అధ్యాయం - 1: పరస్పర సంబంధం నెలకొల్పటం
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
(Interaction)
మీ అందరినీ ప్రేమతో గౌరవాభిమానాలతో ఆహ్వానిస్తున్నాను.
మీరందరూ కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆకాంక్షతో, మీకు ఉన్న జ్ఞాన పరిధిని మరింత విస్తృతం చేసుకోగలమన్న నమ్మకంతో, మీ జీవితానికి ఒక కొత్త దృక్పథాన్ని ఏర్పరచుకోవాలనే కోరికతో ఇక్కడికి వచ్చారు. ఇలా తెలుసుకున్న విషయాలతో ఇంకా మేలైన జీవన సరళిని ఏర్పరచుకుని, దీనితో చక్కగా జీవించగలమనే ఆశతో మీరు ఈ కార్యక్రమానికి వచ్చారు.
మనం అసలు విషయంలోనికి వెళ్ళేముందు మీకు నేను కొన్ని సంగతులు చెప్పదలచుకున్నాను. ఇవి మీరు అర్థం చేసుకుంటే, మీరు ఇక్కడ ఉండి నేర్చుకోబోయే విషయాలను చక్కగా తెలుసుకుని, ఆ అంశాల నుంచి ఎక్కువ లాభం పొందగలుగుతారు.
మీరు ఇక్కడికి రాకముందు చాలచోట్లకి వెళ్ళి ఉంటారు. చాలా ఉపన్యాసాలు విని ఉంటారు. ఏవైనా కొన్ని పద్ధతులు, విధానాలనుసాధన చేసి ఉంటారు. ఇది చాలా మంచి విషయం. కానీ ఒక చిన్న విషయం: మీరు ఇక్కడ ఉన్నంత వరకూ పూర్తిగా ఇక్కడే ఉండండి. అంతే.
మీరు ఇంతవరకూ సంపాదించిన జ్ఞానాన్ని, తెలుసుకున్న విషయాలని బయట వదలి ఇక్కడికి రండి. మీరు “మీ చెప్పులనీ, మీ మైండ్ (మనస్సు)ని బయట వదలండి” అనే బోర్డుని బయట చూసి ఉంటారు. అదేమిటి, అలా రాసారేమిటి అని ఆశ్చర్యంగా చూసి ఉంటారు. దీని అర్థం : మీరు బయట చెప్పులు వదిలినప్పుడు, మీ మైండ్‌ని కూడా అక్కడ వదలమని అర్థం. మీరు ఇంతవరకూ సంపాదించిన జ్ఞానాన్ని, మీరు సేకరించిన విషయాలను, మీ చెప్పులతో పాటు అక్కడే వదిలి, అప్పుడు లోపలికి రండి. మీరు వెళ్ళిపోయేటప్పుడు వాటిని తీసుకువెళ్ళవచ్చు. మీ మైండ్ గురించి ఆందోళన పడకండి. మీ మైండ్‌ని ఎవరూ తీసుకెళ్ళరు. అది అక్కడ చాలా భద్రంగా ఉంటుంది.
ఎవరయినా తీస్తే మీ చెప్పులు తీసుకెళతారేమో కానీ మీ మైండ్‌ని ఎవరూ తీసుకువెళ్ళరు. ఆ విషయం నేను మీకు హామీ ఇస్తాను. ఎవరి మైండ్‌ని వారు సంభాళించుకోలేక సతమతమయిపోతున్నారు. వాళ్ళు ఇక మీ మైండ్‌ని తీసుకెళ్ళి ఏం ప్రయోగాలు చేయగలుగుతారు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు.
మరొక విషయం మీరు లోపలికి వచ్చేటప్పుడు ఎటువంటి అభిప్రాయాలు లేకుండా ఖాళీ మైండ్‌తో లోపలికి రండి. అప్పుడు నేను చెప్పే విషయాలని మీరు సంపూర్ణంగా గ్రహించగలుగుతారు. ఒక వేళ మీరు మీకు వున్న విషయ పరిజ్ఞానంతో, అభిప్రాయాలతో ఇక్కడికి వస్తే, నేను చెప్పే ప్రతి మాటని మీరు నిరంతరం మీకు తెలిసిన విషయాలతో పోల్చుకుంటూ ఉంటారు. మీరు ఇంతకు ముందు విన్న విషయాలతో నేను చెప్పే మాటలను సరి చూసుకోవటంలో మునిగిపోతారు. దాంతో మీరు నేను చెప్పే విషయాలని వినలేరు. నేను మీకు చెప్పదలచుకున్న విషయాలను మీరు పూర్తిగా గ్రహించలేరు. దానిని మొత్తం మిస్ (Miss) అవుతారు. మీరు నన్ను తెలుసుకోగలగాలన్న, నన్ను మీలోనికి తీసుకోవాలన్నా, మీ లోపల ఖాళీ ఉండాలి కదా. అలా కాకుండా ఎన్నో విషయాలతో మీరు, మీ మైండ్ నిండిపోయి ఉంటే నన్ను మీలోనికి ఎలా తీసుకోగలుగుతారు?
ఒక చిన్న కథ:
పశ్చిమదేశానికి చెందిన మహా మేధావి అయిన ఒక ప్రొఫెసర్ (ఆచార్యుడు) జపాన్‌దేశంలో ఉండే ఒక బౌద్ధ గురువుని కలవాలనే ఉద్దేశంతో వస్తాడు. ఆ ప్రొఫెసర్ ఎంతో చదివిన వ్యక్తి. ఆయన చాలా పరిశోధనలు చేసిన గొప్ప పరిశోధకుడు. అటువంటి ప్రొఫెసర్ బౌద్ధ గురువు దగ్గర నుంచి ఆధ్యాత్మిక విషయాలు
నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వస్తాడు. ఈ విషయంలో ఆయనతో చర్చించాలని, ఆధ్యాత్మికతని ఇంకా బాగా అర్ధం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అక్కడికి వస్తాడు.
ఆయన గురువు దగ్గరికి వచ్చే సమయానికి, ఆ బౌద్ధగురువు టీ తయారు చేస్తూ ఉంటాడు. గురువు ప్రొఫెసర్ని చూసి కూర్చోమని సైగ చేస్తాడు. ప్రొఫెసర్ కూర్చొని కొంచెంసేపు గడిచాకా మెల్లగా తన గురించి మాట్లాడటం మొదలుపెడతాడు. ఆయన తన చదువు గురించి, తాను కనుగొన్న విషయాల గురించి, ఆయన చేసిన ప్రయాణాల గురించి, ప్రపంచంలో ఆయన ఎక్కడ ఎక్కడ ప్రయాణించాడో, ఎంత మందిని కలిసాడో ఆ విషయంలో ఆయన అనుభవాల గురించి, చాలా విషయాలలో ఆయన ఇచ్చిన ముగింపులు (conclusions) అభిప్రాయాలను ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలని ఆ ప్రొఫెసర్ ఆ బౌద్ధ గురువుకి చెబుతూనే ఉన్నాడు.
ఈ లోపు గురువు టీ తయారు చేయటం పూర్తి చేసి, రెండు కప్పులు తీసుకు వచ్చి వాళ్ళ ఇద్దరి మధ్యా పెట్టి, ఒక కప్పులోనికి టీ పోయటం మొదలు పెడతాడు. అలా టీ పోస్తూనే ఉంటాడు. కప్పు నిండిపోయి టీ సాసర్లోకి పడుతుంది. అయినా ఆయన టీ పోస్తూనే ఉంటాడు.
ఇదంతా ప్రొఫెసర్ గమనించుతూ ఉంటాడు. ఇక ఆయన ఆగలేక “గురు దేవా! మీరు ఏం చేస్తున్నారు? టీ పోయటం ఆపండి. కప్పు నిండిపోయి టీ కిందికి పోతుంది” అని గట్టిగా అంటాడు.
గురువు టీ పోయడం ఆపి నిదానంగా ప్రొఫెసర్ వైపు చూస్తూ “నీవు కూడా” అని అంటాడు. ఆ మాట వినగానే ప్రొఫెసర్ నిర్ఘాంతపోతాడు. గురువు తనకు ఏమి చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడో ప్రొఫెసర్‌కి అర్ధమయిపోయింది.
ప్రొఫెసర్ టీ కప్పులా నిండుగా ఉండి, ఏ మాత్రం దేనినీ అందులో పట్టి ఉంచలేని స్థితిలో ఉన్నాడు. గురువు ఆ ప్రొఫెసర్‌కి ఏమీ చెప్పినా అది అతనిలోనికి వెళ్ళలేదు, అతనిలో ఇమడలేదు. దాంతో కప్పులో టీ ఎలా బయటికి వచ్చేస్తుందో అలాగే గురువు చెప్పే విషయాలు కూడా బయటకు వస్తాయి. అంతేగాని అతనిలోనికి వెళ్ళవు. గురువు చెప్పిన ఆ ఒక్క మాటతో ప్రొఫెసర్ కి ఆయన తనకి ఏమి చెప్పాలి అని ప్రయత్నిస్తున్నాడో ఆ విషయం అర్ధమయ్యింది.
ఈ విధంగా కథ చెప్పటం ముగించి స్వామి ఇలా అన్నారు : ఈ కథని బట్టి మీరు అర్థం చేసుకోవటాని కి ప్రయత్నించండి. నేను చెప్పే విషయాలని అర్థం చేసుకోవాలని అనుకున్నా, ఆ అనుభవాన్ని పూర్తిగా పొందాలని అనుకున్నా మీరు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నందుకు ఏదైనా ఉపయోగపడే విషయాలను తెలుసుకోవాలి అని అనుకున్నా, ముందుగా మీ టీ కప్పుని ఖాళీగా ఉంచండి. మీ మనస్సుని మీరు పూర్తిగ వికసింపచేసి తెరచి ఉంచండి. నేను చెప్పే విషయాలను మీరు లోపలికి పూర్తిగా తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి పసి పిల్లలలోని అమాయకత్వంతో కూడిన కుతూహలం మీలో ఉండాలి. ఒక స్పాంజిలా నేను చెప్పే విషయాలని మీరు పూర్తిగా గ్రహించగలగాలి. ఈ విధంగా మీరు మీ మనస్సుని సిద్ధపరచుకుని ఈ కార్యక్రమంలో నేను చెప్పే విషయాలని వినండి. అది చాలు.
చూడండి : జ్ఞానం అనేది మూడు విధాలుగా ఉంటుంది. వీటిలో మొదటిది వివేచనాత్మక లేక బుద్ధితో కూడిన జ్ఞానం (Intellectual Acknowledge) ఇది మేధస్సు కి సంబంధించిన జ్ఞానం. ఈ జ్ఞానం కావాలి అంటే మీకు మైండ్ ఒక్కటి చాలు. ఇంకేమీ అవసరం లేదు. మీరు కొంచెం శ్రద్ధ చూపించగలిగి, విషయాలను బాగా గుర్తుంచుకోగలిగితే అది చాలు. మీరు కొంచెం తర్కాన్ని (Logic)కొంత సమయస్ఫూర్తిని(commonsense) ఉపయోగించి విషయాలకి మధ్య సంబంధం ఏర్పాటు చేయగలిగి దానిని అర్థం చేసుకుంటే చాలు. ఈ జ్ఞానాన్ని మీరు పాఠశాలలో, పుస్తకాల ద్వారా సంపాదించుకోవచ్చు . లెక్కలు, సైన్సు లాంటివి నేర్చుకోవటానికి మైండ్ చాలు. దీనితో మీరు గొప్ప గణిత శాస్త్రవేత్త, లేదా మరో శాస్త్రవేత్త అవ్వగలుగుతారు.
రెండవ రకమైన జ్ఞానం హృదయానికి సంబంధించిన జ్ఞానం. ఇక్కడ మీ మైండ్‌తో పాటు మీ హృదయాన్ని కూడా ఉపయోగించాలి. కళలు, సంగీతం, నృత్యం, కవిత్వం,
ఇవన్నీ కూడా ఈ కోవకి చెందినవే. వీటి అన్నింటికీ కేవలం మైండ్‌ని ఉపయోగించితే చాలదు. మీ మేధస్సుతో ఇటువంటివి ఏవీ మీరు చేయలేరు. మీరు మీ హృదయాన్ని ఉపయోగించాలి. ఒక చిత్రాన్ని చిత్రించాలన్నా, ఒక పద్యం లేదా కవిత కాని వ్రాయాలన్నా, ఒక పాట పాడాలి అని అనుకున్నా మీలో భావావేశం ఉండాలి.
ఇవన్నీ కూడా సృజనాత్మక సృష్టి ఫలితాలు. అవి మీ హృదయంలో సృష్టింపబడతాయి. అవి మీ హృదయం వెల్లడి చేసే భావాలు. మీరు ఎటువంటి అనుభూతి లేకుండా ఒక కవిత వ్రాయగలరా? ఒక పద్యం చెప్పగలరా? ఒక చిత్రకారుడు కేవలం మేధస్సుని ఉపయోగించి ఒక చిత్రాన్ని చిత్రించగలడా? అతను తన మైండ్‌ని తన హృదయంతో అనుసంధానం చేయాలి. అప్పుడు అతనిలోని భావాలు వెల్లువలా ప్రవహించుతాయి.
మీరు ఒక పద్యం వ్రాసే పద్దతులని, ఒక చిత్రం గీసే విధానాలని, అందులోని కిటుకులని ఎక్కడైనా నేర్చుకోవచ్చు. కానీ అసలు చిత్రించే నైపుణ్యం, దానికి కావలసిన విషయం మీ హృదయంలోపలి నుంచి మాత్రమే రావాలి. మీకు ఎవరూ పద్యాలు వ్రాయటం, చిత్రాలు చిత్రీకరించటం నేర్పించలేరు. వాళ్ళు కేవలం పద్ధతులు, కొన్ని కిటుకులు మాత్రమే చెబుతారు. ఆ విషయాలని మీరు గ్రహించి మీ అంతట మీరు ప్రయత్నించి సాధించాలి.
ఇక మూడవ రకమయిన జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం మేధస్సుకి కాని హృదయానికి కాని సంబంధించినది కాదు. ఇది మీ అంతరాత్మకి మీ అంతరంగంలోని మీ అసలయిన ఉనికికి సంబంధించిన జ్ఞానం. నిజానికి దీనిని మనం జ్ఞానం అనికూడా అనలేము. ఇది హేతువాదానికి అతీతంగా, విషయాలని లోతుగా అర్ధం చేసుకోవటమే. దీనిని మీకు నేర్పించలేము. మీరు గ్రహించలేరు. ఇది కేవలం మీ అంతరంగంతో మీతో మీరు పొందే సంయోగంలో జరగవలసిన విషయం
నేను ఎప్పుడూ ఒక విషయం చెబుతుంటాను. మీకు ఆధ్యాత్మికతని నేను నేర్పించను. మీరు నేర్చుకుంటారు. మీరు దీనిని గురువులు చెప్పే విషయాలని గ్రహించటం ద్వారా మీ అంతరాత్మ దశలో నేర్చుకుంటారు. ఇది ఒక శక్తి. గురువులు చెప్పే
మాటల వెనుక చాలా గొప్ప శక్తి ఉంటుంది. మీరు గనక దానిని మీలోనికి ప్రవేశింపచేసుకోగలిగితే, ఆ శక్తి మీ లోపలికి దూసుకుపోయి మీ అంతరంగంలో ఉనికిని, మీ అంతరాత్మని స్పృశించగలుగుతుంది. అప్పుడు ఆ శక్తి మీలో మార్పుని తీసుకురాగలుగుతుంది. ఆ మార్పు కేవలం మైండ్ నుండి వచ్చే మాటల వలన కాని, హృదయం నుంచి వచ్చే అనుభవాల అనుభూతుల నుంచి కాని సాధ్యం కాదు. అవి ఆ మార్పుని తేలేవు.
నేను మాట్లాడేటప్పుడు, నేను అంతిమ సత్యం తో నేను పొందిన అనుభవాల నుంచి, నా అంతరాత్మ నుంచి మాట్లాడతాను. మీరు వినేటప్పుడు మీ అంతరంగంలోని ఉనికి నుంచి పరిపూర్ణమైన శ్రద్ధతో పూర్తిగా వినండి. అప్పుడు మాత్రమే మీరు నా అనుభవాలని కొంత వరకైనా చూడగలుగుతారు. నేను ఏవో కొన్ని మాటలు చెప్పటానికి ఇక్కడ లేను. నేను మిమ్ములని ఈ మాటలకి అతీతంగా తీసుకువెళ్ళటానికి ఇక్కడ ఉన్నాను. మీరు ఇక్కడ పూర్తిగా తెలుసుకునే తత్వంతో చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ మాటలకి అతీతంగా వెళ్ళగలుగుతారు. అప్పుడు మీరు మీ ఆత్మని దర్శించగలుగుతారు.
సరే. ఇప్పుడు మనం మీరు కూర్చున్న పద్ధతిని కొంచం మార్చుదాము. మీరు కూర్చున్నప్పుడు మీ బంధువులతో, స్నేహితులతో లేదా మీకు తెలిసిన వారితో కూర్చోవద్దు. మీకు తెలియని వారి దగ్గర, మీ మనస్సుకి తోచిన విధంగా కూర్చోండి. మీకు తెలిసిన వారితో కూర్చుంటే, మీరు తప్పని సరిగా ఒకరిని ఒకరు చూసుకుంటుంటారు. వీలయితే ఒకటి రెండు మాటలు మాట్లాడుకుంటారు. నేను మాట్లాడుతూ ఉండగానే మీరు ఇవన్నీ చేస్తారు. అలా కాకుండా మీకు తెలియని వారితో కూర్చుంటే మీరు నేను చెప్పే విషయాలు పూర్తిగా గ్రహించగలుగుతారు.
మరొక విషయం అర్ధం చేసుకోండి : నేను నా ప్రతి కార్యక్రమంలో ఈ విషయాన్ని చెబుతాను. నా ప్రసంగం జరుగుతున్నంత సేపు, ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు ఇక్కడ చక్కని శక్తి ప్రవహించుతూ ఉంటుంది. మీరు నాలో పూర్తిగా విలీనం అయిపోయి మన మధ్య ఒక సత్సంగమం ఏర్పడుతుంది. అటువంటి సందర్భాలలో
మీరు హాలులోపలికి ఆలస్యంగా రావద్దు. అటువంటిప్పుడు ఆ శక్తి ప్రవాహాన్ని విచ్ఛిన్నం చేస్తారు.
ఇది ఎలా ఉంటుందంటే మీరు హైవే మీద సాఫీగా ప్రయాణం చేస్తున్నప్పుడు స్పీడు బ్రేకర్ వస్తే ఎలా ఉంటుంది. ఇది అంతే : స్పీడు బ్రేకరు చిన్న ఆటంకం మాత్రమే. కానీ దానిని దాటాలంటే మీరు మీ వాహనం యొక్క వేగాన్ని తగ్గించాలి. దానిని దాటాక అప్పుడు మళ్ళీ వేగం పెంచాలి. అప్పుడు సాఫీగా సాగే ప్రయాణంలో అంతరాయం కలుగుతుంది.
మరొక విషయం దయచేసి మీ సెల్ ఫోనులు కట్టేయండి. ఈ రోజులలో అదొక సామాన్యమైన స్పీడు బ్రేకర్ అయిపోయింది. ఈ స్పీడు బ్రేకరు ప్రయాణాన్ని మొత్తం గందర గోళంలా చేస్తాయి. ఎందుకంటే ఒక స్పీడు బ్రేకరు ఒకదాని తరువాత ఒకటి ఇలా విరామం లేకుండా వస్తూనే ఉంటాయి. మీ అందరి దగ్గరా సెల్‌ఫోనులు ఉండి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నంత సేపు వాటిని కట్టేసేయండి.
మీరు ఇక్కడ ఉన్నంత సేపు సీరియస్‌గా, భారంగా ఉండవద్దు. నిజాయితీగా వినండి. వినేటప్పుడు తేలికైన భావంతో, ఆహ్లాదంగా వికసించినవారై వినండి. ఇక్కడికి ఏదో మొదటి క్లాసులోనే మీకు భగవంతుని అనుభవాలు జరుగుతాయి అని ఆశించకండి. తేలికగా, ఆహ్లాదంగా మమూలుగా ఉన్న మనస్సుతో, ఎటువంటి ఆకాంక్షలు ఆశించటాలు లేకుండా వినండి. అప్పుడు మీరు నా నుంచి చాలా పొందగలుగుతారు.
మీరు మీ స్థిరమయిన అభిప్రాయాలతో, ఏవో ఆశించుతూ ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నంతసేపు మీరు మీ ఆకాంక్షల గురించి, మీ అభిప్రాయల గురించి ఆలోచించుతూ ఉంటారు. మీరు మీ ఆకాంక్షల మీద ఏకాగ్రత నిలపటానికి, వాటి కోసం ఇక్కడికి రాలేదు. నేను ఏమి చెబుతానో దాని మీద మీ ఏకాగ్రత నిలపటానికి ఇక్కడికి వచ్చారు.
మరొక విషయం : మీరు మీ సమాజపు అహంకారాన్ని బయట వదిలివేసి, ఇక్కడ ఉన్నంత వరకూ ఒక సామాన్యునిలా ఉండండి. ఆశ్రమము, గురువు సమక్షము
మీకు ఒక చక్కని ప్రయోగశాల వంటివి. ఇక్కడ మీ మీద మీరు ప్రయోగాలు చేయవచ్చు. మీ అహంకారం పోయేటట్టుగా, మీ ఊహలు కల్పనలను వదిలేసే విధంగా మీరు ప్రయోగాలు చేయవచ్చు. మీరు ఈ అనంత చైతన్య సృష్టిలో ఒక భాగమే అని మీకు మీరు నిరూపించుకోవచ్చు. ఆ అనుభవాన్ని మీ అంతరంగంలో పూర్తిగా పొందవచ్చు.
మీరు సమాజంలో ఏదో ఒక హోదాలో ఉన్నా, ఇక్కడ మాత్రం ఒక సామాన్యునిలా ఉంటూ అందరితో హృదయపూర్వకంగా కలసిపొండి. నా మాటలే కాదు, ఇక్కడ మీరు జరిపే సంభాషణ, ప్రతి పరిచయము, మీరు ఇక్కడ వున్న ప్రతి క్షణమూ, మీలో అద్భుతమైన మార్పుని తీసుకువస్తుంది. అది మీరు తెలుసుకోగలిగితే చాలు. అంతే.
ఒక చిన్న కథ:
ఒక మహాజ్ఞాని అయిన బౌద్ధ గురువు దగ్గరికి జపాను దేశ గవర్నరు వస్తాడు. ఆయన తన పేరు ఉన్న విజిటింగ్ కార్డుని లోపలికి పంపించుతాడు. దాని మీద జాక్సొన్ -జపాన్ గవర్నరు అని రాసి ఉంటుంది.
బౌద్ధ గురువు ఆ కార్డుని చూసి " ఇటువంటి మూర్ఖులతో నాకు పనిలేదు. అతనిని వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పండి ” అని అంటాడు. బౌద్ధ గురువులు కొన్నిసార్లు చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఆ మాటలలోని శక్తి మనని చీల్చుకుని మన లోపలికి వెళ్ళి మనలో మార్పు తెస్తుంది.
ఆయన శిష్యుడు వెనక్కి వచ్చి గవర్నరుకి ఆ కార్డు అందిస్తూ గురువుగారు ఏం చెప్పారో సరిగ్గా అవే మాటలు గవర్నరుకి చెబుతాడు. గవర్నరు తాను లోపలికి పంపించిన కార్డు చూస్తాడు. ఆయన చాలా తెలివైన వాడు. మంచి సూక్ష్మబుద్ధి ఉన్నవాడు. ఆయన కార్డులో జపాను గవర్నరు అనే మాటని కొట్టేసి ఆ కార్డుని తిరిగి గురువు దగ్గరికి పంపిస్తాడు. గురువు ఆ కార్డు తీసుకొని “ అతనిని లోపలికి రమ్మని చెప్పండి” అంటాడు.
మనకి ఉండే పదవులు, గౌరవాలు, హోదాలు అనేవి మనకి సంఘం అంటించిన ముద్రలు. కాని మనం ఈ గుర్తులె మనం అని అనుకుంటాము. అలా అని గర్వపడతాము. గురువులని దర్శించటానికి వెళ్ళేటప్పుడు ఇటువంటి హోదాలు, గుర్తులతో వెళ్ళకూడదు. ఈ హోదాలు మనతో ఉంటే మనం ఏమిటో పూర్తిగా తెలుసుకోలేము. ఇక్కడ గవర్నరు చేసిన పని తప్పుకాదు. రక్షణ దృష్ట్యా లేదా సమాజపు నిబంధనలననుసరించి ఆయన చేసిన పని సరియైనదే. అటువంటి వాళ్ళు హోదా సంబంధమయిన కొన్ని మర్యాదలు, నిబంధనలు పాటించాలి. కానీ గురువుల దర్శన సమయంలో అవి అవసరం లేదు.
కాబట్టి మీరు లోపలికి వచ్చే సమయంలో మీ హోదాలను బయట వదిలివేయండి. లేకపోతే మీరు చాలా కోల్పోతారు. ఇక్కడ గురువుకి, శిష్యునికి మధ్య కొంత సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. మనం మన అంతరంగ ప్రపంచానికి సంబంధించి చాలా విషయాలు ఇచ్చిపుచ్చుకుంటాము. అది జరిగే సమయంలో బయట ప్రపంచంలోని మీ హోదాలు అడ్డుగా నిలుస్తాయి.
మీ వ్యక్తిత్వాన్ని మరిచిపోవటమే ఆధ్యాత్మికత. ఎందుకంటే వ్యక్తిత్వం అనేది సమాజానికి సంబంధించిన విషయం. మనం ఇక్కడికి వ్యక్తిగా మనం ఏమిటో తెలుసుకోవటానికి వచ్చాము. అది మన పారంపర్య సహజ లక్షణము. మనం తల్లి గర్భంలో ఉన్నపుడు ఏవిధంగా అయితే ఒంటరి తనపు ఆనందాన్ని అనుభవించామో, ఏవిధంగా అయితే సర్వాంతర విశ్వశక్తి తో సంబంధాన్ని కలిగి ఉన్నామో, ఏ సంబంధాన్ని అయితే మనం అంతిమంగా ఆనంద ఉత్సవాలు జరుపుకుంటామో, దానిని తెలుసుకోవటానికి మనం ఇక్కడ ఉన్నాము.
సరే! ఇప్పుడు మీరు అందరూ వెళ్ళి అందరినీ పరిచయం చేసుకోండి. మనం ఇక్కడ ఉన్న ఈ కొద్ది రోజులూ మనం ఒక సమూహ శక్తిని సృష్టించుతాము. మీరు హాలు అంతా తిరుగుతూ అందరినీ పరిచయం చేసుకోండి. ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకోండి. ఒక వేళ వాళ్ళు మీ కుటుంబ సభ్యులయినా మీ స్నేహితులయినా పరిచయం చేసుకోండి. ప్రతీ క్షణం ప్రతి వ్యక్తీ ఒక కొత్త వ్యక్తిగా ఉంటారు. ఈ
విషయం గుర్తుంచుకోండి. ఆ వ్యక్తి నాకు బాగా తెలుసు అని అనుకోవద్దు. మీకు వాళ్ళు తెలియరు. ఎందుకంటే ప్రతి వ్యక్తీ ప్రతి క్షణం మారుతూ ఉంటారు కాబట్టి మీరు ఇప్పుడు వెళ్లి అందరినీ పరిచయం చేసుకోండి.
(అందరూ లేచి వెళ్ళి ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. చాలా మాటలు, నవ్వులు హడావుడి వీటి మధ్య పరిచయాలు సాగుతుంటాయి)
సరే! మీ పరిచయాలు పూర్తి చేసుకున్నారు. కదా! ఇప్పుడు మీకు చాలా సౌఖ్యంగా, తేలికగా ఉంటుంది. ఏదో కొత్త వారితో కూర్చున్నాము అనే భయం ఇక మీతో ఉండదు.
మనం ఈ కొన్ని రోజులలో చాలా విషయాల గురించి చర్చించుకుంటాము. ప్రతి మాటని శ్రద్ధగా వినండి. మీలో సరిపడా ఖాళీ ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మీరు వినే ప్రతి విషయాన్ని మీ లోపల అన్వయించుకోండి.
ఒక విషయం గుర్తుంచుకోండి : నేను మీకు బోధలు చేయటానికి ఇక్కడికి రాలేదు. మీరు ప్రయోగాత్మకంగా, అనుభవాన్ని పొందే విధంగా చేస్తాను. మీతో సాధన చేయించుతాను. మీరు సాధన మొదలు పెట్టటానికి ఇదే మంచి ముహూర్తము. కాబట్టి సాధన మొదలుపెట్టటానికి మంచి ముహూర్తం కోసం చూడవద్దు. అది ఇప్పుడే, ఇక్కడే ఉన్నది.
నేను మాట్లాడే విషయాలు మీరు వినేటప్పుడు, మీ మైండ్ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి అనుమానంతో : రెండవది నమ్మకంతో.
అనుమానంతో అన్నది మేధస్సుకి సంబంధించిన విషయం. అనుమానం ఉన్నప్పుడు నేను చెప్పే విషయాలు మీరు గ్రహించటానికి, నన్ను మీలోనికి తీసుకోవటానికి కారణాలు తర్కం, ఇలా ఎన్నో అడ్డంకులు వస్తాయి. అలా జరిగినప్పుడు మీరు మొత్తం కోల్పోతారు. ఏమీ గ్రహించలేరు.
నమ్మకం కూడా అటువంటిదే, మీరు నన్ను నమ్మితే మీరు మిస్ అయిపోతారు. ఒక విషయం అర్ధం చేసుకోండి. మీరు నన్నే కాదు ఎవరినీ నమ్మనవసరం లేదు.
ఇలా ఎదుటి మనుషులని నమ్మే నమ్మకస్తులు కొంత బలహీన మనస్కులయి ఉంటారు. ఎందుకంటే ఎటువంటి నమ్మకాలు లేకుండా బ్రతకాలి అంటే చాలా ధైర్యం కావాలి. మీలో నమ్మకాలు లేకపోతే, మీరు ఆధారపడటానికి ఒక వ్యవస్థ ఉండదు. మీరు చేసే పనులని సమర్ధించటానికి ఒక వ్యవస్థ ఉండదు. మీరు ఏమి ఆలోచించాలో ఏమి మాట్లాడాలో ముందుగా తయారు చేసుకున్న భావాలు ఉండవు. ఇటువంటి నమ్మకాలు లేకపోతే మీరు కేవలం మీ తెలివితేటలు మీద మాత్రమే ఆధారపడవలసి వస్తుంది. ఇది మీకు మీ మీద అపనమ్మకాన్ని కలిగిస్తుంది. అభద్రతా భావాన్ని పెంచుతుంది.
అనుమానము, నమ్మకము ఒక నాణానికి ఉండే రెండు ప్రక్కలు. ఆ నాణమే మీ మైండ్. బాగా లోతుగా ఆలోచించితే పెద్ద అనుమానంతో పాటు కొంత నమ్మకం ఉంటుంది. అలాగే గొప్ప నమ్మకంతోపాటు అనుమానం ఉంటుంది. ఈ విషయంలో నేను మీకు హమీ ఇవ్వగలను.
అయితే ఇప్పుడు మనం ఏమి చేయాలి? ఎలా వినాలి?
మీరు విశ్వాసంతో వినండి. విశ్వాశం ఒక శక్తి. బోధనలని జీవితానుభవాలుగా మార్చగలిగే శక్తి విశ్వాశానికి ఉన్నది. నేను మీకు “సూర్యోదయం తూర్పున జరుగుతుంది ” అని చెప్పాననుకోండి. మీరు ఆ మాటని నమ్మవద్దు. ఆ విషయంలో అనుమానం వ్యక్తం చేయవద్దు. ఇది అంతే అని అనుకోండి. అంతే. ఒక వేళ ఈ విషయం ఇంతకు ముందు మీరు గమనించలేదనుకోండి, లేదా నేను చెప్పిన విషయం తెలుసుకోవాలనుకుంటే రేపు ఉదయాన్నే నిద్ర లేచి, మీరే ఆ విషయాన్ని చూసి నిర్ధారించుకోండి. దీనిని ఒక ప్రయోగంలా చేయండి.
నేను మీ నుంచి ఇటువంటి దృక్పదాన్ని ఆశిస్తున్నాను. నేను చెప్పే ప్రతి విషయాన్ని వికసించిన, తెరచి ఉంచబడిన మనస్సుతో లోపలికి తీసుకోండి. నేను చెప్పే ప్రతి విషయాన్ని అనుభవ పూర్వకంగా లోపలికి తీసుకోండి. మీరు రోజులో ఎదుర్కొనే ప్రతి క్షణాన్ని, ప్రతి విషయాన్ని ప్రతి సంఘటననీ మీరు ఇదే విధంగా మీ లోపలికి తీసుకోండి.
కాబట్టి విశ్వాశంతో వినండి. నమ్మకంతో కాదు. నేను చెప్పే విషయాలను ఒక పరికల్పనగా (ప్రయోగాత్మకంగా తెలుసుకోగలటాన్ని పరికల్పన లేదా Hyphothesis అని అంటారు) తీసుకోండి. దానిని మీ జీవితానికి అన్వయించుకోండి. అప్పుడు అది మీ జీవితానికి పనికొస్తుందా లేదా తెలుసుకోండి. మామిడి పండు తీయగా ఉందా లేదా అనే విషయం మీరు నమ్మవద్దు, అనుమానం వ్యక్తం చేయవద్దు. దానిని తిని రుచి మీరే తెలుసుకోండి.
ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో సార్లు ఋషులు, యోగులు, గురువులు ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నారు. అది మానవుల సహజ లక్షణం, శాశ్వతానందం మాత్రమే అని. ఎన్నో సంవత్సరాలుగా గొప్ప యోగులు ఈ భూమి మీద అవతరించారు : వారు బుద్ధుడే కానీ, శ్రీ కృష్ణుడే కాని, జీసస్ క్రైస్ట్ కాని, మహావీరుడు గాని ఎవరయినా సరే. వారి సందేశంలోని సారం ఒక్కటే. వారందరూ మనిషి యొక్క నిజమైన సహజమైన లక్షణం 'పరమానందం'. వారంతా కూడా తిరిగి మనని ఆ పరమానందంతో అనుసంధానం చేయటానికి చాలా పద్ధతులని, దారులని చూపించారు.
వారు వెల్లడి చేసిన పద్ధతులు, చూపించిన మార్గాలు వేరు వేరుగా ఉండవచ్చు. కానీ వారి సందేశం మాత్రం ఒక్కటే. కానీ, ఈ ప్రజలు మళ్ళీ మళ్ళీ కూడా ఈ మహాయోగులు ఇచ్చిన సందేశాన్ని వినకుండా, కేవలం వారిని మాత్రం పట్టుకుని ఉంటున్నారు. వారి ఆకారానికి, ఆవ్యక్తులకి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు. కానీ వారు ఇచ్చిన సందేశాలను మాత్రం పట్టించుకోవటం లేదు. మత మౌఢ్యాలకి, మత యుద్ధాలకి, అన్నింటికీ ఇదే అసలు కారణం. వారి సందేశాలని గ్రహించాలికాని వారి ఆకారాలని కాదు.
సరే! గురువులు యోగులు అందరి సందేశం ఒకట్టే. మనిషిలోని అతి ప్రముఖమయినభాగం 'పరమానందమే' అని. మానవుల ప్రయత్నాలన్నీ కూడా తన అంతరంగంలోని ఈ పరమానందం కోసమే. కానీ కాలక్రమేణ, కొన్ని సమాజపు నిబంధనలు, కొన్ని ఆటంకాలు, ఆకర్షణల వలన, పరిస్థితుల ప్రభావంతో మనిషి
తన లక్ష్యాన్ని మరిచిపోయాడు. ఆ పరమానందాన్ని బయట ప్రపంచంలోని వస్తువులలోను, పేర్లలోను, కొన్ని కొన్ని రూపాలలోనూ, కొన్ని రకాల ముద్రలు, గుర్తింపులలోనూ, బంధాలలోనూ, తన ఉద్యోగం, పని పాట్లలోనూ ఇలా ఎన్నో విషయాలలో వెతుకుతున్నాడు.
ఒక చిన్న కథ :
ఒక పెద్దాయన కుటుంబ సభ్యులతో కలసి సినిమాకి వెళతాడు. సినిమా ప్రారంభం కాగానే అకస్మాత్తుగా చీకట్లో కింద నేల మీద ఏదో వెతుకుతుంటాడు. అతని ప్రక్కనే కూర్చున్న అతని మనుమరాలు ఇదంతా గమనించి చీకట్లో నేల మీద ఏమిటి వెతుకుతున్నావు అని కోపంగా అడుగుతుంది. దానికి ఆ పెద్దాయన " నా చూయింగ్ గమ్ పడిపోయింది. దాని కోసం వెతుకుతున్నాను” అని అంటాడు.
ఆమాటకి ఆ అమ్మాయి చికాకుపడిపోయి “ తాతయ్య ! పోతే పోయిందిలే దాన్ని వదిలేయి. మనం వేరే చూయింగ్ గమ్ కొనుక్కుందాము. ముందు సినిమా చూడు” అని అంటుంది.
ఆ పెద్దాయన " నాకు ఆ చూయింగ్ గమ్ మాత్రమే కావాలి” అంటాడు
మనుమరాలికి చాలా కోపం వస్తుంది. “తాతయ్య చిన్న పిల్లాడిలా ప్రవర్తించకు మనం వేరేది కొనుక్కుందాము” అంటుంది
అప్పుడు ఆపెద్దాయన " నా పళ్ళు ఆ చూయింగ్ గమ్‌లో ఉన్నాయి” అంటాడు
(అంతా నవ్వులు)
చూడండి. మనం నిజంగా వెతికేది ఒక దాని కోసం. కాని దానిని మరొక పేరుతో వెతుకుతాము. చివరికి, ఈ బయట ప్రపంచంలో చాలా సాధించాకా కూడా మనలో శూన్యం ఏర్పడటం మనం తెలుసుకుంటాము. మనలో ఏదో ఒక వేదన ఉండటాన్ని గమనిస్తాము. ఈ వేదన ఈ పరితాపం మనం వెతుకుతున్న పరమానందం కోసమే. కానీ మనం దీనిని మరొక పేరుతో మరొక విధంగా వెతుకుతాము. అందుకే
మనకి ఎప్పటికీ సాధించిన పరిపూర్ణత, తృప్తి లభించవు. ఈ ఆవేదననే మనం అంతరాత్మ యొక్క పిలుపు అని అంటాము.
మనం బయట ప్రపంచపు విషయాలలో పూర్తిగా మునిగిపోయి మన అంతరంగంలో అతి ముఖ్యమైన మన ఉనికిని మర్చిపోతున్నాము. మనం మన అంతరంగపు ఉనికి మీద మన ఏకాగ్రతని నిలపాలి. బయట ప్రపంచంలోని విషయాలని ఒక నాటకంలోని పాత్రలా చేయాలి. కానీ మనమేం చేస్తున్నాము? బయట ప్రపంచపు విషయాలలో లోతుగా, పూర్తిగా నిమగ్నమయిపోయి, మన అంతరాత్మకి పూర్తిగా దూరమయిపోతున్నాము.
మనం మన మీద, మన అంతరంగం మీద ఏకాగ్రతని నిలుపలేకపోతే, మనం పరిపూర్ణత్వాన్ని అనుభవించలేము. బయట ప్రపంచపు విషయాలను మనం పూర్తిచేయగలుగుతాము. కానీ వీటిలో పరిపూర్ణత సాధించలేము. ఎప్పుడయితే ఈ పరిపూర్ణతని మనం సాధించలేమో, మన అంతరంగం వేదనా భరితమవుతుంది. మనం ఎక్కడో ఏదో పోగొట్టుకున్నాము. అని మనం నిరంతరం ఆలోచిస్తూ ఉంటాము. ఆ పోగొట్టుకున్న దానిని బయట ప్రపంచంలో వెతకటం ప్రారంభించతాము.
మీరు ఎప్పుడయితే మీ అంతరంగం మీద, మీ ఏకాగ్రతని తెలుసుకునే తత్వంతో నిలుపుతారో, అప్పుడు మీరు బయట ప్రపంచంలో ఏమి చేసినా, మీరు నిరంతరం పరిపూర్ణతని సాధించిన తృప్తిని పొందుతారు. ఎందుకంటే ఆ తృప్తి మీకు బయట ప్రపంచం నుంచి దొరకలేదు. అది మీ అంతరంగం నుంచి మీకు దొరికింది.
మీరు ఎప్పుడయితే మీ అంతరంగం గురించి తెలుసుకోగలుగుతారో, దాని మీదే కేంద్రీకరించుతారో అప్పుడు మీకు సంపూర్ణత్వం అనేది ప్రతి నిముషం ఉంటుంది. మీరు ఈ ప్రపంచంలో ఏమి చేసినా అది పూర్తిగా నిర్వహించాము అనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి నిర్వహణ అనే ఆ అనుభూతి మన లోపలి నుండి వస్తుంది కాని బయట ప్రపంచం నుంచి కాదు.
కాబట్టి మనకి గురువులు తరతరాలుగా చెప్పేది విషయాలను లోతుగా చూడాలి అని. కానీ ఆ పరమానందాన్ని పొందగోరే వారు, దాని కోసం వెతికేవారు ఆ వెతుకులాటలో పడి గురువుల సందేశాలని వినటం లేదు. వారికి కేవలం వెతకటంతోనే సరిపోతుంది. కాని గురువుల సందేశంలో ఉండే గొప్ప సత్యాన్ని కాని, శక్తిని కాని క్షణ దర్శనమైనా చేసుకోలేపోతున్నారు. వారు శాశ్వతంగా అలా ప్రయాణిస్తూనే ఉన్నారు.
ఈ ప్రయాణం చేస్తున్న భావన ఎలా ఉంటుందంటే "పుస్తకాన్ని ఎంచుకోవటానికి ప్రయత్నిస్తున్నాను" అన్నట్టుగా ఉంటుంది. పుస్తకాన్ని ఎంచుకోవటానికి ప్రయత్నిస్తున్నాను ఏమిటి? అసలు అలాంటిది ఎక్కడయినా ఉన్నదా? దీనిలో అర్థం లేదు. మీరు పుస్తకం తీసుకోవాలి లేదా మానేయాలి. అంతే కాని తీయటానికి ప్రయత్నిస్తున్నాను అంటే అర్థం లేదు. అలా అంటే మిమ్ములని మీరు మోసం చేసుకోవటమే. మీరు వేరే వారికి అలా చెప్పి వారిని మోసం చేయలేరు. ఎందుకంటే మీరు చేసే పని తెలివి తక్కువదని వారికి తెలుసు.
ఇది ఎలా ఉంటుందంటే డబ్బు సంపాదించలేని వారు సామాన్యంగా "మేము నిజాయితీపరులం, అందుకు డబ్బు సంపాదించలేకపోయాము" అంటారు. కానీ వారికి అటువంటి శక్తి లేదు అనేది నిజం. కాని వారు పై విధంగా చెప్పి సమర్థించుకుంటారు.
మనం ఎప్పుడయితే ఈ ఆధ్యాత్మిక చింతనలోనికి పెద్ద అడుగువేయలేమో, అలాగే మాకు ఏమీ తెలియదు అన్న విషయాన్ని ఒప్పుకోలేమో, అప్పుడు మన అహాన్ని తృప్తి పరచుకోవటానికి మన సొంత వేదాంతాన్ని సృష్టించుకుంటాము. అంతేకాకుండా నాకు ఆధ్యాత్మికత గురించి బాగా తెలుసు, ఇక జ్ఞానోదయమవటమే ఆలస్యం అని చెప్పుకుంటాము.
నేను చెప్పేది వినండి. నేను ఆధ్యాత్మికంగా బహుపేదని అనే నిజాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే చాలు. అదే మీలో చక్కని మార్పుని తెస్తుంది. మీలో రసాయన చర్య ప్రారంభమవుతుంది, దాని వెంబడి సత్యము, నీతి, నమ్మకాలు అప్రయత్నంగా వస్తాయి. కాని మనం వాటిని వద్దు అనుకుంటాము. ఎంతసేపు వెతుకులాడే అహంభావాన్ని పెంచుకుంటాము. దానిని మనకు అసలైన సత్యానికి మధ్యలో నిలబెడతాము.
ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కారులో ఉండే షాక్ అబ్జార్బర్స్ మనం ప్రయాణించేటప్పుడు మనని కుదుపుల నుంచి ఎలా దూరం చేస్తాయో అలా మనని మనం ' వెతుకుతున్నాము అనే అహం' సత్యం నుంచి దూరం చేస్తుంది. ఇది సత్యానికి మనకి మధ్య మెత్తని స్పాంజిలా అడ్డంగా వుంటుంది. ఆ మెత్తని సౌఖ్యానికి మనం ఎంతో సంతోషంగా జీవితాంతం వెతుకుతూనే లేదా ప్రయత్నిస్తూనే ఉంటాము. నేను గొప్ప జీవిత శోధకుడిని అని ముగింపులు చెబుతాము.
నేను ఈ కొద్ది రోజులు మీకు ఏమి చెప్పినా పూర్తిగా తెలుసుకునే విధంగా వినండి. దీనిలో ఉండే ముఖ్య ఆధారమయిన తీగని పట్టుకోండి. ఈ మొత్తాన్ని ఏకం చేస్తూ కూర్చి ఈ మొత్తాన్ని ఒకే విధంగా నడిపించుతున్న ఆ దారాన్ని పట్టుకోండి. మీరు అది చేయగలిగితే, మీరు మీ అంతరంగంలో ఒక ప్రదేశాన్ని సృష్టించగలుగుతారు. ఆ ప్రదేశంలోనే మీకు రావలసిన మార్పు జరుగుతుంది. అలా చేయలేనప్పుడు మీరు కేవలం కొన్ని మాటలని పోగుచేసుకుంటూ, నిరంతరం వెతుకుతూ ఉండిపోతారు. మీలో రావలసిన మార్పు వచ్చే వరకూ, ఈ మాటలన్ని నిరుపయోగమే. ఆమార్పు అనేది కేవలం మీరు లోతుగా తెలుసుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది.
ఈ విషయం స్పష్టంగా తెలుసుకోండి. ఈ హాలులో వెయ్యిమంది ఉన్నా కూడా నేను మాట్లాడేది కేవలం మీతోనే. అంటే అది మీరు మాత్రమే. నా దగ్గర ఉన్న దారం మిమ్ములని అందరినీ నాతో కలుపుతూ వెళుతుంది. కాబట్టి నేను చెప్పే విషయాలు నాకు కాదు, నా ప్రక్కవారికి అని అనుకోకండి. వీటిని వేరే వారికి అన్వయించకండి. అలా చేస్తే మీరు మొత్తం మిస్ అయిపోతారు.
మన మధ్యన ముఖ్యమైన బంధంలా ఉండే నా మాటల తీగని పట్టుకోవటానికి ప్రయత్నించండి.
నేను చెప్పే విషయాలు ఇతరులకు అన్వయించకండి. అలా చేస్తే నేను చెప్పే విషయాలు గ్రహించలేక చాలా పోగొట్టుకుంటారు.
మనలో చాలా సామాన్యమైన ధోరణి ఒకటి వుంది. మనం ఆరోగ్య విషయాలు చర్చించుకుంటే వెంటనే ఆ విషయాలను మనకి అన్వయించుకుని, మన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎక్కడ ఉందో అంచనా వేస్తాము. ఆ చర్చలో వచ్చిన అనారోగ్య చిహ్నాలు ఏమైనా మనలో ఉన్నాయో అని తరచి చూసుకుంటాము. అదే శరీరంలో చర్మసంబంధమైన విషయాలు మాట్లాడితే మన చర్మాన్ని గమనిస్తాము. గుండె గురించి మాట్లాడితే వెంటనే మన గుండె ఎలా కొట్టుకుంటుందో పరీక్షిస్తాము. కానీ ఎవరయినా ఆధ్యాత్మికతను గురించి మాట్లాడితే మాత్రం దానిని వేరే వారికి అన్వయిస్తాము. అది మన కుటుంబ సభ్యులు కాని, స్నేహితులుకాని, ప్రక్కవారు కాని ఎవరయినా సరే. కాని మనకు మాత్రం అన్వయించుకోము.
అసలు సమస్య ఏమిటి అంటే నేను ఏదైనా చెప్పగానే మీరేమనుకుంటారంటే, “ఆ! నా గురించి నాకు బాగా తెలుసు. స్వామి చెప్పే సందేశం నా భర్తకి సరిగ్గా సరిపోతుంది. స్వామి చెప్పే ఈ మాటలు తప్పని సరిగా నా భర్త పద్ధతులని మార్చుతాయి. నాకు నమ్మకంగా ఉంది. నా భర్తకి స్వామి సందేశం అంది ఉంటుంది” అని అనుకుంటారు.
(హాలు అంతా నవ్వులు)
నేను సమస్యల గురించి చెబితే, వెంటనే మీరు మీ అమ్మ ఎన్ని సమస్యలని ఎదుర్కొందో అని తలచుకుంటారు. కానీ మీ సమస్య గురించి అనుకోరు. కాని మీకూ సమస్యలుంటాయి. కాకపోతే మీ అమ్మగారు ఎక్కువ సమస్యలను ఎదుర్కొని ఉంటారు.
ఒక ముఖ్య సంగతి. నేను చెప్పే ప్రతీ మాటా మీ కోసం. మీకు మాత్రమే. నేను చెప్పే ప్రతి మాట ఒక బాణంలా దూసుకువస్తుంది. దానితో పాటు చాలా శక్తిని తెస్తుంది. దీని నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించవద్దు. దానిని అలాగే రానివ్వండి. అది మీలో చక్కని మార్పు తెస్తుంది. కాబట్టి నేను చెప్పేటప్పుడు ఇతరులవైపు చూడవద్దు. వారు ఎంత వరకూ అర్థం చేసుకున్నారో అనే కుతూహలంతో వారిని గమనించవద్దు. అలా చేస్తే మీరు నే చెప్పే విషయాలు కొన్ని గ్రహించలేరు. ఏదో కొంత పోగొట్టుకోవలసిన వస్తుంది.
నిజంగా మీ గురించి మీకు బాగా తెలిస్తే మీకు సమస్యలు అనేవి ఉండవు. అసంతృప్తి, బాధ, భయం, కోరిక, అసూయ, అహంకారం అనేవి అసలు ఉండవు. ఇదే మీ గురించి మీకు అన్నీ తెలుసు అనటానికి చక్కటి నిదర్శనం. కానీ ఇవన్నీ మీలో ఉంటాయి. ఇదే మీ గురించి మీకు పూర్తిగా తెలియదు, ఏమీ తెలియదు అని తెలియచేస్తుంది. ముందుగా మీకు ఏమీ తెలియదు అని తెలుసుకోండి. దాంతో కనీసం మీకు మీ గురించి తెలియదు అనే విషయం తెలుస్తుంది. మీకు తెలియదు అనే విషయం తెలియక పోతే మీకు ఏమీ తెలియదు అనే విషయం మీకు అసలు తెలియదు. ఒకరు స్వామిని ఈ విధంగా అడిగారు.
ప్రశ్న: స్వామీజీ, మేము మా గురించి తెలుసుకోవటం వైపు ప్రయాణం చేస్తున్నాము కదా! కాబట్టి ఇప్పుడు మాకు మా గురించి కొంత తెలిసి ఉంటుంది కదా.....
మీకు ఒక విషయం చెబుతాను. చాలా లోతైన ఆధ్యాత్మిక అనుభవంతో, ప్రయాణించటం అనే మాట ఉండదు. అది ఆ క్షణానికి సంబంధించిన అనుభవమే. అంతే. ఇలా తెలుసుకునే లేదా తెలుసుకోవటం అనేది మనం మన గురించి పూర్తిగా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం కాని మన లోతైన భావనలో చివరికి అక్కడ ఉండేది కేవలం 'తెలుసుకోవటానికి' లేదా 'తెలుసుకోకపోవటం' మాత్రమే అయితే మనం ఎక్కువగా తెలుసుకునే కొద్దీ, మనకి ఏమీ తెలియదు అని స్పష్టంగా తెలుస్తుంది. అది చాలు అదే మనికి నిజంగా తెలుసుకోవాలి అనే ప్రేరణని కలిగిస్తుంది.
భగవద్గీత మొదటి అధ్యాయం, అర్జున విషాదయోగం. అది అర్జునుని విషాదాన్ని తెలిపేది. ఇందులో పూర్తిగా అర్జునుడే మాట్లాడుతుంటాడు. కృష్ణుడు నిశ్శబ్దంగా వింటుంటాడు. చివరికి అర్జునుడు “నాకు ఏమీ తెలియదు” అని కృష్ణుడికి అధీనుడయినప్పుడే, అతను కృష్ణుని సందేశం వినటానికి సిద్ధమవుతాడు.
కృష్ణార్జునులు స్నేహితులు, కలసి ఆడుకునే వారు. వాళ్ళిద్దరు కలసిన ఉండే సంఘటనలు కొన్ని వందల సార్లు సంభవించుతాయి. కానీ అప్పుడెప్పుడూ కూడా కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పలేదు. ఎందుకంటే అర్జునుడు దానిని వినే పరిణితిని పొందలేదు. అర్జునుడు ఎప్పుడయితే "నాకు ఏమి తెలియదు" అని చెప్పి శరణాగతుడయ్యాడో అప్పుడే గీత వినటానికి అర్హుడయ్యాడు. ఆధ్యాత్మిక పురోగమనానికి "మనకి ఏమీ తెలియదు" అని మనం తెలుసుకోవటమే ప్రాథమిక నిబంధన. మన గురించి మనం తెలుసుకోవటానికి ఇది మొట్టమొదటి మెట్టు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
మీకు ఒక విషయం చెప్పాలి. మీరు స్వేచ్ఛగా ప్రశ్నలు అడగండి. నేను ఇక్కడికి కేవలము ప్రసంగాలు చేయటానికి రాలేదు. ఇది సంభాషణలా ఉండాలి. కాబట్టి ప్రశ్నలు అడగండి. మీకు ఏదైనా అయోమయంగా, అర్ధం కాకుండా వుంటే చెప్పండి. నేను స్పష్టంగా అర్ధమయ్యేటట్టు చెబుతాను.
మరొక విషయం : మీరు ప్రశ్నలు అడిగితే మీరు నిద్రపోవటములేదు అని నాకు నమ్మకం కుదురుతుంది. మీకు ఒక చిన్న కధ చెబుతాను. ఒక బస్సు డ్రైవరు, ఒక బోధకుడూ చనిపోయి యమలోకంలో యమ ధర్మరాజు కోర్టుకి వెళ్ళారు. యమధర్మ రాజు ముందుగా బస్సు డ్రైవరుని విచారించటం మొదలు పెడతాడు. జీవితంలో అతను చేసిన పనులు తెలుసుకొని అవి నిజమా కాదా అని రికార్డులు చూసి తృప్తి పడి అతనికి బంగారు తాళం చెవి ఇచ్చి నీకు విలాసవంతమైన గదిని ఇచ్చాను అని అక్కడికి పంపించుతాడు. ఇదంతా అక్కడే ఉన్న బోధకుడు చూస్తుంటాడు. అంతా గమనించి, " ఆహా! బస్సు డ్రైవరుకే బంగారు తాళం చెవి ఇచ్చి విలాసవంతమైన స్వర్గాన్ని ఇస్తే, నాకు తప్పకుండా ఇంకా మంచి బహుమతి ఇస్తాడు యమధర్మరాజు" అని అనుకుంటాడు.
అవును మరి బోధకుడు ఎప్పుడూ భగవంతుని గురించి బోధించేవాడు కదా! ఇప్పుడు బోధకుని వంతు వచ్చింది. యమధర్మరాజు విచారణ ముగించి బోధకుని నరకానికి వెళ్ళవలసిందిగా తీర్పు ఇస్తాడు. బోధకుడికి చాలా కోపం వచ్చింది. యమధర్మరాజు తీర్పు మీద అనుమానం వచ్చింది. అతను యమధర్మరాజుని తన తీర్పు విషయంలో వివరణ అడిగాడు. దానికి యమధర్మరాజు ఈవిధంగా వివరణ ఇచ్చాడు. "మీరు మీ జీవితంలో ఏమి చేసారో నాకు అవసరం లేదు. నాకు కావలసినది వాటి ఫలితమే. బస్సు డ్రైవరు బస్సు నడిపేటప్పుడు అతని దూకుడుకి భయపడి ప్రయాణీకులంతా భగవంతుని గురించి ఆలోచించుతూ, ప్రార్ధనలు చేసేవారు. కానీ నీవు బోధనలు చేసేటప్పుడు వారు నిద్రపోయేవారు. ఇదే కారణం"
(అంతా నవ్వులతో తేలిపోయారు)
కాబట్టి మీరందరూ ఇక్కడ మెలకువుగా, పరాకులేకుండా ఉండాలి. మీ కోసం కాకపోయినా కనీసం నా కోసం మీరు నిద్రపోవద్దు. లేకపోతే యమధర్మరాజు కోర్టులో నాకు సమస్యలు తప్పవు. మీరు ప్రశ్న అడగండి. మీకు అర్ధం కాకుండా అయోమయంగా ఉండే విషయాలను అడిగితే నేను మీకు స్పష్టంగా అర్ధమయ్యేట్టు చెబుతాను. మీరు ప్రశ్నలు అడిగితేనే విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అవి మన నిజ జీవితానికి అన్వయించుకోవచ్చు.
మీలో కొందరు ఇలా ప్రశ్నలు అడిగితే తెలివితక్కువ వారిలా కనిపిస్తామని అనుకోవచ్చు. అదే మీరు. ప్రశ్నలు అడగకపోతే ఎప్పటికి తెలివితక్కువ వారిగానే ఉండిపోతారు. కాబట్టి ఏ విషయమైనా మీకు నచ్చకపోతే లేదా మీరు ఒప్పుకోకపోతే వెంటనే ఆ విషయమై వివరణ అడగండి. మీ సందేహాలు తీరుస్తాను.
ఎవరో ఒక ప్రశ్న అడిగారు.
'స్వామీజీ ! మేము మాలో ఉండే వ్యతిరేక భావాలని నాశనం చేసి తిరిగి కొత్తవారిగా పుట్టాలని అనుకుంటున్నాము.
పై ప్రశ్నకి స్వామి ఇలా సమాధానం ఇచ్చారు.
అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ భూమి మీద దేనిని నాశనం చేయలేం. ఎప్పుడయినా మార్పు మాత్రమే సాధ్యం. మీలో వ్యతిరేక భావాలను వాస్తమైన మంచి భావాలుగా మార్చితేగలము. ఉదా: వ్యతిరేక భావాలను ప్రేమగా, తెలుసుకోగల శక్తిలా మార్పు తేవచ్చు
సంఘం మీకు విభజించటం నేర్పుతుంది. దాని ద్వారా మిమ్ములను నాశనం చేస్తుంది. అది మీకు ఎప్పుడూ కూడా ఒక భాగమవటం నేర్పదు. అది మీ మధ్య మీకు చీలికలు తెస్తుంది. దానితో సంఘానికి మిమ్ములను అదుపు చేయటం తేలిక. కాబట్టి మిమ్ములను పూర్తిగా నియంత్రిస్తుంది. ఎప్పుడూ మీలో ఎక్కువ తక్కువ అనే ఆలోచనలో పడేస్తుంది. అది మీతో మిమ్ములను పోరాటం చేసుకునేలా చేస్తుంది. మీ అంతరంగం కల్లోలంగా ఉన్నప్పుడు మీ మీద అజమాయీషీ చేస్తుంది. అది ముందుగా నీవు మంచివాడవు కాదు అనే భావం సృష్టించి అప్పుడు మీకు పరిష్కారాలు సూచిస్తుంది. అటువంటప్పుడే మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు.
ఒక వ్యక్తికి జలుబు చేస్తుంది. అతను డాక్టరు దగ్గరికి వెళ్ళి మందు అడుగుతాడు. ఇది మామూలు జలుబు మాత్రమే. డాక్టరు అతనిని పరీక్షగా చేసి " నీవు రాత్రికి కొంచెం సేపు చల్లగాలిలో తిరిగి అప్పుడు రా” అంటాడు. ఆ వ్యక్తి నిర్ఘాంతపోయి " అదేమిటి డాక్టర్! నేను అలా చల్లగాలిలో తిరిగితే నాకు న్యుమోనియా వస్తుంది కదా!" అంటాడు. అప్పుడు డాక్టర్ “అవును. నేను న్యుమోనియో త్వరగా నయంచేయగలను” అంటాడు.
(అంతా నవ్వుతారు)
సంఘం మిమ్ములను ఏదో చేసేసి, దాంట్లోంచి బయటికి ఎలా రావాలో నేర్పిస్తుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతాను. ఎక్కడా కూడా ఎక్కువ, తక్కువ అనేవి లేవు. కేవలం మార్పు మాత్రమే ఉంది. మీరు ఇది తెలుసుకుని మీలోనికి చూడగలిగితే మీలో మార్పు సాధ్యమవుతుంది. గురువుల దృక్పధం ఎప్పుడూ ఇలానే ఉంటుంది. గురువు మీకు మీలోనికి చూసుకోగలగటం నేర్పిస్తాడు. ఆయన మిమ్ములని ఎప్పుడూ విభజించడు. మిమ్ములను ఎల్లప్పుడూ ఒక సంపూర్ణ వ్యక్తిలా చేస్తాడు.
ఆయన మిమ్ములను ఎప్పుడూ వ్యతిరేకి అనడు. అటువంటిది అసలు లేదు. మీరు చెప్పే వ్యతిరేక, అనుకూల భావాలు ఒక వర్ణమాలలోని రెండు చివర భాగాలు. వ్యతిరేకత అనేది ఒక భౌతిక పదార్ధం కాదు, తీసి బయట పారవేయటానికి. మీలో మార్పు వచ్చినపుడు వర్ణమాలలోని ఉన్నత స్థితిలోనికి, వాస్తవాల శక్తి దగ్గరకి వెళతారు. అంతే. నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు మార్పు అనేది మీరు స్వీకరించటానికి సిద్ధంగా ఉన్న వికసించిన మనస్సుతో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.
ఒక ప్రశ్న :
స్వామీజీ! బుద్ధి అనేది ఒక మాయ, ఒక భ్రమ అని చాలా పుస్తకాలలో చదివాము. అలా అయితే మేము అడిగే ప్రశ్నలన్నీ భ్రమలేనా? దయ చేసి ఈ విషయం కొంచెం వివరించండి
(స్వామి నవ్వి జవాబు ఇచ్చారు)
మాయకు సంబంధించి గొప్ప ప్రసిద్ధి అయిన ప్రశ్న మళ్ళీ అడిగారు. మీకు ఒక విషయం చెబుతాను. కష్టమైనవి చదివి మిమ్ములను మీరు కలవరపెట్టుకోకండి. మరొక విషయం. బుద్ధితో అర్ధం చేసుకునేది ఏమీ లేదు. నిగూఢమైన జీవిత రహస్యాన్ని బుద్ధితో పరిష్కరించలేరు. మీ జీవితాశయాన్ని మీ బుద్ధితో తెలుసుకోలేరు. అందుకే మైండ్‌ని భ్రమ అంటారు.
జీవితపు నిగూఢార్ధాన్ని ఛేదించాలంటే ముందుగా ఈ మైండ్‌ని మీ జీవితంలోంచి తొలగించాలి. మీరు మీ మేధస్సుని ఆడనిస్తే అది మిమ్ములను ఆడిస్తుంది. అంతే. జీవితం తరువాత జీవితం. మీరు అలా ఆడుతూనే ఉంటారు. మీ లోతైన అంతరంగంలోని తృష్ణని తీర్చుకోలేరు. కాకపోతే మీరు వెతుకుతున్నాను, అనుకుని అహాన్ని తృప్తి పరచవచ్చు. కాని అది ఉపయోగంలేని పని. అటువంటప్పుడు మీ అంతరంగపు అంతరాలలో అయోమయం అలాగే ఉంటుంది.
మీరు మీ మేధస్సు నుంచి హృదయం లేదా మీ ఉనికి మీద కేంద్రీకరించండి. అలా కాకుండా మీరు మీ మేధస్సు చేత నడపబడితే ప్రశ్నల మీద ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి. ప్రశ్నలతో మీరు ఏమీ తెలుసుకొనలేరు. కేవలం తెలుసుకునే తత్వంలో మీరు దేనినైనా అర్ధం చేసుకోగలుగుతారు.
మీరు మీహృదయంతో నడపబడితే, తెలుసుకునే తత్వము, అర్ధం చేసుకోగల శక్తి వాటంతట అవే మీలో ఏర్పడతాయి. అప్పుడు మీ ప్రశ్నలన్నీ అప్రయత్నంగా కరిగిపోతాయి. ఇది ఎలా ఉంటుందంటే, సూర్యోదయమయినప్పుడు చీకట్లు ఎలా మాయమయిపోతాయో, మీలో తెలుసుకోగల తత్త్వం కలిగితే, అర్థం చేసుకోగలిగితే, మీలో ప్రశ్నలు కూడా అలా కరిగిపోతాయి.
అప్పుడు మీరు ప్రశ్నతో ముందుకి వచ్చేలోపుగానే విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఆ విధంగా ప్రశ్నలన్నీ మాయమయిపోతాయి. ఈ విషయం వినటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక్కసారి మీకు అనుభవమైతే అది ఏమిటో సరిగ్గా తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా నేను 'తెలుసుకోగల తత్త్వం' అని చెప్పే విషయం మీకు బాగా అర్థమవుతుంది. ప్రశ్నలు కరిగిపోయి అర్థం చేసుకోవటం అనేది మీలోపల నిండుతుంది.
మీరు ఏమాత్రం అర్థం చేసుకోగలిగినా మీరు 'మాయ' 'భ్రమ' గురించి బాధపడరు. నేను చెప్పే మాటలతో మీరు తెలివిగా విషయాన్ని అర్థం చేసుకోవటంతో పాటు ధ్యానం మీకు చాల సహాయం చేస్తుంది. అప్పుడు మీరు వాస్తవ దృక్పథంలోనికి వెళ్ళగలుగుతారు. మాయ, భ్రమ, వీటి గురించి మనం గంటల కొద్దీ మాట్లాడుకోవచ్చు. చివరికి మీరు మరింత అయోమయంలో పడిపోతారు.
దాని బదులు తెలివి, వివేకంతో జీవించటానికి సహాయపడే పరిష్కారాలను నేర్చుకుంటే అవి మీకు బాగా ఉపయోగపడతాయి. అది చాలు. కానీ మీకు ఒక విషయం చెబుతాను. మాయ, భ్రమ అనేవి కేవలం మీ మైండ్ సృష్టించిన భావాలే. అందుకే నేను మీతో మీ మైండ్‌ని వదిలివేయమని చెబుతాను. అంతే.
చూడండి : ఇంతకు ముందు మీకు చెప్పాను. పరమానందం మనలో నిరంతరం జరుగుతూ ఉంటుంది. అది ప్రధాన ఆధారమైన సత్యం. కానీ మనం నిరంతరం ఆ ఆనందాన్ని అడ్డుకుంటాము. దీనినే మనం జీవితంలో బాధ, వ్యధగా అనుభవించుతాము. పరమానందం అనేది బయట నుంచి తెచ్చుకుని మనలో పెట్టుకునే ఒక వస్తువు కాదు. ఇది మన సహజ లక్షణము. మీరు ఈ ప్రపంచంలోనికి వచ్చినప్పుడు పరమానంద స్థితిలోనే ఉన్నారు. ఎప్పుడయితే సమాజం నిబంధనలని మీలోనికి పంపటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి మీరు ఈ పరమానందానికి చాలా దూరమవటంలో ప్రవీణులయ్యారు. ఆ తరువాత దానిని పొందటానికి బయట ప్రపంచంలో వెదకటం మొదలుపెట్టారు.
మీరు ఇక్కడ ఉన్న ఈ కొద్ది రోజులలో మీలో నిరంతరం ప్రవహించే పరమానందాన్ని మీరు అడ్డుకునే పనులని ఎలా ఆపాలో చూద్దాము. నేను పరమానందం అంటే అది మీరు మీ మామూలు జీవితంలో, నిత్య జీవితంలో అనుభవించే సంతోషం కాదు. మీ సాధారణ జీవితంలో మీరు అనుభవించే సంతోషం బయట ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనల ఫలితమే. అది ఏమైనా సంతోషం కలిగించే విషయం అయి ఉండవచ్చు, ఏదైనా వస్తు లాభం, శుభవార్తలు, మంచి మానవ సంబంధాలు, ఒక వ్యక్తితో మంచి సంబంధం ఇలా బయట ప్రపంచంలో ఏ విషయమైనా ఆ సంతోషానికి కారణం కావచ్చు.
ఇటువంటి సంతోషం కేవలం బయట ప్రపంచంలోని మనుషులు లేదా కొన్ని సంఘటనల వలన కలగవచ్చు. ఇటువంటి సంతోషం మనకి దుఃఖాన్ని బాధలని కలిగించవచ్చు. ఎందుకంటే మనుషులు, పరిస్థితులు ఎప్పుడూ మారుతుంటాయి కాబట్టి అవి ఎప్పుడూ ఒకేవిధంగా ఉండవు కాబట్టి మనుషుల ప్రవర్తన వేరు వేరు సమయాలలో వేరు వేరుగా ఉంటుంది. అలా ఎప్పుడయితే వారి ప్రవర్తన మారుతుందో అప్పుడు మన సంతోషం కూడా మారుతూ ఉంటుంది.
కానీ ఇక్కడ నేను చెప్పే పరమానందం పూర్తిగా వేరు. అది పూర్తిగా మన అంతరంగానికి సంబంధించిన విషయం అది ఎటువంటి స్థితిలో కూడా బయట ప్రపంచంలోని సంఘటనల వలన ప్రభావితం కాదు. అది మీలోనికి అతి ముఖ్య భాగము అది మీలోని శాశ్వత స్థితి. మీరు ఎప్పుడయితే ఈ శాశ్వతానందాన్ని పొందుతారో అప్పుడు బయట ప్రపంచంలో జరిగే అన్నింటినీ అలా చూస్తూ ఉంటారు. మీరు ఒక పరమానంద పరిశీలకుడిగా మారతారు. మీరు బయట ప్రపంచంలోని అన్ని విషయాలలో నిమగ్నమవుతారు. కానీ ఎప్పుడూ ఎక్కడా ఈ ఆనందాన్ని పోగొట్టుకోరు.
ఒక చిన్న కథ :
ఒక ఇంటిలో ఒక పెద్దాయన ఉంటాడు. ఎంత ప్రయత్నించినా ఆయన ఆనందపడడు. ఎప్పుడూ మొండిగా, అసంతృప్తిగా ఉంటాడు. అతని కుటుంబ సభ్యులు అతనిని ఉత్సాహపరచాలని చాలా ప్రయత్నాలు చేసారు. కానీ ప్రయోజనం లేదు. అతని పిల్లలు, మనుమలూ అంతా వచ్చి అతనిని ఆనందపరచాలని చాలా ప్రయత్నించేవారు. కానీ అతనిలో మార్పు వచ్చేది కాదు.
ఒక రోజు అకస్మాత్‌గా ఆయన చాలా మృదువుగా, ఆనందంగా అయిపోయాడు. అతని కుటుంబ సభ్యులు అతనిలోని అకస్మాత్‌గా కలిగిన మార్పుకి ఆశ్చర్యపోయారు.
అతని మనుమరాలు చివరికి ధైర్యం చేసి అతనిని ఇలా అడిగింది. “ తాతయ్యా, నీలో ఇంత అకస్మాత్ గా మార్పు ఎలా వచ్చింది". దానికి పెద్దాయన ఇలా జవాబు ఇచ్చాడు “ నేను నా జీవితమంతా సంతృప్తికరమైన మనస్సుతో ఉండాలి అని నా శాయశక్తులా ప్రయత్నించాను. కాని దానిని సాధించలేకపోయాను. ఇప్పుడు సరే ఉన్నదానితోనే సంతృప్తిపడాదామని నిర్ణయించుకున్నాను” అంటాడు
(అంతా నవ్వుతారు)
ప్రతి ఒక్కటీ కూడా మన మైండ్ యొక్క ప్రత్యేక ప్రదర్శనలే. మనలో నిరంతరం ప్రవహించే శాశ్వతానందాన్ని మనం ఈ మైండ్ సహాయంతో అడ్డుకుంటున్నాము. ఆ శాశ్వతానందాన్ని మనం బయట ప్రపంచం నుంచి తెచ్చుకోలేము. అది మనలోపల నిరంతరం ఉంటుంది. మనం కేవలం దానిని చూడగలిగితే చాలు.
ఒక విషయాన్ని అర్ధం చేసుకోండి. ఈ విశ్వమంతా విశ్వ ఆత్మతో, విశ్వచేతనత్వంతో నింపబడి ఉన్నది. అదే చేతన స్థితి మన అందరిలోనూ ఉన్నది. మనిషి యొక్క జీవన ప్రధాన లక్ష్యం ఆ విశ్వ చేతన స్థితికి, మనలోని చేతన స్థితికి సంబంధాన్ని ఏర్పరచటమే. ఎప్పుడయితే ఈ సంబంధం ఏర్పడుతుందో, ఆవ్యక్తికి జ్ఞానోదయమవుతుంది. అతను శాశ్వతానందంలో ఉంటాడు. అదే నిత్యానందం. నిత్యానందం అంటేనే శాశ్వతానందం.
మీరు ఉపన్యాసాలు వినటం ద్వారా, ధ్యాన పద్దతులని సాధన చేయటం ద్వారా ఈ సంబంధం గురించి చాలా చాలా తెలుసుకోగలుగుతారు. అప్పుడు ఆ సంబంధాన్ని వాస్తవ దృష్టితో, తెలుసుకొనే తత్వంతో అనుభవించటానికి ప్రయత్నిస్తారు. మనం చేసే అన్ని ప్రయత్నాల ముఖ్య లక్ష్యం ఇదే.
నేను ఎప్పుడూ చెబుతుంటాను. ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు అని. వారిలో మొదటివారు బయట వారితో పోరాడి గెలుస్తుంటారు. రెండవరకం మనుషులు వారితో వారే పోరాడి గెలుస్తుంటారు.
బయట వారితో పోరాడి గెలవటం చాలా సులభం. అది ఒక గొప్ప విషయం కాదు. కానీ మీతో మీరు పోరాడి గెలవటం చాలా కష్టం. మీరు ధైర్యవంతులయితే మీరు మీతో పోరాడి గెలుస్తారు. అప్పుడు మీలో మీరు కాని దానిని నాశనం చేయగలుగుతారు. అప్పుడు ఒక పరమానందమయిన వ్యక్తిగా బయటకి వస్తారు. అప్పుడు మీరు వికసించుతారు.
తన లోపల ఉన్న నిగూఢ శక్తులని తెలుసుకోగలగటం అనేది మనిషికి ఉన్న అతి పెద్ద సవాలు. అది కేవలం ఆ వ్యక్తి తన అంతరంగంలోనికి వెళ్ళగలిగినప్పుడే సాధ్యమవుతుంది. అతను నిరంతరం తన అంతరంగాన్ని శుభ్రపరచుకోగలిగినప్పుడు,ఎప్పుడయితే తన అంతరంగంలో మురికి అనేది లేకుండా పూర్తిగా శుభ్రం చేసుకోగల వివేకం అతనికి కలిగినప్పుడు అతను తనలోని శక్తులని తెలుసుకోగలుగుతాడు. తిరిగి అతను తన అంతరంగంలోనికి మట్టి ధూళి చేరకుండా చూసుకోగల సామర్ధ్యాన్ని సంపాదించినప్పుడు తన శక్తులని తెలుసుకోగలుగుతాడు.
నిజానికి ‘స్వామి’ అంటే తనలోని నిగూఢ శక్తులని సంపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తి అన్ని అర్ధం. ఈ భూమి మీద మనకి ఉన్న అన్ని కష్టాలకి కారణం మనం మనలో నిక్షిప్తమయి ఉన్న శక్తులను తెలుసుకోలేకపోవటం. ఒక సామెత ఉంటుంది. సింహాన్ని సింహంలా ప్రవర్తించనీయకపోతే అది నక్కలా తయారవుతుంది అని అంటారు. మనలోని నిజమయిన శక్తులను మనం తెలుసుకోలేకపోతే మనం ఆ
శక్తిని తప్పు మార్గాలలో ఉపయోగించుతాము. అది మనలనయినా నాశనం చేస్తుంది లేదా ఎదుటి వారినైనా నాశనం చేస్తుంది.
సృజనాత్మకమయిన శక్తి గాని, నిగూఢమయిన శక్తి గాని ఏదయినా సరే దానంతట అది స్వేచ్ఛగా ప్రవహించేటట్టుగా చేయాలి. ముందు మనం అలా చేయటానికి సమాజం అనుమతించటం ఒకటి. అలాగే మనకి కూడా దానిని వెల్లడి చేయగల పద్ధతి తెలియాలి. స్వామి అంటే - ఎవరయితే తనలో నిగూఢమయిన శక్తులను సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాడో, తనుఏమిటో తాను పూర్తిగా వెల్లడి చేసుకోగలుగుతాడో ఎవరైయితే పూర్తిగా తన అంతరంగపు ఉనికి అయిన తన అంతరాత్మకి అనుగుణంగా ఉంటాడో, ఎవరైయితే శాశ్వతానందంలో ఉండగలడో అటువంటి వ్యక్తి, 'స్వామి'
మీ అందరిలోనూ ఆ నిగూఢ శక్తి ఉన్నది. ఎన్నో సార్లు ఎంతో మంది మానసిక శాస్త్రవేత్తలు, యోగులు, మనిషి తనలో ఉన్న సంపూర్ణ శక్తిని ఉపయోగించి జీవించటం లేదు అని పదే పదే చెప్పారు. దానిని మనం ఎక్కడ కోల్పోయాము? మనం ఎక్కడ చిక్కుకు పోయావము ? మనం ఎందుకు ఈ శక్తిని తెలుసుకోలేకపోతున్నాము? ఎందుకు మనలో శక్తి సామర్థ్యాల గురించి అర్థం చేసుకోలేకపోతున్నాము.?
దీనిలోపలకి వెళ్ళి పరిశోధనలు చేసి కనుక్కోవటానికి మనకి ధైర్యం కావాలి, అంతే. అప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ మనకి జవాబులు దొరుకుతాయి. మీరు నిజాయితీగా మనస్పూర్తిగా అన్వేషణ చేయటం ప్రారంభించితే, మీ చేతన స్థితిలో మార్పు సంభవించుతుంది. ఆ మార్పు మీలో ఒక ప్రదేశాన్ని సృష్టిస్తుంది. ఆ ప్రదేశం మీరు వికసించటానికి సహాయం చేస్తుంది.
ఎప్పుడయితే మీరు వికసించుతారో అప్పుడు మీరు మహారాజవుతారు. అప్పుడు మీరు ఈ భూమికే ప్రభువులా జీవించగలరు. చాలా మందికి అన్ని సౌకర్యాలు, చాలా సౌకర్యాలు, చాలా ఐశ్వర్యం, సంపద, జ్ఞానం ఇలా అన్నీ ఉండవచ్చు. కానీ వాళ్ళంతా కూడా అంతరంగాన్ని చూడలేకపోతే వారు భిక్షగాళ్ళలాగానే మిగిలిపోతారు. మీ అంతరాత్మ, మీ ఉనికి ఐశ్వర్యవంతమవ్వాలి అంటే మీ అంతరంగం ఐశ్వర్యంతో నిండాలి. అదే నిజమైన సంపద.
మనం నిరంతరం మన బయట ప్రపంచ విషయాలలో పూర్తిగా నిమగ్నమయిపోయాము. దాంతో మన అంతరంగ విషయంలో మనం పూర్తిగా అజ్ఞానంలో ఉండిపోయాము. మనం బయట ప్రపంచంలోని సాహసాలలో నిమగ్నమయిపోయి, మన లోపలి ప్రపంచంలోని అద్భుతమయిన సాహసాలను చేయలేకపోతున్నాము. మన గొప్ప ఋషులు, గురువుల వారి జీవితాలలో పొందిన అద్భుత అనుభవాలు మనం పొందలేకపోతున్నాము. ఆ అనుభవాలను నేను మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. మీరేదో అడగాలని అనుకుంటున్నారు అడగండి.
స్వామీజీ! ఆధ్యాత్మికత అనే దానిని సంక్షిప్తంగా ఎలా నిర్వచించవచ్చు?
ఆధ్యాత్మికత అంటే మీ వికసించే నాలుగు విషయాలకి సంబంధించినది : అవి శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, చక్కటి మానవ సంబంధాలు, అవసరానికి వెంటనే స్పందించటం - అంటే బాధ్యత
శరీర ఆరోగ్యం లేదా భౌతిక ఆరోగ్యం అంటే ఎటువంటి అనారోగ్యం లేకపోవటం. మీరు డాక్టరు దగ్గరకి వెళ్ళినప్పుడు, ఆయన మీకు ఏరకమయిన ఆరోగ్య సమస్యలు లేవు అని చెప్పటం.
రెండవది మానసిక ఆరోగ్యం. అంటే మీ అచేతన స్థితిలో ఉండే మీలో లోతుగా నాటుకుపోయిన వ్యతిరేకపు ఆలోచనలు మీలోఉండకూడదు. బాధలు, కష్టం, అసూయ, అసంతృప్తి, అహంకారం, తీవ్రమైన కోరికలు ఇలాంటివి ఏవీ మీలో ఉండకూడదు. వీటి అన్నింటి నుంచీ మీరు పూర్తి స్వేచ్ఛగా ఉండగలిగినప్పుడు మీరు మానసికంగా ఆరోగ్యవంతులు.
మూడవది చక్కటి మానవ సంబంధాలు, మీ చుట్టు ప్రక్కల ఉన్నవారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అందరితో హృదయ పూర్వకంగా మెలగగలిగితే చాలు, ఎటువంటి వారితోనైనా ఎటువంటి సంభాషణ అయినా స్వేచ్ఛగా, మీకు బాధ కలిగించకుండా, మీ మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయగలిగి ఉండాలి. ఎప్పుడయితే ఒకరితో మాట్లాడేటప్పుడు మీరు మీ మీద ఒత్తిడి ఉన్నట్టుగా లేదా ఆ విషయం బాధగా అనిపించినట్టు అనుకుంటే మీ లోపల ఏదో విషయం అడ్డుకుంటుంది అని అర్థం. మీ మానసిక ఆరోగ్యంలో ఏదో అడ్డుపడుతున్నది అని అర్థం.
నాల్గవ విషయం అవసరానికి అప్రయత్నంగా స్పందించగలగటం. దీనినే నేను బాధ్యత అంటాను. ఎప్పుడయితే మీరు బాధ్యత తీసుకోగలరో, ఎప్పుడయితే ఏదైనా అవసరానికి వెంటనే అంగీకారం తెలుపగలరో ఆ క్షణంలో మీరు మరింత విస్తృతం అవుతారు. మీరు ఎప్పుడయితే ‘సరే’ అని ఒప్పుకుంటారో అప్పుడు ఆ పని చేయగలగటానికి కావలసిన శక్తి మీలో ప్రవహించుతుంది. అయితే ఆశక్తిని ఆ పని చేయటానికి ఉపయోగించటం అనేది మీచేతులలో ఉన్నది. మీరు ఇలా చేస్తున్నప్పుడు మీ పరిధి మరింత విస్తృతమవుతుంది. ఈ నాలుగు విషయాలు మీలో వికసించితే మీరు ఆధ్యాత్మికంగా ఉన్నట్టే. మీరు ఏరంగంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, మీకు వివాహం అయినా కాకపోయినా మీరు చిన్న వారయినా, పెద్దవారయినా... ఎవరయినా సరే, ఈ నాలుగు విషయాలు మీలో వికసించి ఉంటే మీరు ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నట్టే.
ప్రశ్న : స్వామీజీ! మాంసాహారం, శాఖాహారంపై మీ అభిప్రాయం ఏమిటి?
(స్వామీజీ నవ్వుతారు)
ముందుగా మీకొక విషయం చెప్పాలి. మీరు ఎవరికి మాంసాహారం తినవద్దు అని ప్రచారం చేయొద్దు. మీకు తెలియని విషయాలలోనికి వెళ్ళి సమస్యలు తెచ్చుకోవద్దు. కొన్ని విషయాలను తర్కంగా, హేతుబద్ధంగా నిరూపించలేము. మీరు ఎవరినైనా మాంసాహారం తినవద్దు అన్నారనుకోండి. అప్పుడు వాళ్ళు మిమ్ములను, జంతువులు లాగానే మొక్కలకి ప్రాణం ఉంటుంది కదా మరి మీరెందుకు వాటిని తింటారు? అని అడిగితే మీరు ఏమని జవాబు ఇస్తారు. ఇలాంటి విషయాలను చర్చించితే వాటికి ఎటువంటి ముగింపు ఉండదు.
నేను మాత్రం ఒక విషయం చెబుతాను. నేను పూర్తిగా శాఖాహారిని. నేను శాఖాహారం తీసుకుంటాను. ఎందుకంటే అది నా శరీర తత్వానికి, నా ఆరోగ్యానికి సరిపోతుంది. అంతే. చాలా మంది జ్ఞానోదయమయిన యోగులు, గురువుల మాంసాహారులు. అయితే జ్ఞానోదయమయిన యోగులు చేసే పనులు మీద మనం మన అభిప్రాయాలు, నిర్ణయాలు చెప్పలేము. వారు ఏమి చేసినా వాఖ్యానించటానికి మన సామాన్య పదాలు, మాటలు పనికిరావు. అలా చేయటం వలన మనం చాలా కోల్పోతాము. వారిని గ్రహించలేము.
మరొక విషయం : మనుషులని వారి ఆహారపు అలవాట్లతో విభజించకండి. అలాగే మాంసాహారం మానేయమని ఎవరిని బలవంతం చేయకండి.
టెలివిజన్ వచ్చిన కొత్తలో ధ్యాన సాధకులు ఉండే ఒక ధ్యాన గృహంలో టెలివిజన్ అమర్చారు. వారిలో ఒక వ్యక్తి తప్ప అందరూ టి.వి. కార్యక్రమాలు చూసే వారు. ఇతను టి.వి. ఎప్పుడూ చూసేవాడు కాదు కాని, ఆ హౌస్ ప్రెసిడెంట్‌కి మాత్రం అందరూ ఆ విధంగా గంటల కొద్ది టి.వి. చూస్తున్నారు అని పిర్యాదు చేసేవాడు.
అలా కొన్ని సార్లు పిర్యాదు చేసిన తరువాత, ఒక రోజు వాళ్ళ ప్రెసిడెంటు “రేపటి నుంచి నీవు కూడా టి.వి. చూడు” అని అంటాడు. ఆ మాట విని అతను నిర్ఘాంతపోతాడు. ఆయన అలా ఎందుకు అన్నాడు అని అనుకుంటాడు.
అప్పుడు ప్రెసిడెంటు ఇలా జవాబు ఇస్తాడు “నీవు టి.వి. చూడకుండా ఉన్నందుకు సంతోషంగా లేవు. అందుకే వాళ్ళ మీద కోపంగా ఉన్నావు. నీకు టి.వి. చూడాలి అని కోరికగా ఉన్నది. కాని నీవు చూడవు. ఎందుకంటే అలా చేస్తే నీ అహం తృప్తి పడుతుంది. అయితే అణచివేయబడిన ఆ కోరిక నిన్ను ఇలా పిర్యాదులు చేసేలా చేస్తుంది”
చూడండి : మాంసాహారం మానటం వలన మీరు పూర్తిగా సంతోషపడనప్పుడు మీరు ఎదుటివారిని మాంసాహారం మానేయమని బలవంతం చేస్తారు. మీరు ఏ పనినైనా పూర్తిగా చేయగలిగినప్పుడు ఎదుటివారిని ఆ పని చేయమని బలవంతం చేయరు. ఎప్పుడయితే మీరు అనుమానంతో సగం హృదయంతో ఆ పనిని చేస్తారో అప్పుడు అందరినీ అందులోనికి లాగాలని చూస్తారు. మీరు ఒక పనిని పూర్తిగాచేస్తున్నారా లేదా అని నిర్ణయించటానికి ఇదే మంచి స్కేలు. మీరు పూర్తిగా నిమగ్నమయి చేసినప్పుడు, మీరు ఆ విషయంలో ఎటువంటి విచారాన్ని చూపనప్పుడు మీరు ఎదుటి వారిని విసిగించరు. వాళ్ళ స్వేచ్ఛని మీరు హరించరు.
నిజానికి మాంసాహారం తినేవారు ఆ ఒక్క గంట మాత్రమే ఆ విషయాన్ని గురించి ఆలోచించుతారు. ఆ తరువాత దానిని మర్చిపోతారు. కాని శాఖాహారం తింటూ 24 గంటలూ దానిని గురించి ఆలోచించే వారితో చూస్తే మాంసాహారులే నయం కదా!
ఒక చిన్న కథ :
ఒక బౌద్ధ గురువు ఆయన శిష్యుడు నడచి వెళుతుంటారు. ఆ దారిలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఒక అందమయిన యువతి నిలబడి ఉంటుంది. ఆమె వాళ్ళని చూసి గురువుని నది దాటటానికి సహాయం చేయమంటుంది. అప్పుడు గురువు ఆమెని చేతులతో మోస్తూ నది అవతల ఒడ్డున వదిలివస్తాడు.
అది చూసిన శిష్యుడికి ఒళ్ళుమండిపోతుంది. మనశ్శాంతి పోతుంది. వాళ్ళు అలా నడచి వెళుతుంటారు. ఇక ఆపుకోలేక శిష్యుడు “ గురుదేవా ! మీరు గురువులు అయివుండి ఒక యువతిని అలా ముట్టుకొని, చేతులతో ఎలా మోసారు;” అని అడుగుతాడు.
ఆ ప్రశ్నకి గురువు ఇలా సమాధానం ఇస్తాడు. “నేను ఆమెని అక్కడ వదిలి చాలా సేపయింది. నీవు ఇంకా ఎందుకు ఆమెని మోస్తున్నావు?”
(అంతా నవ్వులు)
గురువులు ప్రశ్నకి సమాధానం చెప్పరు. ప్రశ్నించిన వ్యక్తికి సమాధానం చెబుతారు. ఈ కథలో గురువు ఆ శిష్యునికి ఒక గురువు యొక్క ఉన్నత స్థితిని వివరించవచ్చు. వారికి స్త్రీ, పురుష భేదం ఉండదని అర్ధమయ్యేలా చెప్పవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన శిష్యునికి అతని మనస్సులో ఉన్న ఆటంకాన్ని అర్ధం చేసుకొని, అసలు సమస్య అతని మైండ్‌లో ఉన్నది కాని గురువు చేసిన పనిలో కాదు అని అర్ధమయ్యేలా చేసాడు.
మీరు మాంసాహారం గురించి ఆలోచించకుండా, దాని మీద కోరిక లేకుండా ఉండగలిగితే అది తినటం మానేయండి. లేదా దానంతట అదే పోయే వరకూ తినండి. అంటే నేను మిమ్ములని మాంసాహారం తినమని చెప్పటం లేదు. నా జీవితానికి నా శరీరానికి, మనస్తత్వానికి శాఖాహారం సరిపోతుంది. అందుకే నేను శాఖాహారం మాత్రమే తీసుకుంటాను. నాలాంటి జీవన విధానం మీరు కూడా కోరుకుంటే మీరు శాఖాహారమే తీసుకోండి. అంతే.
కానీ దానిని మానివేసి దాని మీద కోరికతో ఉండకండి. అలాగే అది తినే వారిని తినవద్దని హింసించకండి. మనం ఇలాంటి చిన్నవిషయాలు తీసుకొని గంటల కొద్ది చర్చించుతాము. అదీ అసలు సమస్య.
మిమ్ములను మూడు రకాల వ్యక్తులుగా విభజించవచ్చు
మొదటిరకం వారు, మాంసాహారం తినరు దాని గురించి ఆలోచించరు.
రెండవ రకం వారు, మాంసాహారం తింటారు, దాని విషయం మర్చిపోతారు
మూడవ రకం వారు మాంసాహారం తినరు కానీ అది తినలేదని బాధ వుంటుంది. దాంతో తమ చుట్టుప్రక్కల ఉన్నవారిని మాంసాహారం తినవద్దని హింసిస్తుంటారు. మీరు మాత్రం ఆ మూడవ రకం లోనికి వెళ్ళకండి. అంతే.
ప్రశ్న : స్వామీజీ! నేనేదయినా మంచిపని చేయాలనుకున్నప్పుడు ఉదాహరణికి బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఒక పెద్దాయనని చూసి ఆయనకి సీటు ఇవ్వాలి అని అనుకుంటాను. కానీ మిగతా ప్రయాణమంతా నేను నిలబడే ఉండాలి అని అనుకున్నప్పుడు సీటు ఇవ్వను. నాకు సిగరెట్టు మానాలని ఉంటుంది. ఒక్క సిగరెట్టు నా జీవితాన్ని నాశనం చేయదులే అని సిగరెట్టు కాలుస్తాను. అందుకు నన్ను నేను నియంత్రించుకో లేకపోతున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నాను?
చూడండి. మీరు ఏదైనా మీ మైండ్ నుంచి తీసుకున్నప్పుడు లేదా ఎవరైనా మీకు చెప్పినప్పుడు వాటిలో ఉండే ఉపయోగాలను మీరు లోతుగా, స్పష్టంగా చూడలేరు. దానిని మీ తెలివితేటలతో అర్ధం చేసుకున్నా కూడా మీకు పూర్తిగా తెలియవు. అదే మీకు అనుభవమైనప్పుడు మీ అంతరంగంలో లోతుగా అనుభూతిని చెందినప్పుడు మీకు పూర్తిగా అర్ధమవుతుంది. అప్పుడు ఆ సమస్యని బాగా ఎదుర్కొంటారు.
సిగరెట్టు మీ ఆత్మలో ఐక్యమయిపోయింది. అది మీరు పూర్తిగా అనుభవించారు. ఇది ఎవరో చెప్పినది కాదు. మీ సొంత అనుభవం. అందుకే దానిని అలవాటు చేసుకున్నారు. కానీ బస్సులో సీటు ఇవ్వటం అనేది మీకు అనుభవం కాలేదు. మీకు ఎవరో బయట వాళ్ళు చెప్పి ఉంటారు. పెద్దవారికి సీటు ఇవ్వండి అని, అది మంచిది అని, కానీ అలా సీటు ఇవ్వటం, ఇస్తే ఏమవుతుంది అనే విషయం మీరు పూర్తిగా లోతుగా అనుభవించలేదు. మీకు అనుభవం లేకపోతే దాంట్లో ఆకర్షణ తెలియదు. నిజంగా ఒకరికి సహాయం చేసిన ఆనందాన్ని మీరు అనుభవించి ఉంటే, మీరు పెద్దాయనకి సీటు ఇస్తారు.
మీకు నిజమైన అనుభవం జరగాలి అంటే ధ్యానం ఒక మంచి మార్గం. మనం ధ్యానం చేసినప్పుడు రాయిలా గట్టిగా ఉండే హృదయం వికసించుతుంది. అది మృధువుగా , సున్నితంగా తయారవుతుంది. అప్పుడు ఎదుటివారికి సహాయం చేయాలి అని మనకి అనిపిస్తుంది.
కానీ మనం పెద్దవాళ్ళకి సీటు ఇవ్వటం మంచిది అని మనం ఎవరైనా చెబితే విని ఉంటాం లేదా ఏదైనా పుస్తకంలో చదివి ఉంటాము. కాని అది మనకి జరిగితే, ఒకరికి సహాయం చేయాలి అన్న కోరిక మనలోనే ఉదయిస్తే అప్పుడు మనం సహాయం చేస్తాం.
మీరు ధ్యానం చేస్తే సున్నితంగా స్పందించగలుగుతారు. లేదంటే అలాంటి సున్నితత్వం మీకు రాదు. మీరు మైండ్‌లో ఉన్న బోధనలని హృదయానికి పంపించాలంటే మీకు ధ్యానం అనే డ్రిల్లింగ్ మిషన్ అవసరం. అప్పుడు న్యాయం, నమ్మకం, నిష్కపటం ఇలాంటి విలువలు ఏవైతే మనకి నేర్పించారో అవి మీ జీవన మార్గాలవుతాయి. అప్పుడు మీరు ఏవి పాటించినా అందులో కొంత న్యాయం ఉంటుంది.
లేదంటే ఈ విలువలన్ని మీ తెలివితేటల దశలో మేధస్సులోనే ఉండిపోతాయి. అవి ప్రయోగాత్మక జ్ఞానంగా మారవు.
మధ్యాహ్నం మనం అసలు మన టాపిక్ గురించి చర్చించినప్పుడు మీకు చాలా వివరంగా జవాబులు దొరుకుతాయి. ముఖ్యంగా మీరు మీకు తెలిసి కూడా అచేతన స్థితిలో ఎందుకు కొన్ని పనులు చేస్తారు అనే విషయం వివరంగా తెలుకుంటారు.
ఇప్పటికి ఇది చాలు. మనం మధ్యాహ్నం భోజనం అయిన తరువాత డైరెక్టుగా మన అసలు విషయంలోనికి వెళదాము.
ధన్యవాదములు.

అధ్యాయం - 2