Books / నిత్యధ్యానం

1. నిత్యధ్యానం

నిత్యధ్యానం గురించి

నిత్యధ్యానం గురించి చెప్పేముందు, ఈ ధ్యానానికి సంబంధించి నా అనుభవం, ఈ ధ్యాన పద్దతి నాకు ఏవిధంగా తెలిసింది అనే విషయాలని మీకు క్లుప్తంగా వివరిస్తాను. నాకు జ్ఞానోదయం జరిగాక చాలా కాలంపాటు, అంటే కొన్ని నెలల పాటు నేను మౌనంలో ఉన్నాను. ఆ సమయంలో నేను ధ్యాన పద్దతుల మీద చాలా లోతుగా పరిశోధనలు చేసాను. ముఖ్యంగా ఈ ధ్యాన పద్దతుల ద్వారా నాకు కలిగిన అనుభవాన్ని ఇతరులకు జరిగే విధంగా ఎలా చేయాలి. అలా పరిశోధించే సమయంలో ముందుగా నాకు స్ఫురించినది, నా పరిశోధనల ఫలితంగా ముందుగా బయటికి వచ్చినది ఆనందస్పురణ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని రూపొందించే పనిలో ఉన్నప్పుడు నేను మనలోని ఏడు శక్తి కేంద్రాలయిన, ఏడు ప్రధాన చక్రాల మీద బాగా పని చేసాను. ఈ చక్రాలని శుభ్రపరచగలిగి, తిరిగి వాటిని శక్తివంతం చేయగల ఏడు ధ్యాన పద్దతులని రూపొందించాను. ఆనందస్పురణ తరువాత, నా పరిశోధనల నుండి పచ్చిన కార్యక్రమం నిత్యానంద స్ఫురణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనలోని ఏడు శక్తి శరీరాలకి సరిపడే విధంగా, అదేవిధంగా మరణ సమయంలో ప్రశాంతంగా, ఆనందంగా శరీరాన్ని వదలగలిగే విధంగా సహాయం చేయగల ధ్యాన పద్దతులని రూపొందించాను. ఆ తరువాత ధ్యానస్పురణ అని, ఆత్మస్పురణ కార్యక్రమం ఇలా చాలా కార్యక్రమాలని తయారు చేసాను. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఆత్మసత్యాన్ని తెలుసుకునే విధంగా, అన్ని మార్గాల ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాలని

ధ్యాన పద్ధతుల పరిశోధన

తయారు చేసాను. ఈ విధంగా నేను వంద రకాలయిన ధ్యాన పద్ధతులని, నా కార్యక్రమాల ద్వారా రూపొందించాను. ఇందులో ప్రతీ ధ్యాన పద్దతి ప్రతి ఒక్కరిలోని వారి చేతనస్థితిని ఉన్నతస్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా వారి అసలయిన ఉనికి (ఆత్మ) సంబంధించిన విషయాల మీద ఈ ధ్యాన పద్ధతులు పని చేస్తాయి. నన్ను చాలామంది చాలాసార్లు, ఒక విషయం అడిగే వారు, ‘మేము ప్రతిరోజు ధ్యానం చేసుకునేందుకు వీలుగా మాకు ఒక ధ్యానపద్దతిని నేర్పించండి’ అని. వారు పదే పదే అడగగా నేను ఈ విషయం గురించి పని చేయటం మొదలు పెట్టాను. నేను ఈ విషయం గురించి చాలా లోతుగా ఆలోచించాను. నేను తయారుచేయబోయే ధ్యాన పద్ధతి నా బోధనలకి, నా అనుభవాలకి, నేను నమ్మిన తత్వానికి పూర్తి ప్రతినిధిగా, పూర్తిగా సరిపోయే విధంగా ఉండాలి. నాదృష్టిలో ఈ ధ్యాన పద్ధతి పూర్తిగా ఉండి మన ఉనికికి సంపూర్ణంగా సరిపోయే విధంగా ఉండాలి. అది ఏదో ఒక్క విషయం మీద మాత్రమే ప్రభావం చూపించేదిగా ఉండకూడదు. అది సంపూర్ణంగా ఉండాలి అనేది నా లక్ష్యం. ఆ పద్ధతి మనిషి యొక్క ఉనికిని పూర్తిగా ప్రభావితం చేసి, ఆ వ్యక్తిలో ఆశించిన మార్పుతేగలగాలి. ఒక రోజు నాకు ఒక ధ్యానపద్దతి స్ఫురణకి వచ్చింది. అదే ఇప్పుడు నేను మీకు నేర్పించబోయే

నిత్యధ్యానం

నిత్యధ్యానం. దీనినే నిత్యధ్యానం అంటారు. (మెడిటేషన్ ఫర్ ఎన్టర్నల్ బ్లిస్). ఇది ఒక మెరుపు మెరిసినట్లు నాకు కనిపించింది. ఒక్కసారిగా నేను ఈ ధ్యానంలోని వివిధ భాగాలను చూడగలిగాను. ఇందులో ఒక్కొక్క భాగం మరొక దానితో ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నది, అదే విధంగా అన్ని భాగాలు కలిపి మనలోని చేతనస్థితిని ఏ విధంగా ఉన్నతస్థితికి తీసుకురావచ్చునో నాకు స్పష్టంగా కనిపించింది. నిత్యధ్యానం నేను చేసిన పరిశోధన ఫలితాలన్నింటిలోనికి ఉత్తమమైనది అని చెప్పగలను. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక ఋషిని మంత్ర ద్రష్ట (మంత్రాన్ని చూసే వ్యక్తి) అని కూడా అంటారు. దీని అర్థం ఏమిటి అంటే, ఆయన సమాధిస్థితిలో ఉన్నప్పుడు ఒక మంత్రాన్ని కాని, ఒక పద్దతిని కాని తన దృష్టిలో చూడగలుగుతాడు. అంటే ఆయన మంత్రాన్ని కాని పద్దతిని కాని సృష్టించాడు అని అర్థం కాదు. అవి ఆయనకు వెల్లడి అవుతాయి. సర్వాంతర్యామి సంపూర్ణమయిన శక్తి. అందులోనికి కొత్తగా ఏదీ సృష్టించవసరం లేదు. కాబట్టి ఒక మంత్రం కానీ లేదా ఒక పద్దతి కానీ ఎవరో ఒక వ్యక్తి యొక్క సృష్టి కాదు. ఈ విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాలి. ఈ పద్దతిని నేను సృష్టించాను అని చెప్పలేను. అవసరమయినప్పుడు ఆ పద్దతి దానంతట అదే రూపుదిద్దుకొని మీ ముందుకు వస్తుంది. ఇప్పుడు మీకు నిత్యధ్యాన పద్దతి వివరాలు చెబుతాను. ఈ ధ్యానపద్దతిలో మొత్తం ఐదు భాగాలు ఉంటాయి. మీకు ఒక్కొక్క భాగాన్ని వివరంగా చెబుతాను.