KAILASA Library/ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?/Sign in
ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?

ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?

This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.

పరమహంస శ్రీ నిత్యానంద

ధ్యానం తూర్పుదేశాల సంస్కృతిలో, వారి ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్యభాగం. బహు ప్రాచీనమయిన వేద సంస్కృతిలో ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నది. కొన్నివేల సంవత్సరాలకి పూర్వం, ధ్యానం ద్వారా మహాఋషులు, యోగులు తమ అంతరంగ ప్రపంచంలోనికి లోతుగా వెళ్ళి, విశ్వశక్తి అయిన సర్వాంతర్యామితో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోగలిగి, ఆ భగవంతుని రూ పాలుగా, అవతారమూర్తులయ్యారు.

వేల సంవత్సరాల క్రితం మహాఋషులు తమ అత్యున్నతమైన విశ్వజ్ఞానంతో, అనంత మేధో సంపత్తులతో తమ అంతరంగమనే ప్రయోగశాలలో జరిపిన మార్మిక ప్రయోగాల ఫలితాలతో ధ్యానాన్ని ఒక అద్భుతమైన శాస్త్రంగా, ఒక అసమాన సాంకేతిక పద్ధతిగా, ఆధ్యాత్మిక ప్రగతికి ప్రధమ సోపానంగా, పరమానంద స్థితిని చేరగలిగే ఒక రాజమార్గంగా తీర్చిదిద్దారు. తూర్పుదేశాల ప్రాచీన ఆధ్యాత్మిక సంస్కృతులు అయిన హిందూ, బౌద్ధ, జైన్, సుఫీ మొదలయిన మతాలు ధ్యానానికి అత్యున్నత స్థానాన్ని కల్పించాయి. ఆ యా మతాలలోని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ధ్యానం, ధ్యానపద్ధతులు, ధ్యానానికి సంబంధంచిన అనుబంధ విషయాలని ఎంతో లోతుగా, విపులంగా అధ్యయనం చేసారు. వారు ఈ అంశాన్ని గురించి సూక్ష్మస్థాయిలో తీవ్రమయిన పరిశోధనలు చేసి, ధ్యానానికి సంబంధించి గొప్ప రహస్యాలని ప్రపంచ దృష్టికి తీసుకువచ్చారు. వారి అధ్యయన మరియు పరిశోధనా ఫలితాలతో, ధ్యానమార్గంలో సామాన్యులకి ధ్యాన సిద్ధి కలిగే విధంగా చక్కని సూత్రాలని రూపొందించి ఈ ప్రపంచానికి అందించారు. ఆ సూత్రాలే వివిధ ధ్యానపద్ధతులుగా అభివృద్ధి చెందాయి. అతి ప్రాచీనమయిన ఆ సూత్రాలు కాలాతీతమయిన పద్ధతులు. అవి ఒక కాలానికి గాని, ఒక ప్రదేశానికి గాని, ఒక భాషా సంస్కృతులకి కాని సంబంధించినవి కావు. వాటికి ఎటువంటి భౌతిక హద్దులు, ఆటంకాలు లేవు. పదివేల సంవత్సరాల క్రితం అవి మనిషికి ఎంత ఉపయోగపడ్డాయో, నేటి ఆధునిక మానవునికి కూడా అంతే ఉపయోగ పడతాయి. అవి విశ్వజనీనత కలిగిన సర్వమానవాళి యొక్క వారసత్వ సంపద.

ఋషులు తమ కఠోర తపః ఫలితాలని మనకి ఎందుకు అందించారు?

ధ్యానం అనే ఆధ్యాత్మిక రాజమార్గంలో ప్రయాణించి, ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలను చేరిన మనముందు తరాలకి చెందిన అవతారమూర్తులు, మహర్షులు మనకి మార్గదర్శకులయ్యారు. ధ్యానం ద్వారా వారు అత్యున్నతమయిన విశ్వచేతన స్థితిని చేరి శాశ్వతమయినది, నిత్యమయినది అయిన పరమానంద స్థితిని పొందారు. ఆ ఆనందపు అనుభూతిని సామాన్య మానవులకి పంచాలి అనే మహదాశయంతో వారు ఈ ధ్యానపద్ధతులని తీసుకొని మన మధ్యకి వచ్చారు.

వారు కారణజన్ములు. సాక్షాత్ భగవంతుని రూపాలు. వారిలో ఉండే అపారమయిన కరుణ, ప్రేమ వారిని మనముందుకి రప్పిస్తుంది. వారు తమ కఠోర తపస్సు ద్వారా సాధించిన జ్ఞానాన్ని కొన్ని సూత్రాలుగా సామాన్యమానవునికి సులభరీతిలో అర్ధమయ్యే పద్ధతులుగా మార్చి, ఆ పరమానంద స్థితికి మనని కూడా చేర్చాలి అనే సేవాభావంతో మన దగ్గరికి వస్తారు. వారు ఎందుకు ఇంత త్యాగం చేస్తారు అని అంటే, దానికి ఒకే ఒక జవాబు, పరమాత్మ కరుణామూర్తి, ప్రేమమూర్తి. ఆ పరమాత్మ రూపాలు అయిన జ్ఞానోదయం పొందిన యోగులు మనమీద వాత్సల్య వర్షం కురిపిస్తూ ఉంటారు. వారిలోని ఆ లక్షణాలే వారిని మన దగ్గరికి నడిపిస్తాయి. జ్ఞానోదయమయిన ఋషులకి ఇవ్వటమే తెలుసు. అంతా నావారే అని ప్రేమించటం మాత్రమే వారికి తెలిసిన విద్య. వారు పొందిన పరమానందాన్ని అందరికీ పంచాలి అనే సేవాభావం వారిని ఈ ప్రపంచంలోనికి నడిపిస్తుంది.

మనం ధన్యులం:

ఈ విధంగా ఈ అద్భుత యోగులు తపః ఫలంగా యోగా, ధ్యానం అనేవి భారతీయ సంస్కృతిలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక ముఖ్య భాగం అయిపోయాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఆ అవతారమూర్తులు ఈ నేలపై నడచి మనందరిని తమ పవిత్ర మార్గంలో నడిపించారు. అందుకే భరతఖండాన్ని దేవభూమి అంటారు. ఇంత పవిత్ర మయిన, సుజ్ఞాన సంపన్నమయిన, కరుణా పూరితమయిన, ధ్యానభూమి మీద జన్మించటానికి మనం ఎంత పుణ్యం చేసుకున్నామో కదా! కేవలం జన్మతోనే మన జీవితం ధన్యమయినప్పుడు, ఆ మహాపురుషులు చూపిన మార్గంలో నడవగలిగితే మనం పొందే ఆనందపు సంపదలకి అంతు ఉండదు. ఆ అదృష్టం మన భారతీయులకి సులభంగా అందే ద్రాక్ష, చేతిలో నిలబడే జాబిలి. ఇంత అదృష్టానికి నోచుకున్న మనం నిజంగా ధన్యులమే.

ఆధునిక ప్రపంచంలో ధ్యానం, యోగా పరిస్థితి:

ధ్యానం, యోగా అనేవి తూర్పుదేశాలకి సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రాలు. పాశ్చాత్య దేశాలకి ఏమాత్రం తెలియని అంశాలు. ధ్యానం, యోగా ఈ రెండు శాస్త్రాలని నేటి ఆధునిక ప్రపంచంలో అత్యంత తప్పు మార్గంలో, తప్పు అర్ధాలతో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాలపై ఎటువంటి అవగాహనా లేకుండా ఈ విషయాలపై లోతయిన జ్ఞానం లేకుండానే, అందరూ ఈ విషయాల గురించి మాట్లాడటం, ఉపన్యాసాలు ఇవ్వటం, శిక్షణ ఇవ్వటం చేస్తున్నారు. దీనితో అసలయిన యోగా, ధ్యానం అనే శాస్త్రాలు మరుగునపడి, కొత్త శాస్త్రాలు పుట్టుకువస్తున్నాయి. ఈ వక్రమార్గంలో తప్పు అర్ధాలతో ఉన్న ఈ శాస్త్రాన్ని తిరిగి దాని అసలు రూపంలో సత్యాన్ని సత్యంలా చూపించాలి అనే ఉద్దేశంతో, పరమహంస శ్రీ నిత్యానంద ధ్యానం, యోగా శాస్త్రాలని సరియైన పద్ధతిలో మనకి పరిచయం చేయటానికి ధ్యానం అనే పద్ధతిని మనకి అందుబాటులోనికి తేవాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ధ్యాన పీఠాలని స్థాపించారు. ధ్యానాన్ని సామాన్య మానవుల శాస్త్రంగా మార్చారు.

పరమహంస నిత్యానంద ఎవరు?

పరమహంస శ్రీ నిత్యానంద జ్ఞానోదయం పొంది ఈ రోజు మన మధ్యన, మనకోసం ఉన్న మహా రుషి, అవతారమూర్తి, ఆయన కారణజన్ముడు. దక్షిణ భారతదేశంలో జన్మించి, అతి చిన్నవయస్సులోనే భారతదేశమంతా కాలినడకన తిరిగారు. తన పదహారవ ఏటనుంచి పరివ్రాజకునిగా హిమాలయాలలో ఎందరో మహాపురుషులని కలసి వారి దగ్గర ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారు. జ్ఞానోదయం పొందాలి అనే తీవ్రమయిన కోరికతో హిమాలయాలలో కఠోర తపస్సు చేసారు. ఆయన తన ఇరవై రెండవ ఏట, జనవరి ఒకటి, రెండువేల సంవత్సరంలో జ్ఞానోదయం పొంది శాశ్వతమయిన నిత్యానంద స్థితిని పొందారు. జ్ఞానోదయమయ్యాక పరమహంస తన ధ్యాన మహా యజ్ఞానికి అంకురార్పణ చేసారు. ఆయన పరివ్రాజకునిగా హిమాలయాలలో తిరిగే రోజులలో ఎందరో యోగులని కలిసారు. అన్ని మతాలకి సంబంధించిన రుషులు, యోగుల దగ్గర ధ్యానపద్ధతులని చాలా వివరంగా నేర్చుకున్నారు. సుఫీ యోగులు, బౌద్ధగురువులు, జైన్ మాస్టర్లు, రుషులు ఆయనకి ధ్యానం, ధ్యానపద్ధతులలో చాలా మంచి శిక్షణని ఇచ్చారు.

జ్ఞానోదయమయ్యాక, పరమహంస నిత్యానంద ధ్యానంలో మరింత లోతుగా పరిశోధనలు చేసారు. ఆయన ధ్యానం అనే శాస్త్రాన్ని ఆధునిక మానవులకి సులభంగా అర్ధమయ్యేరీతిలో మలచి వివరించారు. ధ్యానం అంటే ఉండే తప్పు అర్ధాలని సరిచేసారు. ఆయన ధ్యానం పై ఎన్నో ప్రవచనాలని ఇచ్చారు. మనలో సామాన్యంగా ఉండే అనుమానాలని పూర్తిగా నివృతి చేసారు. ఆయన వివిధ శిక్షణా కార్యక్రమాలలో, ప్రవచనాలలో ధ్యానం గురించి చెప్పిన వివరాలని ఈ పుస్తక రూపంలో తీసుకువచ్చాము.