడు మనని తన గుప్పిట్లోకి తీసుకుంటుంది. మీరు ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఆలోచింయితే మీ శరీరం మీద మీకు ఉన్న అభిప్రాయాలన్నీ కూడా మీ చిన్నతనం నుంచి ఈ సమాజం కల్పించినవే అని స్పష్టంగా అర్థమవుతుంది. అవి నమ్మి మీరు అపరాధభావంతో ఆత్మన్యూన్యతా భావంతో కుంగిపోతే, అప్పుడు సమాజం మీ మీద విజయం సాధించినట్టే అనుకొని, మిమ్మలని తన గుప్పిట్లోకి తీసుకుంటుంది. పరమహంస ఈ విషయాలన్నీ చెబుతూ మనకి ఒక చక్కని కథ చెబుతారు.

చిన్నకథ : కావడి మోసే వ్యక్తి - కావడి కుండలు

ఒక వ్యక్తి ఒక ఆసామి ఇంట్లో పనిచేస్తుంటాడు. ఆ వ్యక్తి చేయవలసిన పని ప్రతి రోజూ ఆ ఇంటికి దూరంగా ఉన్న నదికి వెళ్ళి రెండు కుండలు నిండుగా నీరు నింపి, ఇంటికి తీసుకురావాలి. ఆ నీటిని ఒక తొట్టిలో నింపాలి. ఆ తరువాత యజమాని గదిని అందంగా సార్డాలి.

ఆ వ్యక్తి తన పనులని చాలా బాధ్యతగా చేస్తూంటాడు. అతని పనులకి యజమాని సంతోషపడుతుంటాడు. ప్రతి రోజు ఆ వ్యక్తి కావడి భుజాన వేసుకొని నడచి నది దగ్గరికి వెళ్ళి, రెండు కుండల నిండా నీరు నింపి వాటిని కావడిలో పెట్టి భుజాన మోసుకొని యజమాని ఇంటికి తెస్తుంటాడు. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూంటాడు.

అతను ఇంటికి నీరు తెచ్చే రెండు కుండలలో ఒకటి బాగానే ఉంటుంది కాని మరొక కుండకి చిన్న పగులు ఉంటుంది. దాంతో కుండనిండుగా నీరు పట్టి తెచ్చినా ఆ పగులు ద్వారా నీరు బయటికి కారిపోయి ఇంటి వచ్చేటప్పటికి సగం నీరు మాత్రమే మిగిలేది. ఆ విధంగా కుండలోని నీరు సగం బయటికి పోయినా, ఆ కావడి మోసే వ్యక్తి ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఏమీ అనుకునే వాడు కాదు. ఆవిధంగానే సగం కుండ నీరు మాత్రమే యజమాని ఇంటి తెచ్చేవాడు.

అయితే రెండు కుండలలోనూ బాగున్న కుండ తాను చాలా కచ్చితమయిన దానిని అని, తనని తయారు చేసిన ఉద్దేశం ప్రకారం తన బాధ్యతని చక్కగా నిర్వహిస్తున్నాను అని చాలా గర్వపడేది. తనలో లోపం లేదు అనే అహంకారాన్ని ప్రదర్శించుతూ ఉండేది. తన పనిలోని నాణ్యతని చూసి గర్వపడేది.

రెండవదయిన పగులు ఉన్న కుండ తనలోని లోపం చూసి సిగ్గుపడేది. తాను కచ్చితంగా లేనని, తన బాధ్యతని పూర్తిగా నెరవేర్చలేకపోతున్నాను అని చాలా బాధపడేది. మానసికంగా కుంగిపోయేది. రోజులు గడచేకొద్దీ పగిలిన కుండ వ్యధ అధికమయిపోతుండేది.

ప్రతి రోజూ మాదిరిగానే ఆ రోజు కూడా కావడి మోసే వ్యక్తి నదికి వెళ్ళి కుండల నిండుగా నీరు నింపుతాడు. పగిలిన కుండని నీటితో నింపే సమయంలో ఆ కుండ, నీరు మోసే వ్యక్తితో ఈ విధంగా అంటుంది. “ ఓ వ్యక్తి! నాకు చాలా సిగ్గుగా ఉన్నది. నాకు చాలా బాధగా ఉన్నది. నేను నీకు చాలా శ్రమ ఇస్తున్నాను. నా వలన నీకు చాలా కష్టం కలుగుతుంది.” అని చాలా బాధగా అంటుంది.

నీరు మోసే వ్యక్తి ఆశ్చర్యంగా ఆ కుండ వైపు చూస్తాడు. అతనికి ఏమీ అర్థం కాదు. “ ఓ కుండా! నీవు ఏ విషయం గురించి బాధపడుతున్నావు?” అని అడుగుతాడు.

పగిలిన కుండ ఆ వ్యక్తికి ఈ విధంగా జవాబు ఇస్తుంది, “ అయ్యా! నీవు ప్రతి రోజు నన్ను నీటితో నిండుగా నింపుతావు. కష్టపడి భుజం మీద కావడి వేసుకొని మోసి ఇంటికి వస్తున్నావు. నీవు తీరా ఇంటికి చేరే సరికి నా లోని లోపం వలన సగం నీటిని పోగొట్టుకుంటున్నావు. నా మూలాన నీకు నీ శ్రమకి తగిన ఫలితం దొరకటం లేదు. ఈ విధంగా నా వలని నీ శ్రమ వృధా అవుతుంది. అందుకే నేను బాధపడుతున్నాను” అని చాలా బాధపడుతూ తన మనస్సులోని వ్యధని ఆ కావడి మోసే వ్యక్తికి చెబుతుంది పగిలిన కుండ.

కావడి మోసే వ్యక్తికి ఆ కుండని చూస్తే చాలా జాలి అనిపిస్తుంది. ఆ కుండని ఎంతో ప్రేమగా తన చేతులలోనికి తీసుకొని దానితో “నీవు అసలు ఈ విషయం గురించి ఆలోచించకు. ఇవాళ మనం యజమాని ఇంటికి వెళ్ళే దారిలో చుట్టూ ఉన్న ప్రకృతిని చూడు. అక్కడ ఉన్న అందమైన పూలని గమనించు” అని ఆప్యాయంగా చెబుతాడు.

కుండ కన్నీళ్ళని తుడుచుకుని సరే అంటుంది, కానీ దానికి దిగులు తగ్గదు. ఆ వ్యక్తి కావడిని భుజం మీద వేసుకొని యజమాని ఇంటికి బయలుదేరుతాడు. ఆవ్యక్తి చెప్పినట్టు పగిలిన కుండ దారికి రెండువైపులా ఉన్న పరిసరాలని గమనించతూ ఉంటుంది. అప్పుడే ఉదయించిన సూర్యుని కిరణాలు నలివెచ్చగా అక్కడి చెట్లపై పడి ఆ చెట్లు ఎంతో అందంగా, బంగారు రంగులో కనపడుతున్నాయి. దారి అంతా ఉన్న మొక్కలు అందమైన పూలతో చాలా అందంగా ఉన్నాయి. ఆ పూల మొక్కలు వాటి పూలతో దారి అందంగా కనపడుతుంది. ఆ ప్రకృతి అందాలు, పూలతో నిండుగా ఉన్న మొక్కలని చూసి కుండ చాలా ఆనందపడుతుంది.

వారు ఇంటికి చేరాకా, తిరిగి కుండ తన పాత భావాలలోనికి వెళ్ళిపోతుంది. తాను ఎందుకూ పనికిరాని దాన్నని మరింతగా వ్యధ చెందుతుంది. తనలోని లోపాన్ని మరొకసారి గుర్తుచేసుకొని సిగ్గుతో కుంచించుకుపోతుంది. నీరుమోసే వ్యక్తి కుండలోని నీటిని తీసుకెళ్ళి తొట్టిలో పోసి, వాటిని యథాస్థానంలో పెడతాడు.

అప్పుడు పగిలిన కుండ సగం నీరుని మాత్రమే తేగలిగాను అని కన్నీరు కారుస్తూ ఆ వ్యక్తిని క్షమించమని అడిగి తాను అసమర్థురాలనని అంటుంది.

ఆ వ్యక్తి కుండతో ఇలా అంటాడు, “ నీవు నది నుంచి ఇంటికి వచ్చే దారిని గమనించావా?” అని అడుగుతాడు.

“ అవును, గమనించాను. ఎంతో అందమైన పూల మొక్కలు ఉన్నాయి. అవి అదృష్టం కలిగినవి, నాలాంటి దురదృష్టవంతమయినవి కావు. వాటి అందాలు వర్ణించలేను” అని అంటుంది, పగిలిన కుండ. ఆ వ్యక్తి తిరిగి కుండతో ఇలా అంటాడు, “ ఆ పూల మొక్కలు అన్నీ నీవు ఉన్నవైపు మాత్రమే ఉన్నాయి. అవతలవైపు లేవు. ఆ విషయం గమనించావా”.

అవును, గమనించాను అని కుండ జవాబు చెబుతుంది. అప్పుడు ఆ వ్యక్తి కుండతో, “ ఆ మొక్కలు, అందమైన పూలు నీవు పెంచినవే. అదంతా నీప్రతిభే అంటాడు”. ఆశ్చర్యపోయిన కుండ నేను నమ్మను. నేను అసమర్థురాలని. ఇది ఎలా సాధ్యం అని అంటుంది.

అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, “ప్రతి రోజు ఉదయం నది నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నీ పగులు నుంచి కారిన నీటితో ఆ మొక్కలు పెరిగాయి. అవి అందమైన పూలని ఇస్తున్నాయి. నేను ఆ పూలతో యజమాని గదిని అలంకరిస్తాను. యజమాని నా పనికి ఎంతో సంతోషపడతాడు. నన్ను ఎంతో మెచ్చుకుంటాడు. ఇదంతా కేవలం నీ వలన మాత్రమే సాధ్యపడినది. నేను నీకు కృతజ్ఞత చెప్పాలి” అని ముగించుతాడు ఆ వ్యక్తి.

పగిలిన కుండ ఆశ్చర్యానికి, ఆనందానికి హద్దులు లేనతంగా ఆనందిస్తుంది. తనని అంత ప్రత్యేకంగా చేసిన భగవంతునికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.

ఈ కథని ముగించి స్వామీజీ ఈ విధంగా చెబుతారు. మన అందరిలో ఒక లోపం ఉంటుంది. అందరం పగులు ఉన్న కుండలాంటి వారమే. కాని మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మనందరిని భగవంతుడు ఎంతో శ్రద్ధతో ప్రత్యేకంగా సృష్టించాడు. నేను బాగా లేను, నాలో లోపం ఉన్నది అని మీరు అనుకుంటే, మీరు భగవంతుని శక్తిని విమర్శించుతున్నారు అని అర్థం. భగవంతుని మేధస్సు కచ్చితం కాదు అని మీరు అనుకుంటున్నారు అని అర్థం.

మీలో లోపాలు ఉన్నాయి అని అనుకోవద్దు. మీకు ఏదయినా అలా అనిపించిత్ అసవి మన జీవిత విధానాలు అని గుర్తించండి. అప్పుడు మీరు మీ జీవితంలోనికి అందాలు తేగలుగుతారు. ఆనందం మీ సొంతమవుతుంది. మీ చుట్టు ప్రక్కల, మీ ఇంటిలో, సమాజంలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం వ్యాపించుతుంది.