పోలీసులకు చిక్కిన నిత్యానంద
This text was machine-transcribed from the printed book and may contain errors. Select the words and choose “Report a mistake”.
- అనుచరుడితోపాటు హిమాచల్‌లో నెలకుపైగా తలదాపు
- సిమ్లా కోర్టులో ప్రవేశపెట్టిన సీఐడీ
- హిమాచల్‌ప్రదేశ్‌లో అరెస్ట్
- నేడు బెంగళూరు కోర్టుకు తరలింపు
బెంగళూరు, న్యూఢిల్లీ/సిమ్లా, ఏప్రిల్ 21: కామలీలల నిత్యా నందస్వామి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బెంగళూరులోని రామనగరం సీఐడీ ప్రత్యేక పోలీసు బృందం హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం ఆయనను అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు నిత్యా భక్తానందస్వామి అలియాస్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన సీఐడీ బుధవారం ట్రాన్సిట్ రిమాండ్ పొందింది. గురువారం వీరిద్దరినీ బెంగళూరుకు తరలించే అవకాశముందని సమాచారం. గత నెల 2న తమిళ నటి రంజితతో స్వామి జరిపిన శృంగార లీలలు టీవీలలో ప్రసారమైనప్పటినుంచి నిత్యానందస్వామి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. స్వామి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఆయన దేశం విడిచి పారిపోకుండా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అనేక రాష్ట్రాలలో స్వామి భక్తులైన ప్రముఖుల ఇళ్లలో స్వామి కోసం గాలించినా ఆయన చిక్కలేదు. చివరకు హిమాచల్ ప్రదేశ్‌లో స్వామి తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో వారం క్రితం సీఐడీ ప్రత్యేక బృందం హిమాచల్ ప్రదేశ్ వెళ్లింది. ఆ రాష్ట్రంలోని సోలన్ జిల్లా అర్కీ తహసీల్ పరిధిలోని మమాండ్ల గ్రామంలోని ఓ ఇంట్లో నక్కినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. స్వామితో పాటు ఆయన ముఖ్య అనుచరుడు భక్తానందస్వామి అలియాస్ గోపాల్ రెడ్డి కూడా ఉన్నాడు. వీరిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు పట్నానగర్ కోర్టుకు తీసుకెళ్లగా, జడ్జి ఈ నెల 25 వరకు ట్రాన్సిట్ రిమాండ్ విధించారు. ఈలోపు నిందితులను తమ రాష్ట్రానికి తీసుకెళ్లాలని ఆదేశించారు. దీంతో కర్ణాటక పోలీసులు వీరిద్దరినీ బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన సాక్షి లెనిన్ కరుప్పన్ భద్రతను కేంద్ర హోంశాఖ సమీక్షించింది.

మరో భారీ దాడికి వ్యూహమా?
సిమ్లా (న్యూస్ లైన్): నిత్యానంద స్వామిని పట్టుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అందించిన సహకారం అమోఘం అని సీఐడీ ఐజీ విపుల్ కుమార్ కొనియాడారు. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అందించిన సమాచారంతోనే తాము ఆయన్ని పట్టుకోగలిగామని ఆయన స్పష్టంచేశారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన స్వామి దాక్కున్న ఇంటిపై దాడికి సహకరించిన హిమాచల్ పోలీసు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
"నిత్యానందస్వామిపై బెంగళూరు పోలీసులతో పాటు కర్ణాటక సీఐడీ అనేక కేసులు నమోదు చేసింది. గతంలో ఒక మహిళపై జరిగిన దాడితో పాటు ఆశ్రమంలో జరిగిన పలు అక్రమాలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి స్వామిపై రామనగరం కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. స్వామి దేశం విడిచి పారిపోకుండా లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో స్వామి హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నట్లు మాకు పక్కా సమాచారం అందింది. దీంతో వారం క్రితం సీఐడీ అధికారులు, సిబ్బందితో కూడిన ఏడుగురు సభ్యుల బృందం ఇక్కడికి చేరుకుంది. స్వామి ఆచూకీ కనుగొనేందుకు స్థానిక పోలీసుల సహాయం కోరాం. వారు వెంటనే స్పందించారు. స్వామి అర్కీ ప్రాంతంలోని మమాండ్ల గ్రామంలోని ఓ ఇంట్లో ఉన్నట్లు గుర్తించాం. ఈ ఇంట్లో స్వామి, ఆయన అనుచరుడు గోపాల్ రెడ్డి తలదాచుకున్నట్లు సమాచారం అందింది.
స్వామిని పట్టుకునేందుకు స్థానిక పోలీసుల సహాయంతో పక్కా ప్లాన్ వేశాం. స్వామితో పాటు ఆయన అనుచరుడు కరాటేలో బ్లాక్‌బెల్ట్ కావడంతో దాడి తీవ్రమయ్యే అవకాశముందని భావించాం. ఈ క్రమంలో అర్కీ డీఎస్పీ అమిత్ ఠాకూర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, మా సిబ్బంది రంగంలోకి దిగాం. దాడి సమయంలో స్వామి, ఆయన అనుచరుడు పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేశారు. వారి వద్ద మారణాయుధాలు కూడా ఉన్నాయి. వారిని చాకచక్యంగా లొంగదీసుకున్నాం. స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు వెల్లడించలేం. దాడి చేసిన ఇంట్లో నుంచి దాదాపు రూ. 30-50 కోట్ల వరకు విలువైన డాక్యుమెంట్లు, ఈ ఇళ్లల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నాం. దాడి సమయంలో స్వామి తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక్కడి కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ విధించడంతో ఆయన్ని బెంగళూరుకు తీసుకెళ్తున్నాం" అని విపుల్ కుమార్ వివరించారు.
అభివృద్ధిదేమిటో నచ్చజెప్పాం: ప్రధాని

ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలుసుకున్న అశోక్ గెహ్లాట్, చిదంబరం
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ లో దంతెవాడ తరహా దాడులు పునరావృతం కాకుండా భద్రతా బలగాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టంచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దాడి చేసిన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో నివేదిక అందించాల్సిందిగా ప్రధాని ఆదేశించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పురోగతిపై ప్రధాని సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం, సహాయ మంత్రి జితేంద్రప్రసాద్, ఆర్థిక కార్యదర్శి అశోక్ చావ్లా, హోంశాఖ కార్యదర్శి జి.కె. పిళ్లై, ప్రధానమంత్రి సలహాదారు టి.కె.ఎ. నాయర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నక్సల్స్ దాడి అనంతరం ఛత్తీస్‌గఢ్ లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రధానికి వివరించారు. దంతెవాడ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం తరఫున ఆర్థిక సహాయం అందించడానికి ప్రధాని అంగీకరించారు. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భద్రతా బలగాలకు నైతిక మద్దతు ఇవ్వడంతో పాటు అవసరమైన హెలికాప్టర్లు సమకూర్చాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర పారామిలిటరీ దళాలను తరలించేందుకు కూడా నిర్ణయించారు.
గత 6న మావోయిస్టుల నరమేధం చోటుచేసుకున్న విషయం విదితమే. ఛత్తీస్‌గఢ్ లోని దంతెవాడ సమీపంలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి అనంతరం కేంద్రం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాలని నిర్ణయించింది.
ఇలా ఉండగా మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నిధులను సక్రమంగా వినియోగించడం లేదని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. 1993 నాటి నుంచే ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు రూ. 222 కోట్లు నిధులను కేంద్రం విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ నిధులను రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకోలేదని మండిపడింది. ఈ నిధులతో రోడ్లు, ఆస్పత్రులు, తాగునీరు, పాఠశాలల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో పనులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రం ఇచ్చే నిధులతోనే నక్సల్స్ ప్రాబల్యం తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని స్పష్టంచేసింది.